Pages

Saturday 5 January 2013

ఆదికుంభేశ్వర స్వామి దేవాలయము

రావణా బ్రహ్మ రాజనీతిజ్ఞుడు, వీరుడు, బలశాలి, సకల వేదవేదాంగ పండితుడు అన్నింటినీమించి శివ భక్తుడు. ఎన్నో సుగుణాలు ఉన్నా, కొన్ని అవలక్షణాల వల్ల సర్వనాశనం కావడం మనం రావణుడి నుంచి నేర్చుకోవలసిన పాఠం. రావణాసురుని అసలు పేరు  దశగ్రీవుడు లేదా దశకంఠుడు. అంటే పదితలలు కలవాడు అని అర్ధం. నేను గొప్పవాడిని అన్న అహంతో శివుడు తప్పస్సు చేసుకొంటున్న పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తున్న రావణుడికి బుద్దిచెప్పడానికి శివుడు పర్వత శిఖరం మీద తనబొటనవేలితో అదుముతాడట. ఆ వొత్తడికి నలిగిపోయిన దశకంఠుడు బాధతో రోధిస్తాడట. అప్పటినుంచే అతనికి బాధతో రోదించేవాడని అర్ధం ఇచ్చే రావణుడు అని పేరు వచ్చింది అంటారు. ఆ సంఘటన తరువాత రావణుడు పరమ శివభక్తుడు అవుతాడు.   ఈ కథని గుర్తుకు తెచ్చేలా దశగ్రీవుడి తలలమీద నిలచిన శిఖరంతో ఆదికుంభేశ్వరుడి దేవాలయం మనకి కాకినాడ బీచ్‌రోడ్‌లో కనిపిస్తుంది. 
రావణుడి భారీ విగ్రహంలాగానే దేవాలయానికి మిగిలిన మూడువైపులా మహిషాసురమర్ధిని, పంచముఖ ఆంజనేయస్వామి, సప్తాశ్వాలకు కట్టిన ఒంటిచక్రపు రధమ్మీద ప్రయాణిస్తున్న సూర్యభగవానుడి విగ్రహాలూ కట్టారు. 
రావణాసురుడి కాళ్ళమధ్యనుంచి ఏర్పాటుచేసిన ప్రవేశద్వారం గుండా లోపలికి వెళ్తే విశాలమైన స్థలంలో పెద్ద నంది విగ్రహం, పొడవైన ధ్వజస్థంభం ఉంటాయి. రెండు అంతస్థుల్లో ఉండే గుడి అంతర్భాగంలో, ప్రతీ అంతస్థులోనూ వరుస గదులగా ఏర్పాటు చేసిన మందిరాల్లో దశావతారాలు, అష్ఠలక్ష్ములు, ప్రముఖ శివక్షేత్రాలలో ఉండే శివలింగాలు, నందులు, ఇంకా చాలా దేవతామూర్తులను ఉంచారు. అందంగా మలచిన విగ్రహాలు బాగుంటాయి. కానీ, ఈ గదులను బిల్డింగ్ మెటీరియల్ వేసే స్టోర్ రూములు గా వాడకుండా ఉంటే ఇంకా అందంగా ఉండి ఉండేవేమో!  

ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రతీ సంవత్సరం కార్తీక అమావాశ్యరోజు భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం జరుగుతుంది. సుమారు లక్షమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఒకకోటీ ఎనిమిది లక్షల శివలింగాలకి అభిషేకం చేస్తారు. మరి ఇన్ని శివలింగాలు ఎక్కడినుంచి వస్తాయి అని అనుమానం రావచ్చు. చిన్న చిన్న లింగాలని ఒకే పెద్దలింగంగా ఏర్పాటుచేసి అభిషేకం జరుపుతారు. తరువాత వాటిని అన్నింటినీ సంచులలో పెట్టి ప్యాక్ చేసి అట్టిపెడతారు. ఒకసారి ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు అలా కనిపించిన శివలింగాలు ఇవి.  
సముద్రపుపోటు సమయంలో కెరటాలు దేవాలయం వరకూ వచ్చేస్తాయి. నీరు వెనుకకు వెళ్ళిపోయినప్పుడు గుడి ముందువైపు మినహా మిగిలిన మూడువైపులా చిత్తడిగా ఉంటుంది. చేపల వాసన కూడా ఉంటుంది. భారీ విగ్రహాలు సిమ్మెంటుతో చేసినవి, ముక్కులూ, ముఖాలు కొంతవరకూ ముక్కలు ఊడిపోయాయి. ఇటువంటి కొన్ని అప్రియంగా కనిపించే విషయాలు ఉన్నా, సముద్రమ్మీద దూరంనుంచి కనిపించే ఓడలు, దగ్గరగా కనిపించే రంగురంగుల చేపల పడవలు, మత్యకారుల కార్యకలాపాలు, కెరటాల హోరూ బాగుంటాయి. కాబట్టి, తప్పనిసరిగా చూడవలసిన దేవాలయమే ఇది.  

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!