Pages

Saturday 29 November 2014

తాటి పీచు

తాటి పీచుని రోడ్ల మీదే ఎండ బెట్టేస్తారు. రోజుల తరబడి అది అలా ఎండుతూనే ఉంటుంది. వాహనాలు పీచుమీదుగా పోతూ ఉంటాయి. మనుషులు తొక్కుతూ నడుస్తూ ఉంటారు. సాయంత్రం ఎండతగ్గుతూ ఉండగా పీచుని ఎండబెట్టిన కూలీలు తిరిగి దానిని చక్కగా వొజ్జుపెట్టి, చిన్న చిన్న కట్టలుగా కట్టేస్తారు. వాళ్ళు అలా చేస్తూ ఉండగా తాటి పీచులో ప్రతీ ఈనూ ఒకే పొడవులో ఉండడం గమనిస్తాం. వారంలో ఒక శుక్రవారమో, మరొక రోజో వ్యాన్‌మీద కొనుబడివాళ్ళు వస్తారు. కట్టల్ని బరువు తూచుకొని, డబ్బు చెల్లించి తీసుకొని వెళతారు. జగన్నాధపురంలో మా ఇంటికి ఎదురుగా ఈ వ్యవహారం క్రమం తప్పకుండా జరిగేది. జరిగేది అని ఎందుకు అంటున్నానంటే - ప్రస్తుతం పీచు గొడౌన్ మా ప్రాంతం నుంచి మరొక చోటుకి మార్చేశారు. ఓ రోజు పని చేయిస్తున్న మేస్త్రిని `ఏమిటి ఈ తాటిపీచు సంగతి?` అంటూ చిన్న చిట్‌చాటింగ్ మొదలు పెట్టాను. ఆర్డర్ వొచ్చిన దానిని బట్టి పీచు పొడవులు కత్తిరిస్తారని, లాభసాటి వ్యాపారం అని చెప్పాడు. `కొన్న వాళ్ళు దీనిని ఏమితయారు చెయ్యడానికి ఉపయోగిస్తారో తెలుసా?` అంటే, తెలియదన్నాడు.  నిజానికి తాటిపీచుతో బ్రష్‌లు, చీపుర్లు లాంటివి తయారు చేస్తారట. దీని గురించి కొంత గూగుల్ సెర్చ్ చేస్తే ఒక ముంబాయి ట్రేడర్ యొక్క వెబ్‌సైట్‌లో కొచ్చిన్ తాటిపీచుతో పాటూ, ప్రఖ్యాతి చెందిన కాకినాడ రకం కూడా అమ్ముతామని ప్రముఖంగా ప్రస్తావించాడు. ఇన్నిరోజులూ పెద్దగా పట్టించుకోలేదు కానీ మన ఇంటి ముందు తయారయ్యే దానికి ఇంత  పేరు ఉందా! 




© Dantuluri Kishore Varma

Wednesday 26 November 2014

క్యూట్ కార్టూన్ కేరెక్టర్స్


డెనిస్ ద మేనస్

డెనీస్ ఓ ఐదున్నర సంవత్సరాల కుర్రాడు. మహా అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. వీడికి తోడు రఫ్ అనే కుక్క ఒకటి. డెనీస్ తండ్రి హెన్రీ మిచ్చెల్, తల్లి అలైస్ మిచ్చెల్.

అలైస్ నాన్న - అంటే డెనిస్‌కి తాత జాన్సన్ సంవత్సరానికి ఒకటి, రెండుసార్లు వాళ్ళింటికి వచ్చిపోతుంటాడు. తాతల సంగతి తెలియనిది ఏముంది? మనవలతో కలిసి వాళ్ళకి మరింత అల్లరి నేర్పగలరు. జాన్సన్ తక్కువేమీకాదు. మనవడికి అల్లరి నేర్పి వెళ్ళిపోతే పొరుగింటిలో ఉండే రిటైరయిన  జార్జ్ విల్సన్, అతనిభార్య మార్తా విల్సన్‌లు డెనిస్ చిలిపి పనులకి బలవుతూ ఉంటారు. 

ఈ అమెరికా అల్లరి బుడుగుకి కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. మార్గరెట్ వేడ్ అనే పిల్లకి డెనిస్ అంటే ఇష్టం. వాడి ఆరాధకురాలు అని చెప్పవచ్చు!  ఈమె కాక ఇంకా గిన గిలోటి అనే పిల్ల, జో మెక్‌డోనాల్డ్ అనే చిన్న కుర్రోడు కూడా ఉంటారు.  ఈ కేరెక్టర్ల అన్నింటితో పరిచయం అవ్వాలంటే డెనిస్ కార్టూన్లని చూడడం ఒక్కటే మార్గం. ఈ ఫేస్‌బుక్ పేజీలో చదవండి.  డెనిస్ ద మేనస్ ఫేస్‌బుక్ పేజీ

హాంక్ కెచ్చెం అనే అమెరికన్ కార్టూనిస్ట్ డెనిస్ ద మేనస్ కార్టూన్ స్ట్రిప్‌ని 1951లో గీయడం ప్రారంభించాడు. ఒకేసమయంలో ఇది ఎన్నో న్యూస్ పేపర్లలో రావడం మొదలైంది. పాఠకులకి డెనిస్ తెగ నచ్చేశాడు. వాడి అల్లరి పనులకి, అమాయకంగా అడికే ప్రశ్నలకి జనాలు పడీ, పడీ నవ్వుకొన్నారు. 1959లో టీవీ సీరియల్‌గా కూడా వచ్చి విజయవంతం అయ్యింది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ కార్టూన్ స్ట్రిప్ ఇప్పటికీ కొనసాగుతుంది. మనదేశంలో డక్కన్ క్రానికల్ లాంటి పేపర్లలో కూడా వస్తుంది. డెనిస్ సృష్ఠికర్త హాంక్ కెచ్చెం చనిపోయినా అతని శిష్యులు, కొడుకూ దీనిని కొనసాగిస్తున్నారు.

టెలివిజన్ సీరీస్‌లో మచ్చుకి ఈ ఎపిసోడ్ చూడండి.

