Pages

Monday 14 April 2014

కెన్ ఐ హెల్ప్ యూ?

ఇక్ష్వాకులకాలం నాటి బండి నాది. మా ఎల్.ఐ.సీ ఏజంటు ఎదురుపడినప్పుడల్లా అంటూనే ఉంటాడు, `బండి మార్చరా?` అని. నవ్వడం తప్ప నేను ఏ సమాధానమూ చెప్పనని అతనికీ తెలుసు. అప్పుడప్పుడూ సంభాషణని కొనసాగిస్తూ స్వగతంలో చెప్పుకొన్నట్టు `అచ్చొచ్చిన బండి అయివుంటుంది లెండి,` అంటాడు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ రోజు సాయంత్రం చిన్నమార్కెట్ దగ్గర అది చెప్పాపెట్టకుండా ఆగిపోయింది. స్టార్ట్ చెయ్యడానికి కొంత ప్రయత్నం చేసినతరువాత పెట్రోల్ ఓవర్ అయ్యిందని అర్థమయ్యింది. కిక్ స్టార్ట్ చేసి, చేసి విసుగుపుట్టింది కానీ ఇంజన్ స్టార్ట్ కాలేదు. మెకానిక్‌షెడ్లు తెరిచి ఉండే సమయం కూడాకాదు. అరకిలోమీటరు దూరంలో ఉన్న ఇంటివైపు నడిపించడం మొదలు పెట్టాను. వొళ్ళంతా చెమటతో తడిచి ముద్దయ్యింది. నడిచి, నడిచి ఇంటికి చాలా సమీపానికి వచ్చేసరికి ఒకాయన హీరో హోండా బైకు మీద నన్ను దాటుకొని వెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళి, బైకుని వెనక్కి తిప్పాడు. నా దగ్గరకు వచ్చి `బైకు తీసుకొని వెళ్ళండి. మీ బండి నాకు ఇవ్వండి,` అన్నాడు. అతని ముఖం ఎప్పుడో చూశాను. వెంటనే పేరు జ్ఞాపకం రావడంలేదు. `పరవాలేదండి, ఈ ప్రక్కవీధిలోనే ఇల్లు, థాంక్యూ,` అన్నాను. `మీరు పెట్రోలు తెచ్చుకొనే వరకూ వెయిట్ చేస్తాను, నా బండిలో ఖాళీ సీసా ఉంది. వెళ్ళి వచ్చేయండి ఇబ్బంది ఏమీలేదు,` అన్నాడు. పెట్రోల్ అయిపోయి ఉంటుందని అనుకొన్నట్టున్నాడని అనిపించి విషయం చెప్పాను. తను స్టార్ట్‌చేసి పెడతానన్నాడు. సహాయం చేస్తానని మొహమాటానికి అనడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరీ మరీ కృతజ్ఞతలు చెప్పాను.  ఇంటికి వెళ్ళిన తరువాత జ్ఞాపకం వచ్చింది అతను ఎవరో - చాలా కాలం క్రితం ఒక సాఫ్ట్‌వేర్‌ని అమ్మడానికి మా స్కూల్‌కి వచ్చాడు. నెగోషియేషన్స్ జరుగుతూ ఉండగానే అతను కంపెనీ మారాడని తెలిసింది. అందువల్ల తరువాత మేము కొన్న సాఫ్ట్‌వేర్ అతని సేల్స్ టార్గెట్‌లో పడలేదు - అది వేరే విషయం. కానీ అతని ఆటిట్యూడ్,  చెయ్యాలనుకొన్న సహాయం  ఫీల్‌గుడ్  థింగ్స్!    
© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!