Pages

Wednesday 31 October 2012

గల్లీ క్రికెట్

ఊరికి ఒకటో, రెండో టెలివిజన్ సెట్లు అంతే. పదిగంటలకి క్రికెట్ మ్యాచ్ అంటే, తొమ్మిదీ యాభైకే ఆన్ చేసేసుకోంటే, తెరమీద డిఫరెంట్ గ్రే షేడుల్లో వెడల్పాటి నిలువు చారలు, గూ))))))))))))) అని ఒక సైరన్ లాంటి మోత. ఇంకా కొద్ది సేపటిలో మ్యాచ్ మొదలవబోతుందని అనౌన్సర్ చెప్పిన వెంటనే గొల్లు మని గోల. పెద్దా, చిన్నా; ముసలీ, ముతకా... గుంపుగా పోగయిపోయిన అందరిదీ ఒకటే ఆత్రుత - `మనోళ్ళు గెలుస్తారా?` అని. మొదటి బంతినుంచీ ఉత్కంఠ! ఫోరుకొడితే కేరింతలు, వికెట్టుపోతే నిట్టూర్పులు. మధ్య మధ్యలో ఆడవాళ్ళు ఇటు తొంగిచూసి `స్కోరెంత?` అని అడగడం.  ఒక మినీ స్టేడియం టీ.వీ. గదిలో వెలిసినట్టు  ఉండేది.

కృష్ణమాచారి శ్రీకాంత్, సునీల్ గవాస్కర్, మహీందర్ అమర్నాథ్, కపిల్దేవ్, వెంగ్సర్కార్, రవిశాస్త్రి, బిన్నీ, మదన్లాల్, కిర్మానీ, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ తెండూల్కర్....ఆ జనరేషన్ హీరోలు. 1983 ప్రూడెన్షియల్ వాల్డ్ కప్ లో  అండర్ డాగ్స్ లాంటి టీముని విజయాలబాట పట్టించిన కపిల్ సేన; 1986 ఫైనల్లో చేతన్ శర్మ వేసిన ఫుల్టాసుని మియాందాద్ సిక్సర్ కొట్టడంతో ఆస్ట్రో ఏషియన్ కప్పు తన్నుకుపోయిన పాకిస్తాన్ - ఆశ నిరాశల చెరొక కొనలు.  మ్యాచ్ చూసిన ఉత్సాహాన్ని మైదానంలో ఆటలోకి తర్జమా చేసుకోవడానికి తహతహ లాడిపోయేవాళ్ళం.

సాయంత్రం అయ్యేకొద్దీ చేతులు దురదలు పెట్టెసేవి. ఎప్పుడెప్పుడు గ్రౌండుకి వెళ్ళిపోయి క్రికెట్ అడేసుకొందామా అని. గ్రౌండ్ అంటే అదేదో పెద్దదికాదు.ఇంటి వెనుక ఖాళీజాగా. క్రికెట్ కిట్ అంటే కొబ్బరిమట్ట, బుర్రటెంక. తర్వాత్తర్వాత చిన్న బ్యాట్, టెన్నీస్ బాల్.  వికెట్లకోసం గోడమీద నిలువుగీతలు, ఇటుకలు లేకపోతే వంకరపుల్లలు. రూల్స్ కూడా చాలా పక్కాగా ఉండేవి. బాల్ గోడకి తగిలితే ఫోర్, ఎగిరెళ్ళి తగిలితే సిక్స్, గోడదాటి పోతే ఔటు. ఫీల్డరు లెగ్ సైడే ఉంటాడు కనుక, బాల్ ఆఫ్ సైడుకి కొట్టకూడదు. బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయించడానికి ఒక పద్దతి ఉండేది. ఒక బుడ్డోడిని ఒంగో బెట్టి, వాడి వీపుమీద అరచేతితో చిన్నగా చరిచి,  కొంచెం చేయ్యి పైకి లిఫ్ట్ చేసి - ఒకటో, రెండో, మూడో... వేళ్ళు తెరచి చూపించి `ఇది ఎవరికి?` అని అడగడం. బుడ్డోడు ఎవరిపేరు చెబితే ఆనెంబరు వాడిదన్నమాట. ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి- తెరిచి చూపించిన వేళ్ళు బుడ్డోడు చూడకూడదు.  ఒకటో  నెంబరు చూపించినప్పుడు వాడు తెలివిగా నీడ చూసి `నాదే` అని చెప్పేసి ఫస్టు బ్యాటింగ్ కొట్టేసే ప్రమాదం ఉంది.

ఎవరైనా `నువ్వు బౌలరువా, బాట్స్ మానా?` అని అడిగితే,  `ఆల్రౌండర్` అని చెప్పుకోవడం భలే గర్వంగా ఉండేది. వాళ్ళు ఎప్పుడైనా వెటకారంగా `అబ్బా!` అంటే; ఆటలో మన ప్రతాపం తెలియని వాళ్ళ అజ్ఞానానికి జాలిపడే వాడిని. `క్రికెట్ ఎలా ఆడాలీ?` అనే పుస్తకం కొనుకొన్నాను ఆసమయం లోనే. ముఖ్యంగా బ్యాటింగ్ మీదే కాన్సెంట్రేషన్ అంతా. ఎందుకంటే,  బౌలింగ్ అంత ఏమీ నేర్చుకోవలసిన విషయం కాదని గొప్ప నమ్మకం. ఫేస్ అంటే ఎంతవీలయితే అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి వెయ్యడం. నీరసంవచ్చి దూరంపరిగెత్తలేనప్పుడు వేసిది స్పిన్- As simple as that! ఒకసారి ఏదో టెస్ట్ మ్యాచ్ లో గవాస్కర్కి ఒక ఓవర్ ఇచ్చారు(అప్పటికే భారత్ విజయం నిశ్చయమైపోయింది). వికెట్ దగ్గరనుంచి స్క్రీన్ వరకు నడచుకొని వెళ్ళిపోయి అక్కడినుంచి పరిగెత్తుకొని వచ్చి బౌల్ చేశాడు. మరొకటి  అబ్దుల్ ఖాదిర్ లాగా వేసి తెగనవ్వించాడు.

స్ట్రెయిట్ డ్రైవ్, స్వీప్, రివర్స్ స్వీప్, పుల్, డిఫెన్స్, హుక్ షాట్,  స్క్వేర్  డ్రైవ్, కట్... బాగా చదువుకొని హై స్కూల్ గ్రౌండుకి వెళ్ళేవాళ్ళం (అప్పటికి పెద్దమ్యాచ్లు ఆడే వయసు వచ్చింది లెండి). మన బ్యాటింగ్ అయిన తరువాత  కానీ తెలిసేది కాదు స్విమ్మింగ్, క్రికెట్, డ్రైవింగుల్లాంటివి పుస్తకాలు చదివి నేర్చుకోలేమని. కానీ ఏమిలాభం? అప్పటికే మన పేరుమీద `డక్` ఉండేది. ఒక్కోసారి కృష్ణమాచారి శ్రీకాంత్ లాగ చెలరేగి పోయేవాడిని - కళ్ళు మూసుకొని   బ్యాట్ ఊపితే ఫోరో, సిక్సో పోవలసిందే! ఇక్కడ మన ప్రతాపం కంటే, బౌలరుకే ఎక్కువ వీర తాడులు వేసుకోవాలి.  

నేషనల్ దూరదర్శన్ Body Line అని ఒక 13 వారాల సీరియల్ ప్రసారం చేసింది. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మేన్ డాన్ బ్రాడ్ మేన్ ని నిలువరించడానికి, అప్పటి ఇంగ్లాండ్ కేప్టెన్ డగ్లాస్ ఉపయోగించిన కుతంత్రం. బౌలర్ బాల్ ని వికెట్ల మీదకి కాకుండా, షార్ట్ లెంగ్త్ గా వేసి శరీరానికి తగిలేలా చెయ్యడం. Body line అంటే జ్ఞాపకం వచ్చింది, కార్క్ బాలుతో క్రికెట్ ఆడుతున్నప్పుడు దెబ్బలు గట్టిగా తగిలేవి. ప్యాడ్లు కట్టుకోకుండా ఆడడం వల్ల మోకాళ్ళ క్రింద గట్టిగా బంతి తగిలితే ఇంచుమించు కార్క్ బాలంత బొప్పికట్టేది. ఇంటర్ మీడియట్ పరీక్షలకు కొన్ని రోజుల ముందు, ఒక మ్యాచ్ ఆడుతూ ఫుల్ టాస్ వేసిన బంతిని హుక్ కొట్టబోయి, అంచనా తప్పడంతో కుడిచేతి చూపుడువేలు గోరు పచ్చడి చేసుకొన్నాను. దానితో బొటనవేలు మధ్యవేలు ఉపయోగించి ఎగ్జాంస్ రాయవలసి వచ్చింది.

క్రికెట్ కబుర్లు చెప్పమంటే ఎవరైనా గంటలకొద్దీ చెప్పగలరు. గల్లీల్లో, బీచ్చుల్లో, ఇంటి ఖాళీజాగాల్లో, మైదానాల్లో...ఆఖరికి డ్రాయింగ్ రూముల్లోనయినా ఈ ఆట ఆడని వాళ్ళు ఎంతమంది? ఈ ఆట మెచ్చనివాళ్ళు ఎంతమంది?
© Dantuluri Kishore Varma 

Tuesday 30 October 2012

హ్యాపీ రీడింగ్ అండ్ హ్యాపీ షేరింగ్!

మంచిదో, చెడ్డదో ఎంచుకొని చదివే అలవాటు పెద్దవాళ్ళకే ఉంటుంది. అంతకుముందు ఊహతెలుస్తూఉన్న కోత్తలో చదవడమంటే చదవడంకోసమే! ఎక్కడ తెలుగు పదాలు కనిపించినా కూడబలుక్కోని చదవడం నాకు బాగా చిన్నప్పుడే ఎలా అలవాటు అయ్యిందో చెబుతాను.

పూర్వకాలపు పల్లెటూర్లలో ఉండే విశాలమైన ఇళ్ళలాంటి ఒకానొక ఇల్లుమాది. ఇంటిముందు పెద్ద గేటు ఉండేది. గేటు అంటే ఇనుప కమ్మెలతో, నగిషిలతో ఉండే ఇప్పటిలాంటిది కాదు. చతురశ్రాకారపు చెక్కఫ్రేముకి ఇనుపరేకుని మేకులతో దిగగోట్టి తయారుచేసింది. సమాంతరంగా ఉండే ఇటువంటి ప్రదేశం మా పక్కఊరిలో ఉండే సినిమా హాలు వాళ్ళకి ఉచితంగా లభించిన ఎడ్వర్టయిజ్మెంట్ హోర్డింగ్ లాంటిది. తత్ఫలితంగా వారానికో, పదిరోజులకో మారే ప్రతీ సినిమా పోస్టరూ మాగేటుమీద తప్పనిసరిగా అంటించవలసిందే. రోజూ స్కూలుకి వెళ్ళి వచ్చేటప్పుడు నలుపు తెలుపుల్లో, అప్పుడప్పుడు రంగుల్లో ఉండే సినిమా పోస్టర్లు చూస్తూ ప్రతీ పదం కూడబలుక్కొని చదువుకొనే వాళ్ళం. కామిక్ పుస్తకాలలో బొమ్మలు చూసుకొంటూ చదవడంలో ఉన్న ఆనందం కంటే కూడా ఎక్కువ ఆసక్తి సినిమా పేరూ, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు తెలుసుకోవడంలో ఉండేది.
ఓపెన్ చేసి ఉన్న గేటు కారుకి వెనుకవైపు కనిపిస్తుంది చూడండి.
కూడబలుక్కోని చదవడం నేర్పించడంలో నాకు మొదటిగురువు మాపొరుగూరి సినిమా థియేటర్ వాళ్ళయితే, రెండవగురువు ఆర్.టి.సి. వాళ్ళు! మావూరు దాటి నాలుగు ప్రక్కఊళ్ళకి నిరంతరం బస్సులు తిరిగేవి. వాటి చుట్టూ అవి ఆగే స్టాపులపేర్లు రాసివుంటే చదవగలిగినన్ని పేర్లు బిగ్గరగా చదివేవాళ్ళం. రాజమౌళీ తీసిన సై సినిమాలో పాటలోలాగ ఏదయినా ప్రయాణం చేసినప్పుడు కనిపించిన ప్రతీ పదాన్నీబఠానీల్లాగ నమిలెయ్యడమే. 

