Pages

Thursday 24 April 2014

పూతరేకులు

ఒకరోజు సాయంత్రం బడినుంచి ఇంటికివచ్చేసరికి పెరటిలో కనిపించిన హంగామా చూసి హాశ్చర్యపోయేశాను! మూడురాళ్ళ పెద్ద పొయ్యి, దానిమిద బోర్లించిన మట్టికుండ, కుండక్రింద పొయ్యిలో కణకణమని మండుతున్న పుల్లలు. ఏవో పిండివంటలు తయారవుతున్నాయని తెలుస్తుంది కానీ, అవేమిటో తెలియలేదు. పొయ్యిముందు కూర్చొన్న మనిషి చేస్తున్న పనిని చూస్తుంటే కుతూహలం పెరిగిపోయింది. దగ్గరకు వెళ్ళి నేను కూడా చేస్తానన్నాను. అప్పటికి నేను చాలా బచ్చాని కదా, అందుకే `నువ్వు చెయ్యలేవు కానీ, కావాలంటే ఇది తిను,` అని కుండమీద అప్పుడే తీసిన రేకుని చేతిలో పెట్టారు. పలుచటి ఉల్లిపొరలా ఉంది. రుచి అమోఘం! అదిగో సరిగ్గా అప్పుడే ఆపదార్థంతో ప్రేమలో పడిపోయాను - ఇప్పటికీ హింకా.. తేరుకోలేదు. సరే ఆ సంగతి అలా ప్రక్కన పెట్టండి. పూతరేకు రుచిలో పడిపోయి అక్కడ ఏమి జరుగుతుందో గమనించడం మరచిపోతామా ఏమిటీ!? 

పెద్దగంగాళాలో పలుచగా కలిపిన పిండినీళ్ళు ఉన్నాయి. వాటిలో తెల్లని చతురశ్రాకారపు గుడ్డని ఓ వైపు రెండుకొనలు పట్టుకొని ముంచి,  పిండినీళ్ళు కారుతూ ఉండగానే పొయ్యిమీద బోర్లించిన వేడి కుండమీద వేసి `సర్రు` మని లాగడమే.  అలా చేసీ, చెయ్యడంతోటే పూతరేకు అలా... వచ్చేసేది. దానిని జాగ్రత్తగా తీసి ఓ ప్రక్కన పెట్టేయడమే. అప్పుడు మళ్ళీ కుండమీద కొంచెం నూనె రాసి ఇంకొక రేకుని తీయ్యడం.  You see,  it looked sooo... easy to follow suit,  but too difficult to do. 

అప్పటికింకా పూతరేకులకి ఆత్రేయపురం ప్రశిద్ది అని తెలియదు. అసలు ఆ ఊరి పేరే వినలేదు. పూతరేకులంటే ఇంటిలో తయారు చేసేవే. ఇప్పటిలా అమ్మకానికి కూడా వచ్చేవికాదు. బాగా అనుభవమున్న ఎవరినో ఒప్పించి సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు పూతరేకులు తీయించేవారు.

రేకులు విడిగా తినడానికి బాగానే ఉంటాయికానీ చుట్టలుగా చుడితే మరింత బాగుంటాయి. వాటిని ఎలా చేసేవారో తెలుసా? రెండు రేకులని తడిగుడ్డలో వేసి నొక్కి, వాటి బిరుసు తగ్గిన తరువాత కాసిన వేడి నెయ్యి వేసి, పంచదార పొడి జల్లి, మడత పెట్టి పూతచుట్టలు చుట్టేవారు. అసలు రుచి అంటే పంచదార చుట్టలది కాదు. బెల్లం చుట్టలది! ఎప్పుడైనా తిన్నారంటే... కమ్మని నేతి వాసన, తియ్యటి రుచి... అబ్బా... నా మాటనమ్మండి... మీరు వాటిని జన్మలో మరచిపోలేరు!

ఈ టపా రాయడం వెనుక ఉద్దేశ్యం మీ నోరూరించడం కాదండోయ్. ఒకవేళ.. బై ఎనీ చాన్స్... ఇప్పటివరకూ బెల్లం పూచుట్ట రుచి చూసి ఉండకపోతే... ఆలశ్యం చెయ్యకుండా.. ఆ పనిలో ఉంటారని. ఏమంటారు!?     

© Dantuluri Kishore Varma

8 comments:

  1. అసలు రుచి అంటే పంచదార చుట్టలది కాదు. బెల్లం చుట్టలది!
    వర్మగారూ, మీరు నమ్మండీ, నమ్మకపోండి...బెల్లపు చుట్టల పేరు వినగానే..నా నోట...నీటి వూట. ఏమిచెయ్యనూ ఈ అర్ధరాత్రి పూటా! హ హా.

    ReplyDelete
    Replies
    1. హా..హా.. తప్పదు సర్, కొన్ని కష్టాలని పంటిబిగువున సహించవలసిందే! దొరికే అవకాశం ఉంటే రేపటి వరకూ ఆగండి. :)

      Delete
  2. 2 much kishore garu naa lanti idi chadivite em kaavali ( naaku shaku & chakram vachai lendi ) .... em chestam meru enjoy cheyandi kaani mithai gurichi post rayakandi please.........:)

    ReplyDelete
    Replies
    1. మిఠాయి గురించి రాయకండని మీరు చెప్పింది ఆటో సజెషన్లా ఉపయోగ పడుతుంది. స్వీ...ట్‌గా రాయలని ఉన్నా మీ శంఖు చక్రాలు నన్ను ఆపేస్తున్నాయి రెడ్డిగారూ. ప్చ్! :)

      Delete
  3. మూడేళ్ళ క్రితం స్నేహితులతో ఆత్రేయపురం వెళ్ళి పూతరేకులు కొనుక్కున్నాను.
    మా చిన్నప్పుడు రేకులు మాత్రం వందల లెక్కన అమ్మేవారు. అవి కొనుక్కుని నెయ్యి, పంచదార/బెల్లంతో చుట్టుకునేవారు.
    కొన్నాళ్ళ క్రితం స్టార్ ప్లస్ వారి మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో పూతరేకుల పోటీ కూడ పెట్టారు. కష్టపెట్టి రేకులు చేయించారు కాని, వాటిని చుట్టలు చుట్టి ఎలా తినాలో చూపించలేదు.

    ReplyDelete
    Replies
    1. స్టార్ ప్లస్ వాళ్ళు ఎంత కష్టపెట్టినా మాష్టర్ షెఫ్‌లు పూతరేకులు తీసే, చుట్టలు చుట్టే స్కిల్ అలవరుచుకోలేరని నా ప్రగాఢ నమ్మకం. ఆకారం వరకూ సాధించినా, రుచిని పట్టుకోలేరు. ఏమంటారు బోనగిరిగారు?

      Delete
  4. :) ఆ పంచదార/బెల్లం పొడితో కాస్త ఏలకుల పొడి కూడా వేస్తే ఇంకా అమోఘమండీ.

    ReplyDelete
    Replies
    1. నిజమే శిశిరగారు, యాలకులపొడి సంగతి నేను మరిచాను. మీ కామెంట్‌తో కలిపి చదివితే ఈ టపా సువాసన మరింత పెరుగుతుంది. :)

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!