1993లో వచ్చిన సినిమా కూడా బాగుంటుంది. ఈ లింక్‌లో చూడండి:  సినిమా

పీనట్స్
చార్లెస్  షుల్జ్ (Charles Schulz) అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు అమెరికాలో. మీకు అంత తొందరగా ఆయన పేరు జ్ఞాపకానికి రాకపోతే `పీనట్స్` కార్టూన్ స్ట్రిప్ గీసినాయన అంటే తెలుస్తుందేమో! ప్రింట్ సిండికేషన్ అనే సంస్థలు ఉంటాయి. వాళ్ళ పని ఏమిటంటే ఎడిటోరియల్ కాలమ్‌స్‌ని, కామిక్ స్ట్రిప్స్‌ని, ఆర్టికల్స్‌ని ఆయా రచయితల దగ్గరనుంచీ, కార్టూనిస్టుల దగ్గరనుంచీ తీసుకొని వాటిని పునర్ముద్రించుకొనే హక్కుల్ని చాలా న్యూస్‌పేపర్ల వాళ్ళకి ఇవ్వడం. పత్రికలకి కార్టూన్లు వేసే షుల్జ్ 1950లో లిల్ చాంప్స్ అనే తన కామిక్ స్ట్రిప్‌ని మార్కెట్ చెయ్యడానికి ఇలాంటి ఒక సిండికేట్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నాడు. వాళ్ళు లిల్ చాంప్స్ అనే పేరు తీసివేసి పీనట్స్ అనే పేరుని ఖరారు చేశారు. ఈ మార్పు షుల్జ్ కి అస్సలు నచ్చలేదట. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ పీనట్స్‌కి విపరీతమైన జనాధరణ లభించడం మొదలయ్యింది.  మొత్తం 75 దేశాల్లో ఉన్న 21 భాషల్లో వెలువడుతున్న 2,600 న్యూస్ పేపర్లలో పీనట్స్ కార్టూన్లు అచ్చయ్యాయి. 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా గీసి 2000వ సంవత్సరంలో మరణించే నాటికి షుల్జ్ సుమారు 18,000 పీనట్స్ స్ట్రిప్స్‌ని గీశాడట. ఇన్ని గీసిన షుల్జ్ ఉపయోగించిన  ఆర్ట్ మెటీరియల్ ఏమిటో తెలుసునా? కేవలం ఇండియన్ ఇంక్, అదిపోసి గీయడానికి పాళీ పెన్నులూ ఆర్ట్ పేపరూ! సృజనాత్మకతే పెట్టుబడి.  పీనట్స్‌లో ఉండే పాత్రలు - చార్లీ బ్రౌన్ అనే కుర్రవాడు, స్నూపీ అనే కుక్క, ఉడ్‌స్టాక్ అనే చిన్న పక్షి, చాలామంది పిల్ల కాయలు.. పెద్దవాళ్ళకు ఈ ప్రపంచంలో చోటులేదు.  
పీనట్స్‌లో ముద్దొచ్చే చిన్న పాత్ర చార్లీ బ్రౌన్. ఈ కుర్రాడికి ఏపనీ సరిగ్గా చెయ్యడం రాదు. పుట్‌బాల్‌ని తన్నలేడు, గాలిపటాన్ని ఎగరెయ్యలేడు, మనసులో ఉన్న ఇష్టాన్ని నచ్చిన పిల్లకి చెప్పలేడు.. కానీ ఓడిపోయాననే నిరుత్సాహంతో తన పనిని మాత్రం ఎప్పుడూ చెయ్యకుండా ఆపలేదు. అందుకే కోట్లాది మంది అభిమానాన్ని సొంతంచేసుకొన్నాడు చార్లీ బ్రౌన్. మరొక ప్రక్క ఈ పాత్రను సృష్టించిన చార్లెస్ షుల్జ్ అమోఘమైన విజయం సాధించాననే ఆనందంతో కొనసాగించడం మానలేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతీ రోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 4 గంటలవరకూ ఆలోచించుకొంటూ, గీసుకొంటూ ఉండేవాడట షుల్జ్.  చాలామంది కళాకారుల్లా `కళ కావలసినంత ఉంది, కాణీకి ఠికాణా లేదు` అనే పరిస్థితి ఈయనకి ఎదురుకాలేదు. సంవత్సరానికి ముప్పై నుంచి నలభై మిలియన్ డాలర్లు సంపాదించేవాడు. మన పద్ధతిలో చెప్పాలంటే మూడు నుంచి నాలుగు కోట్ల డాలర్లు. ప్రపంచంలో బహుశా ఏ కార్టూనిస్టూ ఇంత పెద్దమొత్తంలో సంపాదించి ఉండడని అంటారు.  ఈ రోజు షుల్జ్ పుట్టిన రోజు.

పీనట్స్ వెబ్‌సైట్ ఇక్కడ చూడండి. చాలా వీడియోలు ఇక్కడ చూడండి.


విన్నీ-ద-ఫూ
విన్నీ-ద-ఫూ గురించి విన్నారా ఎప్పుడయినా? లేకపోతే ఈ బొమ్మ చూస్తే మీకు వెంటనే తెలిసిపోతుంది విన్నీ ద ఫూ ఎవరో. దానిగురించి ఒక మంచి కథ చెపుతాను వినండి. కథ అంటే కథ కాదు కానీ, నిజ్జంగా జరిగిందే. 

క్రిస్టొఫర్ రాబిన్స్ అని ఒక కుర్రవాడు ఉండే వాడు లండన్లో. వాళ్ళ నాన్న ఏ.ఏ.మిల్నే పెద్ద కథా రచయిత. మిల్నే రాసిన విన్నీ-ద-ఫూ కథలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వాటిలో ముఖ్యమైన పాత్రలు - క్రిస్టొఫర్ రాబిన్స్, విన్నీ అనే పేరుగల ఒక ఎలుగుబంటి, ఈయోర్ అనే గాడిద, రూ అనే కంగారూ పిల్ల, ఒక పులీ... మొదలైనవి ఉన్నాయి. మిల్నే కొడుకు పేరు క్రిస్టొఫర్ రాబిన్స్ అని ముందే చెప్పుకొన్నాం కదా? వాడే ముఖ్య పాత్ర..  క్రిస్టొఫర్ ఆడుకొనే బొమ్మల పేర్లనే కథల్లో కొన్ని పాత్రలకి పెట్టాడు.

మొదటి ప్రపంచ యుద్దం జరుగుతున్న రోజుల్లో ఒక సైనికాధికారి కెనడా నుంచి ఇంగ్లాండ్ వస్తూ మార్గ మధ్యలో ఒక నల్ల ఎలుగు బంటిని కొంటాడు. దాన్ని తన రెజిమెంటులో పెంచుకొంటూ ఉంటాడు. అది అక్కడ చాలా పాపులర్ అవుతుంది. దాని పేరు విన్నీ. తరువాత కొన్నిరోజులకి విన్నీని లండన్ జూకి అప్పగిస్తాడు. ఒకసారి క్రిస్టొఫర్ రాబిన్స్ జూలో దాన్ని చూసి, ముచ్చటపడి, తనదగ్గర ఉన్న టెడ్డీబేర్‌కి ఆ పేరు పెట్టుకొంటాడు.

మరి ఫూ అని ఎందుకు కలిపారు? అంటే, దానికి ఇంకొక కారణం ఉంది. ఒకసారి లండన్ జూలో ఉన్న విన్నీకి చాలా నీరసం చేసిందట. చేతులు కర్రల్లాగ బిర్ర బిగుసుకుపోయాయి. అలా వారం రోజులు ఉంది. ఆ సమయంలో దాని ముక్కు మీద ఏమయినా వాలితే `ఫూ(((` అని ఊదుకొనేదట. అందుకే ఆ శబ్ధాన్ని కూడా కలిపి విన్నీ-ద-ఫూ చేసారు.
మొట్టమొదటి విన్నీ-ద-ఫూ కథలు 1926లో రాయబడ్డాయి. తరువాత వాల్డిస్నీ వాళ్ళు ఈ పాత్రల్ని ఆధారంగా చేసుకొని  మంచి, మంచి యానిమేటేడ్ సినిమాలు తీసారు. మీరు ఎప్పుడయినా వాటిని చూసే ఉండవచ్చు. చాలా బాగుంటాయి కదా?
© Dantuluri Kishore Varma

Monday 24 November 2014

గిఫ్ట్‌వోచరు కథ

గిఫ్ట్ వోచర్లు కావలసినన్ని కష్టాలు పెట్టగలవని నాకు మొన్నటిదాకా తెలియలేదు. 

