Pages

Saturday 29 December 2012

కోనసీమ

గోదావరి నదీపాయలైన గౌతమి, వశిష్టల మధ్య ఒకవైపు బంగాళాఖాతంతో ఉన్న డెల్టా ప్రాంతం - కోనసీమ. త్రికోణాకారంలో కోన(కొండ)ని పోలిఉన్న సీమ(ప్రాంతం) కనుక దీనిని కోనసీమ అంటారట. తూర్పుగోదావరిజిల్లాలో పదహారు మండలాలు కోనసీమలో ఉన్నాయి. అవి అమలాపురం, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు, కొత్తపేట, ఆత్రేయపురం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, రావులపాలెం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలు.

గోదావరిమీద బ్రిడ్జీలు నిర్మించడానికి పూర్వం కోనసీమనుంచి బయట ప్రదేశానికి రాకపోకలు లాంచీలమీద, పడవలమీద జరిగేది. ఇప్పటికీ లాంచీ ప్రయాణాలు పాతబడిపోలేదు. గోదావరినది దాటుతున్నప్పుడు దూరంగా మధ్య, మధ్యలో కనిపించే లంకల్లాంటి ఇసుకమేటలు, చిన్నచిన్న అలలు లాంచీ అంచులకి తగిలి నప్పుడు మీదపడే నీటి తుంపరలు, చల్లగా వీచే గాలి, లాంచీలో జనాల రణగొణద్వని- పదిహేను, ఇరవై నిమిషాల ప్రయాణం డ్రీం జర్నీలా ఉండేది.
సమృద్ధిగా నీటివనరులు, అత్యంత సారవంతమైన నేలా ఉన్న కారణంగా పంటలు చాలా బాగా పండుతాయి. కనుచూపుమేర విస్తరించిన వరిపొలాలు, కొబ్బరితోటలు, కాలువల్లో నింపాదిగా సాగే పడవలతో కేరళానుంచి ఒకముక్క కత్తిరించి ఆంధ్రాలో అతకించినట్టు ఉంటుంది కోనసీమ. కోనసీమలో రైతే రాజు. పొలానికి నీరు పెట్టుకోవడం, దుక్కిదున్నుకోవడం, విత్తనాలు జల్లుకోవడం, నాట్లువేసుకోవడం, కలుపుతీసుకోవడం, ఎరువులు, పురుగుమందులు జల్లుకోవడం, కోతలు కోసుకోవడం, కుప్పలునూర్చుకోవడం, ధాన్యాన్ని మార్కెట్టుకో, ఇంటికో చేర్చుకోవడం, మళ్ళీ పైర్లు చల్లుకోవడం...ఏడాదంతా పనే! దాళవాలకి నీరు వదలనప్పుడో, తుఫాన్లు కన్నెర్రజేసినప్పుడో, పంటలకి కిట్టుబాటుధర సరిగా లేనప్పుడు తనంతట తాను క్రాపు హాలిడే ప్రకటించుకొన్నప్పుడో తప్పించి రైతుకి శలవు లేదు. ఇక్కడ వరి తరువాత ఎక్కువగా పండించే పంట అరటి. రావులపాలెంలో అరటి మార్కెట్ రాష్ట్రంలోనే ప్రముఖమైన వాటిల్లో ఒకటి. తెలతెల వారుతూ ఉండగా, మంచు తెరలు ఇంకా భూదేవి మేనిపైనుంచి తొలగకముందే సైకిళ్ళమీద రైతులు అరటిగెలలు మార్కెట్లకి తీసుకువెళుతుండడం ఒక మనోహరమైన దృశ్యం. 
కోనసీమలో ఎన్నో దేవాలయాలున్నాయి. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి, మురమళ్ళలో వీరేశ్వరస్వామి, ముక్తేశ్వరంలో క్షణముక్తేశ్వరస్వామి, అప్పనపల్లిలో వేంకటేశ్వరస్వామి, అంతర్వేదిలో నరసింహస్వామి, అయినవిల్లిలో శ్రీ సిద్దివినాయకస్వామి, మందపల్లిలో శనేశ్వరస్వామి ఇక్కడి కొన్ని ప్రముఖమైన దేవాలయాలు.

`గుళ్ళూ, గోపురాల్లాంటివేనా ఇంకా ఏమైనా ఉన్నాయా?` అంటారా? అన్నీ చెప్పాలంటే ఒక్క టపా సరిపోదు. అలా అని చెప్పకుండా ఉండాలంటే మనసొప్పదు. అందుకే మీకోసం, నాకోసం కొన్ని విశేషాలని ఇక్కడ ఇస్తున్నాను. అవి ఏమిటంటే.. ఆదుర్రులో బౌద్ద స్థూపం,  మలికిపురంలో దిండీ రిసార్ట్స్, ముమ్మిడివరంలో బాలయోగి ఆశ్రమం   అమలాపురంలో కోనసీమకే మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ ఎస్.కే.బీ.ఆర్ కాలేజ్. ఆత్రేయపురం పూతరేకులు, బండారులంక చీరలు, కోనసీమ కొబ్బరికాయలు, ఆప్యాయంగా పలకరించే ప్రజలు ఈ ప్రాంతం ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఎవరో చెప్పినట్టు కోనసీమ అంటే వర్షంలా కురిసిన చిలకాకుపచ్చరంగు కల. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు! కెమేరాని ఎటుతిప్పి తీసినా అందమైన దృశ్యమే వస్తుంది.

ఈ సారి ఇక్కడికి వచ్చినప్పుడు జనసామాన్యాన్ని కూడా చూడండి. కలుపుతీసే పల్లె పడుచులు, మైదానంలో మేకలని కాసుకొనే  ముసలికాపరి, చెట్లకొమ్మలకి తాడు ఉయ్యాల కట్టి ఊగే చిన్నపిల్లల గుంపు, కాలువలో ప్రపంచాన్ని మరిచి ఈతలుకొట్టే యువకులు, సంధ్యా సమయంలో పడవతెడ్డుమీద గెడ్డం ఆనించి సూర్యాస్తమయాన్ని చూస్తున్న నావవాడు, ఆవులమందని ఇంటిదారిపట్టిస్తున్న కుర్రాళ్ళు... ఏదయినా మీ కెమేరా కంటికి అందమైన ఫోటోని ఇవ్వవచ్చు.

ఫేస్‌బుక్‌లో కోనసీమ అనే పేజీని ఇక్కడ చూడండి

© Dantuluri Kishore Varma

Monday 24 December 2012

ప్రేమ గెలుస్తుంది

చార్లెస్ డికెన్స్ రాసిన ఎ క్రిస్మస్ కేరల్ నవలలో స్క్రూజ్ అనే వ్యక్తి పరమపిసినారి. పిల్లికి కూడా బిచ్చం పెట్టని రకం. మన నేటివిటీకి పోల్చి చెప్పాలంటే, జంద్యాల `అహ నా పెళ్ళంట` సినిమాలో కోట శ్రీనివాసరావు టైపు. పండగ పూటా ఇంటికి భోజనానికి పిలవడానికి వచ్చిన మేనల్లుడిని, `ఏమి డబ్బులున్నాయనిరా, నువ్వు క్రిస్మస్ అని ఎగిరెగిరి పడుతున్నావు?` అంటాడు. ఈ పిసినారి దృష్టిలో పండగంటే డబ్బులులేకపోయినా షాపింగ్ బిల్లు కట్టడం, ఒక సంవత్సరం వయసు పెరగడం... అంతకంటే ఏమీలేదు. అతని మేనల్లుడు మాత్రం అలాంటి వాడుకాదు. అతని ఉద్దేశ్యం ప్రకారం ఇది ఒక గొప్ప సమయం, సాధారణంగా కుంచిచించుకుపోయి ఉండే హృదయాలు దయతో, భక్తితో, సమాజంలో అందరి పైనా ఆపేక్షతో తెరుచుకొనే రోజు. అందుకే, స్క్రూజ్‌తో అంటాడు, `నీకు ఏమిలేదని పండుగపూటా అలా ఏదో పోగొట్టుకొన్నట్టు ఉంటావు?` అని.

