Pages

Friday 16 November 2012

కెమేరా జ్ఞాపకాలు

పాత కెమేరాలని డబ్బా కెమేరాలని వెటకారం ఆడతాంకానీ, అసలు ఒకప్పుడు సొంత కెమేరాని కలిగిఉండడమే ఒక వింత. పోకెట్లో పట్టే చిన్న డిజిటల్ కెమేరాల శకం వచ్చిన తరువాత ఫొటోగ్రఫీ ప్రతీఒక్కరికీ అందుబాటులోకి వచ్చిందికానీ, 1963లో మా నాన్నగారు ఒక డబ్బా కెమేరాని కొనడంతో మావూరికి అది రెండవ కెమేరా అయ్యింది. మొదటిది  స్టుడియో వాడి దగ్గర ఉండేది. యాభైఅయిదు రూపాయలు కెమేరా కోసం ఖర్చుచేయ్యడం ఎవ్వరికీ నచ్చలేదట. ఎనిమిది ఫోటొలు వచ్చే రీలు మూడురూపాయలు, రీలు డెవలప్ చెయ్యడానికి అర్ధరూపాయి, ఎనిమిది ఫోటోలనీ ప్రింట్ చెయ్యడానికి రెండురూపాయలు. ధాన్యంబస్తా ఖరీదు పాతిక రూపాయలు ఉండే రోజులలో ఈ ఖర్చు ఒక లగ్జరీ.

మాన్యువల్ ఫిలింరోలింగ్ ఉండే ఈ కెమేరా ఉపయోగించినప్పుడు, స్నాప్ తరువాత రీలుని తిప్పుకోవాలి, లేకపోతే రెండవబొమ్మకుడా అదే చోట ఎక్స్పోజయి ఫోటో పనికిరాకుండా పోతుంది. ఈ ప్రతికూలతని ఒక కొత్త టెక్నిక్ కోసం ఉపయోగించుకొన్నారు. ఫోటో తీసే ముందు లెన్స్ వెనుకా, రీలుకి ముందూ సరిగ్గా అర్ధచంద్రాకారంగా కప్పేలా ఒక అట్టముక్కని పెట్టి ఒక స్నేప్ తీసిన తరువాత, రీలు తిప్పకుండా ఆ అట్టని రెండవ సగం కప్పేలా పెట్టి ఇంకొకసారి క్లిక్‌చేస్తే ఒకే ఫోటోలో రెండు సీనరీలని, లేదా ఒకేవ్యక్తిని డబుల్ ఫోటోలా తియ్యవచ్చు. ఫోటోషాప్ ఉపయోగించి ఇప్పుడు మనం చెయ్యగలిగిన చమత్కారాలని అప్పుడు ఒక డబ్బ కెమేరాతో చేశారు. ఈ ఫోటో అలా తీసిందే. ఇందులో ఉన్నది మాపెద్దన్నయ్య పృథ్వీరాజు.

మావూళ్ళో శరబయ్య అనే ఒక సన్యాసి ఉండేవాడు. పొడవైన తెల్లగడ్డం, మెడ దగ్గరనుంచి పాదాలవరకూ కాషాయరంగు బురకా, చిరునవ్వు మొహం, ఎప్పుడయినా మాట్లాడే ఒకటి రెండు మాటలు. రోజుకి ఒకరి ఇంటిలో వారాల భోజనాలు చేసే వాడు. ఎవరికైనా దుకాణాలనుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టేవాడు. కొన్నిరోజులు ఊళ్ళో ఉంటే, కొన్నిరోజులు మాపొలాలు దాటిన తరువాత ఎత్తుగా, నిటారుగా ఉండే దొండరాయి కొండమీద, చిన్న గుహలో ధ్యానం చేసుకొనేవాడు.  ఈ కొండమీద వెంకన్న పాదాలూ, అన్నికాలాల్లోనీ మంచినీరు ఊరే ఒక గుంట(లోతుగా ఉండే ప్రదేశం) ఉండేవట. నీరు గుంటలో నిండి, అంచులుదాటి, దిగువకి ప్రవహించి ఒక కాలువలా మా పొలాలని తడిపేది. దీనిని కొండకాలువ అని పిలిచేవారు.