సంవత్సరం క్రితం ఇండిబ్లాగర్ వాడు పెట్టిన బ్లాగింగ్ పోటీలో నేను రాసిన ఓ టపాకి వెయ్యిరూపాయల గిఫ్ట్ వోచరు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆ డబ్బులతో కావలసినవన్నీ కొనుక్కొని పండగ చేసుకొమ్మని సెలవిచ్చాడు. కొనుక్కోవడానికి వాడిచ్చిన కోడ్, పిన్ నెంబరూ ఇన్‌బాక్స్‌లోనే ఉన్నాయి కనుక `ఇప్పుడే తొందరేముందిలే ఇంకా ఏడాది సమయం ఉంది కదా?` అనుకొన్నాను. తీరా చూస్తే వోచరు ఎక్స్‌పయరీ డేటు అయిపోతుంది అనగా అకస్మాత్తుగా ఈ విషయం జ్ఞాపక వచ్చింది. పిల్లలు ఇద్దరికీ ఓ గేమూ, ఇల్లాలికి ఓ క్రోకరీ ఐటమూ ఎంచుకొని `బై నౌ` ని నొక్కితే, `యూ కెనాట్ బై ఫ్రం మల్టిపుల్ సెల్లర్స్` అనే మెసేజ్ ముఖంమీద కొట్టింది. `ఫ్లిప్‌కార్ట్ అంటే  రకరకాల సెల్లర్లు వస్తువులు అమ్మే ఎక్జిబిషన్ లాంటిది అని జ్ఞానోదయం కలిగించుకొని మరో దండయాత్ర మొదలు పెట్టాను. 

ఈసారి డెలివరీ చార్జెస్‌తో కలిపి వెయ్యిదాటని ఒకే ఒక వస్తువుని ఎంచుకొని `బై నౌ` అన్నాను. `డబల్యుఎస్ రిటైల్ వాడు అమ్మే వస్తువులు తప్ప ఈ వోచరుతో మరేమీ కొనుక్కో లేవు,` అని మెసేజ్ కొట్టాడు.  పట్టువదలని విక్రమార్కుడిలా చెట్టెక్కిన బేతాళుడిని దించడానికి మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టా. `మనదేముంది ఇంకా మూడవ సారే కదా? గజనీ పదిహేడు సార్లు దండెత్తలేదా మనదేశం మీద?` అని నన్ను నేనే వోదార్చుకొని డబల్యూఎస్ రిటైల్‌వాడు అమ్మే వస్తువులు ఏమున్నాయో వెతకడం మొదలు పెట్టాను. వచ్చిన ఫలితాలు చూసి మతిపోయింది. అవి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఒక్కొక్కటీ ఏడు నుంచి తొమ్మిది వందలు ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ కవర్లు! వాటి క్రింద `ఇవి తప్ప ఇంకేమీ లేవు. నచ్చితే కొనుక్కో, లేదంటే నీ దిక్కున్న చోట చెప్పుకో,` అని కొట్టినట్టు చెప్పే `నో మోర్ రిజల్ట్స్ టు షో,` కనిపించింది. `గుర్రం లేనోడికి, నాడాతో పనేమిటిరా పింజారీ వెధవా!` అని తిట్టుకొని; `ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిస్తే ఈ కవర్లకి సరిపోయే స్మార్ట్‌ఫోను కొనుక్కొని  తయారుగా ఉందును కదా!` అని ఆక్రోశించాను.    

`ఈ కష్టం నాకేనా? లేదంటే ఇంకొందరు బాధితులు ఉన్నారా?` అని ఇండిబ్లాగర్‌లో చుస్తే నావి రెండు వోచర్లు పోయాయని ఒకరు, నావి పదిహేనువందలు హుష్‌కాకి అని ఇంకొకరు...కుయ్యో మొర్రో మంటూ చాలా మంది తగిలారు. `కొంచెం తుత్తిగా ఉంది,` అనుకొని ఆరోజుకి ప్రయత్నం విరమించాను.

తరువాత కొంచెం ఖాళీ చూసుకొని ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కో వస్తువూ వెతుకుతూ పోతుంటే, డబల్యూఎస్ రిటైల్ వాడు పెన్‌డ్రైవ్‌లు కూడా అమ్ముతాడని తెలిసింది. `ఫోన్‌కవర్ల కంటే ఇవే కొంచెం నయం,` అనుకొని అవసరం ఉన్నా, లేకపోయినా గిఫ్ట్‌వోచర్‌ని నిరుపయోగం చెయ్యడం ఇష్టం లేక ఓ రెండు 16జిబీ పెన్‌డ్రైవ్‌లు పంపమని ఆర్డరేశా. ఇంకొంచెం సేపు వెతికితే డబల్యూఎస్ రిటైల్ వాడు అమ్మే చేతన్‌భగత్ రాసిన హాఫ్‌గాల్‌ఫ్రెండ్, ప్రీతీ షెనాయ్ రాసిన లైఫ్ ఈస్ వాట్ యూ మేక్ ఇట్ పుస్తకాలు కూడా దొరికాయి. ఇచ్చింది కండీషనల్ వోచర్ అన్న సంగతి తెలియదు. వెతుక్కోవడం కొంచెం ఇబ్బందే కానీ, వస్తువులన్నీ బాగానే ఉన్నాయి. కొన్న వస్తువులని కూడా జాగ్రత్తగానే పంపించాడు. గిఫ్ట్‌వోచరు కథ అలా ముగిసింది.  

వెతుక్కొనే ఓపికలేక వోచరు డబ్బుపోగొట్టుకొన్న వాళ్ళు ఇంకా ఇండిబ్లాగర్‌లో, గూగుల్‌లో గొంతుచించుకొంటూనే ఉన్నారు. 

© Dantuluri Kishore Varma

Sunday 23 November 2014

హ్యుయాన్‌త్సాంగ్

చదువంటే, విజ్ఞానసముపార్జన అంటే అనాసక్తి ఉన్నవాళ్ళు హ్యుయాన్‌త్సాంగ్ (Hsuan Tsang AD 602 - 664) గురించి తెలుసుకోవాలి. ఈయన మనజాతీయుడు కాదు - చైనా దేశస్తుడు. కాశ్యప మాతంగ అనే బౌద్ధ సన్యాసి క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో భారతదేశం నుంచి చైనాకి వెళ్ళి బౌద్ధమతం గురించి ప్రచారం చేసినది మొదలు చైనీయులకి భారతదేశంమీద గొప్ప ఆసక్తి నెలకొంది. ఇక్కడి విజ్ఞానాన్ని జుర్రుకోవాలని తపన పెరిగింది. అలా బుద్దుడు నడిచిన ప్రదేశాలని చూడాలని, ఆయన బోధనలని మరింత సమగ్రంగా తెలుసుకోవాలని, అప్పటికే విశ్వవ్యాప్తంగా అత్యంత గొప్పదిగా పేరుగాంచిన నలందా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాలని అభిలాషతో క్రీస్తుశకం ఏడవ శతాబ్దానికి చెందిన హ్యుయాన్‌త్సాంగ్ భారతదేశానికి ప్రయాణం అయ్యాడు. అప్పట్లో చైనా నుంచి ఇతరదేశాలకు వెళ్ళడం చట్టవిరుద్ధం. రహస్యంగా సరిహద్దులు దాటి పోవాలి. ఈ ప్రయత్నంలో పట్టుబడితే ప్రాణాలకే ముప్పు. మోటారువాహనాలు, ఏరో్‌ప్లెయిన్లూ లేని కాలం. రోజుల తరబడి మంచినీళ్ళు దొరకని ఏడారుల్లో గుర్రమ్మీద వొంటరిగా ప్రయాణం, గాలి దుమారాలు, ఇసుక వర్షం, బందిపోటు దొంగలు, మంచు పర్వతాలు... వీటన్నింటితో పాటూ రాత్రిపూట దెయ్యాలు, ప్రేతాలు ఆకాశంలో మంటలు పుట్టించేవట. ఇటువంటి కష్టసాధ్యమైన ప్రయాణం చెయ్యడానికి ఎంతో గుండెనిబ్బరం ఉండాలి. ధైర్యం కోల్పోయి మధ్యలోనే వెనుదిరిగి పోవాలనే ఆలోచన హ్యుయాన్‌త్సాంగ్‌కి ఎప్పుడూ  కలగలేదు. 