ఊళ్ళో మెయిన్ రోడ్డు జనాలతో కిటకిటలాడిపోతుంది. బట్టల కొట్లు, జోళ్ళ షాపులు, స్వీట్ స్టాళ్ళు, బంగారం కొట్లు, టైలరింగ్ షాపులు... పండగ శోభతో కళకళ లాడుతున్నాయి. ప్రియమైన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం సాంప్రదాయం. ఉన్నంతలో ఆప్తులని ఆనందపెట్టడం ఒక గొప్ప తృప్తి. ఏదో కథలో భార్యాభర్తలు - ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. క్రిస్మస్‌కో, పెళ్ళిరోజుకో ఒకరికి తెలియకుండా, ఇంకొకరు పరస్పరం బహుమతులు ఇద్దామనుకొంటారు. కానీ పాపం అంత కలిగున్న సంసారం కాదు. భర్తకి మంచి వాచ్ డయల్ ఉంటుంది దానికి చెయిన్ ఉండదు. భార్యకి పొడవైన జుట్టు ఉంటుంది కానీ దాన్ని చక్కగా దువ్వుకోవడానికి దంతపు దువ్వెన ఉండదు. పండుగరోజు ఉదయాన్నే ఒకరికొకరు ఇచ్చుకొన్న బహుమతులు చూసుకొని అవాక్కవుతారు. ఆయనకి వాచ్ చెయిను, ఆమెకి దంతపు దువ్వెన! కానీ, ఏమి ప్రయోజనం? ఆమె తన పొడవైన జుట్టు అమ్మి ఆయనకి బహుమతిని కొంటే, ఆయనగారేమో తన వాచ్ డయల్ అమ్మి ఆవిడకి దువ్వెన కొన్నాడు. ప్రేమగెలిచింది. 

చదువులూ, ఉద్యోగాలు అని పిల్లలు దూరప్రాంతాలకి వెళ్ళిపోవడంతో, ఒంటరిగా ఉన్న తల్లితండ్రులకి పండగ ఉత్సాహం ఉండటంలేదు. `ఎ క్రిస్మస్ మాణింగ్` అనే కథలో రాబర్ట్, అతని భార్యా పండుగరోజు సాయంత్రం వచ్చే పిల్లలు కోసం, మనుమలకోసం ఎదురు చూస్తారు. `క్రిస్మస్ ట్రీని మనిద్దరికోసం అలంకరించాలా?` అంటుంది. `ఎంతమంది ఉన్నారని కాదు, ఇద్దరే ఉన్నా పండుగ పండుగే,` అంటాడు రాబర్ట్. అతని చిన్నప్పటి విషయాలు జ్ఞాపకం వస్తాయి.  పదిహేను సంవత్సరాల వయసులో ఆవులకి పాలు తియ్యడానికి తండ్రికి సహాయం చెయ్యాలి. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేపేవాడు తండ్రి. ఎదిగే వయసులో పిల్లాడికి నిద్ర ఎంత అవసరమో తెలుసు. కాని  కొన్ని తప్పవు. రాబర్ట్ తండ్రి ఎంతో బాధపడుతూనే కొడుకుని మేల్కొలిపే వాడు. క్రిస్మస్ రోజు రాబర్ట్ రోజూకంటే ముందే నిద్రలేచి, ఒక్కడే బకెట్ల నిండా పాలు పితికి, గప్‌చిప్ గా వచ్చి ముసుగుతన్ని పడుకొంటాడు. తండ్రి ఎప్పటిలాగే ఖాళీ బకెట్లకోసం పశువుల శాలకి వెళ్ళతాడని తెలుసు. నిండుగాఉన్న పాత్రలని చూసి ఎంతగా ఆశ్చర్యపోతాడో ఊహించుకొంటూ తండ్రి రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఉధ్వేగంతో గుండె అదేపనిగా కొట్టుకొంటూ ఉంటుంది. గాఢమైన ఉచ్వాశనిశ్వాసాలని బలవంతంగా నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తుండగా తండ్రి గదిలోకి వస్తాడు. కొడుకు ఇచ్చిన విలువైన బహుమతి గర్వంగా తీసుకొన్న తండ్రి, ఆ గర్వానికి కారణభూతుడైన కొడుకు ఘాఢమైన ఆలింగనంలో శుభాకాంక్షలు చెప్పుకొంటారు. ప్రేమగెలిచింది.

బహుమతులంటే తప్పనిసరిగా గుర్తుకువచ్చే బొద్దుగా ఉండే సాంతాక్లాజ్ ఒక ఫాంటసీ. ఎర్రనికోటు, తెల్లగా పండిన గుబురు మీసం, గెడ్డాలు, చేతికి గ్లౌస్, కళ్ళకి జోడు, కాళ్ళకి బూట్లుతో క్రిస్మస్ తాత సంవత్సరమంతా మంచి, చెడ్డ పిల్లల జాబితా తయారు చేసుకొని పండుగ ముందురోజు రాత్రి రెయిన్‌డీర్‌కి కట్టిన స్లెల్డ్జ్ మీద ఆకాశ మార్గంలో వచ్చి నిద్రిస్తున్న మంచి పిల్లలకి మంచిమంచి బహుమతులు, చెడ్డ పిల్లలకి బొగ్గుముక్కలూ వాళ్ళ వాళ్ళ ప్రక్కన నిశబ్ధంగా పెట్టేసి వచ్చినట్టే వెళ్ళిపోతాడట. పిల్లలు ఏం బహుమతికావాలో సాంతాక్లాజ్‌కి విన్నవించుకోంటే, పెద్దలు ఏమివ్వగలరో అది నిద్రపోతున్న పిల్లల పక్కలో చప్ప్పుడుచెయ్యకుండా పెట్టేయండి. ప్రేమ గెలుస్తుంది. అందరికీ మెర్రీ క్రిస్మస్! 

 A pleasant and cute animated story showing the tradition of Santa Claus ఇక్కడ చూడండి

© Dantuluri Kishore Varma

Sunday 16 December 2012

ప్రియమైన విష్ణుమూర్తికి...

విష్ణుమూర్తికి ప్రియమైన ధనుర్మాసంలో ఆయన దశావతారాల సందర్శన ఇదిగో ఇలా. మానవ పరిణామ క్రమం కూడా దశావతారాల్లో కనిపిస్తుంది అంటారు - మీరు కూడా గమనించండి. రాజమండ్రీ ఇస్కాన్ దేవాలయంలో దశావతార మూర్తులు. ప్రత్యేక అనుమతితో మన కాకినాడ బ్లాగ్‌ కోసం తీసిన ఫోటోలు. 
1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము 
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల్క్యావతారము
మనవాళ్ళకి అన్నీ తెలుసు!

చార్లెస్ డార్విన్ అనే ఆయన జీవపరిణామ సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. పరిణామం అంటే మార్పు. ఈ భూమి మీద మనిషి, మనిషిలాగ ఆవిర్భవించలేదు. చుట్టు ప్రక్కల ఉన్న పరిసరాలకి అనుగుణంగా తనను తాను మార్చుకొంటూ,  జీవం మార్పు చెందుతూ వచ్చింది. భూమి పూర్తిగా నీటితో నిండి ఉన్నప్పుడు కేవలం చేపల్లాంటి జలచరాలు మాత్రమే ఉండేవి. ఆతరువాత నీటిలోను, భూమి మీదా కూడా నివశించగలిగిన ఉభయచరాలు వచ్చాయి. కొంతకాలానికి, పూర్తిగా భూమిమీద నివసించగలిగిన జంతువులు, వాటినుంచి జంతువులాంటి మనిషి, అతనినుంచి పూర్తిగా పరిణామం చెందని మనిషి, తరువాత  ఇప్పడు మన అందరిలాంటి పరిపూర్ణ వ్యక్తిగా అవతరించడం జరిగింది. ఈ మార్పులన్నీ జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది.  

