Pages

Thursday 29 August 2013

గజేంద్రమోక్షం

గజేంద్రమోక్షం పోతన రచించిన భాగవతంలో ఒక చిన్న ఘట్టం. ఒకరోజు అడవిలో గజరాజు ఆహారం భుజించి, మంచినీటికోసం కొలనులో దిగుతాడు. నీరు తాగి, అక్కడే జలకాలాడుతుండగా, ఆ కొలనులో ఉన్న ఒక మొసలి గజరాజు కాలిని పట్టుకొంటుంది. నీటిలో ఉన్నంతసేపూ మొసలి బలంముందు ఏదీ సాటిరాదు. ఏనుగు అత్యంత బలం ఉన్నది అయినా, నీటిలో ఉన్న మొసలితో పోరాడడం చాలా కష్టం. గజరాజు చాలా సమయం పోరాడి, నీరసించి, ఇక ఎటువంటి శక్తీ లేక, చివరగా శ్రీమహావిష్ణువుని తనను కాపాడవలసిందిగా కోరుకొంటుంది. ఇదిగో ఇలా -

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెన మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితః పరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!  

గజేంద్రుడి అసహాయత, నీరసించిపోయాను నువ్వే వచ్చి కాపాడాలనే విన్నపము, నువ్వుతప్ప నన్ను రక్షించగలవారు ఎవ్వరూ లేదు అనే సంపూర్ణ విశ్వాసమూ ఈ పద్యంలో చక్కగా చెప్పబడ్డాయి.  భక్తుడి బాధ సరే! మరి ఆ సమయంలో హరి ఏమిచేస్తున్నట్టు!?

అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా
పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై 

ఆ సమయంలో మహావిష్ణువు లక్ష్మీ దేవితో కలసి ఉంటాడు. గజేంద్రుడు ఆతని భక్తుడు. కష్టంలో ఉన్నాడు. వెంటనే వెళ్ళి కాపాడవలసిని బాధ్యత ఉంది. అందుకే, ఉన్నపళంగా బయలుదేరి ఆఘమేఘాలమీద వెళ్ళాడు. ఎలాగయ్యా అంటే - భార్య అయిన లక్ష్మీదేవితో ఒక్కముక్కైనా చెప్పలేదు. శంఖు, చక్రాలని తీసుకోలేదు. చేతిలోఉన్న లక్ష్మీదేవి చీరచెంగుని వొదలాలనే ద్యాస కూడా లేకుండా - భక్తుడిని ఆపదనుంచి గట్టెంకించడానికి ఒక్క పరుగున బయలుదేరాడు. 

సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై 

శ్రీహరివెంట లక్ష్మీదేవి బయలుదేరింది, ఆమెవెంటే పరివారం, గరుత్మంతుడు, ఆ తరువాత విష్ణుమూర్తియొక్క సకల ఆయుధాలూ వెళ్ళాయి. ఈ పద్యంలో చెప్పినట్టు -

తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్ వాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్

విషయమేమిటని విభుడిని అడగాలా లేదా అనే సంశయాన్ని లక్ష్మీదేవి పరంగా ఎంత చక్కని పద్యంలో చెప్పాడో చూడండి పోతనా మాత్యుడు.

అడిగెదనని కడువడి జను 
నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్
వడివడి జిడిముడి తడబడ 
నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్ 

భక్తుని ఆర్తనాదం విని భగవంతుడు పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చీ, సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి, గజరాజుని రక్షిస్తాడు.

ఈ కథలో విశేషమేమిటంటే భక్తుడు తనప్రయత్నం అంతాచేసి, అసహాయుడై, కష్టంలోఉన్నప్పుడు, అతనిని రక్షించడానికి భగవంతుడు దిగివస్తాడు అని. 
Wall Painting in Kotipalli Temple
గజేంద్రమోక్షంలో అద్భుతమైన పద్యాలను ఇక్కడ చూడండి.          ఇక్కడ వినండి. 

© Dantuluri Kishore Varma

4 comments:

  1. Replies
    1. థాంక్స్ సత్యకిరణ్‌గారు.

      Delete
  2. తన పని తను చేయడమే కాదు పూర్తి శరణాగతి కావాలి" లా ఒక్కింతయు లేదు....

    ReplyDelete
    Replies
    1. నిజమే శర్మగారు. ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!