Pages

Thursday 28 November 2013

నారాయణా, తలప్రాణం తోకకి వస్తుంది!

కాకినాడ మెయిన్‌రోడ్డు ఈ  స్థాయి చాలా పట్టణాల మెయిన్‌రోడ్ల కంటే విశాలమైనదే. ఈ మధ్య విస్తరణ పనులు చేపట్టిన తరువాత ఇంకొంచం బాగుంది. కానీ, ఈ రోడ్ వెంట ప్రయాణించడమే విసుగు పుట్టించే వ్యవహారంగా తయారయ్యింది. దానికి ప్రధానమైన కారణం జనాలు సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించక పోవడమే. 

చాలా కాలం క్రితం సెంటర్‌పార్కింగ్ ఉండేది. ఎడమవైపునుంచి సైకిళ్ళు, రిక్షాలు లాంటి నెమ్మదిగా వెళ్ళే వాహనాలూ వెళితే, కుడివైపునుంచి మోటారుసైకిళ్ళు, కార్లు వెళ్ళేవి. ఆటోలు అంతగా ఉండేవికాదు. తరువాత పార్కింగ్‌ని ఎడమవైపుకి మార్చారు. కానీ రోడ్డు మధ్యలో విభజన రేఖల్లాంటివి ఏర్పాటు చెయ్యలేదు. ఇప్పటికీ చాలా మంది పాతపద్దతినే అనుసరిస్తూ వెళుతున్నా, సైకిళ్ళు ఫాస్ట్ లేన్‌లోనికి వచ్చెయ్యడం, కార్లూ స్కూటర్లవాళ్ళు సైకిళ్ళు వెళ్ళే మార్గంలోకి చొరబడిపోయి, హారన్లతో వాళ్ళని బెంబేలెత్తించడం మామూలయిపోయింది. ఆటోల విషయమైతే చెప్పక్కర్లెద్దు. వాళ్ళకి రూల్స్ ఉన్నా వర్తించవు. చిన్న జాగా దొరికితే ఆటోముందు చక్రాన్ని అక్కడ ఇరికించేస్తారు. ఇంగ్లీష్‌లో పెన్‌డమోనియం అనే ఒక మాట ఉంది - చాలా గందరగోళమైన ప్రదేశం అని దాని అర్థం. రోడ్డుని అలా చేసేస్తారు. 
ఎడమవైపు పార్కింగ్ చేసిన వాహనాలు, వాటి ప్రక్కన తోపుడు బళ్ళమీద పళ్ళు, స్వీట్‌కార్న్, బనీన్లు, బొమ్మలు, కాయగూరలు, ఐస్‌క్రీం అమ్మే హాకర్స్ రమారమి రోడ్డు మధ్యవరకూ ఆక్రమించేసి ఉంటారు. 

ఇక ప్రక్కసందుల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. లారీలు, వేన్లు, అద్దెబళ్ళు, తొట్టిఆటోలు ఎక్కడపడితే అక్కడ నిలిపేసి లోడింగ్, అన్‌లోడింగ్ చేసుకొంటారు. టీషాపుల ముందు ట్రాఫిక్‌కి అడ్డంగా బైకులు నిలిపి దమ్ముకొడుతూ, టీ చప్పరిస్తూ ఉంటారు. కార్ల యజమానులైతే ఇరుకు వీధుల్లో ఉన్న వాళ్ళ ఇళ్ళప్రక్కన గోడని ఆనుకొని ఉన్న మునిసిపాలిటీ స్థలం మీద(రోడ్డు) సర్వహక్కులూ కలిగిఉన్నట్టు ప్రవర్తిస్తారు. అది వాళ్ళ కారు పార్కింగ్ స్థలం. 

ఇల్లు కట్టుకొనే వాడు మెటల్, సిమ్మెంట్, ఇటుకలు, ఇసుక రోడ్డుమీదే వేసి నిర్మాణం పూర్తయ్యేవరకూ ఆక్రమణ కొనసాగిస్తాడు. పెళ్ళో, చావో, మీటింగో వచ్చిందంటే మొత్తం వీధిని ఆక్రమించేసి, టెంట్లు వేసేస్తారు.  పందులు, ఆవులు సరేసరి. వీటన్నింటికీ తోడు స్కూల్, కాలేజీ బస్సులు. ఫుట్‌పాత్ ఉన్నా దానిమీద నడవకుండా, వాహనాలకు అడ్డుపడుతూ సాగిపోయే పాదచారులు. నారాయణా, ప్రయాణం అంటే తలప్రాణం, తోకకి  వస్తుంది! కాకినాడ కంటే, దీనికి పదిరెట్లు ఎక్కువ జనాభా ఉన్న పెద్ద నగరాలలోనే మెరుగైన ట్రాఫిక్ వ్యవస్ధ ఉంటుందేమో!

© Dantuluri Kishore Varma

శ్రీ ఆంజనేయం!

సరిగ్గా పదిసంవత్సరాలక్రితం, అంటే 2003లో స్వాతి సపరివార పత్రికలో తిరుమల వేకటేశ్వరస్వామి గురించి ఒక సీరియల్ వచ్చేది. సీరియల్ అంటే కల్పిత కథ కాదు. టి.టి.డి ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేసిన శ్రీ పీ.వి.ఆర్.కె.ప్రసాద్ రాసిన ఆధ్యాత్మిక అనుభవాలు. `అధికారిగా నేను చేసినా, చేయించింది ఆ తిరుమలేశుడే` అనే దృక్పదంతో రాశారు. సర్వసంభవాం అనే పేరుతో ఈ శీర్షిక ఎంతో ఆసక్తికరంగా ఉండేది. చాలా భాగాలకి బాపూనే బొమ్మలు వేశారు. తరువాత కొన్నింటికి వర్మ అనే వేరే ఆర్టిస్టు వేశారు. ఈ శీర్షిక కోసం పత్రికని విడవకుండా చదివేవాళ్ళం. తరువాత అదే పుస్తకరూపంలో `నాహం కర్తా హరి: కర్తా` అనే పేరుతో విడుదల చేశారు.   
2007లో తిరుమలకొండమీదకి నడచివెళ్ళాం. అప్పుడు సర్వసంభవాం పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి చదివినప్పుడు తిరుమలేశుడిమీద భక్తిభావం మరింత పెరిగింది. అలిపిరి దగ్గరనుంచి తిరుమలకి సుమారు తొమ్మిది కిలోమీటర్లు. మార్గమధ్యంలో నడకదారీ, వాహనాలు వెళ్ళే ఘాట్‌రోడ్డూ కలిసేచోట ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని అక్కడ అలా పెట్టించడం వెనుకకథని ఓ భాగంలో రాశారు. 

