Pages

Saturday 18 October 2014

బ్లాక్‌బ్యూటీ

అన్నా సూవుల్ (Anna Sewell) 1877లో రాసిన బ్లాక్ బ్యూటీ నవల ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన నవలల్లో ఒకటి. ప్రస్తుతం బ్లాక్ బ్యూటీని చిల్డ్రన్స్ క్లాసిక్స్ విభాగంలో చేరుస్తున్నప్పటికీ ఈ నవల రాయబడింది మాత్రం పిల్లలకోసం కాదు. పంతొమ్మిదో శతాబ్ధంలో ప్రయాణాలకి, సరుకుల రవాణాకి గుర్రపుబళ్ళమీద ఎక్కువగా అధారపడే వారు. ఇప్పుడు ధనవంతుల సొంత కార్లలాగ అప్పుడు రకరకాల గుర్రపుబళ్ళు ఉండేవి.  ఎక్కడికైనా వెళుతున్నప్పుడు గుర్రాన్ని బండికి కట్టి తయారు చెయ్యడానికి, బండిని తోలడానికి సేవకులు ఉండేవారు. అలాగే ప్రయాణంనుంచి తిరిగి వచ్చిన తరువాత గుర్రాలకు మాలిష్ చెయ్యడానికి, దానా తయారు చేసి తినిపించడానికి, వాటి సంరక్షణ చూడడానికి కుర్రాళ్ళు ఉండేవారు. వీళ్ళు కాక అద్దె గుర్రబగ్గీల వాళ్ళు, వాళ్ళకి గుర్రాలనీ బగ్గీలనీ సరఫరా చేసేవాళ్ళు, సరుకుల రవాణా చేసే బండి వాళ్ళు... ఇలా సమాజంలో చాలామంది యొక్క ప్రపంచం గుర్రాల చుట్టూ తిరుగుతూ ఉండేది. వీరిలో కొంతమంది తమ గుర్రాలని కుటుంబసభ్యుల్లా ప్రేమగా చూసుకొంటే, చాలామంది స్వలాభంకోసమో, అవివేకంతోనో వాటిని క్రూరంగా హింసించేవాళ్ళు. రచయిత్రే ఎక్కడో వ్యక్తీకరించినట్టు ఈ మూగ జీవాలు నోళ్ళు తెరిచి `మా బాధ ఇదీ,` అని చెప్పనంత మాత్రాన వాటికేమీ బాధలేదని భావించకూడదు. అలా భావిస్తూ ఉండే వ్యక్తుల్లో మార్పు తీసుకురావడానికే అన్నా సూవుల్ ప్రధానంగా ఈ నవలని రచించింది.

అన్నా సూవుల్‌కి పద్నాలుగేళ్ళ వయసున్నప్పుడు స్కూల్ నుంచి తిరిగి వస్తూ జారిపడి కాలు విరగ్గొట్టుకొంటుంది. చేయించిన వైద్యం వికటించి జీవితాంతం అవిటిగానే ఉండిపోతుంది. ఇల్లు కదిలి వెళ్ళాలంటే గుర్రపుబండే శరణ్యం . తనకీ, ప్రపంచానికీ మధ్య వారది గుర్రాలే. అవి లేకపోతే ఆమెకి ప్రపంచం మూసుకొని పోయినట్టే. అందుకే గుర్రాలంటే పిచ్చ ప్రేమ అన్నాకి. వాటి ఋణం బ్లాక్‌బ్యూటి నవల రాయడం ద్వారా తీర్చుకొంది. అది ఎలాగ అంటే.. జంతు ప్రేమికులు బ్లాక్‌బ్యూటి నవలల్ని ఎక్కువ సంఖ్యలో కొని, గుర్రపుశాలల్లో పనిచేసే వాళ్ళకి, అద్దె బళ్ళవాళ్ళకి ఉచితంగా పంచిపెట్టేవారట. గుర్రాలమెడలు ఠీవీగా నిలబడి ఉండడానికి కళ్ళాన్ని గట్టిగా బిగించి కట్టడం అప్పట్లో ఒక ఫ్యాషన్‌గా ఉండేది. దీనిని బేరింగ్ రెయిన్ అంటారు. బండిని లాగేటప్పుడు, ఎత్తులు ఎక్కుతున్నప్పుడు మెడను ముందుకు వంచి బరువు లాగే అవకాశం గుర్రాలకు లేక వాటికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. జింజర్ అనే గుర్రం బ్లాక్ బ్యూటీకి తనకు బేరింగ్ రెయిన్ తగిలించడం వల్ల అనుభవించిన బాధని చెపుతుంది. కథలో తరువాత బ్లాక్‌బ్యూటీకి కూడా ఆ అవస్థ కలుగుతుంది. నవల విడుదలైన తరువాత గుర్రాలకు  బేరింగ్ రెయిన్‌ను కట్టే పద్ధతిని ఇంగ్లాండ్‌లో నిషేదించారట.

ఈ రచయిత్రి తనజీవితకాలంలో రాసింది ఒకే ఒక్క నవల. అదీ తాను మరణానికి దగ్గరలో ఉండగా. వ్యాదిగ్రస్తురాలై మంచంమీద ఉండి బ్లాక్‌బ్యూటీని రాసి, ప్రచురణకు ఇచ్చింది.  పుస్తకం విడుదలైన వెంటనే విజయవంతంగా అమ్ముడుపోయింది. ఆ తరువాత అయిదు నెలలకే అన్నా కన్ను మూసింది.

