Pages

Friday 31 January 2014

యెంకిపాటలు

నండూరి సుబ్బారావు గారి(1895 -1957) యెంకిపాటలు యెంకి, నాయుడు బావల ప్రేమని, విరహాన్ని, సరసాన్ని, శృంగారాన్ని తేటతెలుగు మాటల్లో ఆవిష్కరిస్తాయి.

యెంకిలాంటి చక్కని పిల్ల మరెక్కడా ఉండదన్నంత అబ్బరంగా చెపుతాడు నాయుడుబావ...

సెక్కిట సిన్నీ మచ్చ
సెపితే సాలదు లచ్చ
వొక్క నవ్వే యేలు
వొజ్జిర వొయిడూరాలు

ఇక ఆమె అలంకారం ఎలా ఉంటుందనుకొన్నారు?

మెళ్ళో పూసలపేరు
తల్లో పూవులసేరు
కళ్ళెత్తితే సాలు
కనకాబిసేకాలు

చక్కని కబుర్లు చెపుతుంది, పాటలూ పాడుతుంది...

పదమూ పాడిందంటె
పాపాలు పోవాల
కతలూ సెప్పిందంటె
కలకాల ముండాల

ఇన్ని ఉన్న చక్కదనాల చుక్కకి దొరికిపోయాడు ఇలా.. 

రాసోరింటికైన
రంగుతెచ్చే పిల్ల
నా సొమ్ము - నా గుండె
నమిలి మింగిన పిల్ల

యెంకికి తనంటే ఎంత ప్రేమో ఆమె చూపుల్లోనే చూసుకొంటాడు. అతను ఎంకిపాట పాడుతుంటే, ఆమె గోడవారన చేరి గుటకలేస్తుందట - చక్కగా పాడుతున్నాడని మురిపమేమో! నలుగురమ్మలూ చేరి పాటని మెచ్చుకొంటే యెంకి చూపుల్లో సోద్దెం ఏమీటో? పొరుగమ్మతో సరసమాడేవేళ, పొలమెల్లి అతను పొద్దుబోయి వచ్చేవేళ రకరకాలుగా చూస్తుంటే- ఆమెకళ్ళల్లో ఎన్నెన్ని బాసలు పలుకుతాయో! మరి నోరు తెరిచి చెపితే ఎలాఉంటుందంటే? మరమమిడిసి మనసిస్తే, అతని నీడలోనే మేడ కడతా నంటుంది. 

అలాంటి యెంకి, నాయుడు బావలు కలిస్తే వాళ్ళ సరసాలు ఎలా ఉంటాయో చెప్పాలంటే `వొనలచ్చిమి` పాటే పాడుకోవాలి. 

జాము రేతిరియేళ జడుపు గిడుపూ మాని
సెట్టు పుట్టాదాటి సేనులో నేనుంటె

మెల్లంగ వస్తాది నాయెంకీ 
సల్లంగ వస్తాది నాయెంకీ

పచ్చని సేలోకి పండుయెన్నెల్లోన
నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటె

వొయ్యార మొలికించు నాయెంకీ 
వొనలచ్చి మనిపించు నాయెంకీ

యెంకివస్తాదాని యెదురూగ నేబోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానె

కాలు కదపాలేదు నాయెంకీ 
కరిగి నీరౌతాది నాయెంకీ

మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి

కూలాస గుంటాది నాయెంకీ 
కులుకు సూపెడతాది నాయెంకీ

యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె

సెందురుణ్నీ తిట్టు నాయెంకీ 
సూరియుణ్నీ తిట్టు నాయెంకీ

ఆమెని వొదిలి అతను, అతన్ని వొదిలి ఆమే ఎక్కడి కన్నా వెళ్ళారా, క్షణక్షణం ఆ తలపులతోనే సతమతమౌతారు. నీళ్ళు తేబోతుంటే ఆమె వెంట ఎవరో నడిచి నట్టు ఉంటుందట, అద్దంలో చూసుకొంటే వెనుక ఎవరో నుంచుని నవ్వినట్టుంటుందట యెంకికి. ఆ ఎవరో, మరెవరో కాదు - నాయుడు బావే! ఇక నాయుడు కయితే -

యెంకి వస్తాదాని
యెదురు తెన్నులు కాసి
దిగులుట్టి తలదించి
తిరిగి సూసేతలికి

యెంకి రావాలి నాయెదర నిలవాలి
కులుకుతా నన్నేటో పలకరించాలి

పిల్ల పొరుగూ రెల్లి
మల్లి రాలేదని
వొల్లంత వుడుకెత్తి
వొక్కణ్ణి పొడుకుంటె

ఘల్లుమంటా యెంకి కాలుపెట్టాలి
యెల్లి వొచ్చా నంట యెంకి నవ్వాలి

యెంకి కోపాలొచ్చి
యేదేశమో పోయి
కల్లో నా కాపడితె
కళ్ళు తెరిసే తలికి

తళుకుమని యెంకి నాదరికి రావాలి
నిదర కాబోసంటు నింద నాడాలి 

అసలు ఇంత గొప్పగా ఎలా రాయగలిగేరు అంటే? నండూరి సుబ్బారావుగారే పుస్తకానికి రాసిన పీఠికలో అంటారు - తాను మద్రాసులో చదువుకొనే రోజుల్లో ఒకనాడు ట్రాంబండిలో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా `గుండే గొంతుకలోన కొట్లాడతాది` అని ఒక పల్లవి మనసులోనికి వచ్చిందట. దానిని అలా మననం చేసుకొంటూ ఉంటే ఇల్లుచేరే సరికి పాట తయారయిపోయింది. అదే మొదటి పాట. 1925 లో 35 పాటలతో పుస్తకం విడుదల చేశారు. తరువాత 27 సంవత్సరాలకి ఎంకి కొత్తపాటల సంపుటి వచ్చింది. 

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
కూకుండ నీదురా కూసింతసేపు!