నడకదారిలో సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కాదట. ఒకసారి ఆ మార్గ మధ్యంలో ఒక ముసలావిడని ఎవరో హత్య చేశారట. ఆ నేపద్యంలో దారిని మెరుగుపరచి, లైటింగ్, షెల్టర్లు అవీ ఏర్పాటు చేశారు. ఇంకా ఏదన్నా చేస్తే బాగుండును అని అనిపిస్తూ ఉండేదట ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ గారికి. ఆయన అత్తవారి ఊరు కాకినాడ. కుటుంబంతో కలిసి కాకినాడ కారులో వస్తూ దారిలో సామర్లకోట ప్రసన్నాంజనేయస్వామి విగ్రహాన్ని చూసి మంత్రముగ్ధులైపోతారు. ఆ విగ్రహం ఇదే! కాకినాడ, సామర్లకోట రోడ్డులో ఉంటుంది.
అలాంటి విగ్రహాన్ని తిరుమల నడక దారిలో ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని అనిపించి, శిల్పి వివరాలు తెలుసుకొని, పెద్దాపురం దగ్గర చిన్న ఊరిలో ఉంటున్న తోగులక్ష్మణ స్వామి అనబడే ఆ శిల్పిని కలిశారు. పనిచెప్పి, ఒప్పించి, తిరుమల తీసుకొని వెళ్ళి, సుందరమైన ఆంజనేయుని విగ్రహాన్ని నడకదారిలో ఏర్పాటు చేయించారు. అది ఇదే!
© Dantuluri Kishore Varma 

Wednesday 27 November 2013

తానాన..తనా..ననాన

స్వామికి నలుగురు ఫ్రెండ్స్.

సోము క్లాసుకంతటికీ అంకుల్ లాంటి వాడు. క్లాస్ లీడర్. వాడిగురించి విద్యార్థులందరూ ఏమనుకొంటారంటే, `వాడిని తిట్టాలంటే కేవలం ప్రినిపాల్ మాత్రమే తిట్టగలడని`. రెండవవాడు మణి. ప్రతీక్లాసునీ రెండుమూడు సార్లు చదివినవాడు. స్కూల్లో ఉన్న ముసలిప్యూన్‌కి జ్ఞాపకం ఉన్నప్పటినుంచీ వాడు స్కూలుకి వస్తూనే ఉన్నాడు. బలంగా, ఎత్తుగా ఉంటాడు. పుస్తకాలు ఏమీ తీసుకురాడు, హోంవర్కులు చెయ్యడు. వాడిదగ్గర రెండు దుడ్డుకర్రలు ఉన్నాయని చెపుతాడు. అవసరం అయితే ఒకటి తీసుకొని వస్తాడు - వాడికి ఎదురుచెప్పినవాళ్ళ నడ్డి విరగ్గొట్టడానికి. అలాంటి వాడిని స్వామి వీపుమీదచరచీ, `ఏరా, ఒరేయ్` అని మాట్లాడెయ్యగలడు! మూడవదాడు శంకర్. సూపర్ తెలివితేటలు ఉన్నవాడు. ఏ లెక్కయినా అయిదునిమిషాలలో చెయ్యగలడు. శంకర్‌గానీ మాస్టర్లని ప్రశ్నలడగడం మొదలు పెడితే, వాళ్ళు సమాధానం చెప్పలేరని కొంతమంది అనుకొంటారు. వాడంటే పడని వాళ్ళూ మాస్టర్ల ఇళ్ళల్లో బట్టలు ఉతికి 90% తెచ్చుకొంటాడని అంటారు. ఏదేమయినా వాడు తెలివైనవాడు. కానీ, శంకర్ ముక్కు ఎప్పుడూ కారుతూనే ఉంటుంది. వాడు పొడవైన జుట్టుని జడవేసుకొని, దానిలో పువ్వులు పెట్టుకొని వచ్చినా సరే వాడికేసి ఆరాధనగా చూస్తుంటాడు స్వామి. స్వామికి ఉన్న నాలుగవ ఫ్రెండ్ శామ్యూల్. `బఠాణి` అని పిలుస్తారు అందరూ. తెలివిలేదు, బలంలేదు, చెప్పుకోవడానికి ఏ క్వాలిటీ లేదు వాడి దగ్గర. కానీ, స్వామికి వాడంటే ఎందుకు ఇష్టమంటే - లెక్కల్లంటే స్వామికి ఎంత భయమో, వాడికీ అంతే. మిగిలిన వాళ్ళకి సాధారణంగా కనిపించే విషయాలు, వాళ్ళఇద్దరికీ చచ్చేటంత నవ్వుతెప్పిస్తాయి.   

స్కూలుకి రాజం అనే కొత్తకుర్రాడు రావడంతో స్వామి ప్రపంచంలో మార్పులు వచ్చేస్తాయి. రాజం మంచి బట్టలు వేసుకొంటాడు. స్కూలుకి కారులో వస్తాడు. వాళ్ళ నాన్న పోలీసు సూపరింటెండెంట్. చదువులో శంకరంత తెలివైనవాడు. బలంలో మణికి సరిపోతాడు. అన్నింటికీ మించి మంచి ఇంగ్లీష్ మాట్లాడగలడు. 

స్వామికి, రాజం అంటే గొప్ప. వాడితో ఫ్రెండ్‌షిప్ చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. మణికి వాడంటే మంట. అందరూ స్వామిని రాజంకి తోక అనడంతో గొడవమొదలౌతుంది.
ఇలాంటి ఫ్రెండ్స్ మన అందరికీ ఉండేవారు కదా చిన్నప్పుడు? ఆర్.కే.నారాయణ్ రాసిన స్వామి అండ్ ఫ్రెండ్స్ చదువుతుంటే మనకథ మనం చదువుతున్నట్టు ఉంటుంది. మాల్గుడి అనే ఊరిని సృష్టించి, కథల్ని, నవలల్నీ రాసిన నారాయణ్ మొట్ట మొదటి నవల ఇది. చాలా మటుకు తన చిన్నప్పుడు జరిగిన సంఘటనల్నే కథా సంఘటనలుగా రాశాడు. కథా కాలం స్వాతంత్ర్యానికి పూర్వం. సరయూ నది, రైల్వే స్టేషన్, మార్కెట్, ఇంగ్లీష్ దొర ఫెడెరిక్ లాలీ విగ్రహం, నల్లప్పతోట.. లాంటి ప్రాంతాల్ని సృష్టించి, నిజమా అనిపించేంతగా నమ్మిస్తాడు రచయిత. నారాయణ్ సోదరుడు ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్.కే.లక్ష్మణ్ గీసిన బొమ్మలు మన ఊహించుకొన్న మనుష్యులకి, ప్రాంతాలకీ సజీవ రూపం ఇచ్చినట్టు ఉంటాయి.