వారం, వారం ఆంధ్రప్రభ వీక్లీ వచ్చేది మా ఇంటికి. అందులో మొదట కార్టూన్లూ; తరువాత క్రమంగా తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్లు చిన్న కథలు, సీరియళ్ళ దాకా చదవడం కొనసాగి, చిట్ట చివరికి కవర్ టూ కవర్ కవరేజ్ స్థాయికి చేరుకొంది. ఆసక్తికరమైన విషయాలూ, ప్రమదావనం, వంటలు మొదలైన ఉపయోగకరమైన శీర్షికలు, సీరియల్సు పత్రికల నుంచి వేరుచేసి బైండ్ చేయించేవారు. అవి అన్నీ మాయింటినిండా పెట్టెల్లో సర్ది ఉండేవి. ఎవరికయినా చదవాలంటే వాటిని తీసుకొని వేళ్ళేవారు.

"ప్రాణాలకి తెగించి పుస్తకాలు చదివే వాడిని," అని గొప్పలు చెప్పుకోవడానికి సరిపోయేలా ఒక సంఘటన జరిగింది.

లైబ్రరీ, పల్లపు వీధి అనే ప్రాంతంలో ఉండేది. ఎత్తైన ప్రదేశంలో ఉండే మా ఇంటి నుంచి అక్కడికి సైకిల్ మీద వెళ్ళాలంటే, తొక్కవలసిన అవసరం లేదు. రోడ్డు వాలులో `ఝామ్మని`దూసుకొని పోవడమే. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర లతో పాటూ, మహా మంత్రి తిమ్మరుసు,  చత్రపతి శివాజీ, దుర్గాబాయి దేశ్ ముఖ్ వంటి చిన్ని చిన్ని జీవిత చరిత్రలు లైబ్రరీలో అందుబాటులో ఉండేవి. వాటి కోసం రోజూ వెళ్ళేవాడిని.  అసలు ఏమి జరిగిందంటే - అప్పటికి నాకు ఇంకా సైకిల్ తొక్కడం సరిగా రాలేదు. ఒకరోజు దాన్ని బయటికి తీసి, పెడల్ తొక్కుకొంటూ లైబ్రరీ వైపుకు బయలుదేరాను. పల్లంలో వేగంగా వెళ్ళిపోతుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. తొక్కడమే అంతంత మాత్రం అంటే ఇక ట్రాఫిక్ రూల్స్ అనేవి లేనే లేవని అర్ధం. ఎదురుగా ప్రియా స్కూటర్ మీద త్రిబుల్సుతో అతికష్టమ్మీద అప్ ఎక్కిస్తున్న ఆసామికి అయ్యగారు (అంటే మనమే) హై స్పీడుగా వస్తున్నారని తెలియదు. మనోడు కంగారుపడి  తప్పించే సరికే డాషిచ్చేసి రోడ్డుప్రక్కన ఉన్న  గోతిలో పడగొట్టేయ్యడం జరిగిపోయింది.
ఆ రోడ్డు ఇదే
`ఒకటే గమ్యం, ఒకటే గమనం ,` అన్నట్టు, స్ప్రింగ్ లాగ లేచి,  8 అంకేలాగ వంగిపోయిన ముందు చక్రాన్నీ, నుదుటి నుంచి కారుతున్న రక్తాన్నీ కూడా గమనించకుండా సైకిల్ ఎక్కేస్తున్న నన్ను చూసిన అప్పటీకే అక్కడ ప్రోగయిపోయిన మావూరి జనాలలో ఒకరు "బండ రాస్కేల్," అని తిట్టి, హాస్పిటలుకి తీసుకొని వెళ్ళి కట్టు కట్టించడంతో ఒక అడ్వంచర్ ముగిసింది. ఎడమ కనుబొమ్మ పైన ఉన్న మచ్చని ఇప్పటికీ చూపించి లైబ్రరీ మచ్చ అని బడాయి చెబుతుంటాను మా పిల్లలకి.

మా అన్న కాలేజీలో చేరినతరువాత టాబ్లాయిడ్ సైజులో ఉండే సితార, మేగజైన్ సైజులో, మంచి క్వాలిటీ పేపరుతో వచ్చే విజయచిత్ర; యండమూరి, మల్లాది నవలలు; విశ్వవిజ్ఞాన దర్శిని  లాంటి పాపులర్ సైన్స్ పుస్తకాలూ విరివిగా అందుబాటులోకి తెచ్చాడు. స్కూల్లో నేర్చుకొన్నది ఎంతో తెలియదు కానీ, ఇలాంటి పుస్తకాలు అన్నీ చదివి జనరల్ ఎవేర్నెస్ కొంత వొంట బట్టింది.
మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిన నవల అంకుల్ శామో, సావిరహేనో సరిగా జ్ఞాపకం లేదుకానీ - దానిలో రాజ్ కృష్ణ అనే ఒక ఇంగ్లీష్ లెక్చరర్ కారెక్టర్ ఇంగ్లీష్ మీద ఇంటరేస్ట్ క్రియేట్ చేసింది. భాషలో చమత్కారాలు, దాని ఉపయోగాలు(ప్రపంచ సాహిత్యం అందుబాటులో ఉండడం లాంటివి) ఆసక్తి కలిగేలా ఈ పాత్రచేత చెప్పిస్తాడు రచయిత. రాబిన్సన్ క్రూసో, గాన్ విత్ ద విండ్, ప్రైడ్ అండ్ ప్రెజుడీజ్ మొదలైన క్లాసిక్స్ నుంచి ఇండియన్ ఆదర్స్ ఆర్.క్.నారాయణ్, టాగోర్, జవహర్లాల్ నెహ్రూ వరకూ; అక్కడినుంచి ప్రస్తుతపు చేతన్ భగత్ వరకూ; నావల్స్ నుంచి ఫిలాసఫీ అక్కడినుంచి సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలవరకూ ఏదయినా ఇంగ్లీష్ లో విరివిగా లభించడంవల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అ సాహిత్యం చదివి ఆనందించడానికి ఒక రచయిత కల్పించిన పాత్ర ప్రభావితం చెయ్యడం పుస్తకాలు చదవడం యొక్క అత్యుత్తమ ఉపయోగం అని నా అబిప్రాయం.

కంప్యూటర్, ఇంటర్నెట్లు అందుబాటులోకి వచ్చినతరువాత లభిస్తున్న వేలకొద్దీ పుస్తకాలు, వెబ్ సైట్లు, ఆన్లైన్ మాగజైన్లు, ముఖ్యంగా బ్లాగులు పుస్తక ప్రియులకి అన్నమయ్య చెప్పినట్టు, "ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపముమరి, ఇదిగాక వైభవము ఇంకొకటి కలదా?"... వీటి వల్ల ఇంకొక అధనపు ఉపయోగం- శోభాడేతోనో, అమితాబ్తోనో, మరిఎవరితోనయినా మన అభిప్రాయాన్ని కామేంట్ గా చెప్పగలగడం. మంచి పుస్తకాన్ని చదివినప్పటి ఆనందాన్ని, ఫీలింగుని మనబ్లాగ్ ద్వారా మిగిలిన వారితో పంచుకోగలగడం....హ్యాపీ రీడింగ్ అండ్  హ్యాపీ    షేరింగ్!
© Dantuluri Kishore Varma

Monday 29 October 2012

అన్నవెంటనే వరాలిచ్చే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి

కాకినాడకి 50 కిలోమీటర్లదూరంలో 5వ నెంబరు జాతీయరహదారి ప్రక్కన, పంపానదికి చేర్చి ఉన్న తూర్పుకనుమలలోని రత్నగిరి అనబడే  కొండమీద వెలసిన శ్రీ సత్యనారాయణస్వామి   భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతి పొందిన దేవుళ్ళలో ఒకరు. ఈయననే అన్నవరం సత్యనారాయణ స్వామి అంటారు. అన్నవరం కొండని రత్నగిరి అని పిలుస్తారు. దీని గురించి కథ ఆసక్తికరంగా ఉంటుంది. పర్వతరాజు మేరువు అనే ఆయనకి ఇద్దరు కుమారులు ఉంటారు. వారిలో పెద్దవాడు బద్రగిరి. బద్రాచలంలో రామాలయం ఈ బద్రగిరిమీదే ఉంది. రెండవవాడు రత్నగిరి. ఆ గిరే అన్నవరం కొండ. బద్రగిరిమీద రాముడు వెలియడం చూసి తనకికూడా అటువంటి అదృష్టం కావాలని పరితపించి, విష్ణువును గూర్చి తపస్సు చేసి, ఆయనని ప్రసన్నం చేసుకొంటాడు. అలా ఈ కొండమీద వెలసిన స్వామే శ్రీ సత్యనారాయణ స్వామి. 

1891లో గోరస, కిర్లంపూడి ఎస్టేటుకి జమీందారుగా ఉన్న శ్రీరాజా ఇనుగంటి వెంకట రామ నారాయణింగారు ఈ దేవాలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. ద్రావిడ నిర్మాణ శైలిలో కట్టిన ఈ ఆలయం రధాన్ని  పోలి ఉంటుంది. రెండు గాలిగోపురాలు, చూట్టూ ప్రాకారం మధ్యలో ప్రధాన ఆలయం ఉన్నాయి. అనంతలక్ష్మీ సమేతుడయిన సత్యనారాయణ స్వామి ఒకవైపున, శివుడు ఒకవైపునా ఉన్న మూలవిరాట్టు శోభాయమానంగా ఉంటుంది. రెండు అంతస్థులుగా ఉన్న ఈ దేవాలయంలో పై అంతస్తులో మూలవిరాట్టు, క్రింది అంతస్థులో కాశీ నుంచి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించిన మహా నారాయణ యంత్రం ఉన్నాయి. 
దేవాలయానికి ముందు వ్రతమండపం ఉంది. శ్రీ సత్యన్నారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల సకల కోరికలూ శిద్ధిస్తాయని చెబుతారు. ప్రతీరోజూ రాష్ట్రం నలుమూలలనుంచి, ఇతరరాష్ట్రాలనుంచీ కూడా ఎందరో దంపతులు ఇక్కడికి వచ్చి వ్రతం చేయించుకొంటారు. వివాహం అయిన వెంటనే వధూవరులు ఈ వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 

అన్నవరానికి సంభందించిన ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడి ప్రసాదం. అన్నవరం ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది. స్వచ్చమైన నెయ్యి, ఎర్ర గోదుమలతో తయారుచేసే ప్రసాదాన్ని ఒక్కసారి తిన్నవాళ్ళు ఎప్పటికీ ఆరుచిని మరచిపోలేరు. అన్నవరంలో మూడుచోట్ల ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి  కొండమీద రామాలయం దగ్గర, కొండదిగువన మెట్లదగ్గర, హైవేమీద మోడల్ దేవాలయం దగ్గర. 

కళ్యాణ మండపాలు ఉన్నాయి. పెళ్ళి ముహూర్తాలు ఉన్న మంచిరోజుల్లో ఎన్నో వివాహాలు రికార్డు స్థాయిలో ఇక్కడ జరుగుతాయి. క్షేత్రపాలకుడైన రాముడిగుడి, వనదుర్గ, కనకదుర్గ ఆలయాలు ఉన్నాయి. గోకులం అనబడే గోసంరక్షణశాల ఉంది. ప్రధాన ఆలయానికి ఉత్తరంవైపున ఫలబా యంత్రం (సన్ డయల్) ఉంది. 1943లో రాజమండ్రీ వాస్తవ్యులు శ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు సన్‌డయల్‌ని డిజైన్ చేసి కట్టారు. దీని సహాయంతో సూర్యుడి నీడను బట్టి సమయాన్ని చెప్పవచ్చు.
అన్నవరం రైల్వే స్టేషన్ విజయవాడ, విశాఖపట్టణం రైల్వే లైన్‌లో ఉంది. రాజమండ్రీ, కాకినాడలనుంచి సుమారు ప్రతీ పదిహేను నిమిషాలకీ ఒక్కొకటి చొప్పున్న అన్నవరం బస్సులు ఉంటాయి. కొండమీదకి మెట్లదారి, వాహనాలు వెళ్ళడానికి, క్రిందకిదిగడానికి రెండు వేరు వేరు రహదారులు ఉన్నాయి. భక్తులను కొoడపైకి తీసుకొనివెళ్ళడానికి బస్సులు ఉన్నాయి. పైకి వెళుతున్నప్పుడు కొండదిగువున జలకళతో పంపానదీ, దానిపైన నిర్మించిన రిజర్వాయర్, పచ్చటిప్రకృతీ ఆహ్లాదకరంగా ఉంటాయి. 
కొండపైన వసతికి దేవస్థానం సత్రాలు, గెస్ట్‌హౌస్‌లు; భోజనానికి కేంటీన్లు ఉన్నాయి.  దేవస్థానం యొక్క నిత్యాన్నదానం కూడా ఉంది. 
అన్నవెంటనే వరాలిచ్చే స్వామి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి.

