Pages

Tuesday 7 January 2014

అరకులోయలో సంతరోజు


సంతరోజు తెల్లవారుజామునే మంచుపొరలు విడవకముందే, సూరీడు తన బాణాల్లాంటి కిరణాలని ఎక్కుపెట్టకముందే తట్టలు, బుట్టలు, సంచులు, సంచుల్లో కూరగాయలు, కావిళ్ళు, వాటిల్లో రకరకాల వస్తువులు, అరటిగెలలు, గుమ్మిడికాయలు, పట్టుతేనెనింపిన సిసాలు, జంగిడాల్లో బజ్జీలూ, పుణుకులు, మసాల దినుసులు, కొయ్యబొమ్మలు, తప్పేళాలు, గిన్నెలు, చెక్కపెట్టెలు, కంబళ్ళు, స్వెట్టర్లు, బట్టలు... అవీ, ఇవీ అని కాకుండా అమ్మడానికి పనికివొచ్చే సరుకులన్నీ వెంటబెట్టుకొని కూడలిలో సంతజరిగే ప్రదేశానికి బయలుదేరతారు అరకులోయ చుట్టుప్రక్కల ప్రదేశాల్లోని ప్రజలు. 


`నెత్తిమూటల నెత్తుకోవాలి!
కొత్తమడతలు దీసి కట్టాలి!
అడవి దారుల యెంట నడవాలి!
బరువు మారుసుకొంట పక్కున నవ్వాలి!`

అని ఎంకిపాటలో నండూరి సుబ్బారావుగారు అన్నట్టు అచ్చికబుచ్చికలు ఆడుకొంటూ మొగుడుపెళ్ళాలు సరుకులని తలకెత్తుకొని సంతదారి పడతారేమో! 


ఈ సంతలో వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు చవకగా దొరకవచ్చు కానీ, అన్నీ చవకే అని అనుకోకూడదు.  తేనెలాంటి వాటిలో స్వచ్చతని నిర్ధారించడం ఎవరికీ సాధ్యంకాదు. దానిలో ఎన్ని పాళ్ళు తేనె, ఎన్నిపాళ్ళు పంచదార పానకం ఉంటుందో దేవుడికే తెలియాలి. ఫోటో తీసినప్పుడు కలర్‌ఫుల్‌గా పడే బజ్జీలు, బెల్లపచ్చుల్లో ఫుడ్‌కలర్ బాగా కలిసి ఉండవచ్చు. కార్లమీద వెళ్ళేవాళ్ళు తేనె, మసాలా దినుసులు లాంటివాటిని మంచి రేటుకే కొని పట్టుకొని వెళితే, స్థానికులు తినుబండారాలని బాగా కొనుక్కోవడం కనిపిస్తుంది. ఏది ఏమయినా సంతరోజు అంటే సంతోషకరమైన రోజే.

  

సంత ఒక సూపర్‌మార్కెట్ అక్కడ! తమ సరుకులని అమ్ముకొని, కావలసినవి కొనుక్కొని ఇళ్ళదారి పడతారు. మళ్ళీ వచ్చే వారం సంతవరకూ అడవి తప్ప మరొక ప్రపంచం కనిపించదు వాళ్ళకి. 
ఇంకొక కలర్‌ఫుల్ పోస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. 
© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!