కన్నడ దర్శకుడు శంకర్‌నాగ్ (ఈయన నటుడు కూడా) దర్శకత్వంలో మాల్గుడి కథల్ని 39 భాగాలుగా చిత్రీకరించి చాలాకాలం క్రితం డిల్లీ దూరదర్శన్ వాళ్ళు ప్రసారం చేశారు. చిత్రీకరణ, నటన, నేపధ్యసంగీతం అద్భుతం. మాల్గుడీ పునసృష్టించారు. కొన్ని ఎపిసోడ్స్‌లో చివర క్రెడిట్స్ వచ్చేటప్పుడు ఫ్లూటు తో కలిసి వినిపించే తానాన..తనా..ననాన అనే హమ్మింగ్ గుర్తుకువస్తుంది అప్పుడు సీరియల్ చూసిన ఎవరికైనా.   

                                                                                       

Tuesday 26 November 2013

ఉట్టిమీద కూడు

షాపంగ్‌మాల్స్ లేవు
సినిమాహాళ్ళు లేవు
రెస్టారెంట్లు లేవు..

ఉన్నవల్లా..

కాలువలూ, ఏటిఒడ్లు
రెల్లుగడ్డి మొలిచే రేవడులు, అరటితోటలు
వాళ్ళూరి తీర్తం.

అప్పుడు

మనసునిండా ప్రేమ
ఒంటినిండా పరువం
ఒకరోజంతా సమయం ఉంటే..

వాళ్ళేమి ఆడతారు?
ఏమి పాడతారు?
ఏమి చేస్తారు?

ఈ హుషారు పాటలోలాగ...

1999లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో శంకర్ మహదేవన్, జానకీ పాడిన పాట. సంగీతం రెహమాన్, సాహిత్యం శివగణేష్, ఏ.ఎం.రత్నం.

హే... చంద్రముఖి...లైల లైలలే లై లలైలే
హే... ఉట్టిమీద కూడు ఉప్పు చాపతోడు 
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన 
చచ్చిపోవ తోచనమ్మ నాకు 
ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
కోలా ఓ కోలా కోలా గలా

కొర్రమీను తుళ్లే కాలువలో 
రెల్లుగడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు తైతైతైతైతై
చలి గంగ స్నానాలు చేద్దామా 
సిగ్గు విడిచి వైవై... లైలైలైలైలై లైలలైలైలైలైలై...
కోకలు రాకలు కల్లేనోయ్
బతుకే నిమిషం నిజమేనోయ్
ఏ... అరటి ఆకున నిన్నే విందుగ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
ఆశే పాపం హాయ్ హాయ్ హాయ్
చెవిలో గోల గోయ్ గోయ్ గోయ్
పరువపు వయసు సేవలన్నీ
ఓ చంద్రముఖి... చంద్రముఖి
ఓ లైల లైల లైలై... చంద్రముఖి లైలైలైలైలై

గాలి తప్ప దూరని అడవిలో
తుర్రుపిట్ట కట్టిన గూటిలో
ఒకరోజు నాకు విడిది చెయ్ 
నువ్వు చీర దొంగలించి పోయేనా
పరువు నిలువు దాచెయ్
వలువలు అన్నవి కల్లేనోయ్ 
దాగిన ఒళ్లే నిజమేనోయ్ 
అంతటి అందం నాకే సొంతం 
ఎదలో రొదలే తైతైతై
తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
మేను మేను కలవడమే 
ఉట్టిమీద కూడు ఉప్పు చాపతోడు
వడ్డించ నేను చాలు నీకు 
© Dantuluri Kishore Varma 

Monday 25 November 2013

స్వామీ వివేకానంద సమాధానం

Statue @ Yanam beach road
స్వామీ వివేకానంద ఒకసన్యాసి. సన్యాసులకి తామున్న ప్రదేశం మీద మమాకారం ఉండకూడదు. అమెరికా సర్వమత సభల్లో ఉపన్యసించినతరువాత వివేకానంద అక్కడ చాలా పేరుప్రఖ్యాతులు గడించారు. ఎక్కువకాలం అక్కడ ఉండి హిందూ మతం గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. 

ఒక అమెరికన్ అడిగాడట `ఇక్కడి సౌకర్యాలు, జీవన ప్రమాణాలు, సౌఖ్యాలు చూసిన తరువాత మీదేశానికీ, మాదేశానికి గల వ్యత్యాసం తెలిసిందా?` అని. 

`అవును బాగా తెలిసింది. ఇప్పుడు నాదేశపు ప్రతీ ఇసుకరేణువూ పవిత్రంగా అనిపిస్తుంది,` అని సమాదానం చెపుతారు. 

అప్పుడు మరొక ప్రశ్న `ఇది స్వార్ధం కాదా?`  

`దేశం అంటే తల్లి లాంటిది. తల్లిని నాది అని భావించలేనివాడు, మరి ఏ తల్లినీ ప్రేమించలేడు. భారతదేశం నా తల్లి. నాకు దేశభక్తి ఉన్నప్పుడు మాత్రమే, ప్రపంచాన్ని ప్రేమించగలను అని చెపుతారు. 

అందుకే మహాత్మా గాంధీ ఒకసారి స్వామీ వివేకానంద గురించి చెపుతూ, `దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే వివేకానందుడి గురించి తెలుసుకోవాలి,` అని అంటారు. 
© Dantuluri Kishore Varma 

Sunday 24 November 2013

భక్తియోగమా వ్యక్తిత్వ వికాసమా?

భగవధ్గీత భక్తియోగంలో భక్తునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చెప్పబడ్డాయి. పదమూడవ శ్లోకంనుంచి పంతొమ్మిదవ శ్లోకంవరకూ దండలో గుచ్చిన పువ్వుల్లాగ ఈ గుణాలనన్నింటినీ కూర్చడం జరిగింది. ప్రతీ లక్షణమూ ఒక పొడి మాటగా ఉంటుంది తప్పించి, దానికి సంబంధించిన వివరణ ఉండదు. కాబట్టే అరబిందోఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామీ వివేకానంద, మహత్మాగాంధీ, ఎడ్విన్ ఆర్నాల్డ్, విద్యాప్రకాశానందగిరి స్వామి లాంటి ఎందరో తమతమ దృక్కోణాలనుంచి అర్థంచేసుకొని భగవధ్గీతకి వివరణ రాశారు. సంస్కృతం అర్థంచేసుకోలేని నాలాంటి వారికి ఇవి చక్కగా మార్గనిర్దేశం చేస్తాయి.
మళ్ళీ గీతలో ఈ అధ్యాయంలో చెప్పిన భక్తుని లక్షణాల దగ్గరకి వస్తే - వాటిని నాలుగు వర్గాలుగా విభజించ వచ్చు అనిపించింది.

