Pages

Tuesday 5 November 2013

ఒక్క మాట చాలదూ!

ఊరు వదిలి పట్నాలకి, అక్కడినుంచి ఇతరరాష్ట్రాలకి, దేశాలకి, ఖండాంతరాలకి వెళతాం. వృక్షం శాఖలతో విస్తరించినట్టు ఎన్నో విజయసోపానాలు. కానీ చెట్టువేళ్ళు మనం పుట్టినచోటే ఉంటాయి. `మన వూరు` అనే మాట ఎంత తియ్యగా ఉంటుంది! 

ఈ మధ్య ఒక స్నేహితుడు (స్నేహితుడు అనే మాట వాడవచ్చో, లేదో తెలియదు. ఎందుకంటే ఆయన నాకంటే పెద్దవారు) ముంబాయి నుంచి ఫోన్‌లో మాట్లాడారు. తరువాత ఈ రోజు కలిశాం. ఇద్దరం కలిసి చదువుకోలేదు. ఎందుకంటే ఆయన కాలేజి విడిచిపెట్టే సరికి, నేనింకా స్కూల్లో జాయినవ్వలేదు. బందువులం కాదు, ఇరుగుపొరుగువాళ్ళం కాదు. కానీ ఆయనతో పరిచయం అయ్యేలా చేసింది - మనకాకినాడలో బ్లాగు.

కాకినాడలోనే పుట్టి, విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, 1980లో ఉద్యోగరీత్యా విదేశాలకి వెళ్ళారు. చాలాకాలం వివిధ దేశాల్లో ఉద్యోగబాద్యతలు నిర్వహించి, ఇండియాకి తిరిగి వచ్చి, ప్రస్తుతం రిలయన్స్ సంస్థలో అసిస్టెంట్ వైస్‌ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆయన పేరు బొగ్గవరపు హనుమంత రాం గారు. 

`నన్నెలా పట్టుకొన్నారు?` అని అడిగాను.

`బ్లాగులో మీరు వేసిన పెసరట్ల వాసన ముంబాయ్‌కి వచ్చింది,` అన్నారు.  `అదేకాదు చాలా సంవత్సరాలుగా  ఆర్టోస్ మాట వినలేదు. బ్లాగ్‌లో చూసినతరువాత ఎప్పుడో మరుగునపడిపోయిన ఇష్టం జ్ఞాపకాలపొరలు చీల్చుకొని పైకొచ్చింది. పార్లేలు, కోకోకోలాలు రాకముందు దాన్ని ఎంత అపురూపంగా తాగేవాళ్ళమో గుర్తుకొచ్చింది ` అన్నారు.

`తాజ్‌మహల్‌ని ఆగ్రాలో ఉన్నవాళ్ళు రోజూ చూడాలని కోరుకోరు. అలాగే ఇక్కడే ఉన్నవాళ్ళకి పుట్టినవూరుతో ఉండే ఆత్మీయత అర్ధంకాదు. మాలాగ దూరంగా ఉండేవాళ్ళకి బ్లాగులో ఒక్కొక్క ఆర్టికల్ ఎంత నాస్టాల్జియా కలిగిస్తుందో తెలుసా?` అన్నారు.   

రాకరాక కాకినాడ వచ్చారు. వందపనులు. ఉన్న కొంచం సమయంలో ఒక గంట నాకు కేటాయించారు. ఎన్ని జ్ఞాపకాలు! ఎన్ని అనుభూతులు!! ఇంటిలోవాళ్ళు అర్ధరూపాయి ఇస్తే అక్కా, తనూ గ్లాస్‌హౌస్ సెంటర్‌నుంచి రెడ్‌కాన్వెంటుకి  వెళ్ళడానికి రిక్షా కిరాయి ఓ వైపు ఇరవైపైసలు, తిరిగి వచ్చేటప్పుడు మరో ఇరవై. మిగిలినది చెరొక సగం పోకెట్‌మనీ.  ఐదుపైసలకి ఎన్నివోస్తాయో తెలుసునా? ఒక్కసారి ఆలోచించండి. పుల్లైసులరోజులు, ఒక్కోపైసాకి ఒక్కో పిప్పరమెంటుబిళ్ళ వచ్చేరోజులు.
ఇంకా కొంతసేపు ఆయనతో గడిపితే బాగుండునని అనిపించేటంత స్నేహశీలి, నిగర్వి. కానీ సరిగ్గా ఒంటిగంటకి ఆయనకి చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్‌గారిని కలిసే అపాయింట్‌మెంట్. ఆయనకి పనిష్మెంట్ ఇచ్చిన ఒకే ఒక్క టీచరు! యడాగమసంధికో, ఆమ్రేడితసంధికో సూత్రం సరిగా చెప్పకపోతే ఏ తెలుగు టీచరుకైనా కోపంవస్తుందికదా? మామూలు విద్యార్థులైతే ఏదోఅనుకోవచ్చు, క్లాసులో ఎప్పుడూ ప్రధముడిగా వచ్చే బుద్ధిమంతుడైన కుర్రాడు అలా చెయ్యవచ్చా? బెంచీమీద ఎక్కించి, `నీకు తప్పుచేసే హక్కులేదు. అందరూ నీలా ఉండాలనుకొంటే, వాళ్ళకి తప్పుడు సంకేతాలు ఇస్తే నేను ఒప్పుకోను,` అనికూడా ఘాట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఆ మాట మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఒక్క మాట చాలదూ, విజయాలవైపు వేలుపట్టి నడిపించడానికి. అందుకే, ఆవిడని అభిమానంతో చూడటానికి వెళుతున్నారు. నేను మరికొంచం సేపు ఉండమని కోరగలనా?    

వెళ్ళేటప్పుడు నా బ్లాగుని మెచ్చుకొని, ఒక హెచ్చరిక చేసి వెళ్ళారు. `పలానా కథలో, ఆ చివర రాసిన వాక్యం నాకు అస్సలు నచ్చలేదు. మీరు రాసినట్టు లేదు. ఎందుకు అలా రాయడం?` అని.  ఎంత బాధ్యతతో రాయాలో తెలిసింది. ఒక్క మాట చాలదూ!
© Dantuluri Kishore Varma 

8 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు మూర్తిగారు.

      Delete
  2. ఒక్కమాట జీవితాన్ని మారుస్తుంది

    ReplyDelete
    Replies
    1. నిజమే శర్మగారు కొన్నిమాటలకి స్పూర్తినింపే శక్తి ఉంటుంది. అవి మంత్రాల్లా పనిచేస్తాయి. మీ స్పందనకి ధన్యవాదాలు.

      Delete
  3. వెళ్ళేటప్పుడు నా బ్లాగుని మెచ్చుకొని, ఒక హెచ్చరిక చేసి వెళ్ళారు. `పలానా కథలో, ఆ చివర రాసిన వాక్యం నాకు అస్సలు నచ్చలేదు. మీరు రాసినట్టు లేదు. ఎందుకు అలా రాయడం?` అని. ఎంత బాధ్యతతో రాయాలో తెలిసింది. ఒక్క మాట చాలదూ! This looks like a warning to me :-)

    ReplyDelete
    Replies
    1. మీకూ అలాగే అనిపించిందా..హ..హా.. థాంక్యూ రెడ్డిగారు.

      Delete
  4. ఎంత మంచి అనుభూతి?
    బాగా ఆస్వాదించారనుకుంటాను. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. నిజమే బోనగిరిగారు. ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!