దీనినే పరిణామ క్రమం అంటారు. ప్రపంచం అంతా 1869 నుంచి, అంటే డార్విన్ ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించిన దగ్గరనుంచీ ఈ విషయాన్నిఅవగాహన చేసుకోవడం మొదలు పెట్టింది. కానీ, మన దేశంలో దీనిని వేలసంవత్సరాలకు పూర్వమే కథల రూపంలో నిక్షిప్తం చేశారు.

మన పురాణాలలో విష్ణువు దశావతారాలు ఈ పరిణామ క్రమానికి సరిగ్గా సరిపోతాయి. మొదటిది మత్యావతారం(చేప) - జలచరం; రెండవది కూర్మావతారం(తాబేలు) - ఉబయచరం; మూడవది వరహావతారం(వరహం)- జంతువు; నాలుగవది నరసింహావతారం(సగం సింహం, సగం మనిషి)- జంతువు లాంటి మనిషి; అయిదవది వామనావతారం(పొట్టి మనిషి)- పూర్తిగా పరిణామం చెందని మనిషి; తరువాత అవతారాలన్నీ (పరశురామ,   రామ, కృష్ణ, బుద్ధ, కల్కి) పూర్తి మానవావతారాలు.

కథలరూపంలో చెపితే ఏదయినా అవగాహన చేసుకోవడం ఎంతో సులభం అని మన పూర్వికులు భావించడం వల్ల పరిణామక్రమాన్ని దశావతారాల్లో చూపించడం జరిగింది.

© Dantuluri Kishore Varma

Saturday 15 December 2012

ఆ ఐదు లక్షణాలూ... దుర్గాబాయి

ఉన్న దారిలో నడిచేవాళ్ళు బాటసారులౌతారు, దారిని ఏర్పాటుచేసుకొంటూ ముందుకు సాగేవాళ్ళు మార్గదర్శులౌతారు. వందసంవత్సరాలక్రితం మన సమాజంలో మహిళలకి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. బాల్యవివాహాలు, అవిద్య, వివక్షలు అధిగమించి జాతీయస్థాయిలో స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సంఘసేవకురాలిగా, సంస్కర్తగా, విద్యావేత్తగా, పార్లమెంటేరియన్‌గా కీలక భూమికను పోషించడం దుర్గాబాయి(1909-1981) లాంటి  ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే సాధ్యమౌతుంది. ఈ ప్రత్యేకత ఆమెకు కలగడానికి కారణం ఆమె వ్యక్తిత్వం.  లక్ష్య నిర్ధేశం, పట్టుదల, నాయకత్వ ప్రతిభ, సృజనాత్మకత, సేవానిరతి అనే ఐదు లక్షణాలూ దుర్గాబాయిలో కనిపిస్తాయి.  అవే ఆమెకి భారతదేశ చరిత్ర పుటల్లొ ఒక శాశ్వత స్థానాన్ని సమకూర్చి పెట్టాయి.
దుర్గాబాయి రాజమండ్రీలో జన్మించింది. తండ్రి బెన్నూరి రామారావు, తల్లి కృష్ణవేణి. రాజమండ్రీ అమ్మమ్మగారి ఊరు. తండ్రిది కాకినాడ కోర్టులో ఉద్యోగం. విక్టోరియా టైప్ ఇన్స్టిట్యూట్‌కూడా నిర్వహించేవారు. దుర్గా బాయికి వెంకట దుర్గా నారాయణరావు అనే ఒక సోదరుడు ఉన్నాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే అమలాపురానికి చెందిన గుమ్మడిదల సుబ్బారావు అనే ఆయనతో ఆమె వివాహం జరిగింది. కుటుంభ జీవితం కంటే సంఘసేవకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చే దుర్గాబాయితో, సుబ్బారావుగారికి సరిపడక ఇరవైరెండేళ్ళ వైవాహిక జీవతం తరువాత వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. తరువాత చాలా కాలానికి స్వాతంత్ర్యానంతరం ఆమె జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తుండగా జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలిలో ఆర్ధికశాఖ నిర్వహిస్తున్న చింతామణి దేశ్‌ముఖ్ తో 1953లో మనసులుకలిసిన వివాహం జరిగింది. అప్పటినుంచే ఆమె దుర్గాబాయిదేశ్‌ముఖ్‌గా వ్యవహరించబడ్డారు. ఇది క్లుప్తంగా ఆమె వ్యక్తిగత జీవితం.  

ధైర్యం, నిజాయితీ, సంఘసేవ బీజాలు తండ్రి నుంచి సంక్రమిస్తే, గాంధీగారి ప్రభావం దుర్గాబాయిమీద చిన్నప్పటినుంచీ ఉంది. ఆయనని దగ్గరనుంచి చూడాలని, మాట్లాడాలనీ ఎంతో మంది భారతీయులల్లాగే ఆమే కోరుకొన్నారు. 1921వ సంవత్సరంలో రాజమండ్రీలో గాంధీగారి సభ జరిగింది. అప్పుడు పన్నెండెళ్ళ దుర్గాబాయి అక్కడ ప్రజలనుంచి కాంగ్రెస్ నిధిని వసూలు చేసి, తనచేతిగాజులని కూడా కలిపి గాంధీగారికి అప్పగించడం జరిగింది.  1923లో కాంగ్రెస్ మహాసభలు కాకినాడలో జరిగినప్పుడు ఎంతో మంది మహిళా కార్యకర్తలకి హిందీ మాట్లాడడంలో తర్పీదునిచ్చి తానుకూడా పాల్గొనడానికి తయారయితే, ఆమె అప్పటికి మేజరు కాని కారణంగా కేవలం వేరొకరికి సహాయకురాలిగా సభలకు హాజరయింది. కానీ ఆశ నిరాశ అయ్యేలా గాంధీగారు ఆ సభలకు హాజరు కాలేదు. ఈ సభల సమయంలోనే ఒక తమాషా సంఘటన జరిగింది. సభలతో పాటూ ఖాదీ ప్రదర్శన ఏర్పాటుచేశారు. ప్రవేశ ద్వారం దగ్గర టిక్కెట్లు చించి, సందర్శకులని లోనికి అనుమతించే బాధ్యత దుర్గా బాయికి అప్పగించారు. జవహర్లాల్ నెహ్రూ లోనికి వస్తున్నప్పుడు టిక్కెట్టు లేనిదే అనుమతించేది లేదని ఆయనను అడ్డగించిందట. అప్పుడు వెనుకనున్న కొండావెంకటప్పయ్య గారు, నెహ్రూ గారికి టిక్కెట్టు కొనిపెట్టారట. ఈ సందర్భంలో దుర్గాబాయి కర్తవ్య నిర్వాహణను నెహ్రూ చాలా మెచ్చుకొన్నారట.

