Pages

Thursday 31 January 2013

కాలం కమ్మగా సాగే పాట.

ఇరవై సంవత్సరాల క్రితం-

డిగ్రీ చివరి సంవత్సరం, చిట్టచివరి రోజు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది.

మూడేళ్ళు కలిసి తిరిగిన స్నేహితుల్ని ఆ తరువాతి రోజు నుంచి కలవలేం అనే బాధ గుండెల్లో గుచ్చేస్తుండగా ఆటోగ్రాఫ్ బుక్కులు పట్టుకొని కాలేజీకి వెళ్ళాం. పార్కింగ్ దగ్గర పెద్ద చప్టా, కాలేజ్ వెనుక నేలబారుగా కొమ్మలున్న మావిడి చెట్టు,  కేంటీన్, మిగిలిన ఫేవరెట్ హేంగౌట్స్, మనతో కలిసి క్లాసుకి బంక్ కొట్టి కేరింతలు కొట్టిన స్నేహితులు -  అన్నీ అలాగే ఉన్నాయి. మనసులోనే ఉత్సాహం లేదు.  

`మావా, ఆటోగ్రాఫ్ రా,` అంటే; `ఏడిశావులే, కాలేజీ వదిలేసినా ఊళ్ళోనే ఉంటాం కదరా?` అన్న బక్క దాసు తరువాత రైల్వేలో ఉద్యోగంవచ్చి, ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎడ్రస్ తెలియకుండా పోయాడు.

`ఏరా అమ్మాయికి మేటరు చెప్పావా?` అంటే; మేం సత్తిబాబు అని పిలిచే సతీష్ మొహం చిన్నబుచ్చుకొన్నాడు. `పెళ్ళి కుదిరిందట. ఎగ్జాంస్ అన్నా రాస్తుందో, లేదో అనుమానమే! చీ ఎదవ జీవితం, టైమంతా మన మొహమాటంతోనే గడిచిపోయింది,` అని బోరుమని ఏడ్చేసిన సత్తిబాబుకి ఆతరువాత మేనమామ కూతురితో పెళ్ళయ్యి, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు కాలేజీలో చదువుతున్నారు. 

`జీవితమంటే మెట్ల వరస. వాటిని జారుడు మెట్లుగా కాకుండా, విజయ సోపానాలుగా మార్చుకోవాలని కోరుకొంటున్నా`నని రాసిన లెక్చరర్ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వీడియో సీను, ఇంకా కొంతమంది కష్టపడి అందరి ఫోన్ నెంబర్లూ సంపాదించి గెట్ టుగేదర్ ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈ మధ్యనే కలిశాం. టైం మెషీన్‌లో వెనక్కి వెళ్ళిపోయినట్టు వెనక బెంచీలవాళ్ళు వెనక్కి చేరిపోయి గోల. బుద్ది మంతులు అప్పటిలాగానే ముందువరసలో కూర్చుని ఉపన్యాసాలన్నీ వినేశారు.  `ఆయమ్మాయి వొచ్చిందేమో!` అని ఆశగా వెతుక్కొన్నాడు పాపం సత్తిబాబు.

`మీ బ్యాచ్ మాకు బాగా గుర్తుండి పోయిందయ్యా,` అని అప్పటి మా లెక్చరర్లు అంటే చెట్టెక్కినంత ఆనందపడిపోయాం. అసలు గుర్తుండిపోవడానికి అల్లరి తప్పించి ఇంకేమి చేశామని! గురువులు అన్ని బ్యాచ్‌లతోనూ అలాగే అంటారేమో!

`ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిశాము` అని స్టూడెంట్ నెంబర్ వన్ లో పాటేస్తే చూసిన జనాలకి ఎప్పటివో జ్ఞాపకాలన్నీ మనసులో దూరేసి గుండెల్ని బరువెక్కించేశాయి. `హ్యాపీడేస్` అని శేఖర్ కమ్ముల సినిమాలో మెలోడీ మనసుని మెలిపెట్టేస్తే ఇప్పటి ఇంజనీరింగ్ జనరేషన్ అదే స్థాయిలో జ్ఞాపకాల్లో మునిగి మత్తెక్కి పోయింది. జనరేషన్ ఏదయినా స్నేహబంధంలో మార్పురాలేదు.