1. ప్రకృతితో, మనచుట్టూ ఉన్న జీవజాలంతో ఎలా ఉండాలి?
2. సమాజంలో మిగిలిన వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి?
3. సమర్ధత కలిగిఉండటానికి కావలసిన లక్షణాలుఏమిటి?
4. జరిగే సంఘటనలకి మనం ఎలా ప్రతిస్పందించాలి, లేదా వాటిని ఎలా స్వీకరించాలి? (దీనినే దృక్పదం అనవచ్చు).

1. ప్రకృతితో, మనచుట్టూ ఉన్న జీవజాలంతో ఎలా ఉండాలి? :

1. ఏ ప్రాణి మీదా, ప్రకృతిమీదా ద్వేషం ఉండకూడదు. విచక్షణా రహితంగా వాటికి హానికలిగించకూడదు. 
2. కరుణ కలిగి ఉండాలి.

2. సమాజంలో మిగిలిన వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి? :

1. అందరితో స్నేహపాత్రులుగా ఉండాలి.
2. ఓర్పు కలిగి ఉండాలి.
3. ఇతరులను భయపెట్టకూడదు, వారి గురించి భయపడ కూడదు. 
4. ఎవరినీ ద్వేషించకూడదు.
5. అహంకారం ఉండకూడదు.
6. నిస్పక్షపాతంగా ఉండాలి. 

3. సమర్ధత కలిగిఉండటానికి కావలసిన లక్షణాలుఏమిటి? :

1. మనోనిగ్రహం ఉండాలి.
2. దృఢనిశ్చయం కలిగి ఉండాలి.
3. కర్తవ్యాన్ని నిర్వహించగల సామర్ద్యం కలిగి ఉండాలి.
4. సుచీ, శుభ్రం ఉండాలి
5. నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
6. ప్రతీదానికీ ఆందోళన పడకూడదు.

4. మనదృక్పదం ఎలా ఉండాలి? : 

మిగిలిన లక్షణాలనన్నింటినీ ఒక చిట్టాగా ఇవ్వడంలేదు. కానీ వాటి సారాంశం ఏమిటంటే - సుఖం ఉన్నప్పుడు పొంగిపోవడం, కష్టం కలిగినప్పుడు కృంగిపోవడం ఉండకూడదు. దొరికిన దానితో సంతుష్టి పడాలి. దేనిమీదా మమకారం ఉండకూడదు. హర్షము, క్రోదము, భయము ఉండకూడదు. ఇంకొకరకంగా చెప్పాలంటే స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి.  కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యం, అప్పులు ఎన్ని ఉన్నా నల్లమబ్బు చుట్టూ వెండి అంచు ఉన్నట్టు ఆనందాలు ఉంటాయి. వాటిని ఆనందిస్తాం, వాటికోసమే బ్రతుకుతాం. కానీ రాత్రి వచ్చిందని కృంగిపోకుండాఉంటే, మళ్ళీ వెలుతురు వస్తుంది కదా? ఈ రకమైన దృక్పదాన్ని అలవాటు చేసుకోమనే గీత చెపుతుంది.

ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు నాకు ప్రియమైన వాడు అని భగవంతుడు చెపుతాడు. అంటే, మంచి భక్తుడైన వాడు  ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉంటాడు. భక్తి అనేది ఆధ్యాత్మికమైన విషయం. దీనికి లౌకికమైన విషయాలకీ మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. నాస్తికుడైన వాడు కూడా మంచి వ్యక్తిగానే ఉండాలని కోరుకోవచ్చు. అప్పుడు భగవధ్గీతని ఒక పెర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్‌లా స్వీకరించవచ్చు.  చిత్రమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకొద్దీ కాపీలు అమ్ముడుపోయే పాపులర్ సెల్ఫ్‌హెల్ప్ బుక్స్ అన్నీ కూడా వీటిలో ఎదో ఒక లక్షణం మీద, లేకపోతే కొన్ని వాటిమీద కలిపి, వాటిని ఎలా పెంపొందించుకోవాలో నేర్పించేవే. ఉదాహరణకి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లూయన్స్ పీపుల్, హౌ టూ స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, యువర్ ఎర్రోనియస్ జోన్స్, యూ కెన్ విన్, విజయానికి ఐదు మెట్లు మొదలైనవి.

గీతను చదివి మునీశ్వరుడిలా మారిపోవలసిన పనిలేదు. కానీ, దానిని దారిని చూపించే ఒక దీపంలా ఉపయోగించుకొని చెడుని వదిలించుకొని, మంచిని పెంపొందించుకోవాలి. ప్రభావవంతమైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించాలి. అదే భక్తి!
© Dantuluri Kishore Varma 

Saturday 23 November 2013

జామురాతిరి జాబిలమ్మ

1991 లో రిలీజయిన క్షణ క్షణం సినిమా చూసి మంత్రముగ్ధులమైపోయాం.
శ్రీదేవి నటన, సింపుల్ స్టోరీ, అద్భుతమైన టేకింగ్. `జుంబారే` అనే పాట ప్రారంభంలో కొలను మధ్యలో శ్రీదేవి నిలబడి `శ్రావణ వీణా స్వాగతం, స్వరాల వెల్లువా వెల్కం, లేతవిరివానా నవ్వామ్మా, ఆనందంతో...` అని ఒక బిట్ పాడే షాట్ ఉంటుంది.

అన్నింటికీ మించి `జామురాతిరి జాబిలమ్మ` పాట. 

పలుచటి నీలిరంగు మేలిముసుగు కప్పినట్టు వెన్నెల, చందమామ, చుట్టూ అడివి.. జోలపాటకి ఇంతకన్నా మంచి పరిసరాలు ఏమికావాలి? 

కీటకాల అరుపుల్నీ, పక్షుల కూతల్నీ సంగీతంలో చక్కగా ఇమిడ్చేశారు కీరవాణి. సాహిత్యానికి వస్తే ఇది జోలపాటయినా సరే సిరివెన్నెల మార్కు స్పూర్తిని నింపే మాటలు ఉంటాయి. కావాలంటే చూడండి, "చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి". దానికితోడు ఎస్పీబాలు స్వీట్ వాయిస్. 