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది
యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! 
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది
దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! 
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

యీడుండ మంటాది యిలుదూరిపోతాది
యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

మందో మాకో యెట్టి మరిగించినాదీ
వల్లకుందామంటే పాణమాగదురా! 
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

గుడిపాటి వెంకటాచలం, దేవులపల్లి కృష్ణశాస్త్రీ, నండూరి సుబ్బారావులు మిత్రులు. ఏలూరులో రైలు కట్టకవతల, మైదానం దగ్గరలో, మిణుగురుపురుగులు వాలిన చెట్టుక్రింద నండురివారిని కూర్చోబెట్టుకొని చలం యెంకిపాటల్ని పాడించుకొని తన్మయత్వంతో వినేవారట. ఇక కృష్ణశాస్త్రిగారయితే ఏ సభలోనయినా చక్కగా ఆ పాటల్ని పాడి సభికులని ఆనందపరిచేవారట. మొదటిలో జనాల్లో యెంకిపాటలపట్ల వ్యతిరేకత వచ్చినా, క్రమంగా వాటిల్లో గొప్పతనం తెలిసివచ్చింది. రేడియోవాళ్ళు వరసలు కట్టి పాడించారు. ఎంకీ, నాయుడుబావలు రాధా కృష్ణులంత గొప్పవాళ్ళయిపోయారు. 

© Dantuluri Kishore Varma

Thursday 30 January 2014

పల్లెకు పోదాం చలో.. చలో..

ఒక ప్రోజెక్ట్ మొదలు పెట్టి, దానికోసం ఒక పెయింటర్‌కి రెండు బొమ్మలు పెయింట్ చేసే పని అప్పగించాను. తీరుబడిలేని కమర్షియల్ ఆర్టిస్టు అతను. కానీ, మాట తీసెయ్యలేక రాత్రంతా కూర్చొని  ఉదయానికల్లా పెయింట్ చేసి ఇచ్చాడు. అతనికి బొమ్మలు వెయ్యడంతో నిద్రలేకుండా పోతే, నాకు అవి ఎలా వస్తాయో తెలియక నిద్ర పట్టలేదు. బాపూ బొమ్మలో అందమైన వంకర గీతలు, దామెర్ల రామారావు బొమ్మల్లో సొగసు, టర్నర్ వాటర్ కలర్స్‌లో వెలుగూ కలిసి ఊహల్లోనే అద్భుతంగా కనిపించడం మొదలయ్యాయి. ప్రొద్దుటే వాటిని ఎలా చూసానో అనే విషయాన్ని ప్రక్కన పెడితే - మన బ్లాగర్ మిత్రులు చిన్నిఆశలాగ చిత్రకారుడినయినా కాకపోతినే అని నాకు నేనే వగచాను. అతనికిచ్చిన రిఫరెన్సుల్ని నేనుకూడా పెయింట్‌చెయ్యడం  ప్రయత్నిస్తే బాగుంటుందని అనిపించిన ఒకానొక క్షణంలో బ్రష్‌ని వాటర్ కలర్లో ముంచి డ్రాయింగ్ షీటు మీద యుద్దం మొదలుపెట్టా! దాని ఫలితమే ఈ `పల్లెకు పోదాం.. చలో.. చలో..` పెయింటింగ్. 

క్షణక్షణం సినిమాలో పరేష్ రావల్ పియానో మీద ఒకరాగం వాయించి, తన కూనిరాగం కూడా కలిపి అనుచరుడ్ని..`ఇది ఏం పాటో చెప్పు?` అని అడుగుతాడు. పాపం వాడు, `తెల్వాదు సార్,` అంటాడు.

పరేష్ రావల్ పాటలాగ అయ్యింది నా పెయింటింగ్ సంగతి. ప్చ్! ఏం చేస్తాం, కళను నేర్చుకోలేక పోతిమి.  

© Dantuluri Kishore Varma

Sunday 26 January 2014

గుడ్డికన్నా మెల్ల నయం కదా?

వంశీ మాస్టర్‌పీస్ సితారలో ఓ సన్నివేశం గుర్తుకు వస్తుంది వీళ్ళని చూస్తుంటే! పగటివేషగాళ్ళు పండగకి ప్రతీసంవత్సరం వెళ్ళే ఊరికి వెళతారు. రాజరికం పోయినా, రాజుగారి కోటమాత్రం మిగిలే ఉంది. పంజరంలో చిలుకలా యువరాణీ. మూసి ఉన్న మహల్ తలుపుల ముందు రోజుకొక వేషం కడతారు. రాముడు, శివుడు.. లాంటి ఎన్ని వేషాలు వేసినా, ఎవరైనా చూసినప్పుడు కదా, వాటికి విలువ? కిటికీ కంతలోనుంచి చూస్తున్న ఓ విశాల నేత్రాన్ని గమనించిన వేషగాడికి హుషారు వస్తుంది. నెమలిలాగ నాట్యం చేస్తాడు.   
వొళ్ళంతా రంగుపులుముకోనవసరం లేకుండా నీలమేఘశ్యాముడు చూడండి, చక్కని రంగుచొక్కా తొడిగేసుకొని చిద్విలాసంగా చూస్తున్నాడు. శివుడు మాత్రం కైలాశంనుంచి ఉరుకులెత్తుకొని దుముకుతున్న గంగవైపు చూస్తున్నట్టున్నాడు. బాపూగారి గంగావతరణం గుర్తుందా? 

ఇక్కడ వీళ్ళు నెమలిపించాలతో పురివిప్పినట్టు తయారు చేసుకొన్న చాపాలను వెనుక తగిలించుకొని గెంతుతూ, హొయలుపోతూ, కళ్ళుతిప్పుతూ నాట్యంచేస్తున్నారు. డప్పులు వాయించేవాళ్ళ ఉత్సాహం వాళ్ళని మరింత రెచ్చగొడుతుంది. 


గత ఏడాది బీచ్‌ఫెస్టివల్‌కి వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకొని జనాలని నవ్విస్తూ తిరుగుతున్న వేషగాళ్ళని చూసి, వాళ్ళ మాస్కుల వెనుక ముఖాలమీద ఏ హవభావాలుంటాయా అనిపించింది. ఒక చిన్న కథ ఇక్కడ చదవండి (ఇది లింక్. క్లిక్ చెయ్యండి). ట్రాంప్ వేషాలేసిన చార్లీ చాప్లిన్, జోకర్ సినిమా తీసి రాజ్‌కపూర్, విచిత్రసోదరుల్లో పొట్టి కమల్‌హాసన్ ఒక మారని అభిప్రాయాన్ని మనమనసులో ముద్రవేశారు. 
వొంటిమీద పసుపు రంగు పూసుకొని, నల్ల చారలు వేసుకొని, ఒక చిన్న చెడ్డీ కట్టుకొని పులిముఖాన్ని తగిలించుకొని, తోక పెట్టుకొని డప్పుల మోతకి అనుగుణంగా గెంతులేసే పులిడ్యాన్స్ వాళ్ళని చూశారా ఎప్పుడయినా? 

సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో ఏడాదికోరోజు పులి అనే కథ ఒకటి ఉంటుంది. ప్రతీ దసరాకీ నబీ సాయిబు పులివేషం కడతాడు. పేదా, గొప్పా అని తారతమ్యం లేకుండా ఊరంతా వాడి వీరంగాన్ని విరగబడి చూస్తారు. టంకు, టమా అని డప్పులు మ్రోగుతుంటే బారలు వేసుకొంటూ  పులిడ్యాన్స్ చేస్తుంటే అందరూ దారి ఇస్తుంటారు. ఆ రోజుకి ఊరిలో వాడే రాజు. చూస్తున్న జనాలు విసిరే డబ్బుల్ని కూడా సామతరాజుల దగ్గరనుంచి కప్పం తీసుకొంటున్న చక్రవర్తిలా తీసుకొని చెడ్డీలో దోపుకొంటాడు. కానీ, వాడు పెళ్ళం ముందు పిల్లే! పులివేషం అయిపోయిన తరువాత ఏడాది అంతా ఎవరూ పని ఇవ్వరు . బీడీల కోస అడుక్కొంటూ, మళ్ళీ సంవత్సరం దసరాకోసం కలలు కంటూ ఉంటాడు - ముగింపు కూదా ఆర్థ్రపూరితంగా ఉంటుంది. 

సాహిత్యంలో, సినిమాల్లో అక్కడక్కడా మన సంస్కృతి కనిపిస్తుంది. కానీ, సహజ పరిసరాలలో క్రమంగా మాయమైపోతుంది. కారణాల అన్వేషణ జోలికి వెళ్ళకుండా జానపదకళారూపాలని ఉత్సవాలలో ఇలాగన్నా చూసి ఆనందించగలగడం బాగానే ఉంటుంది. గుడ్డికన్నా మెల్ల నయం కదా?

2014 కాకినాడ సాగర సంబరాలలో తీసిన ఫోటోలు. 
© Dantuluri Kishore Varma

Saturday 25 January 2014

ఇంక్రెడిబుల్ ఇండియా..

65వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకాకినాడలో బ్లాగ్ పాఠకులకి ఒక చక్కని కానుక ఇద్దామని ఈ పోస్ట్ రాస్తున్నాను. రాస్తున్నాను అనేకంటే సేకరణని అందిస్తున్నాను అంటే బాగుంటుందేమో. అది ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అక్కడికే వస్తున్నాను. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన టూరిజం సైట్ల యొక్క లింకులు ఇస్తున్నాను. వాటిని క్లిక్ చేసి ఆయా వెబ్సైట్లలోకి వెళ్ళడంద్వారా ఏఏ రాష్ట్రాలలో ఏమేమి చూడదగ్గ విశేషాలు ఉన్నాయో తెలుసుకొని ఒక అవగాహనకి రావడానికి వీలవుతుంది. వెళ్ళి చూసే ఉద్దేశ్యం లేకపోయినా, జనరల్ నాలెడ్జ్‌ని పెంపొందించుకోవడానికి అయినా ఈ టపా ఉపయోగ పడుతుంది. ఈ దేశం మనది అనే గర్వం కలుగుతుంది. మేరా భారత్ మహాన్! 
Photo: The Times of India
India is incredible in many aspects. Its rich heritage, culture, people and places are unique. One should travel through India to know about the way of life of people. Today we are celebrating 65th Independence Day. On this occasion I am overjoyed to share with you links of tourism web sites of all the states and union territories of our country. Click through the links below and you will have fair idea of worth seeing places from Kashmir to Kanyakumari. Happy browsing.

రాష్ట్రాలు States:

  1. ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh
  2. అరుణాచల్‌ప్రదేశ్  Arunachal Pradesh
  3. అస్సాం Assam
  4. బీహార్ Bihar
  5. చత్తీస్‌ఘర్ Chattisgarh
  6. గోవా Goa
  7. గుజరాత్ Gujarat
  8. హర్యానా Haryana
  9. హిమాచల్‌ప్రదేశ్ Himachal Pradesh
  10. జమ్మూ అండ్ కాశ్మీర్ Jammu and Kashmir
  11. జార్ఖండ్ Jharkhand
  12. కర్నాటకా Karnataka
  13. కేరళా Kerala
  14. మధ్యప్రదేశ్ Madhya Pradesh
  15. మహారాష్ట్రా Maharashtra
  16. మణిపూర్ Manipur
  17. మేఘాలయా Meghalaya
  18. మిజోరాం Mijoram
  19. నాగాలాండ్ Nagaland
  20. ఒడిషా Odisha 
  21. పంజాబ్ Punjab
  22. రాజస్తాన్ Rajasthan
  23. సిక్కిం Sikkim
  24. తమిళ్‌నాడు Tamilnadu
  25. త్రిపుర Tripura
  26. ఉత్తర్‌ప్రదేశ్ Uttar Pradesh
  27. ఉత్తరఖండ్ Uttarkhand
  28. వెస్ట్‌బెంగాల్ West Bengal

కేంద్రపాలిత ప్రాంతాలు Union Territories:


A. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ Andaman and Nicobar Islands
B. చండీఘర్ Chandigarh
C. దాద్రా అండ్ నాగర్ హవేలీ Dadra and Haveli
D. డామన్ అండ్ డయ్యూ Daman and Dayyu
E. లక్షద్వీప్ Lakshdwip
F. నేషనల్ కేపిటల్ డిల్లీ Delhi
G. పుదుచ్చెరి Puducherry
మన ఇండియా - ఈ టపాని ఫేస్‌బుక్ ద్వారా మీ స్నేహితులతో షేర్ చేసుకోవాలంటే, ఈ లింక్ ద్వారా చెయ్యండి. 