© Dantuluri Kishore Varma

Friday 26 October 2012

గోల్డెన్‌కార్

టాటా నానో కారు, టాటా గోల్డ్‌ప్లస్ లకు ప్రచారం చెయ్యడానికి నానో కారుని పూర్తిగా బంగారంతో తయారుచేసి దేశవ్యాప్తంగా ప్రదర్శించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో(అప్పటకి నేను ఈ బ్లాగ్ మొదలుపెట్టలేదు) కాకినాడలో కొన్నిరోజులు ఈ కారు ప్రజలకు కనువిందు చేసింది. 

80 కేజీల 22 క్యారెట్ల బంగారం, 15 కేజీల వెండి, విలువైన రాళ్ళతో – 14 రకాలైన తయారీ పద్దతులను మేళవించి ఈ అత్యంత ఖరీదైన గోల్డ్ ప్లస్ నానో కారుని తయారుచేసి, రతన్ టాటా చేతులమీదుగా సెప్టెంబర్ 2011లో ఆవిష్కరించారు. దీనిఖరీదు సుమారుగా 25 కొట్లు ఉండవచ్చని అంచనా. 

అప్పుడు నేను తీసిన వీడియో.... 



© Dantuluri Kishore Varma

Thursday 25 October 2012

కోరుకొండ

విష్ణుద్వేషి ఐన హిరణ్యకశిపుడు నరుడిచేతకానీ, మృగంచేతకానీ; రాత్రికానీ, పగలుకానీ; నేలపైనకానీ, ఆకాశంలోకానీ; ఏ ఆయుదం చేతకానీ సంహరించబడకుండా ఉండాలని వరం పొందుతాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ భక్తుడు. అతడిని తండ్రినుంచి రక్షించడానికి రాత్రీపగలూకాని సాయం సంధ్యవేళలో, సగంమృగంగా, సగంమనిషిగా అవతరించి, గడపమీద కూర్చొని, హిరణ్యకశిపుడిని తనవొడిలో పెట్టుకొని, పదునైన గోళ్ళతో సంహరించిన ఉగ్రనరసింహుడికి అడుగడుగునా గుడులున్నాయి. వాటిలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా ప్రాచీనమైనది. కోరుకొండ కాకినాడనుంచి 60 కిలోమీటర్లు, రాజమండ్రీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండమీద వెలసిన లక్ష్మీనరసింహ స్వామి శాంతమూర్తి.  సముద్రమట్టానికి 120 మీటర్ల ఎత్తులో దేవాలయం ఉంది. సుమారు 700 మెట్ల మీదుగా పైకి వెళ్ళాలి.

కోరుకొండ క్షేత్రంలో రెండు ఆలయాలు ఉన్నాయి. కొండ దిగువన ఒకటి, పైన ఒకటి. పైన స్వయంభూగా వెలసిన మూర్తి. ఈ  విగ్రహం కేవలం ఒకటిన్నర అంగుళాలు మాత్రమే ఉంటుంది. క్రీస్తుశకం 12వ శతాబ్ధంలో రెడ్డిరాజులు ఈ దేవాలయం నిర్మించారు. విశిష్ఠాద్వైతాన్ని ప్రభోధించిన రామానుజుని ప్రధాన శిష్యుడు, తమిళనాడులోని అతి ప్రాచీనమైన  శ్రీరంగపట్టణం దేవాలయంలో అప్పటి వైష్ణవ ప్రధాన అర్చకుడిగా ఉన్న  పరాశర్ భట్నాగర్ని  ప్రత్యేకంగా కోరుకొండ తీసుకొనివచ్చి ప్రతిష్ఠ చేయించారు.



మెట్లు ఎక్కుతున్నప్పుడు చుట్టూ ప్రకృతి సోయగం, క్రింద ఊరిలో నుంచి అగ్గిపెట్టెల్లా కనిపించే ఇళ్ళు, చల్లటి మలయ మారుతం, ఎగిరివచ్చే రంగురంగుల సీతాకోక చిలుకలు, చెంగు చెంగున చెట్లు ఎక్కే ఉడుతలు... వి కెన్ హేవ్ ప్లెజంట్ ఎక్స్‌పీరియన్స్. 

కొండ మీద చిన్నగుడి - నాలుగు వైపులా రాతి గోడలపైన అద్భుతంగా చెక్కబడిన శిల్పాలు చుట్టు ఉన్న ప్రకృతితో పోటీ పడుతున్నట్లు ఉంటాయి. ఎన్నో పురాణ ఘట్టాలు రాళ్ళ మీద ప్రాణం పోసినట్లు మలిచారు.

నర్తకి
కర్నాటకాలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని చెక్కిన శిల్పి జక్కన్న గురించి కథలలో విన్నాం, పుస్తకాలలో చదివాం, జక్కన్న లాంటి ఎంతో మంది శిల్పులు భారతదేశంలో ఆసేతుహిమాచలమూ దేవాలయాలలో తమకళా నైపుణ్యాన్ని ఉపయోగించి బండరాళ్ళని సుందరమైన ఆకృతులుగా మలచారు. అందమైన లతలని, దేవతామూర్తుల ఆకారాలని, జంతువులని, పక్షులని, పురాణగాధల్ని, కళల్ని, శృంగారాన్ని... లలిత లలితంగా చెక్కి ప్రాణప్రతిష్ఠ  చేశారు.   అయితే వారెవరికీ గుర్తింపులేదు. శిల్పుల చేతిలో సజీవాకృతి పొందిన అందాలను చూసి, నిబిడాశ్చర్యంతో `ఇవన్ని చెక్కినది ఎవరో!` అనుకొంటాం.

అందమైన చిత్రాన్ని చూసినప్పుడో, శ్రావ్యమైన సంగీతాన్ని విన్నప్పుడో ఆనందం కలగడం సహజం. ఇది సహజ ప్రవృత్తి. అలాకాకుండా చిత్రాన్ని ఎలా గీశారు, రంగులేమిటి; ఈ పాట ఏ రాగంలో ఉంది, సాహిత్యం ఏమిటి, ఉపయోగించిన వాయిద్యాలు ఏమిటి...? లాంటి పరిశీలనతో  ఆనందం మరింత పెరుగుతుంది. దీనిని విమర్శనాత్మక ఆనందం అని పిలవచ్చుననుకొంటాను - ఇది హృదయంతోనూ, మెదడుతోనూ కూడా ఆనందించడం. చిత్రాలని చూడటానికి ఆర్టుగేలరీలకి, ఎగ్జిబిషన్లకి వెళ్ళడం; సంగీతాన్ని ఆస్వాదించడానికి కచేరీలకు వేళ్ళడం ఎలాగో శిల్పాలని చూడాలంటే మ్యూజియంలకో, దేవాలయాలకో వెళ్ళాలి. మన చుట్టుపట్ల ఉన్న పురాతనమైన రాతితో నిర్మించిన దేవాలయాలను సందర్శించినప్పుడు కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం చేసుకొన్నా, కళ్ళుతెరుచుకొని శిల్పసంపదని చూడాలి.
రామాయణగాధ
మరొక వైపు కొండదిగువన ఆకుపచ్చ తివాచీ పరచినట్టున్న పంట పొలాలు. తామరపువ్వులతో నిండిన ఒక సుందరమైన తటాకం. దాని మెడ చుట్టూ నెక్లెస్ పెట్టినట్టు ఒంపుతిరిగిన తారురోడ్డు. రాత్రంతా అడవిలో తిరిగి అలసిపోయిన ఏనుగుల గుంపు ఉదయపు పొగ మంచులో   విశ్రాంతి తీసు కొంటున్నట్టు అక్కడక్కడా కొండలు - ఏడువందల మెట్లు ఎక్కి వచ్చిన శ్రమకి తగిన ప్రతిఫలం దక్కినట్టే.


ఇక్కడ ఉగాది, శ్రీకృష్ణ జన్మాష్ఠమి, దసరా పండుగలు ఘనంగా చేస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలూ, కళ్యాణోత్సవాలు చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా రథయాత్ర జరుగుతుంది. 

కొండపైన దేవాలయం ఉదయం తొమ్మిది గంటలకి కానీ తెరవరు. మళ్ళీ సాయంత్రం 4 లేదా 5 గంటలకి తెరుస్తారు. రెండుపూటలా కేవలం ఒక అరగంటో, గంటో తెరిచి ఉంచుతారు. పైకి వెళ్ళేముందు. సమయాలు తెలుసుకొని వెళ్ళడం మంచిది. మోకాళ్ళు నెప్పులు, బీ.పీ. లాంటివి ఉన్న పెద్ద వాళ్ళు మెట్లు ఎక్కడం కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే మెట్ల వెడల్పు తక్కువగా ఉంటుంది; ఒక్కొక్క చోట చాలా నిట్టనిలువుగా ఉంటాయి. కొండమీద కోతులు కూడా ఎక్కువే. మీ చేతిలో ఏవయినా అరటి పళ్ళు, కొబ్బరిచిప్పలు ఉంటే అవి లాక్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఒకరో, ఇద్దరోగా కాకుండా ఇంకెవరయినా భక్తులు కూడా ఉంటే కలసి వెళ్ళడం శ్రేయస్కరం. మన చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వారాంతంలో సరదాగా జాలీ ట్రీప్ వెళ్ళవచ్చు. హేపీ విజిటింగ్!


© Dantuluri Kishore Varma

Wednesday 24 October 2012

ఉత్తర శబరి - రాజమండ్రీ అయ్యప్ప దేవాలయం

రాజమండ్రీ రైలు పట్టాలకీ, గోదావరి నదికీ మధ్యలో గౌతమి ఘాట్ మీద పూర్తిగా రాతితో నిర్మించిన అయ్యప్ప దేవాలయం ఉంది.  దీనిని ఉత్తర శబరి అని పిలుస్తున్నారు.

దీని నిర్మాణం గతసంవత్సరం మార్చిలో పూర్తయ్యింది. సుమారు అయిదున్నర ఏళ్ళ పాటు కట్టడపు ప్రతీ స్థాయిలోనూ ఎంతో నిబద్దతను కనబరుస్తూ పని పూర్తిచెయ్యడం జరిగింది. గుంటూరు జిల్లా కోటప్ప కొండ మైన్స్ నుంచి తీసుకొని వచ్చిన రాతితో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. పావన పదునెట్టాంబడి అని పిలువబడే పద్దెనిమిది మెట్లను మలచడానికి 60 టన్నుల బరువైన ఏకశిలను ఉపయోగించారు. 

120 కేజీల బరువు గల అయ్యప్ప పంచలోహ విగ్రహాన్ని చాలా అందంగా తయారుచేసారు. దీనికి కావలసిన బంగారాన్ని, భక్తులు ఒక్కొక్కరూ ఒక్కో గ్రాము చొప్పున సమకూర్చారు.  శ్రీ శారదా పీఠాధిపతి బ్రహ్మశ్రీ స్వరూపానంద స్వామి వారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 


శ్రీ ధర్మశాస్త ఆధ్యాత్మిక ఆలయ కమిటి ద్వారా దేవాలయ నిర్వాహణ జరుగుతుంది.

ఈ విశేషాలన్నింటినీ దేవాలయ నిర్మాణ కార్యక్రమాలలో మొదటి నుంచీ పాలు పంచుకొంటున్న శ్రీచలపతి గురుస్వామి గారు ఎంతో ఓపికగా తెలియజేసారు. పైన కనిపించే మణికంఠుడి విగ్రహం ఫోటో కూడా ఆయనే ఇవ్వడం జరిగింది. మరొక్క సారి ఈ బ్లాగు ముఖంగా ఆయనకి ధన్యవాదాలు.


కేరళ `హట్` తరహా మందిరం, మూలవిరాట్, ద్వజస్తంభం, పదునెనిమిది మెట్లు, మందిర ముఖద్వారం.. మొదలైన వాటిలో ఇది శబరిమల అయ్యప్ప దేవాలయానికి చాలా దగ్గర పోలికలు కలిగి ఉంది.  మొదటి అంతస్తులో దేవాలయం, వెనుక గోదావరి. నది మీద నుంచి వచ్చే చల్లనిగాలి ఆహ్లాదకరంగా ఉంది. ఏసుదాసు ఆలపించిన అయ్యప్ప పాటలని సౌండ్ బాక్సుల్లో నుంచి మంద్రంగా వినిపిస్తున్నారు. 