దంతులూరి చలమరాజు - మా నాన్నగారు 

రాత్రివేళల్లో అడవి పందులు, కొండగొర్రెలు, కణుజులనే జంతువులు కొండదిగివచ్చి కందిచేలు, వేరుశనగచేలు వంటివి ఉంటే కొంతవరకూ తిని పాడుచేసేవి. కొండపైనుంచి కనిపించే సుందర దృశ్యాలు, ఆహ్లాదకరమైన చల్లనిగాలి, ఏవయినా జంతువులు ఎదురుపడతాయేమో అనే భయంతో కూడిన కుతూహలం అనుభవించాలంటే సాహసం చేసి కొండపైకి వెళ్ళాలి.  కొండ నిటారుగా ఉండడంవల్ల గొర్రెల కాపర్లు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ పైకి ఎక్కేవారు కాదట. వాళ్ళ దగ్గర ఒక చివర డొంకినీలు(వంకరగా ఉండే కత్తి లేదా కర్ర) కట్టిన పొడవైన కర్రలు ఉండేవి. డొంకినీలని చెట్టుకొమ్మలకి తగిలించి వాటి సహాయంతో పైకి వెళ్ళేవాళ్ళు.  ప్రతిఫలం లేకుండా సాహసాలు ఎవరుచేస్తారు? కానీ, అలా చెయ్యడానికి మా నాన్నగారికి దొరికే ప్రతిఫలం కొండపైన తీసే ఫోటోలు. ఒకరో ఇద్దరో కలిసి దొడరాయికొండ  ఎక్కి అద్బుతమైన ఫోటోలు తీసుకొన్న ఆనందం ఇప్పటికీ తాజాగా ఫీలవుతారు. 

తాతయ్యకి గంపెడు సంతానం - పిల్లలు, మనుమలు, మనవరాళ్ళుతో ఎప్పుడూ ఇల్లంతా కళకళ లాడుతూండేదట. అల్లరిపిడుగులు, బుద్దిమంతులు, దబ్బపళ్ళలాంటివాళ్ళు, రొయ్యపిల్లల లాంటివాళ్ళు, పేచీకోర్లు... రకరకాల పిల్లలు. `నువ్వు చిన్నప్పుడు దబ్బపండులా ఉండేవాడివి తెలుసా?` అని చెబితే; ఎలా ఉండేవాళ్ళమో చూసుకోవడానికి మనదగ్గర ఒక్కఫోటో అయినా లేక పోతే ఎంత నిరుత్సాహంగా ఉంటుంది? 
  తాతగారి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు 

మాచిన్నప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఒక ఆల్బం నిండా ఉన్నాయి. అప్పటి మనుషులు, పరిసరాలు, సంఘటనలు ఈ రోజు చూడగలుగుతున్నామంటే కొన్నప్పుడు లగ్జరీ అని భావించిన ఆ డబ్బా కెమేరా పుణ్యమే! నాన్నగారు చెప్పిన విశేషాలని ఈ టపా చూపించి, ఆయనకే చదివి వినిపిస్తే అమ్మా, బావజ్జీ(నాన్న) భలే ఆనందపడతారు. ఊండండి ఒక్కసారి, నేను ఇప్పుడే వెళ్ళి ఆపని చేసి వస్తాను. వచ్చాకా చెబుతానే వాళ్ళ రెస్పాన్సుని! 
ఇక్కడ ముగ్గురిలో చిన్నవాడు - నేనే!
© Dantuluri Kishore Varma

8 comments:

  1. Baaunayandi...photolu ...kaburlu...
    Krishna

    ReplyDelete
  2. మీకు నచ్చి, ఆవిషయం శ్రమ అనుకోకుండా తెలియజేసినందుకు ధన్యవాదాలు కృష్ణగారు.

    ReplyDelete
  3. Very very nice. మాకు ఇద్దరు (అద్దె) అన్నయ్యలున్నారు. వాళ్ళకి ఫొటోగ్రఫీ హాబీ. హైదరాబాదునించి మా యింటికొచ్చినప్పుడల్లా అన్నయ్యా ఫొటో తియ్యవా, అన్నయ్యా కెమెరా తెచ్చావా అని దుంపతెంచి పడేసేవాళ్ళం.

    ReplyDelete
  4. ధన్యవాదాలు నారాయణస్వామిగారు.

    ReplyDelete
  5. బాగున్నాయండీ మీ కెమెరా జ్ఞాపకలు.

    ReplyDelete
  6. అనుభవాలు అనుభూతులుగా మారాలంటే రచన, కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీల.... ద్వారానే సాధ్యం. మొదటి నాలుగూ మనసుమీద ఇమేజస్ అయితే, అయిదోది కళ్ళకు కనిపించే ప్రతిరూపం. పాతఫొటోలు, జ్ఞాపకాలూ ఎప్పటికీ బాగుంటాయి. మీకు నచ్చి, మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు శిశిరగారు.

    ReplyDelete
  7. బ్లాగింగ్ పట్ల నా అభిప్రాయం మార్చింది సర్ మీ బ్లాగ్..

    ReplyDelete
  8. బాగుంది అంటున్నారో, బాగోలేదని అంటున్నారో తెలియలేదు అశోక్ గారు :). నేను పాజిటివ్ అనే అనుకొంటున్నాను. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా బ్లాగ్ చూస్తూ ఉండండి.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!