If you want to share this information with your friends through face book, you can make use of this link 

© Dantuluri Kishore Varma 

రిక్షా పుల్లర్

ఊరు ఏవైపు నుంచి ఏవైపుకు కొలిచినా ఐదారు కిలోమీటర్లు దాటని కాకినాడ, రాజమండ్రీ, అమలాపురం లాంటి పట్టణాలకి రిక్షా ఒకప్పటి ముఖచిత్రం. మధ్యతరగతి కుటుంబాలు సినిమాకి వెళ్ళాలన్నా, బీచ్‌కి వెళ్ళాలన్నా, హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా రిక్షానే ప్రధాన వాహనం. పాతికేళ్ళక్రితం వెతికిచూసినా ఒక్క ఆటో కూడా కనిపించేదికాదు. వాటిని చూడాలంటే వైజాగో, విజయవాడో, హైదరాబాదో వెళ్ళినప్పుడే కుదిరేది. 

సద్గుణరావు, అప్పారావు అని ఇద్దరు రిక్షాపుల్లర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే సైకిలుమీద వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకర్ని పిలుచుకొని వచ్చేస్తే అయిదునిమిషాలలో రిక్షా ఇంటిముందు ఉండేది. బేరం అవసరం లేదు. వెళ్ళి వచ్చినతరువాత డబ్బులు చేతిలో పెట్టడమే. స్కూలుకి పిల్లల్ని దించే రిక్షాలయితే ఎగుడు దిగుడయినా, ఎదురు గాలయినా, జోరువానయినా రిక్షాసవారీ ముందుకు సాగేది. పిక్కల్లో బలం ఉన్నంతవరకూ రిక్షా తొక్కేవారు. తెలుగు సినిమాలలో కూడా హీరో కష్టపడి నిజాయితీగా సంపాదించాలంటే రిక్షా తొక్కవలసిందే. 

రిక్షాలో వెళ్ళి కాన్వెంటులో చదువుకొన్న కుర్రాడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి కారులో అదేవూరికి తిరిగి వస్తే ఇప్పటికీ పిల్లల్ని స్కూలుకి దింపుతున్న అప్పారావుని చూసి ఆశ్చర్యపోవడమే!

సైకిలురిక్షాలు ఇంకా ఉన్నాయా అని అబ్బురపడొద్దు. ఇంకా ఉన్నాయి! కానీ మార్కెట్‌కి అమ్మకానికి కాయగూరలు తీసుకొని వెళ్ళేవాళ్ళూ, అక్కడక్కడా స్కూలుకి వెళ్ళే పిల్లలూ తప్ప వీటిమీద తిరిగే జనాలే అరుదైపోయారు. సెకండ్‌షో చూసి తిరిగి వచ్చేటప్పుడు రిక్షా గూడు వెన్నక్కి వేసేసి, పైన వెన్నెల్ని, తగులుతున్న చల్లగాలినీ అస్వాదిస్తూ, సినిమా కబుర్లు చెప్పుకొంటూ, నవ్వుకుంటూ తుళ్ళుకొంటూ వెళ్ళే పడుచుజంటల పూలరిక్షాలు - బైకులకి బలయిపోయాయి.

ఎక్కడినుంచి, ఎక్కడికైనా పదిరూపాయల షేర్ ఆటోని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. బస్‌స్టాపుల ప్రక్కన `యాభై రిక్షాలు నిలిపు స్థలం` అనే బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. సాగు తున్న ఆటోలు తప్పించి.   

ఇప్పుడు రిక్షా పుల్లర్ ఒక ఎండేజర్డ్ స్పీషీస్ - అంతరించి పోతున్న జాతి.
     
© Dantuluri Kishore Varma 

Friday 24 January 2014

పడవఇళ్ళ కబుర్లు

ఇది చొల్లంగి కాలువ. కాకినాడకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది యొక్క ఏడుపాయల్లో ఒకటైన తుల్యబాగ ఇక్కడినుంచి సముద్రంలో కలుస్తుంది. చొల్లంగి అమావాస్యరోజు ఇక్కడ స్నానాలు చెయ్యడం చాలా పుణ్యంగా భావిస్తారు భక్తులు. దీని నిజమైన ప్రత్యేకత ఏమిటంటే - కాకినాడనుంచి యానం వైపు వెళూతున్నప్పుడు ఈ ప్రదేశాన్ని ముక్కు మూసుకోకుండా ఎవ్వరూ దాటలేరు. ఒకవేళ అలా దాటారూ అంటే వాళ్ళు అక్కడి వాళ్ళయినా అయివుండాలి లేదంటే ఆ మార్గం గుండా రోజూ ప్రయాణీంచేవాళ్ళయినా అయివుండాలి. దానికి కారణం ఎండబెట్టిన చేపలు, రొయ్యల వాసన. ప్రొద్దుటనుంచి సాయంత్రం వరకూ రోడ్డుప్రక్కన రెండువైపులా వీటిని ఎండబెడతారు. ఒకకిలోమీటరు దూరం వరకూ ఈ ఎండబెట్టుడు కార్యక్రమం ఉంటుంది. ఇది కోళ్ళ మేతకోసం వాడతారని అంటారు.  

నాటు పడవలమీద కుటుంబాలు, కుటుంబాలు ఉంటాయి. ఇంటి(పడవ)పెద్ద పడవకి ఒక కొనమీద కూర్చొని వల చిక్కు తీసుకొంటూ ఉంటాడు. రెండవకొనమీద అతని భార్య వంటచేస్తూవుంటుంది. పిల్లలు అక్కడే ఆడుకొంటూ ఉంటారు. చుట్టూనీరు! పొరపాటున అందులో పడతారేమో అని భయంవేస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. పడవే వాళ్ళ ఇల్లు. తిండి, పని, నిద్ర, ఆట అన్నీ దానిమీదే. కొంతకాలం క్రితం ప్రభుత్వంవాళ్ళు పడవలమీద పిల్లలకి చదువు చెప్పడానికి స్కూల్ఆన్‌బోట్ అనే బడిని పెట్టారు. ఈ పడవఇళ్ళ సమీపంలో నీటి మీదతేలుతూ చాలా కలర్‌ఫుల్‌గా ఉండేది. కాలువ గట్టుమీద చిన్న హట్‌లాంటి సిమ్మెంట్ నిర్మాణం కూడా చేశారు. పడవబడి అనో, మరేదో రాసి ఉండేది దాని మీద. కొంతకాలం నడిచింది. తరువాత ఆగిపోయినట్టుంది. ఇంకా....  చెప్పడానికి ఏమీలేదు. అంతే!


