Pages

Thursday 28 November 2013

నారాయణా, తలప్రాణం తోకకి వస్తుంది!

కాకినాడ మెయిన్‌రోడ్డు ఈ  స్థాయి చాలా పట్టణాల మెయిన్‌రోడ్ల కంటే విశాలమైనదే. ఈ మధ్య విస్తరణ పనులు చేపట్టిన తరువాత ఇంకొంచం బాగుంది. కానీ, ఈ రోడ్ వెంట ప్రయాణించడమే విసుగు పుట్టించే వ్యవహారంగా తయారయ్యింది. దానికి ప్రధానమైన కారణం జనాలు సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించక పోవడమే. 

చాలా కాలం క్రితం సెంటర్‌పార్కింగ్ ఉండేది. ఎడమవైపునుంచి సైకిళ్ళు, రిక్షాలు లాంటి నెమ్మదిగా వెళ్ళే వాహనాలూ వెళితే, కుడివైపునుంచి మోటారుసైకిళ్ళు, కార్లు వెళ్ళేవి. ఆటోలు అంతగా ఉండేవికాదు. తరువాత పార్కింగ్‌ని ఎడమవైపుకి మార్చారు. కానీ రోడ్డు మధ్యలో విభజన రేఖల్లాంటివి ఏర్పాటు చెయ్యలేదు. ఇప్పటికీ చాలా మంది పాతపద్దతినే అనుసరిస్తూ వెళుతున్నా, సైకిళ్ళు ఫాస్ట్ లేన్‌లోనికి వచ్చెయ్యడం, కార్లూ స్కూటర్లవాళ్ళు సైకిళ్ళు వెళ్ళే మార్గంలోకి చొరబడిపోయి, హారన్లతో వాళ్ళని బెంబేలెత్తించడం మామూలయిపోయింది. ఆటోల విషయమైతే చెప్పక్కర్లెద్దు. వాళ్ళకి రూల్స్ ఉన్నా వర్తించవు. చిన్న జాగా దొరికితే ఆటోముందు చక్రాన్ని అక్కడ ఇరికించేస్తారు. ఇంగ్లీష్‌లో పెన్‌డమోనియం అనే ఒక మాట ఉంది - చాలా గందరగోళమైన ప్రదేశం అని దాని అర్థం. రోడ్డుని అలా చేసేస్తారు. 
ఎడమవైపు పార్కింగ్ చేసిన వాహనాలు, వాటి ప్రక్కన తోపుడు బళ్ళమీద పళ్ళు, స్వీట్‌కార్న్, బనీన్లు, బొమ్మలు, కాయగూరలు, ఐస్‌క్రీం అమ్మే హాకర్స్ రమారమి రోడ్డు మధ్యవరకూ ఆక్రమించేసి ఉంటారు. 

ఇక ప్రక్కసందుల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. లారీలు, వేన్లు, అద్దెబళ్ళు, తొట్టిఆటోలు ఎక్కడపడితే అక్కడ నిలిపేసి లోడింగ్, అన్‌లోడింగ్ చేసుకొంటారు. టీషాపుల ముందు ట్రాఫిక్‌కి అడ్డంగా బైకులు నిలిపి దమ్ముకొడుతూ, టీ చప్పరిస్తూ ఉంటారు. కార్ల యజమానులైతే ఇరుకు వీధుల్లో ఉన్న వాళ్ళ ఇళ్ళప్రక్కన గోడని ఆనుకొని ఉన్న మునిసిపాలిటీ స్థలం మీద(రోడ్డు) సర్వహక్కులూ కలిగిఉన్నట్టు ప్రవర్తిస్తారు. అది వాళ్ళ కారు పార్కింగ్ స్థలం. 

ఇల్లు కట్టుకొనే వాడు మెటల్, సిమ్మెంట్, ఇటుకలు, ఇసుక రోడ్డుమీదే వేసి నిర్మాణం పూర్తయ్యేవరకూ ఆక్రమణ కొనసాగిస్తాడు. పెళ్ళో, చావో, మీటింగో వచ్చిందంటే మొత్తం వీధిని ఆక్రమించేసి, టెంట్లు వేసేస్తారు.  పందులు, ఆవులు సరేసరి. వీటన్నింటికీ తోడు స్కూల్, కాలేజీ బస్సులు. ఫుట్‌పాత్ ఉన్నా దానిమీద నడవకుండా, వాహనాలకు అడ్డుపడుతూ సాగిపోయే పాదచారులు. నారాయణా, ప్రయాణం అంటే తలప్రాణం, తోకకి  వస్తుంది! కాకినాడ కంటే, దీనికి పదిరెట్లు ఎక్కువ జనాభా ఉన్న పెద్ద నగరాలలోనే మెరుగైన ట్రాఫిక్ వ్యవస్ధ ఉంటుందేమో!

© Dantuluri Kishore Varma

6 comments:

  1. @@ "ఫుట్ పాత్ ఉన్నా దానిమీద నడవకుండా ..........."
    దానికీ బలమైన కారణం ఉంది రాజు గారూ. చిన్న వ్యాపారస్తులు, షాపుల వాళ్ళ బైకులూ ఫుట్ పాత్ ని కూడా ఆక్రమించటంవల్ల పాదచారులు విధిలేక రోడ్ మధ్యనే నడవాల్సివస్తోంది (ప్రాణాలకు తెగించి).

    @@ "........ దీనికి పదిరెట్లు ఎక్కువ జనాభా ఉన్న పెద్ద పట్టణాలలోనే మెరుగైన ట్రాఫిక్ వ్యవస్ధ ఉంటుందేమో!"
    ప్రశ్నే లేదు. పెద్ద పట్టణాలలోనూ, నగరాలలోనూ ట్రాఫిక్ ఇంకా అధ్వాన్నంగా తయారయింది. హైదరాబాద్ బెంగళూరులే ఉదాహరణ.

    జనరల్ గా దేశంలో విచ్చలవిడితనం పెరిగిపోయి ఇష్టారాజ్యంగా తయారయింది (అంతకంతకూ విజృంభిస్తున్న వ్యాపార ధోరణి, రాజకీయ అండదండలు, అవినీతి చాలావరకు కారణాలు అనుకుంటాను). మధ్యలో సగటు మనిషి నలిగిపోతున్నాడు.

    (విశాలమైన రోడ్లతో తీర్చిదిద్దినట్లు హాయిగా ఉండిన కాకినాడ ఒకప్పటి వైభవకాలం నేనూ చూసినవాడినే. అందువల్ల మీ ఆవేదన అర్ధం చేసుకోగలను.)

    ReplyDelete
    Replies
    1. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు మీరు చెప్పిందీ వాస్తవమే, ప్రజల్లో సివిక్‌సెన్స్ తగ్గడమూ వాస్తవమే! స్పందనకు ధన్యవాదాలు నరసింహరావుగారు.

      Delete
  2. నారాయణా అంటే సి.పి.అయ్ నారాయణ అనుకున్నా !

    ReplyDelete
  3. కాకినాడని విశాలంగా చేసేద్దం, లేకుంటే వర్మగారికి నచ్చదు.:-))

    ReplyDelete
    Replies
    1. కాకినాడ విశాలమైనదే మెరాజ్ గారు. కాకపోతే ట్రాఫిక్ సెన్స్ లేక మేమే దానిని ఇరుకిరుకుగా మార్చేసుకొంటున్నాం. :) ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!