ప్రయాణ మార్గంలో ఉన్న టర్పాన్ అనే ప్రాంతపు రాజుగారు హ్యుయాన్‌త్సాంగ్‌ని సాదరంగా ఆహ్వానిస్తాడు, ఆ రాజ్యంలో ఉన్న బౌద్ధ దేవాలయానికి అధిపతిగా చేస్తానని, అక్కడే ఉండిపోవాలని కూడా కోరతాడు. ఆవిధంగా చెయ్యడానికి హ్యుయాన్‌త్సాంగ్‌కి సమ్మతమైతే ఆతనికి సకల సౌకర్యాలూ కల్పించడానికి రాజు సిద్దమే. కానీ హ్యుయాన్‌త్సాంగ్ లక్ష్యం అది కాదు కనుక రాజు చేసిన అభ్యర్థనని నిరాకరిస్తాడు. రాజు ఒత్తడి చేస్తాడు. ప్రతిపాదనని అంగీకరించకపోతే తిరిగి చైనాకి పంపిస్తానని బెదిరిస్తాడు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి పరిస్థితి. తిరిగి స్వదేశానికి పంపబడితే శిక్ష తప్పదు, టర్పాన్ దేశంలో ఉండిపోతే లక్ష్యం నెరవేరదు. ఏం చెయ్యాలి!?  ఆహార పానీయాలు తీసుకోవడం మాని వేశాడు. మూడు రోజుల పాటు కటిక ఉపవాసం చేశాడు. తనని ముందుకు పోనీయక పోతే అలానే ప్రాణత్యాగం చేస్తానని రాజుని తిరిగి బెదిరించాడు. మొండివాడు రాజు కంటే గొప్ప అనే సామెత నిజమయ్యింది. హ్యుయాన్‌త్సాంగ్‌కి ఉన్ని బట్టలు, ప్రయాణానికి కావలసిన ధనం ఇచ్చి టర్పాన్ రాజు సాదరంగా సాగనంపాడు. 
హ్యుయాన్‌త్సాంగ్ ప్రయాణించిన మార్గం
ఇలాంటి ఎన్నో కష్టనష్టాలని ఎదుర్కొని హ్యుయాన్‌త్సాంగ్‌ కాశ్మీరు చేరాడు. కనౌజ్‌ని రాజధానిగా చేసుకొని హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలం అది. బుద్ధుడు జన్మించిన కపిలవస్తు నగరం చూశాడు, బుద్ధ గయని సందర్శించాడు, సారానాథ్ వెళ్ళాడు... ఇంకా గౌతమబుద్ధుడు నడిచిన ప్రదేశాలెన్నో తిరిగాడు. ఆంధ్రదేశం మీదుగా ధ్రావిడ దేశానికి వెళ్ళాడు. చివరగా నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య శీలభద్రుడు అనే ఆయన దగ్గర చాలా కాలం విద్యను అభ్యసించాడు. భాతదేశంలో వివిధప్రాంతాల గురించి, ప్రజల ఆచార వ్యవహారాల గురించి, జీవన విధానం గురించి వివరంగా రాశాడు. ఆ కాలం గురించి ఇప్పటికీ  హ్యుయాన్‌త్సాంగ్ రాసిన యాత్రా విశేషాలే  ప్రామాణికమైన చారిత్రక ఆధారంగా ఉన్నాయి. సుమారు పదహారు సంవత్సరాల తరువాత, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆరువందల పైచిలుకు బౌద్ధ గ్రంధాలు, బుద్ధుని గంధపు ప్రతిమలు, కొన్ని తదాగతుని వస్తువులు తీసుకొని చైనా వెళ్ళాడు. దేశంలో హ్యుయాన్‌త్సాంగ్‌కి అపూర్వ స్వాగతం లభించింది. రాజాస్థానంలో ఉన్నత పదవిని అలంకరించమని చక్రవర్తి అతనిని కోరాడు. కానీ హ్యుయాన్‌త్సాంగ్ తన వెంట తీసుకొనిపోయిన గ్రంధాలను  జీవితాంతం చైనా భాషలోనికి అనువదిస్తూ గడిపాడు.

రాజ పదవిని స్వీకరించి ఉంటే హ్యుయాన్‌త్సాంగ్ జీవితం అష్టైష్వర్యాలతో నిండిపోయి వుండేది. కానీ బౌద్ధ గ్రంధాలని అనువాదం చేసి ఒక లెజండ్‌గా జనహృదయాలలో నిలచిపోయి ఉండేవాడుకాదు.

లక్యాన్ని నిర్ణయించుకోవడం (Goal Setting)
దాన్ని చేరుకోవడానికి కష్టపడి ప్రయత్నించడం (Hard Work)
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే సాగడం (Perseverance)
అంతిమంగా లభించే చిన్న చిన్న ఫలితాలకు ప్రలోభ పడక పోవడం (Never to Swerve From Main Goal)
విజయాన్ని అందుకోవడం (Attaining Success)

విజయపు దారిలో ఈ ఐదు స్థాయిలకీ హ్యుయాన్‌త్సాంగ్ జీవితం ఒక చారిత్రక ఉదాహరణ.



