Pages

Friday 19 October 2012

కేంప్ ఫయర్ దగ్గర దెయ్యం కథలు

చీకట్లు ముసురుకొంటూ ఉండగానే ఊరు నిద్రపోయేది. టెలివిజన్ లాంటి వినోదం లేదు కనుక సుమారు ఏడు గంటలకే రాత్రిభోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించేవాళ్ళు జనాలు. అక్కడక్కడా మసకగా వెలుగుతున్న విద్యుత్ బల్బులు తప్పించి అంతా కటిక చీకటి. సరిగ్గా అప్పుడు వెలిగించేవారు కేంప్ ఫయర్ మాయింటిలో. నిజానికి దానిని కేంప్ ఫయర్ అంటారని అప్పటి వాళ్ళకు ఎవరికీ తెలియదు! కానీ, శీతాకాలం సాయంత్రం మంటముందు కూర్చుని చలికాగుతూ ఉంటే భలేగా ఉంటుంది. 

ఊరి మెయిన్ రోడ్డులో రెండువైపులా వరుసగా కట్టుకొన్న ఒక అరడజను ఇళ్ళల్లో మా కజిన్స్ అందరూ ఉండేవారు. కజిన్స్ అంటే మాతాతగారి అయిదుగురి కొడుకుల సంతానం. అన్ని రోడ్లూ రోముకే చేరతాయి అన్నట్టు సాయంత్రం భోజనాలు ముగిసాకా అందరూ `తాతయ్యగారి ఇల్లు` అనిపిలవ బడే మాయింటికి దారితీసేవారు. వీళ్ళు కాక  వేలు విడిచిన చుట్టరికాల బాపతు చాలామందికి కూడా సాయంకాలపు కూడలి ఇదే. విశాలమైన అరుగులు, వాటికి కొనసాగింపుగా పెద్ద తాటాకు పందిరి, అక్కడినుంచి ప్రవేశ గేటు వరకూ చాలా ఖాళీ స్థలం ఉండేవి.

గోదాములో ఉన్న వేరుశెనగకాయలో, కందికాయలో, తేగలో బయటకు తీసుకొని వచ్చి, ఈ స్థలంలో వేసి, ఎండుతాటాకులు, చితుకు పుల్లలతో మంటపెట్టి కాల్చేవారు. ఉన్న జనాలను బట్టి వేరుశనగ, కందికాయలు లాంటివయితే ఒక కుంచుడో, రెండుకుంచాలో; తేగలయితే ఒక పాతరో, అరపాతరో కాల్చేవారు. ఇవి కాలుతూ ఉంటే వచ్చే కమ్మని వాసన అమోఘం. నోటిలో నీళ్ళు ఊరకుండా నిలువరించుకోవడం ఎవరికయినా అసాధ్యం. ఒక్కొక్కరూ ఒక్కో గుప్పెడు కాయలు తెచ్చుకొని ఒకటీ; ఒకటీ తింటూ, కబుర్లు చెప్పుకొంటూ సాయంత్రం అర్ధరాత్రి గా మారేవరకూ గడిపి నిద్రకళ్ళతో  ఇంటిముఖం పట్టేవారు. 

కటిక చీకటిలో, లేదా వెన్నలరాత్రి మసక వెలుతురులో చెట్లు, పొదలు, ధాన్యం పురులూ  దుప్పట్లు కప్పుకొన్న ఈవిల్ స్పిరిట్స్ లాగ నిలుచుని భయపెడుతుంటే పెద్దవాళ్ళు చెప్పుకొనే దెయ్యాలకథలు భయం భయంగా వినేవాళ్ళం. ఇంచుమించు ప్రతీవాళ్ళ దగ్గరా ఒకటో, రెండో అటువంటి కథలు ఉండేవి. ఈ సంభాషణలు మా మేనత్తలు, వాళ్ళ పిల్లలూ కూడా ఉన్నప్పుడు మరింత ఆసక్తికరంగా ఉండేవి. `నా కళ్ళతో చూశాను తెలుసా?` అనే వాళ్ళు. `దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి,` అని చెప్పే వాళ్ళనమ్మకమైన మాటలు, `మనకి ఎదురైతే ఎలా?` అని భయం ఒక థ్రిల్ కలుగజేసేది. మళ్ళీ ఆ మరునాడు భయమేసినా ఆ మాటలు వినకుండా ఉండలేక పోయే వాళ్ళం. కేంప్ ఫయర్ చుట్టూ కూర్చొని చాలా విశేషాల చెప్పుకొంటున్నా దెయ్యం కథలు, పాముల కథలు ఫేవరెట్స్.

© Dantuluri Kishore Varma

2 comments:

  1. అయ్యో, ఏదైన దెయ్యం కధ ఉంటుందనుకొంటె నిరాశ పరిచారే. మీకు గుర్తున్న కధేమైన ఉంటె చెప్పండి ప్లీజ్, మా పాప చంపుతుంది దెయ్యం కధ చెప్పమని.

    ReplyDelete
  2. హ.. హ.. హా.. ఇది చదివేసి మీ అమ్మాయికి కథ చెప్పేద్దామనుకొన్నారా కిషోర్ గారు...నా బ్లాగుకి స్వాగతం. ధన్యవాదాలు. మా పెదనాన్నగారు చాలా చెప్పేవారండి. ఒకసారి అర్థరాత్రి మెలుకువవచ్చి , ముసుగుతీసి బయటకి చూసేసరికి అరుగు చివర ఒక దెయ్యం పొడవైన జుట్టు విరబోసుకొని అటు తిరిగి కూర్చొని ఉందట. ఇక ఆయన పరిస్థితి ఏమిటో మీరే ఊహించుకోండి! అది నిజంగా దెయ్యమే అని ఇప్పటికీ కుండబ్రద్దలుగొట్టినట్టు చెబుతారు ఆయన. ఇంకా చాలా...........ఉన్నాయి. వాళ్ళు వివరించి చెబుతుంటే నిజంగానే వెన్నులోంచి వణుకు వచ్చేది.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!