మొన్నఇంజనీరింగ్ కాలేజీలో E.C.E(B) నాలుగవసంవత్సరం చదువుతున్న వెంకటేష్ `ఫేర్‌వెల్ టైం వచ్చేసింది సార్. మా బ్యాచ్ వాళ్ళం ఎప్పటికీ మరచిపోలేని విధంగా ఏమయినా చెయ్యాలి,` అన్నాడు.

`ఆటోగ్రాఫ్‌లు రాసుకొని జాగ్రత్త  చేసుకొంటారా?` అన్నాను.

`అవీ, టీ షర్ట్‌ల మీద సంతకాలు, చేతిముద్రలు జాగ్రత్త పెట్టుకోవడం, ఫోటోలు అలాగే ఉన్నాయి. ఫేర్వెల్ వీడియో తీసుకొని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకొంటున్నారు ఇప్పుడంతా. నేను చాలా వీడియోలు చూశాను. కానీ అన్నీ  ఒక్కలాగే అనిపిస్తున్నాయి. మేం ప్రత్యేకంగా ఉండేలా స్పెషల్ ఎఫెక్ట్స్ కలిపి ప్లాన్ చేసుకొంటున్నాం,` అన్నాడు.

`స్పెషల్ ఎఫెక్ట్స్ వల్ల గుర్తుండిపోతుందా?` అంటే అతను చక్కటి వివరణ ఇచ్చాడు. `కొత్తదనం మీద ఆసక్తితో ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకొని అట్టేపెట్టుకొంటారుకదా!  జ్ఞాపకం యొక్క విలువ తెలిసేసరికి, పుస్తకంలో దాచుకొన్న నెమలిపించంలా వీడియో బద్రంగా ఉంటుంది.`

ఫోన్లు, ఫేస్ బుక్కులు లేని రోజుల్లో ఎడ్రస్ లేకుండా మాయమై పోయిన దాసులాంటి ఫ్రెండ్స్‌ని మళ్ళీ కలవాలంటే సాధ్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. సాంకేతికత పెరిగింది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకొంటున్నాం. మారుతున్న కాలంతో పాటూ, అభిరుచులు మారుతున్నాయి. కాలం మారినా స్నేహబంధం మారలేదు. జ్ఞాపకాలు దాచుకొనే మాధ్యమాలు వేరయినా ఆప్యాయతల పరిమళాలు ఆగిపోలేదు.

కాలం కమ్మగా సాగే పాట.
© Dantuluri Kishore Varma 

13 comments:

  1. nyc post..impressive..!!!!!!!!!

    ReplyDelete
  2. స్నేహబంధమూ ఎంత మధురమూ....చదువుతుంటే ఈ పాట గుర్తుకొచ్చింది.
    కాలం ఎంతగా మారినా, ఎన్ని మార్పులొచ్చినా, ఎంత కాలానికి మళ్ళీ కలిసినా...అదే చిన్న నాటి పలకరింపులు...ఒక్క స్నేహితులకే సాధ్యం.
    అన్ని బంధాల్లోనూ మిన్న అయిన బంధం నిస్సందేహంగా స్నేహ బంధం!

    ReplyDelete
  3. చిన్ని ఆశ గారి మాటకే నా ఓటు :)

    ReplyDelete
  4. excellent editing...waiting eagrly for the movie..!!!
    varma garu patha nenories gurthukutecharandi

    ReplyDelete
  5. థాంక్స్ చిన్ని ఆశగారు, శర్మగారు, అజ్ఞాత గారు.

    ReplyDelete
  6. bagundi varma garu...nyc post..

    ReplyDelete
  7. excellent andi ..me matalaki aa kurolla chethalaki perfect sink...keep going

    ReplyDelete
  8. andaru cheppedey nenu cheputunnanu......... EXCELLENT...........

    ReplyDelete
  9. థాంక్స్ అండీ కృష్ణ చైతన్య గారు.

    ReplyDelete
  10. జ్ఞాపకాలు దాచుకునే మాధ్యమాలు మారినా ఆప్యాయతా పరిమళాలు ఆగిపోలేదు బాగుందండి.మంచిపోస్ట్

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!