© Dantuluri Kishore Varma

Monday 17 November 2014

ఆకాశ దీపం

కాకినాడ నుంచి యానంవైపు వెళ్ళే దారిలో ఉన్న జామికాయల తూముకి ఓ ఫర్లాంగ్ దూరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామివారి ఆశ్రమం, ఆశ్రమంలోనే కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయమూ ఉన్నాయి. సాయంత్రం ఆరు అవుతూ ఉండగా ఆశ్రమంలో గాలిగోపురం దాటి గుడిలోనికి ప్రవేశించాం. చలికాలం కనుక అప్పుడే చీకటి పడిపోయింది. గుడి  ప్రశాంతంగా ఉంది. ఓ వైపు దేవాలయ సిబ్బంది కొందరు మట్టి ప్రమిదలలో వొత్తీ, నూనే వేసి వచ్చిన భక్తులకి దీపారాధన కోసం ఇస్తున్నారు. రంగమండపం వెనుకఉన్న పెద్ద హాలులో విద్యార్థులు వేదం చదువుతున్నారు. అది వింటూ ప్రదక్షిణ పూర్తిచేసి సరాసరి దర్శనానికి వెళుతూ ఉండగా, `ఆకాశ దీపం వెలిగిస్తున్నారు. చూసి వెళ్ళండి,` అన్నారు ఎవరో. పురోహితులు మంత్రోశ్చారణచేస్తూ  ఆకాశదీపం వెలిగించి, చుట్టూ రంద్రాలున్న గుండ్రని ఇత్తడి ఉట్టిలో పెట్టారు. తరువాత ప్రమిదలు పట్టుకొని వేచి ఉన్న సుమారు పాతిక మంది భక్తులు వరుసగా వాటిని వెలిగించి ఆ ప్రదేశాన్నంతా దీపపు కాంతులతో శోభాయమానంగా మార్చేశారు. అందరూ `గోవిందా, గోవింద` అని చెపుతూ ఉండగా ఆకాశ దీపం కప్పీ మీద తాడు సహాయంతో నిటారుగా ఉన్న స్థంభం పైకొసకు వెళ్ళింది. గర్భగుడిలోనుంచి పదకొండు అడుగుల ఎత్తైన వేంకటేశ్వరుడు మందస్మితంతో బయట జరుగుతున్న కార్యక్రమాన్ని గమనిస్తున్నట్టు ఉన్నాడు.


చిరు మంచుతో కూడుకొన్న శరత్కాలపు రాత్రి, చమురు దీపాల వెలుగుల్లో కిరణాలుగా సాగుతున్న ఆధ్యాత్మికత, విత్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతున్న దేవదేవుడు, గడియారాన్ని మరచిపోయి ఆగిపోయిన కాలం..  బయట జరుగుతున్న విషయాలని ఏదోలా వ్యక్తం చెయ్యవచ్చు. మరి మనసులోనో, మెదడులోనో ముద్రపడే ఇలాంటి దివ్యమైన  అనుభూతులని ఎలా చెప్పగలం! 
© Dantuluri Kishore Varma

Sunday 16 November 2014

మిగిలిన కథలు..

దియేటరు దాటి కొంచం ముందుకు వెళ్ళగానే అప్పుడే చేసిన నేతి సున్నుండల వాసన వచ్చేది. "తాచుపాము ఉన్నచోట ఇలాంటి వాసన వస్తుంది," అని బండి వాడు చెప్పేవాడు. ఊరు నిద్రపోతుండగా రెండు సరిహద్దులకీ మధ్య ఉన్న కంకర గోతులు అనే ప్రదేశంలో ఉండే మర్రి చెట్టు దాటుకొని మావూరు తిరిగి వెళ్ళాలి. ఆ మర్రిచెట్టుమీద దెయ్యాలు ఉంటాయని చెప్పుకొనేవారు....

ఒక్కసారి రాసింది పదిసార్లు చదివినదానితో సమానం అంటారు. అలాగే ఒక్కసారి వివరించి చెబితే పదిసార్లు రాసినదానితో సమానం అన్న సత్యం నాకు ఇక్కడే తెలిసింది. ఒక డిబేట్ కోసం తయారయినప్పుడు విషయం మనకి మాత్రమే అర్ధమైతే సరిపోదు, దానిని ఎదుటి వాళ్ళు మెచ్చేలా చెప్పాలి - దీనినే  డ్రైవింగ్ ద పాయింట్ హోం అంటారు.

ముఖ్యంగా బ్యాటింగ్ మీదే కాన్సెంట్రేషన్ అంతా. ఎందుకంటే,  బౌలింగ్ అంత ఏమీ నేర్చుకోవలసిన విషయం కాదని గొప్ప నమ్మకం. ఫేస్ అంటే ఎంతవీలయితే అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి వెయ్యడం. నీరసంవచ్చి దూరంపరిగెత్తలేనప్పుడు వేసిది స్పిన్- As simple as that!


ఒక్కో రోజు గోదావరి గట్టుమీద కూర్చుని బ్రిడ్జ్‌మీదనుంచి పోతున్న రైళ్ళని, వెలుగుతున్న విద్యుత్ లైట్లని, లంగరువేసి ఉన్న పడవల్నీ, ఊగుతున్న మర్రి చెట్టు ఆకుల్నీ, ఒడ్డుని తాకుతున్న అలల్నీ చూస్తూఉంటే గంటలు  నిమిషాలు అయ్యేవి.  మంచుకురుస్తున్నప్పుడు రోడ్డు వెంబడి నడవడం, ఎండ మండిపోతున్నప్పుడు చెట్టునీడల్లో సైకిలు మీద పెట్టి చీరికలుగా కోసి అమ్ముతున్న పుచ్చకాయ ముక్కలో, బొప్పాయి ముక్కలో తినడం, స్కూటర్‌మీద కొవ్వూరు వెళుతున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ దాటడం, పేపరుమిల్లు వైపు వెళ్ళే దారిలో పాతపుస్తకాల షాపు, దామెర్ల రామారావు ఆర్టు గేలరీ, లాలా చెరువు దగ్గర దాబాలో రోటి - దాల్ కాంబినేషన్.... రాజమండ్రీ అంటే పంచేద్రియాలూ ప్లస్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతాయి.

పొయ్యిముందు కూర్చొన్న మనిషి చేస్తున్న పనిని చూస్తుంటే కుతూహలం పెరిగిపోయింది. దగ్గరకు వెళ్ళి నేను కూడా చేస్తానన్నాను.  `నువ్వు చెయ్యలేవు కానీ, కావాలంటే ఇది తిను,` అని కుండమీద అప్పుడే తీసిన రేకుని చేతిలో పెట్టారు. పలుచటి ఉల్లిపొరలా ఉంది. రుచి అమోఘం! అదిగో సరిగ్గా అప్పుడే ఆపదార్థంతో ప్రేమలో పడిపోయాను - ఇప్పటికీ హింకా.. తేరుకోలేదు.

ఎవరో పై కండువాగా వేసుకొనే తెల్ల తువ్వాలు చుట్టబెట్టి ధర్మయ్యకోసం బహుమానం తెచ్చారు. `ఇదిగోరా ధర్మయ్యా వొండించుకో, మంచి చేపలు,` అని మూటని వాడి చేతిలో పెట్టారు. ఏరకం చేపలో తెలుసుకోక పోతే వాడికి మనసు మనసులో ఉండదు. వెంటనే మూట ముడి విప్పాడు. లోపలినుంచి `బుస్` మంది. ఇంకేముంది, దాన్ని అక్కడే పారేసి పరుగో, పరుగు! 

ఇవన్నీ జ్ఞాపకాల తునకలు. మొదటినుంచీ ఈ బ్లాగ్‌లో రాసుకొంటూ వచ్చినవి. పూర్తి కథలు చదవాలనుకొంటే లింక్‌లు క్లిక్ చెయ్యండి. 

Dantuluri Kishore Varma

Friday 14 November 2014

ఎంత ఎదిగినా మనలో చిన్నప్పటి మనం అలాగే ఉంటాం!

నిశ్చల తటాకంలో ప్రతిబింబించేలాంటి ముచ్చటైన జ్ఞాపకాలు 
జీవనదిలో అలల్లా తరంగితమయ్యే ఆహ్లాదకర జ్ఞాపకాలు
సముద్రంలో కెరటాల్లా విరిగిపడే ఉద్వేగపు జ్ఞాపకాలు
జలపాతంలో ఉరికురికిదూకే ధారల్లాంటి ఉన్మత్త జ్ఞాపకాలు... 
మీకున్నాయా?
నాకున్న కొన్ని జ్ఞాపకాలు, మీ జ్ఞాపకాల్లాంటివే అయ్యి వుండవచ్చు!  