గ్రౌండ్ ఫ్లోరులో విశాలమైన హాలు. మణికంఠుడి కథను చెప్పే పద్దెనిమిది సన్నివేశాలని విగ్రహాలద్వారా తెలియజేస్తూ ఈ హాలులో అద్దాలు బిగించిన షెల్ఫుల్లో ఉంచారు. జీవకళ ఉట్టి పడే బొమ్మలు, రంగుల మిశ్రమం, అమరిక అన్ని బాగున్నాయి. కానీ, షెల్ఫుల్లోపల బొమ్మలమీద చెమ్మ, బూజులు, ఫంగస్ ఏర్పడి పాడవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఆలయకమిటి ఈ విషయం మీద దృష్ఠి పెడితే మరింత బాగుంటుంది.



స్వామియే శరణం అయ్యప్ప!


© Dantuluri Kishore Varma

Friday 19 October 2012

కేంప్ ఫయర్ దగ్గర దెయ్యం కథలు

చీకట్లు ముసురుకొంటూ ఉండగానే ఊరు నిద్రపోయేది. టెలివిజన్ లాంటి వినోదం లేదు కనుక సుమారు ఏడు గంటలకే రాత్రిభోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించేవాళ్ళు జనాలు. అక్కడక్కడా మసకగా వెలుగుతున్న విద్యుత్ బల్బులు తప్పించి అంతా కటిక చీకటి. సరిగ్గా అప్పుడు వెలిగించేవారు కేంప్ ఫయర్ మాయింటిలో. నిజానికి దానిని కేంప్ ఫయర్ అంటారని అప్పటి వాళ్ళకు ఎవరికీ తెలియదు! కానీ, శీతాకాలం సాయంత్రం మంటముందు కూర్చుని చలికాగుతూ ఉంటే భలేగా ఉంటుంది. 

ఊరి మెయిన్ రోడ్డులో రెండువైపులా వరుసగా కట్టుకొన్న ఒక అరడజను ఇళ్ళల్లో మా కజిన్స్ అందరూ ఉండేవారు. కజిన్స్ అంటే మాతాతగారి అయిదుగురి కొడుకుల సంతానం. అన్ని రోడ్లూ రోముకే చేరతాయి అన్నట్టు సాయంత్రం భోజనాలు ముగిసాకా అందరూ `తాతయ్యగారి ఇల్లు` అనిపిలవ బడే మాయింటికి దారితీసేవారు. వీళ్ళు కాక  వేలు విడిచిన చుట్టరికాల బాపతు చాలామందికి కూడా సాయంకాలపు కూడలి ఇదే. విశాలమైన అరుగులు, వాటికి కొనసాగింపుగా పెద్ద తాటాకు పందిరి, అక్కడినుంచి ప్రవేశ గేటు వరకూ చాలా ఖాళీ స్థలం ఉండేవి.

గోదాములో ఉన్న వేరుశెనగకాయలో, కందికాయలో, తేగలో బయటకు తీసుకొని వచ్చి, ఈ స్థలంలో వేసి, ఎండుతాటాకులు, చితుకు పుల్లలతో మంటపెట్టి కాల్చేవారు. ఉన్న జనాలను బట్టి వేరుశనగ, కందికాయలు లాంటివయితే ఒక కుంచుడో, రెండుకుంచాలో; తేగలయితే ఒక పాతరో, అరపాతరో కాల్చేవారు. ఇవి కాలుతూ ఉంటే వచ్చే కమ్మని వాసన అమోఘం. నోటిలో నీళ్ళు ఊరకుండా నిలువరించుకోవడం ఎవరికయినా అసాధ్యం. ఒక్కొక్కరూ ఒక్కో గుప్పెడు కాయలు తెచ్చుకొని ఒకటీ; ఒకటీ తింటూ, కబుర్లు చెప్పుకొంటూ సాయంత్రం అర్ధరాత్రి గా మారేవరకూ గడిపి నిద్రకళ్ళతో  ఇంటిముఖం పట్టేవారు. 

కటిక చీకటిలో, లేదా వెన్నలరాత్రి మసక వెలుతురులో చెట్లు, పొదలు, ధాన్యం పురులూ  దుప్పట్లు కప్పుకొన్న ఈవిల్ స్పిరిట్స్ లాగ నిలుచుని భయపెడుతుంటే పెద్దవాళ్ళు చెప్పుకొనే దెయ్యాలకథలు భయం భయంగా వినేవాళ్ళం. ఇంచుమించు ప్రతీవాళ్ళ దగ్గరా ఒకటో, రెండో అటువంటి కథలు ఉండేవి. ఈ సంభాషణలు మా మేనత్తలు, వాళ్ళ పిల్లలూ కూడా ఉన్నప్పుడు మరింత ఆసక్తికరంగా ఉండేవి. `నా కళ్ళతో చూశాను తెలుసా?` అనే వాళ్ళు. `దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి,` అని చెప్పే వాళ్ళనమ్మకమైన మాటలు, `మనకి ఎదురైతే ఎలా?` అని భయం ఒక థ్రిల్ కలుగజేసేది. మళ్ళీ ఆ మరునాడు భయమేసినా ఆ మాటలు వినకుండా ఉండలేక పోయే వాళ్ళం. కేంప్ ఫయర్ చుట్టూ కూర్చొని చాలా విశేషాల చెప్పుకొంటున్నా దెయ్యం కథలు, పాముల కథలు ఫేవరెట్స్.

© Dantuluri Kishore Varma

Monday 15 October 2012

ఆంధ్రాశిరిడీ బలబద్రపురం

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఉన్న బలబద్రపురం అనే ఊరిలో శిరిడీ సాయిబాబా గుడి ఉంది. దీనిని ఆంధ్రాశిరిడీ అని వ్యవహరిస్తున్నారు. కాకినాడనుంచి రాజమండ్రీ కెనాల్ రోడ్డు ద్వారా వెళుతున్నప్పుడు ఈ గుడి కుడిచేతివైపు కనిపిస్తుంది.
ఈ దేవాలయాన్ని 2004లో నిర్మించారట. జైపూర్ నుంచి బాబా పాలరాతి విగ్రహాన్ని తీసుకొనివచ్చారని అక్కడ ఉన్న పంతులుగారు చెప్పారు. ఇంకా ఆయన తెలియజేసిన వివరాల ప్రకారం, ఈ విగ్రహాన్ని శిరిడీ తీసుకొనివెళ్ళి అక్కడి దేవాలయ అర్చకులచేత అభిషేక పూజలు చేయించి, తీసుకొని వచ్చి ప్రతిష్ట చేసారట. ఒక వందమంది సాయి మాల ధరించిన భక్తులు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మధ్యనే బంగారు కిరీటం కూడా చేయించారట.

రెండు అంతస్తులుగా ఉన్న దేవాలయంలో క్రింద కళ్యాణ మండపం, పైన సాయి ఆలయం ఉన్నాయి.
ప్రతిసంవత్సరం గురుపూర్ణిమ సమయంలో (కొన్నిరోజులు అటూ, ఇటూగా) సూర్యకిరణాలు సాయి ముఖమ్మీద ప్రసరిస్తాయట. అప్పుడు బాబా మరింత అందంగా కనిపిస్తారట. దేవీ నవరాత్రుల వంటి పండుగరోజులలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలూ నిర్వహిస్తారు. బాబా జన్మదినమైన గురుపూర్ణిమకు పాలాభిషేకం చేస్తారు.
ఆలయానికి వెనుక ప్రార్ధనా మందిరం ఉంది. మెడిటేషన్ అలవాటు ఉంటే, ఇక్కడ కొంతసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. 
ప్రార్ధనా మందిరం కిటికీఅద్దంలోనుంచి కొన్ని కొండముచ్చులు సందర్శకులని నిశితంగా గమనిస్తున్నాయి. బహుశా భక్తులు ఇచ్చే కొబ్బరిచిప్పలు, అరటిపళ్ళు తీసుకొనే అలవాటు వీటికి ఉన్నట్లుంది. ప్రశాంతమైన వాతావరణంలో గుడి బాగుంది. ఎప్పుడయినా ఈ మార్గంలో వెళుతున్నప్పుడు, మరచిపోకుండా ఈ గుడిని సందర్శించండి. 

© Dantuluri Kishore Varma

Saturday 13 October 2012

రాతల్లో రకాలు

"నాకొక కొత్తవ్యక్తిని పరిచయం చెయ్యండి,  అతనిగురించి ఒక ఆసక్తికరమైన కథ రాస్తాను," అనేవాడట స్టివెన్ లీకాక్. ఇంచుమించు అలాగే "అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేదోయ్ కవితకనర్హం," అని శ్రీశ్రీ గారు అంటారు. తొంభై ఏళ్ళు పైన బ్రతికిన తాళ్ళపాక అన్నమాచార్య 36,000 సంకీర్తనలు రాసి `ఔరా!` అనిపించాడు. రోజుకి ఒకటి చొప్పున రాసినా అన్ని కీర్తనలు పూర్తిచెయ్యడానికి 97 సంవత్సరాలు పడుతుంది! ఏమి రాయాలో ఆలోచించుకోవలసిన అవసరం లేకుండా,  ఏమైనా రాయగల సృజనాత్మకత వాళ్ళ సొంతం.

చాలా ఏళ్ళక్రితం నా స్నేహితుడు ఒకరు స్వాతిలో కథల పోటికి ఒక కథ పంపిస్తే, `రాసే విధానం బాగుంది, కానీ కథగా ప్రచురించగలిగినంత పెద్దగా లేదు. బాగా నిడివి పెంచి రాయండి సీరియల్ గా వేస్తాం,` అని ఒక నోట్ పెట్టి త్రిప్పి పంపించారు. అది చూసి మొదట నిరుత్సాహపడినా, తరువాత నిజంగానే సీరియల్ రచయిత అయిపోయినంత ఆనంద పడిపోయాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆకథని నవలగా పెంచి రాయడంగానీ, ప్రచురించబడడంగానీ జరగలేదనేది వేరే విషయం. "చ! ఎడిటర్ల లాంటి చెక్ పోస్ట్లు లేకుండా ఉంటే మన రాతలు మనమే వేసేసుకోవచ్చు," అనేవాడు. మావాడు ఆశపడిన అవకాశం ఇప్పుడువచ్చింది.  కొంతకాలం క్రితం వరకూ రచయితలు వేరుగా, పాఠకులు వేరుగా ఉండేవారు. కానీ, అంతర్జాలంలో బ్లాగులు మొదలయ్యాకా ఎవరయినా రచయితలు అవ్వొచ్చు. నా ఫ్రెండుకి బ్లాగు లేదు కానీ, ఒకవేళ ఉంటే ఏమిరాసి ఉండేవాడా అని నాకు సందేహం కలుగుతుంటుంది అప్పుడప్పుడూ. అవకాశం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. లేనిదల్లా ఏమిరాయాలనే అవగాహన మాత్రమే.  

నేను ఈ మధ్యనే ఇండీబ్లాగర్ అనే ఇండియన్ బ్లాగర్ కమ్యూనిటీలో చేరడం జరిగింది. వాళ్ళు చెప్పే ఒక వాఖ్యం బాగా నచ్చింది నాకు - "ఎవ్విరీ వన్ హేజ్ సంతింగ్ టు బ్లాగ్ అబౌట్," అని.  మరి ఆ `సంతింగ్` అంటే ఏమిటీ అనేది బేతాళ ప్రశ్న. ప్రతీరోజూ కొన్ని వేల మంది బ్లాగర్లు లక్షలకొద్దీ పేజీలు రాసిపడేస్తున్నారు. వాళ్ళంతా రాసే సంతింగ్, సంతింగ్ ఏమిటి? ఆ మేజిక్ ఏదో మనకి కూడా తెలిస్తే చంద్రుడికో నూలు పోగులా ఓ నాలుగు పేజీల మనమూ బరికి పారేయవచ్చుకదా! ఇదే ఆలోచనతో కొన్నిరోజులుగా కనిపించిన బ్లాగునల్లా చదివితే  కొన్నివిషయాలు తెలిశాయి. అవి అందరితో పంచుకొoటే బాగుంటుందని ఈ టపా రాస్తున్నాను.

రాతలు 6 రకాలు (Kinds):
1. నెరేటివ్ - సంఘటనలు  జరిగిన క్రమంలో కథలాగ చెప్పుకొని పోవడం: `నాచిన్నప్పుడు ఏమి జరిగిందంటే,` అని మొదలుపెట్టి జ్ఞాపకాలు అన్ని రాసేసుకోవడం. జీవితచరిత్రలు, సంఘటనలు, ఏదయినా తయారుచేసే విధానం...లాంటివాటిని ఈ కోవలోకి తీసుకొని రావచ్చు. 

