Pages

Tuesday 2 October 2012

వాన

గ్రీష్మంలో ఎండవేడికి అలసిసొలసిన భూదేవికి జ్యేష్ఠమాసం తీసుకొనివచ్చే పరిమళాల సందేశం.  తొలకరి జల్లులు, తడిసిన మట్టి వాసన, హాయిగా వీచే వర్షపుగాలి...

వినీలాకాశానికి నల్లదుప్పటి కప్పినట్టు దట్టంగా కమ్ముకొనే మబ్బులు, అప్పటివరకూ ఏ చెట్ల ఆకుల్లో దాక్కుంటుందో తెలియని ఈదురుగాలి  `వర్షాగమనం` గురించి ప్రతీఒక్కరినీ  పేరుపేరునా పలుకరించి చెబుతుంది. 

నేలంతా చిత్తడి, చిత్తడి. `కమ్మని పకోడీ తింటూ వర్షాన్ని చూస్తూ గడిపేద్దాం` అంటే. ఆఫీస్ లోనో, షాపులోనో పనిరాక్షసుడు- కష్టమో, నష్టమో; గొడుగులోనో, రెయిన్కోటులోనో; బైకులోనో, ఆటోలోనో -  వెళ్ళక తప్పదుగా.
చినుకు వానై, వాన వరదై నదులు నిండితే అన్నదాతకు ఎక్కడిలేని ఆనందం. దుక్కుదున్నుకోవాలి, ఆకుమడి జల్లుకోవాలి, నాట్లువేసుకొని, పొలంలో ఊడుపులు పూర్తిచెయ్యాలి. 

ముందు  చెప్పకుండా హఠాత్తుగా వచ్చే వరాల జల్లు స్కూలుకి శెలవు ఇచ్చేస్తే, ఇంటి ముందు ప్రవహించే వాన నీటి కాలువలో కలల కాగితపు పడవల ప్రయాణం...

ఊహించని అవకాశం బస్ స్టాప్ దగ్గర నుంచున్నప్పుడు ప్రియురాలో/ఫ్రేమికుడో గొడుగులో చోటిస్తే `ఒకే అడుగు, ఒకే గొడుగు, ఒకే నడకగా... ఒకరికి ఒకరుగా...` అని పాడుకోంటూ, కళ్ళల్లొ కళ్ళుపెట్టి చూసుకొంటూ ప్రపంచం అవతలి వరకూ నడిచేయవచ్చు.  
© Dantuluri Kishore Varma 

4 comments:

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!