సమాజంలో దేవదాసీల జీవితం చాలా దుర్భరంగా ఉండేది. కాకినాడలో గాంధీగారి సభను వాళ్ళకోసం ఏర్పాటుచేసి, వాళ్ళ జీవితంలో కొంత మార్పు తీసుకురావాలని దుర్గాబాయి భావించారు. అప్పుడు(1929) కాంగ్రెస్ విరాళాల సేకరణకోసం గాంధీగారు  ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. దుర్గాబాయి సూచనను పాటించి, సభను ఏర్పాటు చెయ్యాలంటే 5000 రూపాయలు విరాళం సేకరించాలని స్థానిక నాయకులు ఒక చిక్కుముడిని వేస్తారు. ఆ రోజుల్లో ఐదువేలంటే తక్కువ మొత్తం కాదు. కానీ ఎన్నో వ్యయ ప్రయాశలకోర్చి, నిధిని కూడబెట్టి సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. స్వాగతోపన్యాసం చక్కని హిందీలో చేసిన దుర్గాబాయి భాషా కౌశలం గమనించి గాంధీగారు తన ప్రసంగాన్ని తెలుగులో అనువదించే అవకాశం కొండా వెంకటప్పయ్య స్థానంలో, దుర్గాబాయికి కలుగజేసారు. అక్కడి నుంచి ఆమెని తన కారులోనే కాకినాడ టౌన్‌హాలుకి తీసుకొని వెళ్ళి అక్కడి ఉపన్యాసానికి కూడా అనువాధకురాలిగా చేసారు. తరువాత ఆంధ్రదేశమంతా ఆమే, ఆయన ఉపన్యాసాలని తెలుగులోనికి అనువదించారు.

1930లో ఉప్పుసత్యాగ్రహం జరిగినప్పుడు తన భర్త సుబ్బారావు అనారోగ్యకారణంగా మద్రాసులో ఉన్న దుర్గాబాయి, ఊరుకాని ఊరులో కార్యకర్తలని పోగుచేసి సత్యాగ్రహ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు మొదటిసారి అరెస్టయ్యారు. తరువాత రెండుసంవత్సరాలకి మళ్ళీ అరెస్టవడం జరిగింది. ఈ దఫా అనారోగ్యం కారణంగా విశ్రాంతి అవసర పడటంతో తన దృష్టిని చదువుమీదకి మళ్ళించారు.  బెనారస్‌లో మెట్రిక్యులేషన్ చేసి, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంటర్‌మీడియట్, విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటి నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, మద్రాసులో లా ఏకబిగిన పూర్తిచేశారు.

1938లో మహిళలకు స్వయంఉపాది కల్పించే ఉద్దేశ్యంతో మద్రాసులో ఆంద్రమహిళాసభను ప్రారంభించారు. విరాళాలతో, ప్రభుత్వ సహకారంతో అది దినదిన ప్రవర్ధమానమైంది. 1958లో హైదరాబాదులో కూడా ఆంద్రమహిళాసభను మొదలుపెట్టారు. వయోజనవిద్య అందించే ఉద్దేశ్యంతో 1971లొ హైదరాబాదులో సాక్షరతా మిషన్‌ను ఆంధ్రమహిళా సభకు అనుబంధంగా ప్రారంభించారు. మహిళలకు, విధ్యా, ఉపాది, వైద్యం, వయోజనులకు విద్య మొదలైన విషయాలలో గొప్ప సేవచేసారు. స్వాతంత్ర్యం వచ్చినతరువాత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో, ప్లానింగ్ కమిటీలో సభ్యురాలిగా విశేషమైన సేవలు అందించారు. విదేశాలలో భారతదేశ ప్రతినిధిగా ప్రసంగించారు. నెహ్రూ లిటరసీ అవార్డు, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు పొందారు.

ప్రాధమిక విద్యకూడా సరిగా లేని ఒక సాధారణ అమ్మాయి, ఎన్నో సాంఘిక అవరోదాలని దాటి పట్టుదలతో ఈ స్థాయిని చేరడం గర్వకారణం. విచ్చిన్నమైన వైవాహిక జీవితం, దుర్భరమైన కారాగారవాసం, జైలు నుంచి విడుదలైన తరువాత అనారోగ్యం, 1948 ఎన్నికలలో రాజమండ్రీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అపజయం వంటి అవరోదాలకి కృంగిపోకుండా దేశం గర్వించదగ్గ మహిళామణిగా, ఐరన్‌లేడీగా స్పూర్తివంతమైన జీవితం గడిపి 1981లో పరమపదించారు.

ఆమె వ్యక్తిత్వంలో లక్ష్య నిర్ధేశం, పట్టుదల, నాయకత్వ ప్రతిభ, సృజనాత్మకత, సేవానిరతి అనే ఐదు లక్షణాలూ గుర్తించి మనలో పెంపొందించుకొనే ప్రయత్నం చేస్తే ఈ టపా యొక్క ఉద్దేశ్యం నెరవేరినట్టే.

© Dantuluri Kishore Varma 

Tuesday 11 December 2012

రేపు రేపే!

కొవ్వు తగ్గించుకొని స్లిమ్‌గా అవ్వాలనుకొంటున్నారా? అయితే ఆలోచించకుండా మాణింగ్ వాకో, యోగానో, డైటింగో మొదలు పెట్టేయండి. 
రేపటినుంచి మొదలు పెడతానండీ.
ఇంగ్లీషో, హిందీనో నేర్చేసుకొని ఆయా భాషల్లో మహవక్తలా ఉపన్యాసాలివ్వాలా? ముప్పై రోజుల్లో ఏ భాషయినా నేర్పేసే పుస్తకాలు కొట్టుకో(షాప్) పుట్టెడు. ప్రారంభించండి మరి. 
రేపే వెళ్ళి ఆ బుక్స్ తెచ్చుకొంటానండి.
ఎమయ్యా రోమియో, మూడుసంవత్సరాలనుంచి ఓ జూలియట్‌కి లైను వేస్తున్నావుకదా; మరి నీ ప్రేమకి ఓకే చెప్పిందా?
ఏదండీ ఇంకా ప్రపోజ్ చెయ్యందే. కాదంటుందేమో నని భయo. అయినా ప్రేమించాకా ప్రపోజ్ చెయ్యడం తప్పదుగా! రేపే చెప్పేస్తానండి.
మీ అమ్మాయికి డెలివరీడేటు ఇచ్చారా?
ఇంకా పదిరోజులు టైము ఉండట. కానీ, అల్లుడుగారు రేపు సిజేరియన్ చేయించమన్నారు.
కొత్త ఇంటిలోకి మారేరా?
రేపండి.
ఎగ్జాంస్ దగ్గరకి వస్తున్నాయి. ప్రిపరేషన్ మొదలుపెట్టావా?
రేపటినుంచి స్టార్ట్ చేస్తా.
మీ ఫ్రెండ్ పెళ్ళెప్పుడు?
రేపే.
మీ హీరోగారి కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడు?
రేపు.
పాపం మీ తాతగారు కోమాలో ఉన్నారట?
ఔనండి. వెంటిలేటర్ల సహాయంతోనే ఇంకా బ్రతికున్నారు. డాక్టర్లు కష్టం అన్నారు. రేపు వేంటిలేటర్లు తొలగించమని చెప్పేశాం.
ఎమయ్యా దారిన పోయే దానయ్యా, ఎదో పెద్ద పార్టీ చేసుకొంటున్నారట, ఎప్పుడు?
రేపు.
ఎందుకో?
ప్రజలు రకరకాల కారణాలతో రేపుని సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఏ కారణం లేని మాబోటి వాళ్ళం పార్టీ చేసుకొంటున్నాం.
ఏమిటో రేపటి ప్రత్యేకత!?
12.12.12
© Dantuluri Kishore Varma

Monday 10 December 2012

పట్టి తెచ్చానులే...



నేను తీసిన వాటిల్లో మంచివి....





రాజమండ్రీ ఇస్కాన్ మందిరందగ్గర మధ్యాహ్నం రెండుగంటల సమయంలో నీడలో చల్లగా ఉన్న నాచుపట్టిన ఫౌంటెన్ మీద పావురం. రెండు స్నాప్స్ తీసిన తరువాత ఆ చప్పుడుకి బెదిరి ఎగిరిపోయి దురంగా వాలింది. 