© Dantuluri Kishore Varma

Tuesday 21 January 2014

మౌనాన్ని మనసు భాషలోనికి అనువదించుకోవడం..

సాహిత్యాన్ని, సంగీతాన్ని, గానాన్ని, చిత్రీకరణని, నటనని, నటీనటుల అందాన్ని అన్నింటినీ సమపాళ్ళలో కలిపి ఒక అద్బుతమైన పాటని చేస్తే ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని చెప్పగలం? అలాంటి అరుదైన పాటల్లో ఒకటి సాగరసంగమంలో మౌనమేలనోయి అనేది. 

అప్పుడప్పుడే స్నేహం ప్రేమగా మారుతున్న తరుణం, వాళ్ళిద్దరూ మనుష్యులుగా దగ్గరగా ఉన్నా, మొహమాటాల సుధీర తీరాల్లో ఉన్నవాళ్ళు. వెన్నెలరాత్రి, ఎక్కడినుంచో గాలితో పాటూ తేలివస్తున్న మధురమైన ఎస్.జానకి గానం, రాతిరధం దగ్గర అద్దాల్లాంటి నాపరాళ్ళమీద ప్రతిఫలిస్తున్న వాళ్ళ రూపాలు. ఇళయరాజా ఆర్కెష్ట్రైజేషన్, వేటూరి సాహిత్యం. 

నిశ్సబ్ధంలో అంతర్ముఖం అవుతుంటే అతను చెపుతాడు `వెళతానని`. ఆమె ముఖకవళికలు చూడండి. 

పరధ్యానం, మనసులో మెదిలే భావాలని గమనించుకోవడం, మౌనాన్ని మనసు భాషలోనికి అనువదించుకోవడం.. ప్రతీభావాన్నీ జయప్రద ఎంతబాగా వ్యక్తీకరించిందో.


మౌనమేలనోయి….మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలా
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
పలికే పెదవి వణికింది ఎందుకో
వణికే పెదవి వెనకాల ఏవిటో
కలిసే మనసులా విరిసే వయసులా (2)
నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు
ఏమేమో అడిగినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా వలపు మడుగులా (2)
కన్నె ఈడు ఉలుకులు కంటి పాప కబురులు
ఎంతెంతొ తెలిసినా..మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
  © Dantuluri Kishore Varma 

Monday 20 January 2014

రా రమ్మని పిలిచిన కోన పిలుపు

కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో 
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపు వికసించగనే ఎన్నెన్నీ హొయలో ఎన్నెన్నీ లయలో 
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్నీ హొయలో, ఎన్నెన్నీ లయలో.... 

అని సీతారామశాస్త్రిగారు అన్నట్టు అరకులోయలో దారిలో అందాల హొయలు వర్ణించతరం కాదు. అందుకే ఈ ఫోటోలు చూపిద్దామని... చిన్ని ఆశ. 

ఈ రిసార్ట్ కిటికీలోనుంచి చూస్తే లోయ అందం కనిపిస్తుంది. ప్రొద్దున్న మంచులో, మధ్యాహ్నం ఎండలో, సాయంత్రం ఏటవాలు సూర్యకిరణాలలో కొండదారుల్లో నడుస్తూ వెళ్ళి ఎక్కడినుంచో ప్రవహిస్తున్న సెలయేటిని చూడాలనిపిస్తుంది. గొంతెత్తి పాడుతున్న ఏదో పక్షి కూతకి బదులివ్వాలనిపిస్తుంది. కానీ, రాత్రయితే!? దూరంగా ఉన్న పూరిగుడిసెలో ఎప్పుడూ కాపురముండే కోనవాసులు ఎలా ఉంటారో? 

ఆకాశం దాకా నిటారుగా పెరిగినట్టున్న చెట్లు, వాటి మొదళ్ళనుంచి `మేము కూడా మేఘాలని అందుకొంటాం,` అన్నట్టు  పైకి ఎగబ్రాకుతున్న కాఫీతోటల్లో పాదులు, పొద పొదకీ మధ్య వాలునుంచి పైకి ఎక్కడానికి కాఫీ తోటల యజమానులు కట్టిన మెట్లు, మెట్లక్రింద ఘాట్‌రోడ్డుని చేర్చి మంచెల్లా కట్టిన బడ్డీలమీద కాఫీ పొడిని, మసాలా దినుసుల్నీ, తేనెనీ అమ్ముతున్న మనుషులు. ఒక కప్పు వెచ్చని కాఫీనీ సిప్ చేస్తూ, చిరుచలిని ఆస్వాదిస్తూ, చెట్ల వెనుకనుంచి అస్తమిస్తున్న సుర్యుడిని చూడడం బాగుంటుంది. ఇది అనంతగిరి కాఫీతోటల దగ్గర దృశ్యం. 


దూరంగా కనిపిస్తున్నది సూయిసైడ్ పాయింటట. ఫెన్సింగ్ పైనుంచి అఖాతంలోకి చూస్తే కళ్ళుతిరుగుతాయి.  
`నువ్వు వస్తానంటే నేనొద్దంటానా,` సినిమా చూశారా? షూటింగ్ చేసింది ఇక్కడేనట. శ్రీహరి ఇల్లు, పొలం అన్ని ఈ లోయలోనివే. 

అక్టోబర్, నవంబర్ నెలల్లో అరకులోయలో కొండవాలులు పసుపు వర్ణంతో కళకళ లాడతాయి. ఎక్కడచూసినా వలిసేపువ్వులు విరబూసి కనువిందుచేస్తాయి. మేము సీజన్ కొంచెం దాటిన తరువాత వెళ్ళడంవల్ల అప్పటికే చాలా చోట్ల పంటకోతలు అయిపోయి, ఖాళీ మడులు ఉన్నాయి. కానీ, అదృష్టంకొద్దీ ఒక్కచోటమాత్రం కొన్ని మడుల్లో ఇంకా వలిసెలు వుండడంతో ఇలా కెమేరా కళ్ళల్లో చిక్కుకొన్నాయి. 


ఇది తిరుగు ప్రయాణపు దారి.
 
© Dantuluri Kishore Varma

Sunday 19 January 2014

ఆకాశం అమ్మాయి.. మేఘం ఆమె మనసు..