  

 చిన్నప్పటి తీపిజ్ఞాపకాలు 
మన మదిలో మాటి మాటికీ మెదులుతూనే ఉంటాయి.
అవంటే మనందరికీ చెప్పలేనంత ఇష్టం
`నా చిన్నప్పుడేం జరిగిందో తెలుసా?` అని ఎవరైన చెప్పడం మొదలుపెడితే
చెవులప్పగించి వినని వాళ్ళు అరుదుగా ఉంటారు. 
`నాకూ ఇలాగే జరిగింది సుమా!` అని ఆశ్చర్యపోవడం కూడా సహజమే.
చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ రోజు వాళ్ళ, వాళ్ళ చిన్ననాటి ఫోటోలు 
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పెట్టి చాలా మంది మురిసి పోయారు.
కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి అప్‌లోడ్ చేశారు. 
ఎంత ఎదిగినా మనలో చిన్నప్పటి మనం  అలాగే ఉంటాం!

Dantuluri Kishore Varma

Thursday 13 November 2014

కమనీయ కల్పన

`ఇంగ్లాండ్‌లో షేక్‌స్పియర్ పేరున ప్రతీసంవత్సరం సాహితీ పండుగలు నిర్వహిస్తారు. మనదేశంలో కూడా కాళిదాసు పేరుమీద అటువంటివి జరపవచ్చు కదా?` అని ఒకాయన సందేహాన్ని వెలిబుచ్చాడు. కాళిదాసుని ది షేక్‌స్పియర్ ఆఫ్ ఇండియా అంటారుగానీ, షేక్‌స్పియర్‌నే ది కాళిదాసా ఆఫ్ ఇంగ్లాండ్ అనాలని కూడా అభిప్రాయపడ్డాడు. అతని వాదనలో  పూర్తి న్యాయం ఉంది. షేక్‌స్పియర్ క్రీస్తుశకం పదహారో శతాభ్దానికి చెందినవాడు; కాళిదాసు క్రీస్తుపూర్వం వాడని చాల మంది అంటారు - షేక్‌స్పియర్ కంటే చాలా పూర్వంవాడు. సంస్కృతంలో అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం అనే అద్భుతమైన నాటకాలు రచించాడు. రఘువంశం, కుమారసంభవం, ఋతుసంహారం, మేఘదూతం అనే కావ్యాలు రాశాడు. ఉపయోగించిన భాష, వాడిన అలంకారాలు, కథను నడిపించే విధానం, ప్రకృతి వర్ణనలు అనన్యసామాన్యం అని విజ్ఞులు అంటారు. ఆయన కవికులగురువుగా ప్రశిద్దుడు. సంస్కృతం ప్రపంచభాషగా ఉండి ఉంటే కాళిదాసుకి విశ్వకవి చక్రవర్తిగా ఖ్యాతి వచ్చి ఉండేదేమో!

ఈ మధ్యన మేఘదూతం చదవగలిగిన అవకాసం నాకు వచ్చింది.

Painting by Vasudeo Kamath
చిత్రకారుల ఊహలకి రెక్కలు తొడగగలిగిన పదాల అల్లిక కాళిదాసు సొంతం. నీకెలా తెలుసు అంటారేమో! మేఘదూతం - దీనినే మేఘసందేశం అనికూడా అంటారు - కావ్యంలో కథానాయకుడు ఒక యక్షుడు. అలకాధిపతి కుబేరుని కొలువులో ఉద్యోగి. యక్షుని భార్య అతిలోకసౌందర్యవతి. ఆమె ద్యాసలో పడి కుబేరుడు చెప్పిన పనిని యక్షుడు అలక్ష్యం చేస్తాడు. దానితో కోపగించిన కుబేరుడు యక్షుడికి ఒక సంవత్సరం పాటు దేశబహిష్కారం విదిస్తాడు. కథాప్రారంభానికి ఆతని బహిష్కరణ శిక్షలో ఎనిమిది నెలల కాలం గడుస్తుంది. యక్షుడు సీతారామలక్ష్మణులు వనవాసం సమయంలో గడిపిన చిత్రకూట పర్వతం దగ్గర ఉంటాడు. అది ఆషాడమాసం ప్రారంభం. ఒక నల్లని వర్షమేఘం రామగిరిమీద నిలిచి ఉంటుంది. `మేఘమాశ్లిష్టసానుం` అంటే సానువుని కౌగలించుకొన్న మేఘం `కంఠాశ్లేషప్రణయిని` అంటే ఆతని కంఠం చుట్టూ తామరతూడుల్లమంటి చేతులతో పెనవేసిన ప్రణయిని ఆలింగనం జ్ఞాపకం చేస్తుంది. మేఘుడు యక్షుడికి దంతాలతో రాళ్ళను పైకి వెదజల్లుతున్న మత్త గజంలా కనిపిస్తున్నప్పటికీ ఆతనిని సమీపించి తన భార్య అయిన యక్షిణికి రాయబారం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరతాడు. ఈ సన్నివేశ వర్ణనకి వాసుదేవ కామత్ అనే చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూడండి. ఈయన లాగే ఇంకా చాలామంది చిత్రకారులు కాళిదాసు కవితలకి బొమ్మలు గీశారు.

జపాన్‌లో తొమోమీ శాటో అనే ఆవిడ సంస్కృతం నేర్చుకొని మేఘదూతంలో శ్లోకాలను చక్కగా పైకి చదివింది. ఇంగ్లీష్‌లో ఇంకా జపానీస్‌లో వివరణ రాసింది. మేఘుడు ప్రయాణించబోయే దారిలో అగుపించబోయే ఎన్నో ప్రకృతి అందాల్ని యక్షుడు వర్ణిస్తాడు. శిరీష పుష్పాలు ఎలా వుంటాయి? మాధవీ లతలు!? పోనీ దేవదారు వృక్షాలు!!?  చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉండే పువ్వుల గురించి కాళిదాసు చేసిన వర్ణనలకి తొమోమీ బొమ్మలు గీసింది. వాటన్నింటినీ తన బ్లాగ్‌లో ఉంచింది. కావాలంటే ఇక్కడ చూడండి.

కాళిదాసు కమనీయ కల్పనల్ని ఆస్వాదించడానికి సంస్కృతం నేర్చుకోలేం. ఇంగ్లీషులోకో, తెలుగులోనికో అనువదించిన రచనలతోనే సంతృప్తి చెందవలసిందే. మేఘదూతంలో ప్రతీ పద్యాన్నీ తెలుగు లిపిలో రాసి, వివరణ ఇచ్చిన, ప్రతీ పదానికీ అర్థాన్ని చెప్పిన పుస్తకం ఒకటి అదృష్టవశాత్తూ నాకు దొరికింది. `ప్రతీ పుస్తకమ్మీదా చదవగలిగే ప్రాప్తమున్నవాడి పేరు రాసి ఉంటుందని,` ఎవరో తమాషాకి చెప్పినట్టు ఈ పాత పుస్తకమ్మీద నా పేరు కూడా రాసి ఉందేమో! ఇది చదివి కాళిదాసు కవిత్వంతో ప్రేమలో పడిపోయా.  వాసుదేవ్ కామత్‌లా బొమ్మలు వెయ్యలేకపోయినా, తొమోమీ శాటోలా సంస్కృతం నేర్చుకొనే వోపిక లేకపోయినా కాళిదాసు కమనీయ కవితా కల్పనల్లో చిక్కుకోకుండా ఉండలేం.  