ముందురాత్రి వేటకి వెళ్ళివచ్చి, లంగరు వేసిఉన్న పడవలు. వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని వార్తల్లో చెపుతున్నారు.ఎన్నో సార్లు చెప్పినప్పుడు తుఫాను రాలేదు, చెప్పకుండా వచ్చింది. ఈ రోజు మళ్ళీ వేటకి వెళ్ళడమా, లేదా? మత్యకారుల సంధిగ్దానికి గుర్తుగా తెల్లవారినా కడలిదారి పట్టని పడవలు.  







అరకు లోయలో. చలిపులిని ఆరిపోతున్న కాగడాతో దూరంగా ఉంచడానికి చివరిప్రయత్నం చేస్తున్న సాయంత్రపు సూర్యుడు. ఎప్పుడో పుష్కరం క్రిందట తీసిన ఫోటో. స్కాన్ చేసింది. మిగిలిన ఫోటోలంత క్లారిటీ ఉండదు. 





తిరుమల కొండల్లో:   
తెల్లవారె జామెక్కె - దేవతలు మునులు
అల్ల నల్ల నంత నింత - నదిగో వారే
చల్లని తమ్మిరెకుల - సారసపుగన్నులు
మెల్ల మెల్లనె విచ్చి - మేలుకొనవేలయ్య 



© Dantuluri Kishore Varma 

Saturday 8 December 2012

నేను నేనే - బ్నిం

బ్నింగారితో నా పరిచయం విచిత్రంగా జరిగింది. బహు గ్రంధకర్త అయిన ఆయన మాతామహులు  శ్రీజటావల్లభుల పురుషోత్తం గారు, స్వయంగా పద్యాలు రాసి, బ్నింగారికి పద్య చందస్సు నేర్పిన అమ్మమ్మ బాలాత్రిపురసుందరి గార్ల ఫోటోని నేను ఎడ్మిన్‌గా ఉన్న మనకాకినాడ అనే ఫేస్ బుక్ గ్రూపులో ఉంచారు. బ్నిం అనే పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇది భమిడిపల్లి నరశింహ మూర్తి అనే పేరుకి సంక్షిప్త రూపం. చిన్నప్పుడు పత్రికల్లో వచ్చే వారి  కార్టూన్లని చూసేవాడ్ని. కార్టూనిస్ట్‌గా ఆయన బాగా తెలుసు. గ్రూపులో చూసిన మూర్తిగారు ఆయనేనా, కాదా అనే సందేహనివృత్తికోసం  సరాసరి వారినే అడిగేశా `ప్రముఖ రచయితా, కార్టూనిస్టు మీరేనా?` అని.  ఆయన చిరునవ్వుతో, "అవునండీ, నేను నేనే," అన్నారు. ఆయన స్నేహశీలుడు, ప్రజ్ఞావంతుడు, నిగర్వి, హాస్యచతురుడు అన్నింటికీ మించి స్పూర్తి ప్రదాత.  సునిశితమైన పరిశీలనా శక్తి ఆయన సొంతం. ఈ విషయాలలో ఆయనకి ఆయనే సాటి. అందుకే, `నేను నేనే` అన్న మాట బ్నింగారికి ఖచ్చితంగా సరిపోతుంది. 

అచ్చమైన స్నేహితులంటే ముందుగా మనకి జ్ఞాపకం వచ్చేది బాపూ, రమణలు. రమణగారు లేని లోటుని చెప్తూ ఒకసారి బాపూగారు మెచ్చుతునకలాంటి ఒక మాట అన్నారు. "రమణ లేని నేను గోడలేని చిత్రపటంలా ఉన్నాను," అని. స్నేహబంధానికి నిర్వచనం లాంటి వాఖ్యం ఇది. అటువంటి మిత్రద్వయం అంటే బ్నింగారికి వల్లమాలిన అభిమానం, భక్తీ. "నా హృదయం బాపూ ఆలయం," అంటారు. ముళ్ళపూడి వారినుంచి చమత్కార రచనా సంవిధానం, బాపూ నుంచి రేఖా విన్యాసం పుణికి పుచ్చుకొన్న ఆయన భావ చిత్రాలు `మరపురాని మాణిక్యాలు`. వివిధ రంగాల్లో 132 తెలుగు ప్రముఖులని లలితమైన రేఖల్లో, క్లుప్తమైన రాతల్లో పరిచయం చేశారు. బహుశా తెలుగులో ఇటువంటి ప్రయోగం మొట్టమొదటిది అనుకొంటాను. ఈ పుస్తకానికి కవర్‌పేజీ గీసింది స్వయంగా బాపూగారే.   `బాపూ అంటే  బ్నింకి ఎంత భక్తో, బ్నిం అంటే బాపూకి అంత వాత్సల్యం`ట. బాపూగారికి హైదరాబాదులో ఎంతమంది మిత్రులున్నా, ఆ వూరికి వచ్చినప్పుడు కినీసం అరగంట సమయం దొరికినా బ్నింగారితో గడుపుతారట. బాపూ ఒరిజినల్ పెయింటింగ్స్ ఎన్నో  మూర్తిగారి దగ్గర ఉన్నాయి.



మొన్న అక్టోబర్ 28న బ్నింగారి జన్మదినోత్సవసందర్భంగా `హాస్యానందం` వారిగురించి ప్రత్యేక సంచిక వేశారు. టీ.వీ, సినిమా, కళ, సాహిత్య రంగాలలో ప్రముఖులు ఎందరో బ్నింగారి స్వీట్ నేచర్ గురించి, దృక్పదం గురించి, ఆత్మస్థైర్యం గురించి రాసినవి చదివితే ఎవరికైనా `వాహ్, బ్నిం!` అనిపించక మానదు.

కాకినాడ జన్మస్థలం అయినా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో పెరిగారు. అనారోగ్యం వల్ల స్కూలుకి వెళ్ళలేక పోయినా, అమ్మ ఒడే బడి అయ్యింది. అదే తనకి గొప్ప అదృష్టం అంటారు. తెలుగు, సంస్కృతాల్లో గొప్పప్రవేశం ఉన్న సాక్షాత్తు సరస్వతీ సమానురాలయిన తల్లి శ్రీమతి విజయలక్ష్మి గారి సమక్షంలో కాళిదాసు రాసిన మేఘసందేశం, కుమార సంభవం లాంటి ప్రబంధాలు, ఇతిహాసాలు చదవగలిగే అదృష్టం బడిలో చదివే సాధారణ కుర్రవాడికి ఉండదుకదా!ఈయన తండ్రి భమిడిపల్లి సూర్యనారాయణ మూర్తిగారు ఆయుర్వేద వైద్యులు.

ఊరిలో డ్రాయింగ్ మాష్టారు శేషాచలం గారిదగ్గర చిత్రలేఖనం నేర్చుకొన్నారు. ఇక రాయడంలో ప్రవేశం, తన సోదరి కోసం రచించిన బుర్రకథ వల్ల జరిగిందని చెప్పారు. చేతితో రాసే ప్రత్రికని కొన్నిరోజులు నడిపారట.

తన 24వ ఏట భాగ్యనగరం వచ్చి, కొంతకాలం పత్రికలలో పనిచేసిన తరువాత, వాటినుంచి బయటకు వచ్చి  సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు.   తెలుగులో 208 నృత్య రూపకాలు రాసి ప్రపంచంలో ఏఒక్క రచయితా చెయ్యని ఫీట్‌ని సాధించారు. నూటయాభై కథలు నాలుగు సంపుటాలుగా విడుదలయ్యాయి. మిసెస్ అండర్స్టాండింగ్ అనే కథల పుస్తకం ఆలూమగల మధ్య ఉండవలసిన సరైన కమ్యూనికేషన్ గురించి హస్యస్పోరకంగా చెబుతుంది. పత్రికల  కవర్ పేజీలు, శుభలేఖలు, లోగోలు డిజైన్ చేస్తారు. టీవీ సీరియళ్ళ కథలు, టైటిల్ సాంగ్‌లు రాస్తారు. సవ్యసాచిలాగ ఇవ్వన్నీ చేస్తూనే అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తారు.