చిత్రకారుడు కుంచెతీసుకొని బొమ్మగీసినట్టు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల్లో మాటలు మనసు కాగితంమీద రంగు రంగుల బొమ్మలు వేస్తాయి. ఉదాహరణకి నువ్వేకావాలి సినిమాలో `అనగనగా ఆకాశం ఉంది` పాట. పల్లవిలో చాలా నామవాచకాలు ఉపయోగించి రాశారు కనుక మేఘం కరిగి నేలమీద కురిసిన వర్షం కనిపిస్తుంది. అదే చిన్న పోలికను శ్లేషగా తెలియజేశారు అనుకొంటే - ఇలా ఒక్కసారి ఆలోచించి చూడండి

ఆకాశం అమ్మాయి 
మేఘం ఆమె మనసు 
మేఘంవెనుక ఉండే రాగం స్నేహమో, ప్రేమో
అబ్బాయి నేల 
ప్రేమవర్షం కురిస్తే చిలకలు వాలిన చెట్టులా అతని జీవితం అంతా సందడి మయం అయిపోదూ!

ఈ పాట వింటున్నప్పుడు నాకు ఈ భావం స్పూరిస్తూ ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే పల్లవిలో ప్రతీవాక్యం చివరి మాటలో తరువాతి వాక్యం మొదలవుతూ ఒక లయ సృష్టిస్తుంది. చెవులకు వినసొంపుగా ఉంటుంది. 

`వెన్నెలదారుల్లో ఊరేగే ఊహ`, `ఏకాంతం పులకించడం` లాంటి ప్రయోగాలు కూడా భలే నచ్చుతాయి నాకు. విన్నపుడంతలా చూసినప్పుడుకూడా నచ్చడానికి కారణం రీచా హుషారు డ్యాన్స్, ఆడిటోరియంలో కుర్రాళ్ళ సందడి. 


ఇదే పాట- 

సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల 
పాడినవారు : చిత్ర , జయచంద్రన్   


అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి..."అనగనగా"

ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా
ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నువు చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి
నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి..."అనగనగా"

చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం
వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే
నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి..."అనగనగా"

పాట చదువుతూ వినండి, వింటూ చూడండి. (Click here for the link of the video)
© Dantuluri Kishore Varma 

Saturday 18 January 2014

ఈ గుడి ద్వాపరయుగం నాటిదా!?

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి కిర్లంపూడి వెళ్ళేదారిలో దివిలికి ఒక కిలోమీటరు దూరంలో తొలి తిరుపతి అనే ఊరు ఉంది. సామర్లకోటనుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు. గుడికి బయట ఒక ఫ్లెక్సీ బోర్డ్‌మీద తొమ్మిదివేల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది అని రాసి ఉంటుంది. దేవాలయం పురాతనంగానే కనిపిస్తుంది కానీ మరీ అంత పాతది కాదేమో అనే సందేహంకూడా కలుగుతుంది. కొతమంది అభిప్రాయం ప్రకారం కలియుగం మొదలై సుమారు 5000 సంవత్సరాలు అయ్యిందని. అంటే ఈ దేవాలయం ద్వాపరయుగం నాటిదన్నమాట! 



తొలితిరుపతి దేవాలయం యొక్క స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు కీకారణ్యంగా ఉండేదని, దృవుడు ఇక్కడ విష్ణుమూర్తికోసం తపస్సుచేశాడని చెపుతారు. ఇక్కడొక చిన్న లింక్ మిస్సయ్యింది. దృవుడు తపస్సుచేసిన మధూవనం యమునా నది సమీపంలో ఉంటుందని పురాణంలో చెప్పబడి ఉంది. కానీ ఇక్కడ యమునా నది లేకపోవడమే మిస్సయిన లింకు. దృవుడికథ విష్ణుపురాణంలోను, బగవత్‌పురాణంలోనూ ఉంటుంది. ఉత్తానపాదుడనే రాజుగారికి సురుచి, సునీతి అనే ఇద్దరు భార్యలు ఉంటారు. ఆయనకి సునీతి ద్వారా దృవుడు, సురుచి ద్వారా ఉత్తముడు అనే కుమారులు కలుగుతారు. రాజుగారికి సురుచి అంటే ప్రేమ మెండు. అమెకీ, ఆమె కుమారుడికీ ముద్దుమురిపాలన్నీ దక్కేవి. ఒకరోజు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా చూసిన దృవుడు తానుకూడా తండ్రి ప్రేమను అదేవిధంగా పొందాలని భావించి ఒడిలోని ఎక్కబోతుండగా అతని సవతి తల్లి సురుచి అతడిని నిందిస్తుంది. బాధపడుతున్న దృవుడిని చూసి తల్లి  సునీతి విష్ణువుని గూర్చి తపస్సు చేసి తండ్రిప్రేమని పొందే వరంకోరుకోమంటుంది. అప్పుడు దృవుడు యమునా నది తీరంలో ఉన్న మధూవనం అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సుచేసి విష్ణువుని ప్రసన్నం చేసుకొంటాడు. 
పిల్లవాడైన దృవుడు దేవుడి తేజస్సుచూసి భయపడ్డాడని, అప్పుడు విష్ణువు దృవుడి అంత పొడవుతో కనిపించి, చిరునవ్వుతో అతని చెంపలు నిమిరాడని, ఆకారణంగానే ఇక్కడిస్వామి చిరునవ్వులు చిందిస్తూ శృంగార వల్లభ స్వామిగా పిలవ బడుతున్నాడని, ఎవరుఎంత పొడవు వుంటే అంత పొడవుగానే కనిపిస్తాడని చెపుతారు. శృంగార వల్లభ స్వామి అంటే వేంకటేశ్వరుడే. అన్నిచోట్లా ఆయన కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం ఉంటాయి. కానీ, ఈ దేవాలయంలో అవి అది ఇటు, ఇది అటు మారి ఉంటాయి. మరొక ప్రత్యేకత ఇది. స్వామివారి దేవేరులైన శ్రీదేవిని నారదమహర్షి, భూదేవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్టించారట. స్వామివారికి వెండితొడుగు విక్టోరియా మహారాణి భహూకరించినదట. 


దేవాలయానికి వెనుకవైపు ఉన్న నూతిలో నీటిని తలపై జల్లుకొని, స్వామివారిని కోరుకొంటే, ఆయా కోరికలన్నీ నెరవేరుతాయట. శృంగార వల్లభ స్వామికి పటికబెల్లం అంటే ఇష్టంకాబట్టి కోరికలు నెరవేరిన భక్తులు పటికబెల్లాన్ని స్వామివారికి సమర్పిస్తారు. 