ఇక కథ విషయానికి వస్తే -

బ్లాక్‌బ్యూటీ అనే గుర్రం చిన్నప్పుడు తల్లి దగ్గర చింతలేకుండా గడిపిన రోజుల దగ్గరనుంచి జీవితపు చివరి అంకం వరకూ తన ఆత్మకథని చెపుతుంది. మధ్యలో ఎందరో యజమానులు. వాళ్ళలో మంచివాళ్ళు, క్రూరులు, తాగుబోతులు, అజ్ఞానులు, స్వార్థపరులు ఉంటారు. వాళ్ళతో తన అనుభవాలనీ, తనతో పాటూ గుర్రపుశాలల్లో ఉండే మిగిలిన గుర్రాల యొక్క వెతల్ని, రోడ్లమీద తాను గమనించిన విషయాలనీ బ్లాక్‌బ్యూటీ తనకోణంలో ఆవిష్కరిస్తుంది. సాంకేతిక పదాలు ఎక్కువగా ఉపయోగించకుండా, సులభమైన పద్దతిలో రచయిత్రి రాసిన విధానం పుస్తకాన్ని క్రిందపెట్టకుండా చదివిస్తుంది.

ఫార్మర్ గ్రే అనే వ్యక్తి పొలంలో తల్లి డచెస్‌తో కలిసి  తన బాల్యాన్ని ఆనందంగా గడుపుతుంది బ్లాక్‌బ్యూటీ. గోర్డన్ అనే ఆయనకి బ్లాక్‌బ్యూటీని అప్పగిస్తాడు ఫార్మర్ గ్రే. ఇక్కడే మెర్రీ్‌లెగ్స్ అనే చిన్న గుర్రం, జింజర్ అనే మరొక గుర్రం స్నేహితులౌతాయి.  చాలాకాలం యజమానులకి విశ్వాసపాత్రంగా సేవలు చేసిన తరువాత బ్లాక్‌బ్యూటీ, జింజర్‌లు మిష్టర్ డబల్యూ దగ్గరకి వెళతాయి.  ఒక ప్రమాదంలో  బ్లాక్‌బ్యూటి మోకాళ్ళు దెబ్బతింటాయి. దానితో అద్దెబళ్ళ వాడికి అమ్ముతారు. అక్కడినుంచి చేతులుమారుతూ జెర్రీ అనే గుర్రపు బండి వాడి దగ్గరకు వస్తుంది. జెర్రీ దగ్గర బ్లాక్‌బ్యూటీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కానీ ఎంతో కాలం కాదు. తరువాత బరువులు లాగే బండికి కట్టబడి, విపరీతంగా బాదింపబడుతుంది. జింజర్ నిర్బాగ్యస్తితిలో మరణించడం చూస్తుంది. దానాని దొంగిలించి గుర్రాలని అర్థాకలితో మాడ్చేవాళ్ళు, రెండుసార్లు అటూ ఇటూ తిరగవలసిన అవసరం లేకుండా ఒకేసారి గుర్రాలమీద రెట్టింపు బరువు వేసేవాళ్ళూ, వారానికి ఏడురోజులూ - రాత్రీ పగళ్ళూ బండినడిపి తాము అద్దెకుతెచ్చిన బళ్ళ యజమానికి అద్దె చెల్లించేవాళ్ళూ.. ఎంతో మంది తారస పడతారు. కథ చివరకు వచ్చే సరికి థరోగుడ్ అనే ఆయన బ్లాక్‌బ్యూటీని కొని, సంరక్షించి ముగ్గురు సోదరీమణులకి అమ్ముతాడు. చివరిరోజులు ప్రశాంతంగా గడుస్తాయి అనే హ్యాపీనోట్‌తో తనకథను చెప్పడం ముగిస్తుంది బ్లాక్‌బ్యూటీ.

గుర్రపుబళ్ళ కాలం ఎప్పుడో గడిచిపోయినప్పటికీ ఈ నవల ఇంకా పాఠకాధరణ పొందుతూనే ఉంది. దానికి నేననుకొనే కారణం ఏమిటంటే యజమానులు తమక్రింద పనిచేసే ఉద్యోగుల విషయంలో, భర్తలు భార్యల విషయంలో, బలవంతులు బలహీనుల విషయంలో అకృత్యాలకు పాల్పడడం చుస్తూనే ఉన్నాం. ఎన్ని చట్టాలున్నా మనిషి మనస్తత్వంలో మార్పురానంత వరకూ పరపీడన పరాయణత్వం జరుగుతూనే ఉంటుంది. బ్లాక్‌బ్యూటీ నవల చదువుతున్నంత సేపూ పీడనకు గురవుతున్న ఒక వ్యక్తి ఆత్మ కథ చదువుతున్నట్టే ఉంటుంది. కథాగమనంలో ఎన్నో సార్లు పీడించేవాళ్ళగానో, పీడింపబడేవాళ్ళగానో మనల్ని మనం పరిశీలించుకొంటాం.  ముఖ్యంగా చిన్నపిల్లలు బ్లాక్‌బ్యూటీని తమస్వంతం చేసుకొన్నారు. ఈ కథ ఆధారంగా కార్టూన్ సినిమాలు వచ్చాయి. ఫీచర్ ఫిల్మ్ కూడా తీశారు.

గుర్రాలు మాత్రమే కాదు, మరి ఏ జంతువులైనా కరుణకు పాత్రమైనవే. బ్లాక్‌బ్యూటీ పిడీఎఫ్ రూపంలో ఉచితంగా లభిస్తుంది. బుక్స్ షుడ్ బి ఫ్రీ అనే సైట్‌లో ఆడియో ఫైల్స్ రూపంలో ఉంది. విని ఆనందించవచ్చు. 

Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!