Pages

Thursday 28 August 2014

జై బోలో గణేష్ మహారాజ్‌కీ....

పర్యావరణానికి హాని చెయ్యని గణేష నిమజ్జనం కావాలి అందరికీ. ప్లాస్టరాఫ్ పారిస్‌తో తయారు చేసిన ప్రతిమలు, వాటికి వేసిన రంగులు జలకాలుష్యానికి కారణమౌతాయని, కాబట్టి వాటికి బదులుగా మట్టివినాయక ప్రతిమలు వాడాలని ప్రతీఒక్కరికీ అర్థమవ్వవలసిన ఆవశ్యకత ఉంది. మా వంతు ప్రయత్నంగా మట్టి వినాయకుడ్ని తయారు చేసుకొన్నాం. 

ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలనుంచీ వర్షం మొదలయ్యింది. మధ్యాహ్నం అయ్యేకొలదీ ఎక్కువయ్యింది. సాయంత్రం అయ్యిందికానీ వర్షం తగ్గడం లేదు. అలాగని జనాలు బయటకు వెళ్ళడం మానడం లేదు. గొడుగులు వేసుకొని మెయిన్ రోడ్డుకి ఇరువైపులా పెట్టిన అంగళ్ళదగ్గర కావలసినవి కొనుక్కొంటూ ఉన్నారు.  ఊరంతా సందడిగా ఉంది. రేపటి పూజకి పత్రి కొనుక్కోవాలి, పాలవెల్లులకి కట్టుకోవడానికి రకరకాల పళ్ళు కావాలి, ప్రసాదాలకీ, పిండివంటలకి సరుకులు తెచ్చుకోవాలి... 

ప్రసాదం అంటే జ్ఞాపకం వచ్చింది - మట్టి వినాయకుడి చేతిలో లడ్డు మట్టితో చేసిందే పెడతారా? చాలా కాలం క్రితం గణేశ నవరాత్రుల సమయంలో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మల్లిబాబు అనే ఆయన కూతురికి ఇదే సందేహం వచ్చిందట. ఆయన వెంటనే `మనకి మండపేటలో స్వీట్ స్టాల్ ఉందికదా, మనమే స్వామికి మహాలడ్డూ తయారుచేయించి పంపుదాం. అప్పుడు మట్టిలడ్డూకి బదులుగా నిజందే పెడతారు,` అని అన్నాడట. ఇంకేముంది అప్పటి నుంచీ క్రమం తప్పకుండా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఖైరతాబాదుకి మహాలడ్డూలు వెళుతున్నాయి. వీటి తయారీ ప్రత్యేకంగా గణేష మాలధారణ చేసిన వ్యక్తుల చేతులమీదుగా భక్తి ప్రవత్తులతో జరుగుతుంది. ప్రతీ ఏడాదీ ముందరి సంవత్సరం కంటే పెద్ద లడ్డూ పంపిస్తున్నారు. ఈసారి మహాలడ్డు బరువు ఎంతో తెలుసా? 5000 కిలోలు! జై బోలో గణేష్ మహారాజ్‌కీ.... అందరూ ఆనందంగా వినాయకచవితి జరుపుకోండి! 
© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!