బ్నింగారి కృషికి గుర్తింపుగా ఎన్నో సాంస్కృతిక సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ముఖ్యంగా నాలుగు నందులు, కళారత్న(హంస) బహుమతులు వారి ప్రతిభకి పురస్కారాలు. నిండుకుండ తొణకదు అన్నట్టు ఎవరినైనా ఆత్మీయంగా పలకరించే నిగర్వి మూర్తిగారు. కష్టాలు, నష్టాలు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసం సడలకుండా ముదుకు సాగిపోయే వాడే నిజమైన స్పూర్తి ప్రధాత. అటు వంటి మనీషి శ్రీ బ్నిం.  బెంగగా ఉన్నప్పుడు బ్నింని తలచుకొంటే ధైర్యం వస్తుందని తనికెళ్ళభరణి గారు చెప్పడం, బ్నింగారి స్థైర్యానికి ఒక గొప్ప కితాబు.

భమిడిపల్లి నరశింహ మూర్తి (బ్నిం) గారి గురించి రాసేటంత సామర్ధ్యం నాకు లేకపోయినా, స్పూర్తిని రగిలించగల విజయగాధని నా సహచరులకి పంచుదామన్న స్వార్ధంతో ఈ చిన్ని పరిచయాన్ని రాశాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
© Dantuluri Kishore Varma

Friday 7 December 2012

అయ్యవారి బొమ్మ వెయ్యబోతే అది కోతిబొమ్మ కావాలా!

వాటర్ స్ప్రింక్లర్స్



మా అమ్మాయిల స్కూల్లో పెయింటింగ్ ఏక్టివిటీ పెట్టారు. ఏదయినా ఒకప్రదేశాన్ని గీసి పెయింట్ చెయ్యడం నేర్పించమటే, ఒక ప్రయోగం చేద్దామని డ్రాయింగ్ చార్టు, వాటర్ కలర్స్, బ్రష్‌లు కొనుక్కొని వచ్చి మొదలు పెట్టాం.





ఈతకొట్టేస్తున్న ఓ అబ్బాయి


ముందుగా షీట్‌ని స్ట్రెచ్ చేసాం. స్ట్రెచింగ్ అంటే షీట్‌ని నీళ్ళతో తడిపి ముడతలు లేకుండా ఆరబెట్టుకోవడం. ఇలా చెయ్యడం వల్ల కాగితానికి రంగులు బాగా పడతాయని ఎక్కడో చదివాను. ఆరిన తరువాత పాత రికార్డ్ బుక్‌లో పెట్టెసి మొదటిరోజు కార్యక్రమాన్ని ముగించాం.

దిగడానికి తయారుగా ఉన్న అమ్మాయి


కొన్నిరోజులముందు రాజమండ్రీ వాటర్‌పార్క్ దగ్గర తీసిన ఫోటోలు రిఫరెన్స్‌గా పెట్టుకొని, ఒక్కో ఫోటో నుంచీ ఒక్కో మనిషినీ, ఒక్కో స్థలాన్నీ తీసుకొని  ఔట్‌లైన్ స్కెచ్ పెన్సిల్తో చాలాలైటుగా ఆరిన చార్ట్ పేపరు పైన వేశాం.





ఎరుపు రంగు డ్రాయరు  కుర్రాడు


ఎరుపు రంగు డ్రాయరు వేసుకొని నీళ్ళల్లో నుంచున్న కుర్రాడు, మోకాళ్ళలోతు కూడా లేకపోయినా స్విమ్మర్‌లా ఈతకొట్టేస్తున్న ఓ అబ్బాయి, మెట్లమీద నీటిలోకి దిగడానికి తయారుగా ఉన్న అమ్మాయి, స్లైడ్ మీద మొదటిసారి భయం భయంగా జారుతున్న ఇంకొక అబ్బాయి, వీళ్ళందరి మధ్యలో చెయ్యి చెయ్యీ పట్టుకొని వెళుతున్న శ్రావ్య, వర్షిత.

 శ్రావ్య, వర్షిత


లేయర్ బై లేయర్ పెయింట్ చేస్తే బాగుంటుందని అనుకొని లైట్ బ్లూకలర్తో మొత్తం బ్యాక్‌గ్రౌండ్ వాష్ ఇచ్చాం. ఈ కలర్ని మళ్ళీ పూర్తిగా ఆరనిచ్చి వరుసగా గోడ, స్విమ్మిగ్‌పూల్‌లో నీరు, స్లైడ్లు, మెట్లు, వాటర్ స్ప్రింక్లర్స్, మనుష్యులు ఒకదాని తరువాత ఒకటి రంగులు వేసుకొంటూ వచ్చాం.




స్లైడ్ మీద జారుతున్న అబ్బాయి
అయ్యవారి బొమ్మ వెయ్యబోతే అది కోతిబొమ్మ కావాలా! అని ఏదో పాటలో చెప్పినట్టు మాప్రయోగం ఇలా తయారయ్యింది.

© Dantuluri Kishore Varma

Thursday 6 December 2012

అరకులోయలో...

(పిల్లలు చదవడానికి ఉద్దేశించిన కథ కాదు) 

"హలో," శృతిచేసిన వీణతీగ మీటినట్టు సుప్రియ కంఠం రిసీవర్‌ద్వారా అతని చెవిలోంచి గుండెల్లోకి ప్రవేశించి, అక్కడ ప్రతిధ్వనించింది.  
"కి...కిరణ్ దిస్ సైడ్," తడబడ్డాడు.
"మీ పేరులో రెండు `కీ` లున్నాయా?" నవ్వింది.
"ఒకటి నాపేరులోది. రెండవది నా గుండెల్లోది."
"అంటే!?"
"లవ్ ఈజే మాస్టర్ కీ దట్ ఓపెన్స్ ఎవ్విరీ వార్డ్ ఆఫ్ ద హార్ట్ అంటారు. రెండవది ఆ మాస్టర్ కీ." వివరించాడు. వాళ్ళిదరికీ పెళ్ళి నిశ్చయమై వారంరోజులైంది. మొడటిసారి మిగిలిన వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకోవడం. పెళ్ళి జరగడానికి ఇంకా నెలరోజులు టైం ఉంది. 
*     *     *
డియర్ సుప్రియ,
బయట వెన్నెల ఎంతో బాగుంది. నువ్వు పక్కనుంటే ఇంకా బాగుండేది. నీ భుజాల చుట్టు నా చేతినివేసి ఎన్నో రొమాంటిక్ విషయాలు చెప్పాలని ఉంది. 
- నీ కిరణ్
కిరణ్ నుంచి వచ్చిన ఎస్సెమెస్స్‌లో `రొమాంటిక్` అనే మాట సుప్రియకి మరీ, మరీ జ్ఞాపకమొచ్చి గుండేల్లో తరoగిత మౌతుంది. ఆమాట ఆమెకి ముందు తెలిసినదే అయినా ఎందుకో గమ్మత్తుగా ఉంది. 
*     *     *
మొదటి రాత్రి-

అతను గదిలో ఎదురు చూస్తున్నాడు. ఆమె మల్లెపూల దండలా కదిలి వచ్చింది. మునివేళ్ళ మీద ముద్దిచ్చి, తనప్రక్కన చోటిచ్చాడు. పెదవులతో చెక్కిలి మీద స్పృశించి, చెవిదాకా వెళ్ళి గుసగుసగా `ఐలవ్యూ` చెప్పి, "ఎదైనా మాట్లాడు," అన్నాడు.