ఇంకా ప్రచారంలేక భక్తుల రద్దీ కనిపించడంలేదు. సాయంత్రం మూడున్నర సమయంలో ఆలయానికి వెళితే గర్బగుడి తలుపులు మూసి ఉన్నాయి. పూజారిగారి ఇల్లు గుడికి చేర్చి ఉన్నా, ఒకగంటసేపు ఆయన కోసం నిరీక్షించి నాలుగున్నర ప్రాంతంలో దర్శనం చేసుకొని, విశేషాలు తెలుసుకొని, పటికబెల్లం ప్రసాదం తిని వచ్చాం. గుడితెరిచే సమయానికి ఇంకొక ఇద్దరు ముగ్గురు భక్తులు వచ్చారు అంతే. నిరీక్షించిన గంటా గాలిగోపురాన్నీ, ధ్వజస్థంభపు శిఖరాన్నీ, ఆవరణలో చెట్టుకొమ్మలపైనుంచి పరుగులు పెడుతున్న ఉడుతలనీ, ఎగిరే పక్షులనీ చూస్తూ సమయం గడిపేశాం.   
  
© Dantuluri Kishore Varma 

Thursday 16 January 2014

ఇలాంటి బ్లాగ్ఎక్స్‌ప్రెస్ మనవాళ్ళు కూడా పెడితే బాగుంటుంది కదా?

కేరళా టూరిజం డెవలప్‌మెంట్ వాళ్ళ దగ్గరనుంచి మనవాళ్ళు నేర్చుకోవలసింది చాలా ఉంది. వాళ్ళు తమ రాష్ట్రంలో చూడచక్కని బీచ్‌లని, దేవాలయాలని, ప్రకృతి అందాలని, సంస్కృతీ సంప్రదాయాలని, వైద్యవిధానాలనీ చక్కగా ప్రమోట్ చేసుకొంటారు. రాష్ట్రాన్ని `గాడ్స్ ఓన్ కంట్రీ` అని పిలుచుకొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులని ఆకర్షిస్తున్నారు. ఈ మధ్యనే కేరళాబ్లాగ్ఎక్స్‌ప్రెస్(బ్లాగ్ఎక్స్‌ప్రెస్ గురించి, కేరళా గురించి సమాచారం ఈ లింక్‌లో దొరుకుతుంది) అనే విన్నూత్న ప్రోగ్రాంని డిజైన్ చేశారు. అంతర్జాతీయంగా పాతికమంది ట్రావెల్ బ్లాగర్స్‌ని ఎంపికచేసి పదిహేనురోజులపాటు రాష్ట్రమంతా తిప్పుతారు. వాళ్ళని రోడ్డు మార్గం ద్వారా లగ్జరీ బస్సులో మంచి మంచి ప్రదేశాలన్నీ తిప్పి, బస, భోజన ఏర్పాట్లు చేసి, వాళ్ళు తమ తమ సోషల్ మీడియా ఎకౌంట్లద్వారా, బ్లాగులద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ అప్డేట్‌లు చేసుకోవడానికి, బ్లాగ్‌పోస్టులు ఫొటోలతో సహా రాయడానికి వైఫై సౌకర్యం కలుగజేస్తారు. ఇలా చెయ్యడం ద్వారా కేరళా టూరిజం వాళ్ళకి అయ్యే ఖర్చు,  దాని ద్వారా వాళ్ళకి వచ్చే ప్రచారం తత్ఫలితంగా పెరిగే పర్యాటకుల సంఖ్య, వారినుంచి వచ్చే ఆదాయం లెక్కవేసుకొంటే ఎంత విజ్ఞతతో ప్రచారం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.  

మనరాష్ట్రంలో కేరళాకి ఏమాత్రం తగ్గని అందాలు ఉన్నాయి. కోనసీమలో పచ్చనిపొలాల మధ్య ఫోటోలు తీస్తే అవి కేరళాలో తీసినవో, మనరాష్ట్రంలో తీసినవో తెలుసుకోవడం కష్టం. అలాగే మనపురాతన దేవాలయాలు, కోటలు, సముద్రతీరప్రాంతాలు, ఏజన్సీ, చారిత్రక కట్టడాలు, మన సంస్కృతి అన్నీ గర్వంగా ప్రపంచానికి చూపించవలసినవే. కానీ ప్రచారం జరగడం లేదు. టూరిజం ఆఫీసులో ఓ పేకేజ్ టూర్‌గురించి వాకబు చేస్తే కళ్ళుతిరిగే రేట్లు చెప్పారు. `ఇంతఎక్కువా?` అనకుండా ఉండలేకపోయాను. నాతోపాటూ రిసెప్షన్ డెస్క్ దగ్గర ఉన్న ఒకాయన అన్నమాటలు, `మనవాళ్ళు టూరిజాన్ని మునిసిపాలిటీ ఆవులా చూస్తారు. ఖర్చు లేకుండా రోజంతా అది రోడ్లమీద దొరికే చెత్తా చెదారం తింటే, సాయంత్రం పాలు పితుక్కోవచ్చు.` 

పన్నెండు సంవత్సరాలక్రితం అరకు దగ్గర ఉన్న చాపురాయి అనే ప్రాంతం చూశాను. చాలా అందంగా ఉంది. కొన్నిరోజుల క్రితం మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు సంరక్షణలేక పాడు పడిపోయినట్టు ఉన్న కట్టడాలు, ఎండిపోయిన మొక్కలు, చెత్త పేరుకొని పోయిన పరిసరాలు చూసి అనవసరంగా ఈ ప్రదేశానికి వచ్చాం అనిపించింది. ఎంట్రన్స్ దగ్గరమాత్రం టిక్కెట్లు యదాతదంగా అమ్మేస్తున్నారు!     