© Dantuluri Kishore  Varma 

Sunday 9 November 2014

యాదృచ్ఛికమా!?

ఆంధ్రభూమిలో `ఈ వారం కథ` అనే శీర్షికతో ప్రతీవారం ఒక్కో కథ వేస్తారు. ఈ రోజు వాటి ఆర్కైవ్స్ చూస్తూవుండగా `ముష్టివాడి నవ్వు` అనే పేరుతో ఉన్న కథ  నాలో ఏవో జ్ఞాపకాలు కదిలించింది. జ్ఞాపకాలు అన్నాను కదా అని ఏవో సీరియస్ ఫ్లాష్‌బ్యాక్‌లు చెప్పి తల బొప్పిక కట్టిస్తానేమో అని భయపడకండి. ఒక విషయాన్ని మీతో క్లుప్తంగా చెబుదామని ఇది రాస్తున్నాను. ఈ కథ టైటిల్ నన్ను ఆకర్షించడానికి కారణం `అదే నవ్వు` అనే పేరుతో ఈ బ్లాగ్‌లో నేను ఒక కథ రాసి ఉండడమే! `ఈ రెండు  పేర్లలో సారూప్యం ఉన్నట్టే, కథల్లో కూడా పోలికలు ఉండివుంటాయా?` అనే కుతూహలంతో దాన్ని చదివాను. 

`ముష్టివాడి నవ్వు` అనే కథని ఇక్కడ చదవండి. ప్రచురించిన తేదీ 27.09.2014. 
`అదే నవ్వు` కథ - పై తేదీకి సుమారు 17 నెలల ముందు నేను రాసింది. 

చిత్రంగా రెండింటిలోనూ స్టోరీ లైన్ ఒక్కటే! - ఒక ముసలివాడి/ముష్టివాడి నవ్వుని చూసి చీదరించుకొనే వ్యక్తిని ఒక ప్రాణాపాయం నుంచి వాడే రక్షించడం. 

యాదృచ్ఛికమా!?

Dantuluri Kishore Varma


వ్యాఖ్యల్లో లింక్

బ్లాగర్‌లో టపాలు రాసేటప్పుడు మధ్యమధ్యలో పదాలనుంచి, ఫోటోలనుంచి వేరే వెబ్‌సైట్లకి, వీడియోలకి హైపర్‌లింక్‌లు కలపడం సులభం. కానీ కామెంట్లలో ఆవిధంగా లింక్ ఇవ్వడం ఎలానో తెలిసేది కాదు. చాలా సార్లు రెఫరెన్స్ ఇవ్వడంకోసం కొంతమంది సంబంధిత విషయం యొక్క యూ.ఆర్.ఎల్ ని కామెంట్లలో  యధాతదంగా ఇస్తుంటారు. దాని నుంచి బ్యాక్‌లింక్ వెళ్ళదు. కాబట్టి కాపీ చేసుకొని క్రొత్త ట్యాబ్‌లో పేస్ట్‌చేసి వివరం చూడవలసిందే. సహజంగానే ఇది కొంత చికాకు కలిగించే విషయం. ఈ తలనొప్పి లేకుండా టపాల్లో ఇచ్చినట్టు, వ్యాఖ్యల దగ్గర కూడా బ్లాగర్‌వాడు పదాలకు లింక్ కలపగలిగిన తేలికపాటి ఇంటర్‌ఫేస్‌ని ఏర్పాటు చేసుంటే బాగుండునని అనిపించేది. మనతెలుగు బ్లాగర్లలో కొంతమంది కామెంట్లలో హైపెర్‌లింకులు ఇవ్వడం చూసినప్పుడు `ఎలా చేశారా?` అనుకొన్నాను. వాళ్ళు ఉపయోగించిన హెచ్‌టి్ఎంఎల్ కోడ్ ఏమిటో తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. వాళ్ళనే అడుగుదామనుకొన్నాను - అప్పుడు సందర్భం రాలేదు. కానీ, ఈ రోజు తెలుసుకోవలసిన అవసరం వచ్చింది.              

`అడుగడుగునా గుడివుంది` అనే శీర్షికతో చాలా టపాలు రాసి, అన్నింటినీ చేర్చి మనకాకినాడలో బ్లాగ్‌లో ఒక పేజీగా ఏర్పాటు చేశాను. బ్లాగ్ పాఠకుల్లో ఒకరిద్దరు మురమళ్ళ వీరేశ్వరస్వామి దేవాలయం గురించి కూడా రాయమని, అవసరం అయితే ఫోటోగ్రాఫులు అవీ పంపుతామని కామెంట్‌ల ద్వారా తెలియజేశారు. అదెప్పుడో ఓ సంవత్సరం క్రితం జరిగింది. ఈ మధ్య మురమళ్ళ మీదుగా అమలాపురం వెళుతూ వీరేశ్వరస్వామి దర్శనం చేసుకొని, తిరిగి వచ్చిన తరువాత ఈ దేవాలయం గురించి టపా రాశాను.  రాశానని వాళ్ళకు తెలియజేస్తూ కామెంట్‌లో టపాకి బ్యాక్‌లింక్ ఇవ్వాలి. అదీ అవసరం!   దీనికోసం గూగుల్లో వెతికితే పరిష్కారం దొరికింది. మీకు కూడా ఏమైనా ఉపయోగ పడుతుందేమో అని ఇక్కడ ఇస్తున్నాను. 

<a href="http://manakakinadalo.blogspot.in/2014/10/mummidivaram.html">Here</a>

పైన  వీరేశ్వరస్వామి టపా యొక్క యూఆర్ఎల్‌  లింక్‌ ని  Here అనే మాటకి కలపాలి.  ఈ కోడ్ చక్కగా పనిచేసింది. కావాలసినప్పుడు మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. చేయవలసిందల్లా ఎరుపు రంగులో ఉన్నయూఆర్ఎల్‌నీ, Here అనే మాటనీ  మీకు కావలసిన వాటితో రీప్లేస్ చేసుకోవడమే.

మీలో చాలామందికి ఎప్పటినుంచో ఈ విషయం తెలిసి ఉండవచ్చు. నాలా ఇప్పటివరకూ తెలియని వాళ్ళు ఉండవచ్చు కదా! అందుకే....

*     *      * 

బ్లాగ్‌వ్యూస్‌ని ఎప్పటికప్పుడు తెలియజేసే డిజిటల్ స్టాట్ కౌంటర్లో అప్పుడప్పుడూ కనిపించే ఫ్యాన్సీ నెంబర్లు బాగుంటాయి. ఈ రోజు నా బ్లాగ్ మంచి నెంబర్‌ని చూపించింది :)  ఇదిగో ఇలా...   202020 


హ్యాపీ బ్లాగింగ్!

