Pages

Friday 11 January 2013

పోటెత్తిన సంబరాలు

కాకినాడ సూర్యారావు పేట బీచ్‌లో సరదాల సందడి మొదలైంది. బీచ్ ఫెస్టివల్‌ కు వేలల్లో జనాలు తరలివచ్చారు. ముందు అనుకొన్నట్టుగానే ముఖ్యమంత్రి, ఇతరమంత్రులు, ప్రజా ప్రతినిధులు పెద్దసంఖ్యలో వచ్చి సాగర సంబరాలని ప్రారంభించారు. పట్టణం ఎక్కడికక్కడ నిర్మించిన స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, గోడలమీద చిత్రకారులతో గీయించిన తూర్పుగోదావరి జిల్లా సంస్కృతీ, జీవనవిధానం, జీవవైవిధ్యం మొదలైన విశేషాలను తెలియజేసే అందమైన చిత్రాలు, ఓవర్ బ్రిడ్జీలమీద ఇరువైపులా ఏర్పాటు చేసిన మొక్కలతో పండుగ శోభతో కళకళ లాడింది.
బైకుల్లో, కారుల్లో, ఆటోల్లో వచ్చిన ప్రజలు వాకలపూడి లైట్ హౌస్‌కు దగ్గరలో వాహనాలని పార్క్ చేసుకొని సుమారు ఒకకిలోమీటరు దూరంలో ఉన్న ఫెస్టివల్ దగ్గరకి నడచి వెళ్ళారు. స్వాగత ద్వారం దాటిన వెంటనే ఇరువైపులా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేసారు. నర్సరీ వాళ్ళు పెట్టిన స్టాల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎదురుగా అన్నవరం సత్యదేవుని నమూనా దేవాలయం. దానికి సమీపంలోనే తుర్పుగోదావరిజిల్లా ప్రముఖ దేవాలయాల స్టాల్ ఏర్పాటుచేసి ప్రసాదాలు అమ్ముతున్నారు.
ఉత్తరంవైపు పెద్ద సభాస్థలిని నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూర్చుని వీక్షించడానికి అనువుగా కుర్చీలు వేసారు. ఉదయం నుంచి సాయంత్రంవరకూ విద్యార్ధుల కార్యక్రమాలూ, సాయంత్రం నుంచి ప్రఖ్యాత కళాకారుల సంగీత, వినోద కార్యక్రమాలు ఉంటాయి.
సంబరాలు జరుగుతున్న బీచ్ ఏరియా అంతా విద్యుత్ లైట్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఫ్లడ్‌లైట్లకి దగ్గరగా ఇసుకలో ప్రఖ్యాత సైకత శిల్పి పట్నాయక్ చేసిన సేవ్ ద సీ శిల్పం, కాకినాడ వాటర్‌వర్క్స్ లో పనిచేస్తున్న సానా వెంకట రమణ చేసిన సేవ్ విమెన్ ఇసుక శిల్పాలు చాలా బాగున్నాయి. 
ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. చాట్, బిర్యానీ, బొంగులో చికెన్, స్వగృహా ఫుడ్స్ మొదలన స్టాల్స్ ధక్షిణం వైపు వరుసగా ఏర్పాటు చేశారు. T.కొట్టాం బొమ్మల స్టాల్, పశు సంవర్ధక శాక స్టాల్, తోలుబొమ్మల స్టాల్స్ బాగున్నాయి.    చూడటానికి సాధారణంగా కనిపించే ఒక చిన్న తోలుబొమ్మ ధర ఆరువందల రూపాయలట!
గంగిరెద్దులవాళ్ళు, రకరకాల వేషదారులు, జానపద కళాకారులు, బీచ్ ప్రాంతం అంతా తిరుగుతూ సందడి చేస్తున్నారు. 
శాశ్వత ప్రాతిపదికన 30, 40 ఎకరాల స్థలంలో బీచ్ పార్క్ నిర్మిస్తాం అని ముఖ్యమంత్రి ప్రకటించడం అందరికీ నచ్చిన విషయం. ఇక ముందు కాకినాడ సాగరతీరానికి పర్యాటక హంగులు జతకూడడం జిల్లా వాసులందరికీ సంతోషకరమైన వార్త. ఇప్పటి వరకూ మనవూరి సాగరతీరం సరయిన సౌకర్యాలులేక నామమాత్రపు ఆకర్షణగా మిగిలిపోయింది. ఇప్పటి నుంచి విశాఖ సాగరతీరంలా ఇది కూడా ముఖ్యమైన పర్యాటక ప్రాంతం అవుతుందని ఆశిద్దాం . మీరు నిన్న ఈ సంబరాలకి వెళ్ళి ఉండక పోతే, ఈ రోజో, రేపో ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళగలిగేటంత దగ్గరలో లేకపోతే కనీసం వచ్చే సంవత్సరానికయినా సందర్శించే వీలు చేసుకోండి. 

© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!