చెక్కిలి మీదనుంచి శంఖంలాంటి మెడమీదకి జారుతున్న అతని చేతిని మెత్తగా హత్తుకొని, కళ్ళల్లోకి చూస్తూ, "రొమాన్స్ అంటే ఏమిటి?" అని అడిగింది.

అతను తడబడ్డాడు. "రొమాన్స్ అంటే...," ఆతరువాత ఏమి చెప్పాలో తెలియలేదు. పూర్తిగా లవ్ కాదని తెలుసు. సెక్స్ కూడా కాదు. కానీ ఎలా వివరించడం? కొంచం ఆలోచించి తరువాత చెప్పాడు, " మల్లెపూల వాసన ఎలా ఉంటుంది అంటే ఏమి చెబుతావు? అదొక అనుభూతి, దాన్ని స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి తప్ప వివరంచలేం. రొమాన్స్ కూడా అంతే."

తన గుప్పిటలో ఉన్న అతని చేతిని పెదవులవరకూ తెచ్చుకొని, ముద్దిస్తూ... "ఆ అనుభూతిని నాకూ తెలియజేయండి," అంది. నిశ్చేష్టుడయ్యాడు. అతని భావుకత్వానికి, ఆమె చిలిపితనం విసిరిన సవాల్. రొమాన్స్ అంటే ఏమిటో మాటల్లో నిర్వచించడంకాదు, చేతల్లో ఆమెకి అనుభవైకవేధ్యం చెయ్యడం. దానికి ఆ మరునాడే ముహూర్తంగా నిర్ణయించాడు.
*     *     *
కిరుండుల్ పాసింజర్ విశాఖపట్నం నుంచి అరకు వైపుగా సాగిపోతుంది. విండోకి అవతల వెనక్కి పరిగెడుతున్న ప్రకృతి అందాలను చూస్తుంది సుప్రియ. ఆమెకి ఆనుకొని కూర్చుని కనురెప్పల కదలికల్లో కవిత్వాన్నీ, ఎగురుతున్న ముంగురుల్లో సంగీతాన్నీ అస్వాదిస్తున్నాడు కిరణ్. ఒక ఏటవాలు సూర్యకిరణం ఆమె బుగ్గలమీద పడి మెరుస్తుంది. ట్రెయిన్ టన్నెల్ లోనికి ప్రవేశించింది. ఒక్కసారిగా వెలుగు మాయమయ్యి, చీకటి ఆవరించింది. కళ్ళల్లోనుంచి మనసులోకి దారి ఉన్నట్టు, వెలుతురులోనుంచి మొదలైన టన్నెల్ ఓ చీకటిని దాటి అటువైపు మిరుమిట్లు గొలుపుతున్న మరో వెలుతురు ద్వారాన్ని చేరుకొంది. కోరికంటూ ఉంటే టన్నెల్‌కి మధ్యలో, కటిక చీకటిలో ఒక వార్మ్ షేక్ హేండ్, ఒక టెండర్ కిస్ ఏదయినా ఇవ్వొచ్చు. విరహాన్ని ఓపలేని సూర్యకిరణం ఆమె చెక్కిలిమీద మళ్ళీ వచ్చి వాలింది. అంతకుముందు అక్కడలేని గులాబీ వర్ణం ఎలా వచ్చిందో దానికేమీ అర్థమైనట్టులేదు! 
*     *     *
అక్టోబర్ నెల. చలి చక్కిలిగింతలు పెడుతుంది. పకృతి పరవశించి పక్కుమని నవ్వినట్టు, అరకులోయలో సౌందర్యం వాళ్ళిద్దరి గుండెల్లో అలజడి పుట్టిస్తుంది.

కొండవాలులో పసుపుదుప్పట్టి ఆరబెట్టినట్టు ఉన్న చేల అందాలని చూస్తుంది సుప్రియ. "ఈ పసుపు పువ్వుల తోట - వలిసెలు అనే నూనెగింజల పంట" పువ్వులు కోస్తూ అన్నాడు కిరణ్. "దోసిలి పట్టు," అంటూ ఆమె చేతుల్లో గుప్పెడు పువ్వులు ఉంచాడు. వాటిని అపురూపంగా అందుకొంది.

"నేను మొదటిసారి ఇచ్చిన పువ్వులు. క్రింద పెట్టకు. సెంటిమెంట్," అన్నాడు. అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. ముఖం చూస్తుంటే ఏదో తుంటరి పనికి తయారవుతున్నట్టే ఉంది. ముసిముసిగా నవ్వుతూ  సరేనంది. దూరంగా ఓ ముసలి కాపరి  గొర్రెల్ని తోలుకొంటూ వెళుతున్నాడు. చాపురాయి జలపాతం దగ్గరనుంచి పిక్నిక్‌కి వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్న అల్లరి లీలగా వినిపిస్తుంది. వలిసెల చేలల్లో వాళ్ళిద్దరే ఉన్నారు. అప్పటికే ఆమె వెనుకకు చేరిన అతని ఊపిరి చెవి ప్రక్కన గిలిగింతలు పెడుతుంటే, హత్తుకొన్న సుతిమెత్తని కౌగలి పులకింతలు రేపుతుంది. చెవికమ్మ మీద పెదాలను తాకిస్తూ అన్నాడు, " కొండప్రాంతాలకి విహారయాత్రలికి వెళ్ళినప్పుడు సరదాకి కాలినడకన చిన్న చిన్న కొండలు ఎక్కి దిగడాన్ని  ట్రెక్కింగ్ అంటారు. నా పని అలాగే అవుతుందేమో!" చేతుల్లో పువ్వులని ఉంచి, గుండెల్లో పరిమళాలను నింపుతున్న అతని చమత్కారం ఆమెని ముగ్ధురాల్ని చేస్తుంది.  
*     *     *
పద్మావతీ గార్డెన్స్. ఏకాంతంగా వాళ్ళిద్దరే. ఆమె పచ్చికమీద కూర్చొని ఉంది. ఒడిలో తల పెట్టుకొని చీర చెంగులోనుంచి ఆమె ముఖాన్ని చూస్తూ అడిగాడు, "కాకెంగిలి ఎప్పుడయినా తిన్నావా?" అని. సమాదానం చెప్పకుండా నవ్వుతూ చూసింది. ఫోనులో అతనితో కొన్నిరోజుల సంభాషణ, పెళ్ళిజరిగిన తరువాత ఈ మూడురోజుల సాహచర్యం అతని తుంటరి తనాన్ని పూర్తిగా తెలియజేసాయి. ఏం సమాదానం చెప్పినా టాపిక్‌ని శృంగారం వైపు మలుపుతిప్పడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. "మాట్లాడవేం, రొమాన్స్ అంటే ఏమిటో అని ఆలోచిస్తున్నావా?" అన్నాడు. అతని పెదవులను చూస్తూ అవుననో, కాదనో చెప్పడానికి సిద్దమౌతుండగా, చటుక్కునలేచి తెరుచుకొంటున్న పెదాలను తన పెదాలతో మూసాడు. మధ్యలో నలిగిపోతున్న చీర చెంగు "కాకెంగిలి," అని గోలపెట్టింది.
*     *     *

జగడపు జనవుల జాజర |
సగివల మంచపు జాజర ||

మొల్లలు దురుముల ముడిచిన బరువున |
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన బుప్పొడి జాగర బతిపై |
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపైగడు సిం- |
గారము నెరపెటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ బడతులు |
సారెకు జల్లేరు జాజర ||

బింకపు గూటమి పెనగేటి చమటల |
పంకపు పూతలపరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు |
సంకుమదంబుల జాజర ||