2. డిస్క్రిప్టివ్  - వర్ణన: ఒక ప్రదేశాన్ని గురించి వర్ణించి రాసే టపాలు. ట్రేవలాగ్ పోస్టులు ఈ కోవలోకి వస్తాయి.

3. రిఫ్లెక్టివ్ -  అద్దంలో ప్రతిబింబం లాంటి రాతలు అన్నమాట: బుక్ రివ్యూస్, ఫిల్మ్ రివ్యూస్ మొదలైనవి.

4. క్రిటికల్ - పరిశీలనాత్మకమైన టపాలు: మనుషులని, నడవడికలని, పనులని, విధానాలని... పరిశీలించి,  విశ్లేషించి వ్రాయడం.

5..క్రియేటివ్ - సృజనాత్మక రాతలు: కథలు, కవితలు మొదలైనవి. 

6. పిక్ అండ్ పోస్ట్ -ఏదో ఒకటి ఏరుకొని వచ్చి మన మొహాన కొట్టడం: దీనికి వివరణ అనవసరం.

ఇంకా చాలా రకాలు ఉండవచ్చు. విషయాన్ని క్లుప్తంగా చెప్పే టపా కనుక వివరంగా రాయడం లేదు (= నాకు అంతకంటే ఎక్కువ తెలియదు :-p)  

రాసే విధానాలు (Moods) :
కొంతమంది చమత్కారంగా హాస్యం ఉట్టిపడేలా చెబుతారు(హ్యుమరస్). ఇది ఒకకళ. వాళ్ళు రాసింది చదువుతున్నంత సేపూ పొట్ట చెక్కలయిపోయెలా నవ్వలేక చస్తాం. రెండవ విధానం సీరియస్. జాగ్రఫీ పాఠంలాగ చెప్పేయడం అన్నమాట. మూడవది సర్కాస్టిక్ అంటే వెటకారం. ఒకవైపు నుంచి నవ్వువస్తూనే ఉంటుంది; ఇంకో వైపు కారం రాసినట్టు ఉంటుంది. అయినా ఈ పోస్టు మనమీద కాకపోతే భలే ఉంటుంది ; )

ఉద్దేశ్యాలు (Purposes):
1. వినోదం కలిగించడానికి 2. ఎడ్యుకేట్ చెయ్యడానికి  3. సుత్తేసి బొరుకోట్టడానికి. 

ఈ ఆరు రకాలని, మూడు విధానాలని, మూడు ఉద్దేశ్యాలని రకరకాలుగా కలిపి చాలా కాంబినేషన్లని తయారుచెయ్యవచ్చు. 

స్టివెన్ లీకాక్ భావించినట్టు మన అందరిలో కూడా ఆసక్తి కరమైన సంగతులు ఉంటాయేమో! వాటిగురించి వ్రాయడం మొదలుపెట్టవచ్చు. ఎవ్విరీ వన్ హేజ్ సంతింగ్ టు బ్లాగ్ అబౌట్. So, start blogging right now.

(నా పరిశీలనలోకి వచ్చిన వాటిని `ఇంకా ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందేమో!` అనే ఆశతో ఈ టపాలో రాయడం జరిగింది. నేను ప్రస్తావించిన కేటగిరీల్లోకి కొందరి పోస్టులు వచ్చే అవకాశం ఉంది కనుక, ఎవ్వరూ విమర్శతో రాశానేమో అని భావించవద్దని మనవి.)

© Dantuluri Kishore Varma 

Thursday 11 October 2012

ఓ అందమైన అమ్మాయి ఆత్మకథ :p

గోదావరి జిల్లాల ప్రజలు స్నేహశీలురు, గౌరవమర్యాదలు తెలిసున్నవాళ్ళు. అలాగని అమాయకులని మాత్రం అనుకోవడానికి వీలులేదు. `ఆయ్` అని మర్యాద చూపిస్తూనే, తమమర్యాద ఏమైనా తగ్గుతుందని భావిస్తే చమత్కారంగా మాటకి మాట అప్పజెప్పగల చతురులు. ఏ పరిస్థితులలో అయినా నెగ్గుకురాగల వ్యవహారధక్షత కూడా వీళ్ళకు ఎక్కువే. "ఏమిటి, గోదావరి వాళ్ళ వకాల్తా పుచ్చుకొన్నట్టు, అంతలేదు, ఇంతలేదు అని కోతలు కోస్తున్నావ్? వాళ్ళకేనా సుగుణాలు? ఇంకెవరికీ ఉండవా?" అని వాదనకి రావద్దు. ఎందుకంటే, ఈ ప్రాంతపు ప్రజలతో నాకు ఉన్న స్నేహం అపూర్వం. చాలా సంవత్సరాలుగా వాళ్ళ సహవాసం. అదే మీతో స్నేహం ఉండుంటే, మీగురించే చెబుతానుకదా? అర్ధం చేసుకోరూ!   ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ? వస్తున్నా...వస్తున్నా... అక్కడికే వస్తున్నా.

ఇంకొక్క చిన్న ముచ్చట ఉంది. అదికూడా చెప్పనివ్వండి ముందు. అది మన భాగ్యనగరం హైదరాబాద్ గురించి. హమ్మో! ఎంత పెద్ద నగరం. ఫేక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, స్కూళ్ళు, కాలేజీలు, సినిమా స్టూడియోలు  , షాపింగుమాళ్ళు, హాస్పిటళ్ళు, ప్రాచీన కట్టడాలు, టూరిస్టుప్లేసులు, ఎమ్యూస్మెంట్ పార్కులు, హోటళ్ళు, ప్రభుత్వ ఆఫీసులు... మిలియన్ల కొద్దీ జనాలు... అబ్బో చెప్పాలంటే చాలా ఉంది. "మాకు తెలుసులే. పెద్ద పుడింగిలా నువ్వు మాకు ఏమీ చెప్పకర్లెద్దు," అంటారా? సరే, అలాగే కానిద్దాం. నిజంచెప్పాలంటే, నాకు కూడా ఈ సిటీ గురించి పెద్దగా ఏమీ తెలియదండీ. చెప్పుకొంటుంటే వినడమే.  హైదరాబాదులో నాకు బాగా తెలిసున్న ప్రదేశం రైల్వే స్టేషన్ ఒక్కటే! :P

"నువ్వు ఎవరు? ఎవరు?? ఎవరు??" అని బల్ల గుద్ది అడగక్కర్లా. నేను...నేను...మరేమో నేనూ..... "చెప్పెహే, తొందరగా," అని విసుక్కోవద్దు. అందమైన అమ్మాయిల ముందు అలా అసహనం ప్రదర్శిస్తే ఏం బాగుంటుంది చెప్పండి?

నావయస్సా? హన్నన్నా, ఎంతమాటా? ఎంతమాటా? అమ్మాయిల వయస్సు అడుగవచ్చునా? అడిగినా పరవాలే! నాకు చెప్పుటకు సమ్మతమే. కానీ... అంతకు ముందు మీకు ఇంకొంచము చరిత్ర వివరించవలె!(అమ్మో! అన్నగారి భాష పొంగుకొని వచ్చేస్తుంది ఈ రోజు).

అదేనండీ, మా గోదావరి జిల్లాల్లో ఎంతలేదనుకున్నా ప్రతీ నాలుగయిదు ఇళ్ళకీ కనీసం ఒక్కడయినా మనరాష్ట్ర రాజదానిలో ఉంటాడండీ. ఎందుకా? చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు...ఇంకా చాలా ఉన్నాయి లెండి. వీళ్ళుకాక ప్రతీరోజూ వైద్యానికో, విహారానికో, రాజకీయ రికమండేషన్లకో, సినీమాల్లో వేషాలకోసమో చాలా మంది చలో హైదరాబాదన్నమాట.  పండగలకి, పబ్బాలకి, శెలవులకి, మంచికి, చెడ్డకి... అటునుంచి ఇటు, ఇటునుంచి అటూ నిరంతరం జనాలు తిరగడం నా కళ్ళారా నేను పుట్టింది మొదలు పాతిక సంవత్సరాలనుంచి  చూస్తూనే ఉన్నాను.  అయ్యయ్యో! చూసారా, ఇంకా చెప్పకూడదనుకొంటూనే, నా వయసు యెంతో చెప్పేశాను?  వయస్సు దాచుకొంటే దాగుతుందా? అందులోనూ ఉరుకులెత్తే పరువంలో ఉన్న నాలాంటి వాళ్ళ విషయంలో. ఇలా ఎందుకంటున్నానంటే? నన్నందరూ సూపర్ ఫాస్ట్ అంటారండీ! మీ మీద ఒట్టు. నిజ్జంగానే నేను సూపర్ ఫాస్టు!  బై ద వే! ఈ మధ్యనే అక్టోబరు మూడున నా బర్త్ డే కూడా అయ్యింది. నేను పుట్టిన సంవత్సరం 1987.  

నిరంతరం ప్రజలతో కలిసి తిరిగే ఉద్యోగం. ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇంత జాబ్ సాటిస్ఫేక్షన్ మరెక్కడా దొరకదు. సరదాలు, సంతోషాలు; కేరింతలు, తుళ్ళింతలు; కష్టాలు, కన్నీళ్ళు; నిరుత్సాహాలు, నిట్టూర్పులు; ముచ్చట్లు, మురిపాలు; కొట్లాటలు, దొమ్మీలు - జీవితమంటే రిదమిక్ గా, కమ్మగా సాగే పాటే నాకు. ఒక్కోసారి, ఆ పాటలో అపసృతులు కూడా దొర్లుతుంటాయి. నాలుగేళ్ళ క్రితం వరంగల్లో కే సముద్రం అనేచోట ఏం జరిగిందంటే... అమ్మో! వద్దులెండి, వరంగల్ మాట అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.

నా ఉద్యోగంలో నాకు అస్సలు నచ్చని విషయం... వీడ్కోలు. టాటా చెబుతూ, కంటి చివరి మెరిసే కన్నీటిచుక్కని రెండవచేతితో తుడవడానికి విశ్వప్రయత్నం చెయ్యడం. భార్యనుంచి, భర్తని; కొడుకునుంచి, తండ్రిని; ఓ స్నేహితురాలి నుంచి, స్నేహితుడిని... విడదీసే పాపం. నాకే ఎందుకు? అటువంటి సమయంలోనే నా బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. తిరిగి రాత్రి గడచి, పొద్దుపొడిచే సరికి ఎన్ని ఆనందమైన ముఖాలు... అవే నన్ను మళ్ళీ కర్తవ్యోన్ముఖిని చేస్తాయి. జీవితం అంటేనే కలవడం, విడిపోవడం - అంతే కదా! అమ్మో, ఫిలాసఫీ ఒచ్చేస్తుంది.
మిమ్మల్ని చాలా సేపు సుత్తి కొట్టి విసిగించానండీ...ఉంటానే. పంక్చువాలిటీ ముఖ్యం. బై! కూ...చుకు, చుకు..... ఏమిటండీ మళ్ళీ? నా పేరా? ఇందాకా చెప్పలేదా? అయ్యో, నా మతిమరుపూ, నేనూ! చా! వాకే, వాకే అక్కడికే వస్తున్నా. నా పేరు....గౌతమి.

(ఇంతకీ ఈ కాకినాడ - సికింద్రాబాద్ అమ్మాయి ఎవరో మీకుతెలుసా?)
© Dantuluri Kishore Varma

Wednesday 10 October 2012

నా గుండె నమిలి మింగిన పిల్ల

ఫ్రెండ్స్, సినిమాలు, పార్టీలు, ఫేస్ బుక్కు…. జీవితం, వేసవికాలం సాయంత్రం మెల్లగా ప్రవహించే నదిలాగ సాగిపోతూఉంటుంది. అంతా అలా సవ్యంగా జరిగిపోతే దానిని జీవితం అని ఎందుకు అంటారు? ఏదో ఒక రోజు అకస్మాత్తుగా ఓపిల్ల ఓలా నవ్వేసరికి- వెన్నెల రాత్రి తిరునాళ్ళలో రంగులరాట్నం ఎక్కి, అది వేగంగా క్రిందకి దిగుతున్నప్పుడు గుండె అడుగున ఏర్పడే ఖాళీలా హార్ట్ బీట్లు రెండో, మూడో తప్పిపోయి,మిస్సయిపోయిన బీట్లని తిరిగి భర్తీ చేసుకోవడానికి హృదయస్పందన రెట్టింపయితే; పండుగాడు చెప్పినట్టు `దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయిపోతుంది`. అక్కడినుంచి ప్రశాంతత అనేది మనసుకి విడాకులు ఇచ్చేసి ఎక్కడికో ఎగిరిపోతుంది.