గుడ్లగూబ, కప్ప, ఆకుపురుగు, చేప.. వీటిని చూపిస్తూ నాలుగు షాట్‌లు; కొలనులో ప్రతిబింబించే చందమామ; నీటిలోకి రాయి విసిరినప్పుడు ఆ చప్పుడుకి బెదిరి పరుగెత్తిన కుందేలు.. అందమైన ఆంబియన్స్ క్రియేట్ చేశారు.రాం గోపాల్ వర్మకి ఉత్తమ డైరెక్టర్‌గా నందీ అవార్డ్ వచ్చింది. 

శ్రీదేవి కళ్ళతోనే నటించేసింది. ఎంతో కష్టపడి సృష్ఠించిన పరిసరాల్ని ఆమె సింపుల్గా డామినేట్ చేసి పారేస్తుంది. ఇక్కడ రాంగోపాల్‌వర్మ ఆమెగురించి చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. `క్షణ క్షణం సినిమా నేను శ్రీదేవికి రాసిన ప్రేమలేఖ,` అంటాడు నా ఇష్టం అనే పుస్తకంలో.

జామురాతిరి జాబిలమ్మ
జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మా
జారనీయకే కలా
వయారి వాలుకళ్ళలోనా...వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగువేళ !!జామురాతిరి!!

కుహు కుహూ సరాగాలే శృతులుగా 
కుశలమా అనే స్నేహం పిలువగా 
కిల కిలా సమీపించే సడులతో 
ప్రతిపొదా పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందని 
వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ !!జామురాతిరి!! 

మనసులో భయాలన్నీ మరచిపో 
మగతలో మరోలోకం తెరుచుకో 
కలలతో ఉషాతీరం వెదుకుతూ 
నిదరతో నిషారాణీ నడచిపో 
చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి 
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి !!జామురాతిరి!!  
© Dantuluri Kishore Varma 

జిల్లా కేంద్ర గ్రంధాలయం

`వ్యాయామం శరీరానికి ఎలాగో, పుస్తకాలు చదవడం మెదడుకి అలాగ,` అంటారు. నిశ్సబ్ధంగా కూర్చొని చక్కని పుస్తకం చదువుతూ ఉంటే సమయం తెలియదు. ద్యానం చేసుకొన్నప్పటి ఏకాగ్రతలాంటిది కలుగుతుంది. మెదడుమీద వొత్తిడి తగ్గుతుంది. రచయిత మనుష్యులని, ప్రదేశాలనీ వర్ణించి చెపుతుంటే మెదడులో న్యూరాన్లు కొత్త, కొత్త బొమ్మలను సృష్టిస్తాయి. సన్నివేశాల కల్పనచేస్తుంటే నిజమా అన్నంత స్పష్టంగా ఊహాలోకంలో కనిపిస్తుంది. ఒక మహానుభావుడు అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని గడిపితే అతని ఆత్మకథ చదవడం వల్ల ఆ జీవితాన్ని మనం జీవించినట్టే ఎన్నో లైఫ్‌స్కిల్‌ని నేర్చుకోవచ్చు.                                      - చలో లైబ్రరీ! (Read the article here)
జిల్లాకేంద్ర గ్రంధాలయాన్ని 1952లో ప్రారంభించారు. కాకినాడ మెయిన్‌రోడ్‌లో ఉంది. పెద్దభవనం, విశాలమైన రీడింగ్‌రూంలు, మంచి ఫర్నీచర్, వివిధ సబ్జెక్టమీద 83,000 గ్రంధాలతో(లిస్ట్‌కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి) పుస్తకప్రియులని చేతులు చాచి ఆహ్వానిస్తుంది. 72 రకాల పత్రికలని తెప్పిస్తున్నారు. పోటీపరీక్షలకి వెళ్ళే విద్యార్ధులకి అవసరమైన వివిధరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా గంటకి కేవలం పదిరూపాయలు చెల్లించి అంతర్జాలాన్ని ఉపయోగించుకోగల సదుపాయంతో ఇంటర్నెట్ విభాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు. 

మెయిన్‌రోడ్‌నుంచి దూరంగా ఉండే పాఠకులకికూడా చేరువగా ఉండేలా గాంధీనగర్, శ్రీనగర్, రామకృష్ణారావుపేటల్లో ఒక్కొక్కటీ, జగన్నాథపురంలో రెండూ శాఖా గ్రంధాలయాలు ఉన్నాయి.  తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా చూసుకొంటే - 97 శాఖా గ్రంధాలయాలు, 45 గ్రామీణ గ్రంధాలయాలు, 161 పుస్తక నిక్షిప్తకేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి పదమూడు లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 

ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకూ తెరిచి ఉంటుంది. పుస్తకవిభాగం మాత్రం ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 నుంచి 7 గంటలవరకూ తెరిచి ఉంటుంది. ప్రతీ శుక్రవారం శెలవు. 

ఇంత పెద్ద గ్రంధాలయాన్ని మనకి దగ్గరలోనే పెట్టుకొని, ఉపయోగించుకోలేక పోవడం బాధాకరమైన విషయం. ముఖ్యంగా విద్యార్థులు రోజుకి కనీసం ఒక గంటసమయమైనా లైబ్రరీల్లో గడిపే అలవాటుని పెంపొందించుకోవాలి. అలా వీలుకాని పక్షంలో వారానికి ఒకటి, రెండు సార్లయినా గ్రంధాలయానికి వెళ్ళాలి. 

© Dantuluri Kishore Varma 

Friday 22 November 2013

ఉప్పెనలా గుండెల్ని ముంచెత్తే ప్రేమ!

ప్రేమ చినుకులా మొదలౌతుంది. సమయం గడుస్తున్నకొద్దీ, చినికూ చినుకూ కలిసి కుంభవృష్ఠయ్యి, ఉప్పెనలా గుండెల్ని ముంచెత్తుతుంది. ప్రేమకి స్పందించి ప్రేయసి వస్తే జీవితం మొదలౌతుంది. రాకపోతే తుదలౌతుంది. చిన్న చిన్న మాటల్లో వేటూరి సుందర్రామ్మూర్తి ప్రేమబాధని ఎలా దట్టించారో చూడండి. `కన్నీటి ముడుపవ్వడం`, `కన్నీటిలో తేనెకలవడం` లాంటి ప్రయోగాలు చూడండి ఎంతబాగుంటాయో. ప్రతీపదం అర్ధవంతంగానే ఉంటుంది.