అన్నమాచార్య కీర్తన రూంలో మ్యూజిక్ సిస్టంలోనుంచి వినిపిస్తుంది. కిరణ్ గుండెల మీద సుప్రియ తల ఆనించి పడుకొని ఉంది. అతను అన్నాడు, "రొమాన్స్ అంటే ప్రేమతో మొదలై శృంగారంతో ముగియని ఒక కోరిక, పరుగుతీసే పడుచు ఊహ, సాహచర్యంలో ప్రతీక్షణాన్ని ఎగ్జయిటింగ్‌గా మలచుకోవడం, మనసుపొరల్లో శాశ్వతత్వాన్ని ఆపాదించుకొనే ఓ అనుభూతి..." అతని పెదాల్ని ఆమె తన పెదాలతో మూసింది. ఆమెకి అర్థమైందని అతనికి అర్థమైంది.
© Dantuluri Kishore Varma 

Monday 3 December 2012

బొంగులో చికెన్ - Bamboo Chicken

పట్టణ రణగొణ ధ్వనులకి దూరంగా అడవిలాంటి ప్రదేశంలో ఒకరోజు గడిపితే ఎలా ఉంటుంది? అలాగని రాకరాక ఎప్పుడో వారానికి ఒక్కసారి వచ్చే ఆదివారంరోజు రంపచోడవరమో, మారేడుమిల్లో, మరో ఏజన్సీ ప్రాంతమో వెళ్ళి మళ్ళీ సాయంత్రానికల్లా తిరిగి వచ్చేయాలంటే కష్టమే. రాంగోపాల్ వర్మ తీసిన క్షణక్షణం సినిమాలో `జామురాతిరీ జాబిలమ్మా..` పాటలో చూపించిన సెట్టింగ్‌లాంటి అడవి కాకినాడకి ఒక అరగంట దూరంలో ఉంటే...! ఆదివారం పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అక్కడికి వెళ్ళిపోయి, లంచ్‌కి కేంప్‌ఫయర్ దగ్గర ఏదయినా వండేసుకొని తినేసి, ఆతరువాత ఓ రెండు, మూడు గంటలు ఆనందంగా మన వాళ్ళతో గడిపేసి, ఓ డ్రీం వీకెండ్‌ని మన జ్ఞాపకాల డైరీలో రాసేసుకోవచ్చు, కదా? ఫెయిరీ టెయిల్ ఫేంటసీల్లాంటివి అనుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ, అలాంటి ప్లేసు ఎక్కడ దొరుకుతుంది మహాప్రభో! 
లేఅవుట్లు చేసేసి, స్థలాలు అమ్మేసి, ఇల్లుకట్టుకోవడానికి ఏ వొక్కరూ ముందుకురాని ఎకరాలకొద్దీ తోట ఒకటి ఉంది. అందులో మనకో, మనకి తెలిసిన వాళ్ళకో ఒక బిట్టు ఉంటే చిన్న పర్మిషన్‌తో పార్టీ చేసేసుకోవచ్చు. జీడిమామిడిచెట్లు, తాడి చెట్లు, వొత్తుగా పెరిగిన గడ్డి, తోటలోకి కనీసం దారి కనిపించకుండా, నేల కనిపించకుండా ఓ రెండగుల మందంలో రాలి, కుళ్ళిపోయి ఆతరువాత ఎండిపోయినా చెట్ల ఆకులు; వృక్షాలు నేలకి దగ్గరగా కొమ్మలు వేసి పెరిగిపోవడంతో సూర్యరశ్మి చేరక గుబురుగా ఉండే పరిసరాలు, అడుగు వేస్తే బయటకు వచ్చే ఆకుల క్రింద సంవత్సరాల తరబడి ప్రశాంతంగా జీవిస్తున్న జెర్రులు, ఇంకా మన అదృష్టం బాగుంటే కనిపించే పాములు....భలే ప్రదేశం! ఓ మనిషిని పెట్టుకొని శుబ్రం చేయించుకొంటే, కొంతవరకూ అనుకూలంగా మార్చుకోవచ్చు.

హమ్మయ్య! ప్రదేశం దొరికింది. మరి కేంప్‌ఫయర్ దగ్గర వొండుకోవడానికి ఏమిటీ అని? మా కజిన్స్ ఇదివరలో ఏజన్సీకి వెళ్ళినప్పుడు రుచిచూసిన బొంగులో చికెన్‌ని (Bamboo Chicken) సజెస్ట్ చేశారు. ఎలా తయారు చెయ్యాలో తెలుసు, కానీ మేం ఎవ్వరూ అప్పటివరకూ చెయ్యలేదు. ఎక్కువ వంటసామాన్లు పిక్నిక్ స్పాట్‌కి మోసుకొని వెళ్ళనవసరం లేకుండా, బొంగులో చికెన్ తయారుచేసే సౌలభ్యం ఉండడంతో అదే నిశ్చయమైంది.
మా మేనమామ గారు పెద్ద లేత వెదురు గడల్ని ఇంచుమించు ఒక్కొక్కటీ మూర పొడవు ఉండేలా కణుపుల క్రిందకి కోయించి, వాటి మూతి కవరయ్యేలా చిన్న వెదురు కణుపుల్ని బిరడాల్లా చెక్కించి తెచ్చారు. బోన్‌లెస్ చికెన్‌కి  ఇంటిదగ్గరే ఉప్పు, కారం, మషాలాలు, అల్లం వెల్లులి పేస్టు, కొద్దిగా పెరుగు పట్టించి కజిన్ తీసుకొని వచ్చాడు. కొన్ని అరిటాకులని కూడా వెంటతీసుకొని వెళ్ళాం. స్పాట్‌కి చేరుకొనే సరికి ఉదయం పది   అయ్యింది.

ఔట్‌డోర్ ఫైర్ ప్లేస్ తయారు చేసుకోవాలి. ముందురోజు సైట్‌ని శుబ్రంచేసిన తోట వాచ్‌మ్యాన్ అందుబాటులోనే ఉన్నాడు. మా రిక్వైర్‌మెంట్ చెప్పడంతో ఒకపొడవైన నాపరాయినీ, ఎండు చితుకుల్నీ తీసుకొనివచ్చాడు. నాపరాయిని నేలమీద పడుకోబెట్టి, దానికి ముందు సమాంతరంగా ఒక రెండంగుళాలు లోతుగా ఒక గుంత తవ్వించాం. దానిలో ఎండుపుల్లలు, చితుకులూ వేసి మంటరాజేసి మెల్లగా నిప్పుల దాలిలా తయారుచేశాడు.

వెదురు బొంగుల్లోకి చికెన్‌ని దట్టించి, అరటి ఆకులుతో మూసి దానిపైన బిరడా బిగించాం. అలా చికెనంతా నాలుగయిదు బొంగుల్లోకి ఎక్కించిన తరువాత వాటిని ఫైర్ ప్లేస్‌లో రాయికి చేర్చి ఏటవాలుగా నుంచోబెట్టి, చితుకులతో మంట పెట్టాం. ఈ కార్యక్రమం పర్యవేక్షణ అంతా మా నాన్నగారు, మా కజిన్ శ్రీను చూసుకొంటుంటే, అందరం సరదా కొద్దీ తలొక చెయ్యీ వేసి ఒక అరగంటలో  కాలిన బొంగులో కమ్మని చికెన్‌ని బయటకు తీసి పొగలు వస్తుండగానే ఒక్కో పీసూ లాగించేశాం.
ఇలా చెబుతుంటే మీకు నోరూరుతుంది కదూ? అయితే ఆలస్యం ఎందుకు మీరూ తయారు చేసుకోండి. అందుకోసమే రెసిపీ అంతా వివరంగా చెప్పడం జరిగింది. తయారు చెయ్యడం చాలా సులువు. ఆల్ ద బెస్ట్!

© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!