© Dantuluri Kishore Varma

Thursday 6 November 2014

రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం - రాజమండ్రీ

శ్రీ రాళ్ళబండి సుబ్బారావుగారు ఎక్కడెక్కడినుంచో సేకరించిన పురాతన శిల్పాలు, నాణాలు, శాసనాలు, మధ్యయుగంలో ప్రజలు వాడిన పనిముట్లు మొదలైన వాటితో 1967వ సంవత్సరంలో ఆయనపేరు మీదే రాజమండ్రీలో మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంను సందర్శించే ఉద్దేశ్యంతో రాజమండ్రీలో ఉన్న కొంతమంది స్నేహితులని వివరాలకోసం అడిగాను. ఆశ్చర్యకరంగా అది ఎక్కడ ఉందో చెప్పగలిగారు తప్పించి ఎవ్వరూ అంతకుమించి సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోయారు. ఇంటర్‌నెట్‌లో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీకీపీడియాలో రాళ్ళబండి సుబ్బారావుగారి పేరుమీది పేజీయే లేదు!   

ప్రతీ శుక్రవారం మ్యూజియంకి శెలవు అనే సంగతి తెలియదు. దురదృష్టవశాత్తు మేము(నేనూ, నా భార్య శుభా, పిల్లలు శ్రావ్యా, వర్షిత)  రాజమండ్రీ వెళ్ళిన రోజు శుక్రవారం అయ్యింది. అయినాసరే కనీసం బయటినుంచయినా చూద్దామని వెళ్ళాము. రాజమండ్రీ గోదావరి వొడ్డున రాళ్ళబండి సుబ్బారావు గవర్నమెంట్ మ్యూజియం ఉంది. గేటు తెరిచే ఉంది. వాచ్‌మేనో, పనివాడో సరిగా తెలియదుకానీ ఒకవ్యక్తి మాత్రం లోపల ఉన్నాడు. `ఈ రోజు శెలవు బాబూ, రేపురండి,` అన్నాడు. దూరంనుంచి వచ్చామని, బయటినుంచి చూసి వెళ్ళిపోతాం అనీ అన్నాం. కొంచెం తటపటాయించి, `సరే!` అన్నాడు. గేటుమూసేయ్యాలని, తొందరగా చూసి వచ్చేయ్యమని కూడా చెప్పాడు.    

క్రీస్తుశకం పదవ శతాబ్ధం నుంచి పంతొమ్మిదో శతాబ్ధం వరకూ వివిధకాలాకు చెందిన కుమారస్వామి, వినాయకుడు, ఆంజనేయుడు, శ్రీరామపట్టాభిషేకం, భద్రకాళి, పార్వతి, జైన మహావీరుడు, నందులు మొదలైన శిల్పాలు వరండాలో, ఆరుబయటా ఉన్నాయి. పన్నెండవ శతాబ్ధానికి చెందిన నాజూకుగా చెక్కబడిన వేణుగోపాల స్వామి విగ్రహం చాలా బాగుంది. క్యూరేటర్‌కానీ, గైడ్‌కానీ అందుబాటులో ఉంటే సమాచారం వివరంగా తెలుసుకోవడానికి బాగుండుననిపించింది.  
క్రీ.శ. 3వ శతాబ్ధం నాటి బుద్దుడి విగ్రహం ఉంది. బయట ఉంచిన వాటిలో ఇదే అత్యంత పురాతనకాలం నాటిది. లోపల ఇంకా ప్రాచీనమైనవి ఉన్నాయేమో తెలియదు.


మ్యూజియం లోపల పురాతనమైన తాళపత్ర గ్రంధాలు; శాతవాహనులు, కుషాణులు, విజయనగర రాజులు, మొఘలాయిల కాలాల్లో చలామణీలో ఉన్న నాణాలు; ముఖ్యంగా తెలుగు లిపిలో క్రమాణుగతంగా వచ్చిన మార్పులు తెలియజేసే డిస్‌ప్లేబోర్డ్ ఉందట. వాటిని ప్రస్తుతానికి చూడలేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది.   

ఈ మ్యూజియంను కొంచెం అభివృద్ది చేసి, ప్రచారం కల్పిస్తే మన సంస్కృతి, చరిత్ర గురించి తెలుసుకోవాలనుకొనే వాళ్ళకి బాగుంటుంది.  చక్కని టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది.   

ఎప్పుడైనా రాజమండ్రీ వెళ్ళినప్పుడు రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం సందర్శించండి. శుక్రవారం, పబ్లిక్ హాలిడెస్ తప్పించి మిగిలిన రోజుల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ మ్యూజియం తెరిచి ఉంటుంది.
© Dantuluri Kishore Varma

Tuesday 4 November 2014

కాలం కొమ్మన వేలాడుతూ పాతకాలపు జ్ఞాపకాలు..

ఇలాగే చెట్టుమొదలుకి కాడిని ఆనించి కట్టిన గుర్రబ్బండి 
- గూడు ఉన్నది
చిన్నప్పటి దాగుడుమూతలాటల్లో ఫేవరెట్ హైడింగ్ ప్లేస్.
దొంగకి దొరకకుండా ఊపిరి బిగబట్టి 
వొదిగి కూర్చున్నప్పుడు...
బుగ్గన పెట్టుకొని చప్పరించడానికి
చాక్‌లేట్ బిళ్ళో, తాటి తాండ్ర ముక్కో..
ఉంటే ఆట మరింత మజాగా ఉండేది.   
ఆగిపోయిన బండి చక్రం 
రోడ్డువార కొబ్బరి చెట్టుకి జారబెట్టినది
ఏమి చేస్తుందీ అంటే?
జ్ఞాపకాలని కాలంలో వెనక్కి
పరుగులు పెట్టిస్తుంది.  
చిన్నప్పుడు ఎక్కిన బళ్ళు
తిరిగిన ఊళ్ళూ
లయబద్దంగా వినిపించిన గిట్టల చప్పుళ్ళు..   
మాంచి హుషారు మీదున్న కోడెగిత్తల్ని
బరువు తక్కువ ఉన్న ఇలాంటి బండికి కడితే
`పరుగులు తియ్యాలి...
గిత్తలు ఉరకలు వెయ్యాలి,` అని
ఎక్కడికైనా అఘమేఘాలమీద 
వెళ్ళిపోయేవారు... కదూ?
 
కాలాన్ని చక్రంతో పోలుస్తారు. 
ఈ రోజు పైన ఉన్నది
కొంతకాలానికి క్రిందకు వెళుతుంది
అప్పుడు క్రిందకు పోయినది
పైకి రాక తప్పదుకదా?
`మళ్ళీ గుర్రపుబళ్ళ రోజులు తిరిగి వస్తాయా!?`
అన్నటు ఆశగా చూస్తున్నట్టు ఉంది కదూ?
ఈ ఊరిచివర గడ్డిమేస్తున్న ఖాళీ గుర్రం.  
ఎక్కడెక్కడికో వెళుతున్నప్పుడు
కనిపించే ఇలాంటి దృశ్యాలని
నా డిజిటల్ కెమేరాతో క్లిక్‌మనిపిస్తాను.
కాలం కొమ్మన వేలాడుతూ 
ఎప్పుడెప్పుడు రాలిపోదామా
అన్నట్టుండే పాతకాలపు జ్ఞాపకాలు..
గుర్రపు బళ్ళు, బండి చక్రాలు
నెమరేసే గుర్రాలు... ఇక్కడ పంచుకోవడం..
మీ కోసం!
© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!