పాటభావానికి సరిపడేలాంటి చిత్రీకరణ, మణిరత్నం దర్శకత్వప్రతిభ ఈ పాటని అజరామరం చేశాయి. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, మేఘాలుపట్టి వర్షం కురుస్తున్న సాయంత్రం ప్రేయసీ, ప్రియుల మానసిక అలజడిని సూచిస్తాయి. మనీషా కొయిరాలా, అరవిందస్వామిదగ్గరకి పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు ఆమె వేసుకొన్న బురకా ఇనుపకొక్కేనికి తగులుకొంటుంది. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నించి, సాధ్యంకాక వదిలేసి వెళ్ళిపోతుంది. మతాల సరిహద్దులు దాటి వెళ్ళిందని దర్శకుడు చక్కగా చూపించాడు. కదా? ప్రేయసీ, ప్రియులు ఒకచోటకి చేరినప్పుడు కెమేరా వాళ్ళచుట్టూ సర్క్యులర్గా తిరుగుతూ మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది. అలాగే చిట్టచివర తిరగడం ఆగిపోయి స్థిరంగా నిలుస్తుంది. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. 

ఇవన్ని కలిసి రూపంలాంటివి అయితే, రహమాన్ సంగీతం ఈ పాటకి ప్రాణం. 1995 వచ్చిన బొంబాయి సినిమాలో `ఉరికే చిలుకా` పాట చూడండి.మీకేతెలుస్తుంది. 


ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకై ఇలకై ఊయలూగింది కంటపడి
కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికే
అరెరే.. అరెరే.. నేడు కన్నీట తేనె కలిసే
ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
మొహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
© Dantuluri Kishore Varma 

దేవదేవుడు తడిసి ముద్దవుతున్నాడు, ఎవరూ గొడుగు పట్టకండి!

జగన్నాధపురం ప్రధానరహదారి. నిత్యం జనం-
వాహనాల పొగ, కాలుష్యం  పైకి లేస్తూ ఉంటాయి.
కళ్ళల్లో, ఇళ్ళకప్పులమీద, షాపుల అద్దాలమీద దుమ్మూ దూళీ పడుతూ ఉంటుంది.
దానికేమి తెలుసుపాపం ఇదే దారిలో రెండు దేవాలయాలు ఉన్నాయని-
ఎత్తైన గాలిగోపురాలు ఊరికే అందమైనవని, వాటిమీద పడకూడదని!

విష్ణాలయం, శివాలయాల అందమైన గోపురాలు దూళికొట్టుకుపోయాయి.
ఎన్నికుండల నీళ్ళు వేసి కడిగితే శుభ్రపడతాయి?
వాటికి అభిషేకం చెయ్యాలంటే నీటిని మేఘాలతో తేవాలి.
చినుకు చినుకుగా వర్షం మొదలైంది.
రాత్రంతా గాలి, వానా..
రోడ్లు, ఇళ్ళు, షాపులు అన్నీ తడిసిపోయాయి వాటితోపాటూ గాలిగోపురాలుకూడా.
వర్షం ఇంకావస్తుంది. దేవదేవుడు తడిసి ముద్దవుతున్నాడు. ఎవరూ గొడుగు పట్టకండి.
విష్ణాలయం

శివాలయం
© Dantuluri Kishore Varma 

Thursday 21 November 2013

అదిగో...ఉంది!

ఇండిబ్లాగర్ అనే బ్లాగర్ఆగ్రిగేటర్ ఉంది తెలుసు కదా?
వాళ్ళు తరుచూ బ్లాగ్‌టపాల పోటీ పెడుతుంటారు.
ఆ మధ్యన ఆంబీపురా అనే పెర్‌ఫ్యూముల కంపెనీ వాళ్ళది స్మెల్లీ టూ స్మైలీ అనే పోటీ ప్రకటించారు. 
వాసనలకి సంబంధించో, పరిమళాలకి సంబంధించో మన జ్ఞాపకాలని వాళ్ళతో పంచుకోవాలి. 
నేను కూడా ఒక టపా రాశాను - 
మూడువందల వాటిల్లో నాదొకటి. 
బహుమతులు ఎప్పుడు ప్రకటించారో తెలియలేదు. కానీ, ఈ రోజు అనుకోకుండా వాటిని చూశాను. 
మొదటి ప్రైజు, రెండవ ప్రైజుల్లో నా పేరులేదు(ఆశకి అంతుండాలి! వచ్చేస్తుందనే!)
`అరవై వెయ్యిరూపాయల ప్రైజులు. ఇక్కడ క్లిక్కండి,` అని ఉంది.
ఆశ చావదు కదా! 
క్లిక్కి చూశాను, స్క్రోల్ డౌన్ చేశాను.
అదిగో...ఉంది!
బ్లాగులు రాయడం బొత్తిగా కాలక్షేపం ఒక్కటే కాదండోయ్. అప్పుడప్పుడూ డబ్బులు కూడా వస్తాయన్న మాట!
మనకి బహుమతి వచ్చిందో, లేదో తెలియకపోవడానికి కారణం ఏమిటంటే - వాళ్ళేమీ మనకి మెయిలు అదీ పంపరట. మనకి జ్ఞాపకం ఉండి, వెనక్కి వెళ్ళి చూసుకొంటూ ఉంటే ఇలా సడన్ సర్పైజులు తగిలే అవకాశం ఉంటుంది. ఏమంటారు? 
 
© Dantuluri Kishore Varma 

Tuesday 19 November 2013

చలో లైబ్రరీ!

పబ్లిక్ లైబ్రరీలు, రెంటెడ్ లైబ్రరీలు ఉండేవి. తెలుగు పత్రికలు, నవలలు చదివేవాళ్ళు చాలా మందే ఉండేవారు. అయిదవతరగతి కూడా పాసవని ఇల్లాళ్ళు, వాళ్ళ భర్తలు వారం,వారం ఇంటికి పోస్టులో వచ్చే పత్రికలు చదవడానికి వంతులువేసుకొనేవారంటే చదివే అలవాటు ఎంత బాగుండేదో అర్థంచేసుకోండి. సహజంగానే అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకి కూడా అదే అలవాటు అవడంలో విచిత్రంలేదు కదా! ఇది ఇంచుమించు ముప్పై, నలభై సంవత్సరాల క్రితం మాట.