`Love is the master key that opens every ward of the heart`  అన్నట్టు ఆ పిల్ల ఫోటో గుండెల్లో పచ్చబొట్టు అయిపోతుంది.  సెమిస్టర్స్, ఎగ్జాంస్, మార్క్స్, ప్లేస్మెంట్స్, గోల్, లాంటి వొకాబ్యులరీని వెన్నెల, విరహం, ప్రేమ, యండమూరి వీరేంద్రనాథ్ లాంటి పదాలు రీప్లేస్ చెసేస్తాయి.

వెన్నల రాత్రి మిద్దెమీద వెల్లకిలా పడుకొని, ఆకాశంలో ఎడంగాఉన్న నక్షత్రాలని శూన్యంలో గీతలు గీసి కలుపుతూ, ఆమె గురించి ఆలోచిస్తుంటే – “ఎందుకురా ఆమె అంటే అంత లౌస్,” అంటాడు ఒక క్లోజ్ బడ్డీ.  ప్రేమించడానికి కారణం ఏముంటుంది?
దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి అయితే-
“సౌరభములేల చిమ్ము పుష్పప్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబుపారు? గాడ్పేల విసరు?
ఏల నాహృదయంబు ప్రేమించు తనను”
నండూరి సుబ్బారావు అయితే -
“మెళ్ళో పూసలపేరు
తల్లో పువ్వులు సేరు
కళ్ళెత్తితే సాలు
కనకాబిసేకాలు

సెక్కిట సిన్నిమచ్చ
సెపితే సాలదు లచ్చ
ఒక్క నవ్వే సాలు
వొజ్జిర వయిడూరాలు

పదము పాడిందంటె
పాపాలు పోవాల
కతలు సెప్పిందంటె
కలకాల ముండాల

రాసోరింటికైన
రంగుతెచ్చే పిల్ల
నాసొమ్ము నా గుండె
నమిలి మింగిన పిల్ల”

అని-  ప్రేమ బాధలన్నీ ఏకరువు పెట్టుకొనేవాడే.

తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టు, ప్రేమ ముదిరి పాకాన పడుతుంది. ఊహల్లో, వాస్తవంలో; ఉషస్సులో, సంధ్యలో; శశికాంతిలో, నిశిరాత్రిలో ఆమె ద్యాసే శ్వాశవుతుంది. ఆమె వేలికొసలను తాకుతూ అందుకొనే ఏదైనా అమృతమే. ప్రాణంలేని వస్తువులు కూడా సెంటిమెంట్లు ఆపాదించుకొంటాయి – చాకొలేట్ రేపర్లు,ఆమె నోట్ బుక్కులలో కాగితాలు… అతనికి అమూల్యమైన సంపద అవుతాయి. గాలికి కదులుతున్న చెవి జుంకీ గుండెగదిలో గంట కొడుతుంది.

ప్రేమంటే అనుభవిస్తున్న ఈ అద్భుతమైన భావం  చిన్ని గుండెలో ఇమడటంలేదే అన్న తపన. ఫ్రెండ్స్ దృష్టిలో వీడిది పైత్యం, వాడికి మాత్రం ప్రాణశంకటం. “చెప్పెయ్యవచ్చు కదా!” అంటాడు ఒక స్నేహితుడు. అందుకోలేని లోతుల్లో ఆమె మనసు, మొహమాటపు సుదూర తీరాల్లో అతడు. అతని భావం ఆమెకి చేరాలంటే కొన్ని యుగాలు పడుతుందేమో! తీరా చెప్పాక కాదంటే…అమ్మో!

సెమిస్టర్ ఎగ్జాంస్ పూర్తిఅవుతాయి. ఆలోచనలు ఆమెకి అంకితమైతే, ఖాళీ ఆన్సర్ స్క్రిప్స్ ఎగ్జామినర్కి నైవేద్యమౌతాయి.ఎగ్జాం పోతేనేమి, ప్రేమగెలిస్తేచాలు.

Holidays -

“ఏ దూర తీరాల్లో నీవుంటావో నేస్తం! కానీ ఏదో ఒక రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్లు నీ కనిపిస్తే… ఈ దూర దేశపు పాత స్నేహితుదు నిన్ను తలుస్తున్నాడనడానికి సంకేతంగా దానిని భావించు చాలు,” అంటాడు యండమూరి. అలా చెప్పుకొంటే ప్రతీరోజూ చంద్రుడు ప్రకాశవంతంగానే ఉండాలికదా! అయినా పిచ్చికానీ, రాత్రిపూట అకాశంవంక చూసి పరవశించే భావుకత్వం ఆమెకి ఉంటుందా!

సముద్రం మీద నురుగుకీ, పౌర్ణమి నాటి వెన్నెలకి ఎలా శాశ్వతత్వాన్ని ఆపాదించగలం? అటువంటిదే ప్రేమ కూడా. చివరిరోజు ఆటోగ్రాఫ్ బుక్ మీద అతనికొక స్నేహసందేశం రాసి, కవితాఝరిలా సాగిపోతుంది, విరహం కీచురాళ్ళ శబ్ధంలా మిగులుతుంది.ఆల్ఫ్స్ పర్వతాలలో ఘనీభవించిన మంచు కరిగి నైల్ నదిలా మారినట్టు, గుండెగదిలో జ్ఞాపకాలు గట్టు తెగి, నీటిచుక్కై కంటిచివరమెరుస్తాయి.

షేర్ మార్కెట్ లో సర్వం కోల్పోయినట్లు, నాశనమైన కెరీర్ని, ముక్కలైన మనసుని తిరిగి అతికించుకోవడానికి ఎంతకాలం పడుతుందో?

వాడి సంగతి అలాఉంచండి - మీ ప్రేమ ఎంతవరకూ వచ్చింది?
© Dantuluri Kishore Varma 

Tuesday 9 October 2012

ఎఫెక్టివ్ పేరెంటింగ్

"మా అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడండి. అస్సలు చెప్పిన మాట వినడంలేదు. అన్నంకూడా సరిగా తినడు. మీరు భయం చెప్పండి," అని విద్యార్ధుల తల్లితండ్రులు ఉపాధ్యాయులని కోరుతూ ఉంటారు. కానీ, ఒక టీచరు యొక్క ప్రభావం విద్యార్ధి మీద అతని ఇంటిదగ్గర కూడా ఉంటుందా అనేది సందేహాస్పదం. చదువు వరకూ స్కూల్ యొక్క ప్రభావం ఉన్నా, స్టూడెంట్ ప్రవర్తన ఇంటిదగ్గర, బయటిసమాజంలో ఎలా ఉండాలీ అనే విషయాన్ని నిర్ణయించేది -తల్లితండ్రుల, విద్యాలయాల ఉమ్మడి పాత్ర.

ఒకసారి తన కుమారుని ఉపాధ్యాయునికి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ రాసిన లేఖలో ఆ కుర్రాడికి ఏమేమి నేర్పించాలో చెబుతాడు. ఇది చాలా ఇన్స్పయరింగా ఉంటుంది.  

"మావాడు ఎంతో నేర్చుకోవాలి. నాకు  తెలుసు లోకంలో  అందరూ న్యాయబద్ధులు, సత్యవంతులూ  కారని.  కానీ  సమాజంలో  ప్రతీ దుష్టుడికీ ఒక ఆరాధ్యుడు ఉంటాడని మా వాడికి నేర్పండి. స్వార్థపరుడైన ప్రతి రాజకీయవేత్తకి నిస్వార్థ నాయకుడు ఉంటాడు.

ప్రతీ శత్రువుకీ ఓ స్నేహితుడుంటాడని బోధించండి. ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పక్షులు, ఎండలో తిరిగే చీమలు, పచ్చని కొండ చెరియల్లో పూసే పూల రహస్యాల్ని తెలుసుకోను కాస్తంత సమయమూ ఇవ్వండి. మోసం చేయడం కంటే విఫలం కావడమే గౌరవప్రదమని చాటి చెప్పండి. అతని ఆలోచనలను ఇతరులు తిరస్కరించినా వాటి పట్ల అతనికి నమ్మకం కలిగించండి. మంచి వారి పట్ల మంచిగా, చెడ్డవారి పట్ల కఠినంగా వ్యవహరించడమూ నేర్పండి.

అందరూ వెళ్లే దారిలో కాకుండా సత్యాన్ని శోధించే దారిలో వెళ్లేందుకు మా అబ్బాయికి శక్తినిచ్చేందుకు ప్రయత్నించండి. అందరి మాట వినడం, విన్నవాటిలో సత్యాన్ని గ్రహించేట్టు చేయండి. మనసు బాగోలేకపోయినా నవ్వడం నేర్పండి మీకు వీలైతే. దు
ఖం అవమానం కాదని, అనాలోచనాపరులకు దూరంగా ఉండమని, అతిగా పొగిడేవారి పట్ల జాగ్రత్త వహించమని బోధించండి. ఆలోచనలు ఉన్నత పథానికి వెళ్లడానికి వినియోగించమని బోధించండి కానీ, మనసుకు వెలకట్టకూడదని చెప్పండి.

అల్లరిమూక గోల వినవద్దని, తన ఆలోచన సత్యమైతే దానికోసం పోరాడమని చెప్పండి. సున్నితంగా బోధించండి. కానీ మరీ ముద్దు చేయొద్దు. కఠిన పరీక్షలతోనే గదా రాటు తేలేది!


అసహ్యాన్ని ఎదిరించేందుకు, ధైర్యసాహసాలు ప్రదర్శించడానికి ఎంతో సహనంతో నిలవడం బోధించండి. తనపై తనకి అపార నమ్మకం కలిగేట్టు చెయ్యండి. తద్వారా మానవాళిపై నమ్మకాన్ని పెంచుకోగలుగుతాడు.


దీన్ని ఆదేశంగానే తీసుకోండి. మీరు చేయగలిగింది చేయండి. మా వాడు మా మంచి పిల్లవాడు!"


అలాగే ఒక పేరంట్ కూడా తను చేయవలసిన పనులను ఒక చిట్టా తయారుచేసుకొని వాటిని అమలు పరిస్తే....

పిల్లలు చక్కటి ప్రవర్తన, క్రమశిక్షణ, బాధ్యత, సమయపాలనలతో పెరిగి పెద్దవ్వాలి అంటే తల్లితండ్రుల పాత్ర విశేషంగా ఉండాలి. పెద్ద పేరున్న కార్పొరేట్ స్కూల్లో చేర్చి మన బాధ్యత తీరింది అనుకుంటే తప్పు చేసినట్లే. పిల్లలు స్కూల్లో విద్యా విషయాలు, క్రమశిక్షణ, సమయపాలన, సామాజిక ప్రవర్తనా నియమాలూ నేర్చుకొంటే; కుటుంభం నుంచి నైతిక విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆర్ధిక విషయాలు,  ప్రేమ, ఆప్యాయతలు నేర్చుకొంటారు. పిల్లల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లితండ్రులదే ప్రముఖ పాత్ర అనేది కాదనలేని సత్యం.

తల్లితండ్రులు విద్యాధికులు అయిఉండీ, రోజులో కొంత సమయాన్ని పిల్లలికి కేటాయించగలిగితే ఆ పిల్లలు చదువులో, చక్కని ప్రవర్తనలో  తమ సహచరులుకంటే ముందు ఉండే అవకాశం ఎనభై శాతం వరకూ ఉంటుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ప్రతీరోజూ చేయించడం, చేతివ్రాత చక్కగా ఉండేలాగ జాగ్రత్త తీసుకోవడం, ఒక నిర్ధుస్టమైన ప్రణాళికననుసరించి చదివించడం కిండర్ గార్టెన్ స్థాయి నుంచీ పిల్లలికి పేరెంట్స్ అలవాటు చెయ్యాలి. ఇది క్రమశిక్షణ, సమయపాలనలు నేర్పించడంలో మొదటి మెట్టు.

లాంగ్వేజస్ లో, భావాల వ్యక్తీకరణలో ప్రగతి సాధించడానికి డిక్టేషన్ ఇవ్వాలి, మంచి నీతి కథలు చెప్పి వాళ్ళు తమ స్వంత మాటలలో వ్రాసేలాగ ప్రోత్సహించాలి. దీనివలన మంచి కమ్యూనికేషన్ అలవడటమేకాక, నైతికవిలువలు నేర్చుకోగలుగుతారు.

