Pages

Saturday 25 January 2014

రిక్షా పుల్లర్

ఊరు ఏవైపు నుంచి ఏవైపుకు కొలిచినా ఐదారు కిలోమీటర్లు దాటని కాకినాడ, రాజమండ్రీ, అమలాపురం లాంటి పట్టణాలకి రిక్షా ఒకప్పటి ముఖచిత్రం. మధ్యతరగతి కుటుంబాలు సినిమాకి వెళ్ళాలన్నా, బీచ్‌కి వెళ్ళాలన్నా, హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా రిక్షానే ప్రధాన వాహనం. పాతికేళ్ళక్రితం వెతికిచూసినా ఒక్క ఆటో కూడా కనిపించేదికాదు. వాటిని చూడాలంటే వైజాగో, విజయవాడో, హైదరాబాదో వెళ్ళినప్పుడే కుదిరేది. 

సద్గుణరావు, అప్పారావు అని ఇద్దరు రిక్షాపుల్లర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే సైకిలుమీద వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకర్ని పిలుచుకొని వచ్చేస్తే అయిదునిమిషాలలో రిక్షా ఇంటిముందు ఉండేది. బేరం అవసరం లేదు. వెళ్ళి వచ్చినతరువాత డబ్బులు చేతిలో పెట్టడమే. స్కూలుకి పిల్లల్ని దించే రిక్షాలయితే ఎగుడు దిగుడయినా, ఎదురు గాలయినా, జోరువానయినా రిక్షాసవారీ ముందుకు సాగేది. పిక్కల్లో బలం ఉన్నంతవరకూ రిక్షా తొక్కేవారు. తెలుగు సినిమాలలో కూడా హీరో కష్టపడి నిజాయితీగా సంపాదించాలంటే రిక్షా తొక్కవలసిందే. 

రిక్షాలో వెళ్ళి కాన్వెంటులో చదువుకొన్న కుర్రాడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి కారులో అదేవూరికి తిరిగి వస్తే ఇప్పటికీ పిల్లల్ని స్కూలుకి దింపుతున్న అప్పారావుని చూసి ఆశ్చర్యపోవడమే!

సైకిలురిక్షాలు ఇంకా ఉన్నాయా అని అబ్బురపడొద్దు. ఇంకా ఉన్నాయి! కానీ మార్కెట్‌కి అమ్మకానికి కాయగూరలు తీసుకొని వెళ్ళేవాళ్ళూ, అక్కడక్కడా స్కూలుకి వెళ్ళే పిల్లలూ తప్ప వీటిమీద తిరిగే జనాలే అరుదైపోయారు. సెకండ్‌షో చూసి తిరిగి వచ్చేటప్పుడు రిక్షా గూడు వెన్నక్కి వేసేసి, పైన వెన్నెల్ని, తగులుతున్న చల్లగాలినీ అస్వాదిస్తూ, సినిమా కబుర్లు చెప్పుకొంటూ, నవ్వుకుంటూ తుళ్ళుకొంటూ వెళ్ళే పడుచుజంటల పూలరిక్షాలు - బైకులకి బలయిపోయాయి.

ఎక్కడినుంచి, ఎక్కడికైనా పదిరూపాయల షేర్ ఆటోని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. బస్‌స్టాపుల ప్రక్కన `యాభై రిక్షాలు నిలిపు స్థలం` అనే బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. సాగు తున్న ఆటోలు తప్పించి.   

ఇప్పుడు రిక్షా పుల్లర్ ఒక ఎండేజర్డ్ స్పీషీస్ - అంతరించి పోతున్న జాతి.
     
© Dantuluri Kishore Varma 

10 comments:

  1. so true
    and in western cities, rickshaws are famous now in some areas where no cars are allowed.
    I saw in london oxford street, there are lot of rickshaws

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog Krishna garu. It would be nice to see rickshaws going along London streets. I am trying to visualize them. How I wish I saw some picks of them. Thanks for the comment.

      Delete
  2. అవునండి, కొన్నాళ్ళకి రిక్షాలు అంతరించిపోవచ్చు. ఇప్పుడు నడిపేవాళ్ళు కూడ చాలామంది ముసలివాళ్ళే. యువకులు ఆటోలే నడుపుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. అలా జరిగే అవకాశాలే ఎక్కువ బోనగిరిగారు. చాలా కాలానికి మళ్ళీ నా బ్లాగులో ఆగినట్టున్నారు. ధన్యవాదాలు.

      Delete
  3. నిజం. పల్లెలలో కూడా కనపడటం లేదు. మనిషిని మనిషి రిక్షా మీద తీసుకుపోవడం అనాగరికమని కదా!

    ReplyDelete
    Replies
    1. అమర్నాథ్ యాత్రలో డోలీల్లో యాత్రికులని తీసుకొని వెళ్ళడం, రిక్షాలో మనుష్యులని కూర్చోబెట్టుకొని లాగడం లాంటిదే. కేబుల్ కార్ లాంటి సదుపాయాన్ని అక్కడ కలుగ జేస్తే బహుశా డొలీలు మోసే పనిని అనాగరికం అని ప్రక్కన పెట్టేస్తారు.

      పైన కృష్ణ పాలకొల్లు గారు రాసిన కామెంట్ చూస్తే మళ్ళీ పాతరోజులు వస్తున్నాయి అనిపించడం లేదూ? ధన్యవాదాలు మీ కామెంటుకి శర్మగారూ.

      Delete
  4. ఇవిగోండి కిషోర్ వర్మ గారు, లండన్ రిక్షా ఫోటోలు
    http://www.oxoncarts.com/gallery.html

    మరివేమో న్యూయార్క్ రిక్షా కంపెనీ ఫోటోలు
    http://www.manhattanrickshaw.com/

    మీ అప్పారావుకి చూపించి, ఏమన్నారో ఇలాంటిదే ఒక మంచి పోస్ట్ వేయండి :)

    ReplyDelete
    Replies
    1. రిక్షాలన్నీ చాలా గ్లామరస్‌గా ఉన్నాయండి. ఒకవేళ అతనికి చూపిస్తే అక్కడికివెళ్ళిపోతానంటాడేమో! :)

      Delete
  5. రిక్షా అన్న పదం కూడా కనుమరుగయింది
    ప్రారంభంలో ఆటో లను ఆటోరిక్షా అని పిల్చేవారు కానిప్పుడు ఆటో అని మాత్రమె పిలుస్తూ
    రిక్షాని వదిలేసారు చరిత్రకి.

    ReplyDelete
    Replies
    1. అవునండి. చిన్నప్పుడు రిక్షాల్లో వెళ్ళేవాళ్ళమంటే ఇప్పటి తరం పిల్లలు అబ్బురంగా చూస్తున్నారు. రిక్షాలని మ్యూజియంల్లో చూసే రోజు ఎంతో దూరంలో లేదేమో అనిపిస్తుంది.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!