తరువాత కొంచెం పరిస్థితులు మారాయి. ప్రైవేట్‌స్కూళ్ళు, కాన్వెంటులు, హోంవర్క్, ర్యాంకులు మొదలయ్యాయి. టీ.వీలు డ్రాయింగ్ రూంలోకి వచ్చాయి. మమ్మీలూ, డాడీలూ `మనకి ఎలాగూ చదువు లేదు. మనదీ, వాళ్ళదీ కలిపి పిల్లలచేతే చదివించేద్దాం` అని కంకణం కట్టుకొని, క్లాసు పుస్తకాలు తప్ప మిగిలినవేమీ పిల్లలకి అందకుండా చేసేశారు. పిల్లలు అలసిపోతే బూస్టు గ్లాసు చేతికి ఇచ్చి టీ.వీ. ముందు కూర్చోబెట్టారు. ఇంకేముంది, ఆ తరానికి మంచి ర్యాంకులు, ఉద్యోగాలూ వచ్చాయి. చందమామలు, జీవితచరిత్రలు, కథలపుస్తకాలు, నవలలూ అటకెక్కాయి. 
  
`వ్యాయామం శరీరానికి ఎలాగో, పుస్తకాలు చదవడం మెదడుకి అలాగ,` అంటారు. నిశ్సబ్ధంగా కూర్చొని చక్కని పుస్తకం చదువుతూ ఉంటే సమయం తెలియదు. ద్యానం చేసుకొన్నప్పటి ఏకాగ్రతలాంటిది కలుగుతుంది. మెదడుమీద వొత్తిడి తగ్గుతుంది. రచయిత మనుష్యులని, ప్రదేశాలనీ వర్ణించి చెపుతుంటే మెదడులో న్యూరాన్లు కొత్త, కొత్త బొమ్మలను సృష్టిస్తాయి. సన్నివేశాల కల్పనచేస్తుంటే నిజమా అన్నంత స్పష్టంగా ఊహాలోకంలో కనిపిస్తుంది. ఒక మహానుభావుడు అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని గడిపితే అతని ఆత్మకథ చదవడం వల్ల ఆ జీవితాన్ని మనం జీవించినట్టే ఎన్నో లైఫ్‌స్కిల్‌ని నేర్చుకోవచ్చు.    

వంద పదాలని తీసుకొని, వాటి అర్థాలని డిక్ష్నరీలో చుసి తెలుసుకోవాలంటే, జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఎంతలేదన్నా మూడునాలుగు రోజులు పడుతుంది. అదే ఒక కథను చదివితే దానిలో తారసపడే కొత్త పదాలను ఏ డిక్ష్నరీనీ చూడకుండానే ఉపయోగించిన సందర్భాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు. వాటి వినియోగం కూడా తెలికగానే అవగాహన అవుతుంది. అందుకే, చదవడం అనే హాబీ ఉన్నవాళ్ళకి ఎక్కువ పదాలు తెలిసి ఉంటాయి. పదసంపద సమృద్ధిగా ఉన్నవాళ్ళకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెపుతారు. 

స్వంత అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడానికి, రచనలు చెయ్యడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి, సంఘంలో నలుగురితో కలివిడిగా ఉండడానికి కావలసిన వాక్చాతుర్యం అభివృద్ది చేసుకోవడానికి, విజయాలను అందుకోవడానికి, పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి నిస్సందేహంగా పుస్తకాలు చదవడం అనే అభిరుచి సహాయపడుతుంది. 

మరి ఇప్పటి తరం దానిని ఎందుకు అలవాటు చేసుకోవడంలేదు? టి.వీ. ని, ఇంటర్‌నెట్‌ని, ముఖ్యంగా సోషల్‌నెట్వర్కింగ్ సైట్లని పిల్లలకి దూరంగా ఉంచి, మంచి పుస్తకాలని దగ్గరగా ఉంచితే బాగుంటుంది. ఇప్పటికే తమ పిల్లలకి ఈ అలవాటుని కలిగించడానికి ప్రయత్నిస్తున్న తల్లితండ్రులూ, ఉపాద్యాయులూ అభినందనీయులు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కనీసం వారానికి ఒక్కరోజయినా పిల్లలని గ్రంధాలయాలకి తీసుకొనివెళితే ఒక మంచి అభిరుచిని వాళ్ళకు పరిచయం చేసినట్టు ఉంటుంది. 

జాతీయగ్రంధాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి (14.11.2013 నుంచి 20.11.2013 వరకూ). చలో లైబ్రరీ!

© Dantuluri Kishore Varma 

వర్ణరంజితం

సూర్యాస్తమయంలో ఏటవాలు కిరణాలు భూవాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల తక్కువ వేవ్‌లెంగ్త్ ఉన్న నీలం, ఆకుపచ్చలు మాయమైపోయి ఎరుపు, ఆరెంజ్‌లు పరిసరాల్ని రంగులమయం చేస్తాయి. సూర్యోదయం తరువాత ఒకగంట వరకూ, సూర్యాస్తమయానికి ముందు ఒక గంట సమయాన్ని ఫోటోగ్రాఫర్లు గోల్డెన్ అవర్ అంటారు. సూర్యకిరణాలు కట్టడాలమీదో, చెట్లమీదో, మనుష్యులమీదో ప్రసరించినప్పుడు  గొప్పవెలుగు ఫోటోని అందంగా వచ్చేలా చేస్తుంది. గోడమీద బొమ్మలు వేసే కుడ్యచిత్రకారుడిలా సాయంకాలపు సూర్యుడు ఆకాశాన్ని వర్ణరంజితం చేస్తాడు. సంధ్యాసమయం ఎంత అందంగా ఉంటుందంటే కొమ్మమీద పశ్చిమాభిముఖంగా కూర్చున్న పేరుతెలియని ఒక బుజ్జిపిట్ట ఎలా అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఉండిపోతుందో, అలాగే నాకు ఉండిపోవాలనిపిస్తుంది. సూర్యుడిని కాదు, సూర్యుడి వెలిగించే ప్రకృతిని. మీరూ అలాగే మైమరచిపోగల అవకాశం ఉంటుందేమో అని ఈ ఫోటో... నచ్చిందా? 
© Dantuluri Kishore Varma 