సైన్సు, మేథ్స్ సబ్జెక్ట్ లలో చిన్న చిన్న పరిశోధనలు చెయించడం, కొంచం డబ్బు వారికిచ్చి ఏమయినా వస్తువులు కొనిపించి ప్రాధమిక గణిత భావనలను అవగాహన అయ్యే విధంగా చేసినప్పుడు చదువు యొక్క వాస్తవ విలువను గ్రహించగలుగుతారు. ఈవిధమైన ప్రణాళిక వలన శ్రధ్ధ, ఆసక్తి కలిగి సెల్ఫ్ మొటివేషన్, ఐక్యూలతో తిరుగులేని విజయాలకి పునాది వేసుకోగలుగుతారు. తల్లితండ్రులయొక్క సహకారం లేకుండా ఏ విద్యాసంస్థ అయినా ఇటువంటి పౌరుల్ని తయారు చెయ్యడం సాధ్యమయ్యె పనేనా?

మరి నిరక్షరాస్యులయిన తల్లితండ్రులు, ఉద్యోగ లేదా వ్యాపారలలో తీరిక లేని వారి విషయంలొ  ఏమి చెయ్యలీ అనేది ప్రశ్న. ట్యూషన్ అనేది ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ, అది కేవలం ఎకడమిక్స్ వరకే పరిమితం అని గమనించాలి.  ఎంతవరకూ ట్యూటర్ శ్రధ్ధ వహిస్తున్నారు అని తెలుసుకోవడం తప్పనిసరి.

ఏ పాఠశాలల్లోనూ సాధారణంగా నేర్పించని విషయాలు చాలా ఉంటాయి.  ఉదాహరణకి చిన్న చిన్న పనులని పిల్లలికి అప్పగించి స్వతంత్రంగా పూర్తి చేసేలాగ చెయ్యడం, డబ్బు విషయంలో – దూబరాకి అవకాశం లేని ఆర్ధిక నిబధ్ధతని అలవరచడం, జంక్ ఫుడ్ కి అలవాటుపదకుండా చూడడం, పెద్దలపట్ల గౌరవం, దీనులపట్ల ఆదరణ, వోడినప్పుడు కూడా స్థైర్యం కొల్పొకుండా ఉండడం, పనులని కష్టంతో కాకుండా ఇష్టంతో చెయ్యడం , మెడిటెషన్…. మొదలైనవి. ఖచ్చితంగా వీటిపట్ల సమయం కేటాయించ వలసినది తల్లితండ్రులే.

బాల్యంలో, యవ్వనంలో ఉన్న పిల్లలితో సరిఅయిన కమ్యూనికేషన్ కొనసాగిస్తూ, టి.వి. సినిమా, ఇంటర్నెట్ల యొక్క దుష్ప్రభావవానికి సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. అలాగని వారిని టెక్నాలజీకి దూరంచెయ్యకూడదు. చెడ్డ ఫ్రెండ్స్ నుంచి కూడా దూరంగా ఉంచాలి.  పిల్లల్ని పెంచడం మొక్కల్ని పెంచడం వంటిదే. అది ఒక తప్పనిసరి బాధ్యత కాదు అని, ఇష్టంతో ఆహ్లాదంగా చెయ్యాలి అని మరవకూడదు.

అందుకే, తల్లితండ్రులు నేర్చుకోవలసిని మొట్టమొదటి సాఫ్ట్ స్కిల్ హౌ టు బి ఏన్ ఎఫెక్టివ్ పేరెంట్ అనేది.

ఇవి నాకు తోచిన కొన్ని విషయాలు మాత్రమే. బహుశా ఈ లిస్టుకి ఇంకా చాలా పాయింట్స్ చేర్చుకోవచ్చనుకోంటాను!
© Dantuluri Kishore Varma 

Saturday 6 October 2012

పుట్టుమచ్చ నవ్వింది

తెరిచిన కిటికీలోనుంచి చల్లగాలి వీస్తుంది. గొల్ల గోపిక ఇంటిలో దొంగిలించిన కృష్ణయ్య చేతిలో వెన్నముద్దలా  చందమామ మెరుస్తుంది. నల్లనయ్య చీకటిలో కలసిపోగా, వేసుకొన్న ఆభరణాల మీద పొదిగిన వజ్రాల్లా అక్కడక్కడా చుక్కలు మెరుస్తున్నాయి .  స్టీరియోలోంచి   రఫీ గొంతు మంద్రంగా వినిపిస్తుంది- 

"బహారో ఫూల్ బర్సావో 
మేరీ మెహబూబ్ ఆయాహై..." 

ప్రియురాలిని అహ్వానించడానికి వసంతాన్ని పువ్వులు పరచమని కోరడం - హౌ పోయెటిక్!

బైట మైదానంలో వెన్నెల పరచుకొని ఉంది. కిటికీకి అవతల గాలికి ఊగుతున్న కొబ్బరి ఆకులు గదిలో  గోడమీద వెలుగు నీడల్ని సృష్టిస్తున్నాయి. వాటిని చూస్తూ రవి అనుకొన్నాడు, "వెన్నెల రాత్రి ఆరుబైట ప్రియురాలితో కలసి ఉన్నప్పుడు, ఆమె పొడవైన నల్లని కురులు అతని ముఖం మీద పడితే వాటి మధ్యనుంచి అతనికి కనిపించే చంద్రకాంతి అలాగే ఉంటుందేమో!` అని.

అతనికి ఇంజనీరింగ్ అప్పుడే పూర్తయింది. కొంచం తెలుగు సాహిత్యం పిచ్చి. వెన్నెలన్నా, కృస్ణశాస్త్రి కవితలన్నా,  హిందీ పాటలన్నా, పొడవైన కురులున్న అమ్మాయిలన్నా చెప్పలేనంత ఇష్టం. కృష్ణశాస్త్రి సృష్టించిన ఊర్వశి లాంటి అమ్మాయి వెన్నెట్లో వయారంగా నడచి వస్తుంటే, ఆమెని ఆహ్వానించడానికి రఫీ లాగ వసంతాన్ని పువ్వులు పరచమని అడగాలనిపిస్తుంది. కానీ, అతని ఊహలకి సుబ్బలక్ష్మి పెద్ద కాంట్రాస్ట్. సుబ్బలక్ష్మి రవి మేనమామ కూతురు. పుట్టినప్పుడే అతనికి పెళ్ళంగా నిర్ణయించబడింది.
***
"ఛీ, ఏం పేరు!," విసుగ్గా అన్నడు రవి. 

"సుబ్బలక్ష్మికేమిరా లక్షణంగా ఉంటేనూ?" అతని తల్లి అంది.

"ముసలి పేరు."

"నీకు అంతగా నచ్చకపోతే, మీ పెళ్ళయ్యాకా  వెన్నెలనో, మల్లికనో మార్చుకో. ఎవరుకాదంటారు?" నవ్వుతూ అంది.

"అసలు సుబ్బలక్ష్మిని ఎవరు పెళ్ళిచేసుకోబోతున్నారు?" విసుగ్గా అన్నాడు. ఆమెతో పెళ్ళంటేనే రవికి వొళ్ళు మండి పోతుంది. చిన్నప్పుడెప్పుడో చూసిన సుబ్బలక్ష్మి రూపం అతని మనసులో గాఢంగా ముద్రపడిపోయింది. ఆమె పిలక జడలు, చప్పిడి ముక్కూ ఇప్పటికీ గుర్తుకు వచ్చి కలవర పెడతాయి.

"మావయ్య కూతురు ముచ్చటగా ఉంటుందిరా. ఒక్కసారి దాన్ని చూశావంటే, ఎగిరి గంతేసి వొప్పుకొంటావు. ఈ ఒక్కసారికీ మావయ్య వాళ్ళ ఊరు వెళ్ళరా నాయనా..." కొడుకుని ఎలాగయినా బుజ్జగించి పెళ్ళిచూపులకి పంపించాలని ఆమె ఉద్దేశ్యం. "...అప్పటికీ నీకు నచ్చక పోతే అప్పుడే ఆలోచిద్దాం లే." సంభాషణని ముగించి లేచింది. తల్లి చెప్పిన చివరి వాక్యం ఓ రిలాక్సేషన్లా అనిపించింది. స్టీరియో ఆన్ చేసి, పక్కమీద వాలుతూ అనుకొన్నాడు, `ఓ సారి చూసి వచ్చి, నచ్చలేదని చెప్పేస్తే సరి,` అని. 
***
సంధ్య చీకట్లు ముసురుకోటుండగా, ఊరు మొదట్లో రవిని దింపేసి బస్సు వెళ్ళిపోయింది. అదొక చిన్న పల్లెటూరు. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న పాలేరుకి సూట్కేసు అప్పగించి, వాడితో పాటూ పొలం గట్లు మీదనుంచి నడుచుకొంటూ మావయ్యగారింటికి బయలుదేరాడు.

ఇంటిల్లిపాదీ అతన్ని సాదరంగా ఆహ్వానించారు. సుబ్బలక్ష్మి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రయాణంలో వొళ్ళంతా హూనమైపోయింది. పెరట్లో పెట్టిన వేడి నీళ్ళతో శుబ్రంగా స్నానం చేసి ఇంటిలోకి రావడంతోటే భోజనానికి పిలుపువచ్చింది. భోజనం చేస్తూ మరదలు ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూసాడు. ఎక్కడా ఆమె ఉన్న అలికిడే లేదు. ఎంతకాదనుకొన్నా మావయ్య కూతురి తాలుకు ఊహలతో మనస్సంతా గజిబిజిగా ఉంది. `అమ్మ చెప్పినట్టు లక్షణంగా ఉంటుందా!` అనుకొన్నడు. `ఒక్కసారి కనిపిస్తే బాగుండు,` అనికూడా అనుకొన్నాడు. 

భోజనం ముగించి, డ్రాయింగ్ రూంలోకి వచ్చి కూర్చుంటూ, కుతూహలం పట్టలేక మేనమామని అడిగాడు, "మావయ్యా, సుబ్బలక్ష్మి ఎక్కడా కనపడదేం?" అని.

మావయ్య అన్నాడు, "పెళ్ళిచూపులకి ఎల్లుండి బాగుందని పంతులుగారు అన్నారు.  దాన్ని చూడటానికి ఈ రెండు రోజులూ ఆగక తప్పదు."

సరిగ్గా అప్పుడే డ్రాయింగ్ రూం గుమ్మానికి కట్టిన కర్టెన్ వెనుక మువ్వల శభ్ధం వినిపించింది. ఓ నీడ కదిలినట్టు అనిపించింది.

అసంకల్పితంగా కర్టెన్ వైపు చూసాడు. అప్పుడే గాలికి ఎగిరిన తెరకి అటువైపు ముందుగా వెండిపట్టీలు పెట్టుకొన్న రెండు పచ్చటి పాదాలు పట్టుపరికిణీ అంచుల వెనుకనుంచి కనిపించాయి. తరువాత, వెనుతిరిగి తుర్రున లోనికి పరిగెడుతున్న సుబ్బలక్ష్మి సొగసైన మెడ మీద పొడవైన వాలుజడ క్షణకాలం మెరిసి మాయమయ్యింది.

రవికి కుతూహలం పెరిగింది. అతని కుతూహలం గమనించి మావయ్య నవ్వాడు. రవికి బిడియమేసి, చప్పున చూపులు తిప్పుకొని, దృష్ఠి చేతిలో ఉన్న పాత మేగజైన్ మీదకి మళ్ళించాడు.

ప్రయాణ బడలిక వల్ల ఆరాత్రి మత్తుగా నిద్ర పట్టేసింది. కలల నిండా వెండి పట్టీలు ఆనంద లాస్యం చేశాయి.

***
మరునాడు ఉదయం మావయ్యతో పాటూ పొలం చూడటానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నమయ్యింది. భోజనంచేసి, రిలాక్స్ అవుతూ ఉండగా ప్రక్క గదిలో నుంచి అతనికి ఎంతో ఇష్టమైన ముఖేష్ పాట సన్నగా అతని చెవిలో పడింది.

"ఖభీ, ఖభీ మెరే దిల్ మే ఖయాల్ ఆతా హై..." ఎవరో పాటలు వింటున్నారు.

"....ఏ హోఠ్, యే బాహే మేరీ అమానత్ హై..." పాట సాగుతూ ఉంటే ఓ అందమైన అమ్మాయి దొండపండు పెదవులు, నున్నని బాహువులు అతని కళ్ళముందు కదలాడ సాగాయి. ఆ వెంటనే ముందురోజు అతను చూసిన పచ్చటి పాదాలు తళుక్కున జ్ఞాపకం వచ్చాయి. `సుబ్బలక్ష్మి అందంగానే ఉంటుందేమో!` అనిపించింది.