© Dantuluri Kishore Varma 

Tuesday 14 January 2014

బొర్రాగుహలు


బొర్రాగుహలు విశాఖపట్టణం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో, అరకు వెళ్ళే మార్గంలో ఉన్నాయి. బొర్రాగుహలు నుంచి అరకు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుహల దగ్గరకి వెళుతున్నపుడు మనకు నది ప్రవాహపు శబ్దం వినిపిస్తుంది. గుహల బయట ఏర్పాటుచేసిన వ్యూపాయింట్ దగ్గరనుంచి చూస్తే కొండలమధ్యనుంచి ప్రవహిస్తున్న గోస్తనీ నది కనిపిస్తుంది. ఈ నది బొర్రా గుహలలోనే పుట్టింది. కొన్ని లక్షల సంవత్సరాలక్రితం ప్రస్తుతం గుహ ఉన్న కొండప్రాంతం పైనుంచి గోస్తనీ నది ఉరుకులెత్తుకొంటూ ప్రవహించేదట. దానివల్ల కొండల్లో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు కరిగిపోయి, నీటితోపాటు కొట్టుకొని పోగా బొరియలు మిగిలాయి. అవే ఇప్పటి బొర్రాగుహలు. బొర్ర అంటే బొరియ అనే అర్థం.  గోస్తనీ అంటే గోవుయొక్క పొదుగు అని అర్థం. సున్నపురాతి నిక్షేపాలతో ప్రవహిస్తున్న నీరు తెల్లగా ఉండి, గోవు పొదుగునుంచి వచ్చే పాలలా ఉంటుంది కనుక ఈ నదిని గోస్తనీ నది అనిపిలవడం మొదలుపెట్టారట. 


విలియం కింగ్ జార్జ్ అనే జియాలజిస్టు 1807వ సంవత్సరంలో ఈ గుహలని కనుక్కొన్నాడని ఇక్కడ పెట్టిన బొర్డ్‌లో రాసి ఉంది. అనంతగిరి కొండలమీద మేస్తున్న ఆవు ఒకటి ప్రమాదవశాత్తూ బొరియలోనుంచి గుహల్లోకి పడిపోవడంతో, ఇక్కడ గుహలు ఉన్న సంగతి జనాలకి తెలిసిందని చెపుతారు. తెలియడం అంటే ఇప్పుడు తెలిసింది కానీ 30,000 నుంచి 50,000 సంవత్సరాలకి పూర్వమే ఈ గుహల్లో ఆదిమానవులు నివశించేవారని పరిశోధనలు చేసిన ఆంత్రొపాలజిస్టులు కనుగొన్నారు. 



గుహపైనుంచి చుక్కా, చుక్కా కారే సున్నపురాయి క్రమంగా పేరుకొని, గట్టిపడి బొర్రాగుహల్లో రకరకాల ఆకారాలని పొందాయి - కొన్ని గుహసీలింగ్ నుంచి క్రిందకి, కొన్ని నేలమీదనుంచి పైకి. కేవ్ అంతా తిప్పి చూపించడానికి ఇక్కడ గైడ్లు ఉంటారు. కావాలంటే వాళ్ళని ఫీజ్ చెల్లించి ఎంగేజ్ చేసుకోవచ్చు. కానీ అది అనవసరం. ఒకవేళ మీరు అలా కనుక చేస్తే, వాళ్ళు మీకు చూపించేది ఈ ఆకారాలనే. మహర్షి గెడ్డం అని, ఆవు పొదుగు అని, తల్లీబిడ్డా అని, ఇంకా చాలా చాలా చెపుతారు. శివలింగం లాంటి ఆకారాలు కూడా ఉన్నాయి. ఒక శివలింగానికి గుహ అంతర్భాగంలో చిన్న మందిరం కట్టారు. శివరాత్రి రోజు ఈ చుట్టుప్రక్కల గ్రామాలనుంచి ప్రజలు తొండోపతండాలుగా వస్తారట ఇక్కడ పూజలు చెయ్యడానికి. 

గట్టిపడి వివిధ ఆకారాలను పొందిన వీటిని స్టాలక్‌టైట్, స్టాలగ్‌మైట్ అని పిలుస్తారు. గుహపైనుంచి తోరణాల్లా వ్రేలాడ బడినట్టు ఏర్పడినవి స్టాలక్‌టైట్స్, క్రిందనుంచి పైకి ఏర్పడినవి స్టాలగ్‌మైట్స్. ఈ రెండు పేర్లూ చాలా సారూప్యత కలిగి ఉండి గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటాయి. జియాలజిస్టులే ఒక్కో సారి ఏది, ఏదో తెలియక తికమక పడతారట. అందుకే జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తారు. సీలింగ్ నుంచి వ్రేలాడేవి స్టాలక్‌టైట్స్ - సీలింగ్‌లో ఇంగ్లీష్ అక్షరం `సి`, స్టాలక్‌టైట్‌లో `సీ`. గ్రౌండ్‌నుంచి పైకి ఏర్పడినవి స్టాలగ్‌మైట్స్ - గ్రౌండ్‌లో `జి`, స్టాలగ్‌మైట్‌లో `జి`. ఈ నెమోనిక్ బాగుంది కదా? 

గుహకి లైటింగ్ ఏర్పాటు చెయ్యడంతో చూడడానికి బాగుంది. మెడడును పోలిన ఆకారం ప్రత్యేక ఆకర్షణ. గుహ సీలింగ్ మీద రెండు కొండలు కలిసిన అతుకు ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. లోపల మెట్లు, ఎత్తుపల్లాలు, ఒకటిరెండు చోట్ల చిన్న సొరంగ మార్గాలు ద్వారా నడక మూడువందల నుంచి నాలుగువందల మీటర్ల వరకూ ఉంటుంది. ఈ గుహలు మొత్తం ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయట. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రైలు మార్గం ఈ గుహల మీదనుంచే వెళుతుంది!    
ఉదయం పదినుంచి సాయంత్రం ఐదు వరకు తెరిచే ఉంటాయి. మధ్యాన్నం ఒంటిగంట నుంచి రెండు వరకూ లంచ్‌బ్రేక్. ఎంట్రన్స్ టిక్కెట్ల ధర మాత్రం పేలగొట్టేస్తున్నారు. పెద్దవాళ్ళకి అరవై, పిల్లలకి నలభైఐదు, కెమేరాకి వంద! 

గుహల్లోకి వెళ్ళే ముందే బయట ఉన్న చిన్న రెస్టారెంట్లలో ఏదో ఒకదాని దగ్గర లంచ్ ఆర్డర్ చేసి వెళితే, మీరు తిరిగి వచ్చేసరికి రెడీ చేస్తారు. 
 
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!