పాట సాగుతూనే ఉంది-

"...ఏ కేశావోంకీ ఘనీ చావ్ మే మేరీ ఖాతిర్..." ఈ సారి పొడవైన మరదలి జడ ఊహల్లోకి వచ్చింది. ఇష్టమో, అయిష్టమో తెలియని ఏదో ఫీలింగ్ మనసులో గుచ్చి ఇబ్బంది పెడుతుంది. మనసంతా దిగులుగా అయి పోయింది.

బావకి కంపెనీ కూర్చున్న ఇంటర్మీడియట్ చదువుతున్న సుబ్బలక్ష్మి తమ్ముడు రవిని గమనించి అడిగాడు, "ఏమిటి బావా ఆలోచనల్లోకి వెళ్ళిపోయావు?" అని.

"ఎవర్రా పాటలు పెట్టింది?"

"ఇంకెవరూ? అక్కయ్యే. ఎప్పుడూ పాత పాటలు వింటూ వెన్నెట్లో కూర్చుంటుంది," అవసరమైన దానికంటే ఎక్కువే చెప్పాడు.

సుబ్బలక్ష్మి టేస్టు రవికి నచ్చింది.

వాలు జడలో మల్లె పూలు తురుముకొని నడచి వస్తున్న ఆమె ఊహల్లో మెదిలి మనసు తన్మయత్వం చెందింది.

అప్పుడే అతని ఊహలని చెదరగొడుతూ సెల్ ఫోన్ మ్రోగింది.
***
`టాప్ టెన్ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన ఎంఫసిస్ లిమిటెడ్ వాళ్ళు ఆఫ్ కేంపస్ డ్రైవ్ జరుపుతున్నారని, వెంటనే హైదరాబాద్ వచ్చేయ్యమని,` ఫ్రెండ్ ఫోన్.

పెళ్ళిచూపుల కార్యక్రమమేదో ముగించి వెళ్ళ మని ఎంతచెప్పినా వినలేదు రవి. `పెళ్ళి చూపులు ఎప్పుడైనా పెట్టుకో వచ్చని, ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతే, మళ్ళి అటువంటి మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశం రాకపోవచ్చునంటూ, వెంటనే వెళ్ళాలని` పట్టుబట్టాడు.

ఆరోజు సాయంత్రమే మేనమామ పలుకుబడి అంతా ఉపయోగించి సంపాదించిన  రిజర్వేషన్ టిక్కెట్టు పట్టుకొని ప్రైవేట్ బస్సు ఎక్కాడు.
***
కొన్నిరోజులు గడిచాయి.

రవికీ, సుబ్బలక్ష్మికీ పెళ్ళిచెయ్యడానికి పెద్దవాళ్ళు ముహూర్తాలు నిర్ణయిస్తుంటే అడ్డుచెప్పలేదు రవి. వాళ్ళ పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయింది.

పీటలమీద సుబ్బలక్ష్మిని చూసిన రవికి ఆనందం వేసింది. అందుకు కారణం ఆమె బాగా నచ్చడమే. కానీ, ఆమెకి మాత్రం ఒక సందేహం మిగిలి పోయింది.

`మొదట తనని  పెళ్ళాడనని పట్టుబట్టిన బావ, అస్సలు చూడకుండానే ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకొన్నాడా!` అని.  

ఆ విషయమే మొదటిరాత్రి అతనిని అడిగింది.

అతనన్నాడు, "నేను, నిన్ను అస్సలు చూడలేదని ఎందుకు అనుకొన్నావు?" అని.

 ఆమె  ఆశ్చర్య పోయి, ఏమి చూశావంది.

"నవ్వుతున్న పుట్టుమచ్చ," నన్నాడు.

"పుట్టుమచ్చ నవ్వటమేమిటీ!?" అంది.

అప్పటికి వాళ్ళిద్దరూ పందిరి మంచం మీద ఉన్నారు. అతను ఆమె పక్కనుంచి లేచి,  పాదాలని కప్పిఉంచిన పట్టుచీర కుచ్చీళ్ళని కొంచెం పైకి జరిపాడు. కుడి పాదపు చర్మం  గులాబీ రంగులోకి మారేచోట ఉన్న కందిగింజంత పుట్టుమచ్చ మీద సుతారంగా పెదవులానించాడు. అతని గరుకు మీసాలు వత్తుకొని చక్కిలిగింతలై , "కిల కిల," మని నవ్వింది.

అతను అన్నాడు, "చూశావా, పుట్టుమచ్చ ఎలా నవ్విందో?" అని.
© Dantuluri Kishore Varma 

Thursday 4 October 2012

ద్వారపూడి

బయటనుంచి
కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రీ వైపు వెళ్ళే కెనాల్ రోడ్డు ప్రక్కన ద్వారపూడి ఉంది. ఇక్కడ ఒకే ప్రాంగణంలో సుమారు పది పెద్ద దేవాలయాలు ఉన్నాయి. 
పాలరాతితో నాలుగు అంతస్తులుగా నిర్మించిన శివాలయం: ఇందులో స్తూపాకారంగా క్రిందనుంచి నాలుగవ అంతస్తువరకూ వ్యాపించిన శివలింగం ఉంది. రెండవ, మూడవ అంతస్తులలో ప్రదక్షిణ మార్గం చుట్టూ పురాణగాధలో సన్నివేశాలని తెలియజేసే విగ్రహాలను ఏర్పాటుచేశారు. నాలుగవ అంతస్తులో, శివలింగ శిఖరానికి అబిషేకం చేస్తే, అబిషేక జలం క్రిదకి వచ్చే మార్గంలో ప్రధాన లింగానికి అనుసంధానం చేసిఉన్న 18 చిన్న లింగాలని తాకుతూ క్రిందకి వస్తుంది. ఈ దేవాలయాన్ని అష్ఠాదశ(18) ఉమా సోమేశ్వరదేవాలయం అంటారు.
శివాలయం
శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి, రెండువైపులా హనుమంతుడు, నందీశ్వరులు తమ తమ హృదయాలలో శ్రీరామ పట్టాభిషేకాన్ని చూపిస్తూ పెద్ద విగ్రహాలు ఉన్నాయి.
(ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంచడం యొక్క ఉద్దేశ్యం, నందీశ్వరుడి గుండెల్లో సీతారాములు ఎందుకు ఉన్నారో నాకు అర్ధంకాలేదు)
శివాలయం ప్రక్క ప్రవేశద్వారానికి ఎదురుగా మహానంది ఉంది. ఆలయం నాలుగవ అంతస్తు కిటికీ నుంచి కనిపించేలాగ దీనిని నిర్మించారు.
పురాణాలలో నందీశ్వరుడికి సంబంధించిన మూడునాలుగు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ప్రతీశివాలయంలోనూ శివలింగానికి అభిముఖంగా నందిని చూస్తుంటాం. నంది శివుని వాహనంగా మనకి తెలుసు. కానీ లింగపురాణంలో నంది సాక్షాత్తూ శివుని అవతారం అని చెప్పబడింది. శిలాదుడు అనే మహర్షి అమరుడైన(మరణం ఉండబోని చిరంజీవి అయిన) ఒక పుతృనికోసం శివునికి తపస్సుచేస్తాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి తానే అతనికి పుత్రునిగా జన్మిస్తానని వరం ఇచ్చి, అలాగే చేస్తాడు. అంతేకాకుండా కైలాసంలో శివునికి ద్వారపాలకులిగా ఉండే ఇద్దరిలో ఒకరు నంది, రెండవవాడు మహాకాళి. శివుని ప్రమదగణాలకు అధిపతికూడా నందీశ్వరుడే. నందికి దివ్యత్వం, బలం, అధికారమే కాకుండా తెలివి కూడా ఉందని చెప్పే కథ ఏమిటంటే - ఈయన పురాణాలలో చెప్పబడిన ప్రధమగురువులలో ఒకడట. ఈ సారి ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని కేవలం ఒక వాహనంగానే కాకుండా, ఇంకా మిగిలిన అంశాలుకూడా దృష్ఠిలో ఉంచుకొని చూడండి.
భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం: శివాలయానికి ఎడమవైపు భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ఉంది. వెండి శివలింగం భారతదేశం మొత్తానికి ఇక్కడే ఉందట. దర్శనానికి ఆడవారు చీరలో, మగవారు పంచలో సాంప్రదాయబద్దంగా వెళ్ళాలి. లేకపోతే అనుమతించరు. బయట మగవాళ్ళకి పంచలు రెండురూపాయలకి అద్దెకి ఇస్తున్నారు. అందరికీ అవే ఇస్తూ ఉంటారుకనుక ఎవరైనా ధైర్యం ఉంటే అద్దెకితీసుకొని లోనికి వెళ్ళవచ్చు.    
 ఇక్కడే విష్ణుమూర్తి యొక్క దశావతార దేవాలయం నిర్మాణంలో ఉంది. 
అయ్యప్పస్వామి దేవాలయం: ఈ గుడిని ఆంధ్రా శబరిమల అని అంటారు. అయ్యప్ప మాలదారులు అంతదూరం ప్రయాణించి శబరిమల వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వస్తారు. 1989లో అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహాన్ని కంచి పీఠాధిపతి స్వామీ జయేంద్ర సరస్వతి వారి చేతులమీదగా ప్రతిష్టించారు.  ఒకేరాతి మీద చెక్కిన 18 మెట్లను తమిళనాడు నుంచి తీసుకువచ్చారట. కేరళలోని శబరిమల ఆలయంలో జరిగిన విధంగానే ఇక్కడకూడా సాంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహిస్తారు.
మహిషాసురిడిని దుర్గాదేవి సమ్హరించిన తరువాత, అతని సోదరి మహిష బ్రహ్మగురించి తపస్సుచేసి శివుడి చేత కానీ, విష్ణువు చేత గానీ చంపబడకుండా ఉండాలని వరంపొందుతుంది. తరువాత కొంతకాలానికి మోహినీ రూపంలో ఉన్న విష్ణువుని చూసి శివుడు మోహించిన కారణంగా వారికి జన్మించిన పుత్రుడే ధర్మశాస్త అనబడే అయ్యప్ప. మహిషను చంపడానికి పుట్టిన కారణజన్ముడు.   అయ్యప్పని హరిహర పుత్రుడు అని కూడా అంటారు.  ఈ పురాణ గాధని సూచిస్తూ దేవాలయానికి ముందు ఎత్తైన్ శివకేశవ విగ్రహం ఉంది.
శివకేశవ విగ్రహం
దుర్గాదేవి ఆలయం: గుదిలోనికి  సింహపు నోటి ప్రవేశ ఆకారపు ద్వారంగుండావెళ్ళాలి.  
లోపల చిన్న అష్ఠలక్ష్ముల మందిరం, వివేకానంద, వేమన, బ్రహ్మంగారు వంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో దేవి.  
ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సాయిబాబా మందిరం, నాగదేవత ఆలయం, శనీశ్వరాలయం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం....
శిరిడీ సాయిబాబా ఆలయంలో సాయినాధుని విగ్రహానికి వెనుకవైపు ఒక గర్భ గుడిలాంటి చాంబర్లో పవళించి ఉన్న  అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ఉన్న అన్నింటిలోనూ నాకు బాగానచ్చింది. అందుకే ఒక ప్రత్యేకమైన పోస్టు వేశాను చూడండి. 

పెద్ద గుడి. చూడటానికి ఎలా లేదన్నా గంట పడుతుంది. ఇక్కడి పరిసరాలు సుచీ శుబ్రతలతో ఉంటే దర్శనం ఒక గొప్ప అనుభూతిని మిగల్చడం ఖాయం. కానీ, ఎవరూ అంత శ్రద్ద తీసుకొంటున్నట్లు కనిపించడం లేదు.

దేవాలయం స్టాల్లో పద్దెనిమిది పిక్చర్ పోస్టుకార్డుల సెట్ పాతికరూపాయలకి అమ్ముతున్నారు. ఈ వాల్ మీద టైటిల్స్ ప్రింట్ చేసి ఉన్న ఫోటోలు అందులోనివే. మిగిలినవి నేను తీసినవి. కెమేరా అనుమతిస్తున్నారు. దానికి టిక్కెట్టు ముప్పై రూపాయలు. కారు పార్కింగి కి ప్రత్యేకమైన స్థలం లేకపొయినా, రోడ్డుప్రక్క నిలుపుకొన్నందుకు దేవాలయం వాళ్ళకి ఇరవై రూపాయలు కట్టాలి. చిల్లర దగ్గర ఉంచుకోండే!   

ఇంకా ఓపిక ఉంటే ఇదికూడా చదవచ్చు మీరు వీకెండ్ @ కడియం . 


© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!