Sunday 17 November 2013

కార్తీక పౌర్ణమిరోజు జ్వాలాతోరణం


కార్తీక పౌర్ణమిరోజు సాయంత్రం విద్యుత్‌ లైట్లతో అలంకరించిన గాలిగోపురాల వెలుగులతో పోటీపడుతూ భక్తులు చేసే దీపారాధనల మంగళకాంతి శోభాయమానంగా ఉంటుంది. దేవాలయందగ్గర రెండు కర్రలు నిటారుగా పాతి, వాటిని కలుపుతూ వరిగడ్డి మందంగా చుట్టిన తాడుని తోరణంగా కడతారు. శివుడు, పార్వతుల ఉత్సవ విగ్రహాలను అలంకరించిన పల్లకీలో ఉంచి, నూనెవేసి వెలిగించిన కంచుకాగడాలు ముందు వెళూతుండగా, మంగళవాయిధ్యాలతో ఆలయం బయటకు తీసుకొని వస్తారు. పల్లకీని మొయ్యడం ఎంతో పుణ్యంగా భావించడంవల్ల భక్తులు పల్లకీని కనీసం తాకినా చాలని  ఎగబడతారు. తోపులాట జరుగుతుంది. అర్చకులు వచ్చి ముందు కట్టి ఉంచిన వరిగడ్డి తోరణాన్ని కాగడాలతో వెలిగిస్తారు. జ్వాలాతోరణ మహోత్సవం అప్పుడు మొదలౌతుంది. దేవుడి పల్లకీని వెలుగుతున్న తోరణం క్రిందనుంచి అటూ, ఇటూ మూడుసార్లు తీసుకొని వెళతారు. తోరణం పూర్తిగా వెలిగిపోయిన తరువాత గాలికి ఎగిరిపడే బూడిదను భక్తులు సేకరిస్తారు. దానిని నుదుటిన పూసుకోవడం మంచిదట. పశుసంపద ఉన్నవాళ్ళు, అవితినే గడ్డిలో ఈ బూడిదను ఒక చిటికెడు కలుపితే పశువులు బాగా వృద్దిచెందుతాయని నమ్ముతారు.
కార్తీకపౌర్ణమి రోజు సామర్లకోటలో కుమార భీమేశ్వరస్వామి దేవాలయం, ద్రాక్షారామ శివాలయం, పిఠాపురంలో పాదగయ, కోటిపల్లిలో శివాలయం, మురమళ్ళలో వీరేశ్వరస్వామి దేవాలయం, ద్వారపూడి అయ్యప్ప దేవాలయం, రాజమండ్రీలో ఉమా మార్కండేయస్వామి, ఉమా రామలింగేశ్వరస్వామి, అయ్యప్ప దేవాలయాలు, అన్నవరం సత్యన్నారాయణస్వామి దేవాలయం, ఇంకా ఊరూరా శివాలయాల్లో జ్వాలాతోరణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

ప్రతీ సంవత్సరం లాగానే, ఈ ఏడాది కూడా జగన్నాధపురం (కాకినాడ-2) శివాలయంలో జ్వాలాతోరణ మహోత్సవం చాలా సందడిగా జరిగింది. మీకోసం పోటోలూ...

... వీడియో.
 © Dantuluri Kishore Varma 

యమునాతటిలో రాధ ఇంకా ఎదురు చూస్తూనే ఉంది.

రాధాకృష్ణులు జగమెరిగిన ప్రేమికులు
బృందావనంలో వాళ్ళిద్దరి రాసలీలలు
జయదేవుడు రాసిన
అష్టపదుల్లో ఆవిష్కృతమైయ్యాయి
రాధలేకుండా కృష్ణప్రేమ సంపూర్ణంకాదు.
కృష్ణుడులేకుండా రాధలేదు.
వస్తాడు, వస్తాడని ఎదురుచూస్తూ పాడుకోవడం ఎంత బాగుంటుంది. విరహంకూడా ఆనందమే కదా!

మాధవుడు రేపల్లెలో ఎల్లకాలం ఉండలేదుగా?
మధురానగరంలో తానుమాత్రమే పూర్తిచెయ్యవలసిన గొప్పకార్యాలు ఉన్నాయి -
కంస సంహారం, ధర్మ సంస్థాపన.
బృందావనాన్ని, రాధనీ
విడవలేక, విడవలేక వెళ్ళాడు.
రాధకివిరహం తాళలేనిది అయ్యింది.

కొన్నిరోజులు గడిచాయి.


రాచకార్యాలు విడిచి వెళ్ళలేని యశోదానందనుడు
రాధను చూసిరమ్మని దూతని పంపాడు.
చూస్తే ఏముంది?
బృందావనలోలుడ్ని తలచుకొని సజలనయనాలతో
విరహోత్కంఠిత రాధ! 
వచ్చిన వాడు ఆమె బాధకు నొచ్చుకొన్నాడు.
కృష్ణుడు బృందావనానికి ఆరాత్రే వస్తాడని అబద్దమాడాడు.

పాపం రాధ. ఎంతో ఆశతో వెళ్ళింది. 
రేయి గడిచింది, పగలు గడిచింది...
కానీ నల్లనయ్య ఇంకా రానేలేదు!
రాధ ఇంకా ఎదురు చూస్తూనే ఉంది.

మణిరత్నం దళపతి సినిమాలోపాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి, గాయని స్వర్ణలత.

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా 
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా 
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే 
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే 
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే 
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే 
యదుకుమారుడే లేని వేళలో 
వెతలు రగిలెనే రాధ గుండెలో 
యదుకుమారుడే లేని వేళలో 
వెతలు రగిలెనే రాధ గుండెలో 
పాపం రాధా………… 
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా 
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా 
© Dantuluri Kishore Varma 

Saturday 16 November 2013

ఎన్నెన్ని హొయలో

సాయంత్రం సమయంలో నిప్పులు చిమ్మే సూర్యుడు కమ్ముకొంటున్న మబ్బులకి చోటిచ్చి పడమరదారి పడుతుంటే, నీరుపెట్టిన ఆకుమడుల్లో ఆహారంకోసం వెతుక్కొంటున్న కొంగలగుంపు  ఉండుండి వీచే పిల్లగాలికి పడుచుపిల్ల పైట కొంగులా ఎగురుతున్నప్పుడు తీసిన ఫొటో. ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో అని పాడుకోవాలనిపిస్తుంది కదూ?  
© Dantuluri Kishore Varma 

Friday 15 November 2013

కామన్ మేన్

ఆర్.కే.లక్ష్మణ్ మరొక్కసారి వార్తల్లోకి వచ్చారు. 
*     *     *
ఒకవేళ ఎవరికైనా ఆయన ఎవరో తెలియకపోతే, కామన్ మేన్ పేరు చెపితే గుర్తు పట్టవచ్చు. టైంస్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో 1951 నుంచి లక్ష్మణ్ గీస్తున్న కార్టూన్ స్ట్రిప్‌లో కేరక్టర్ అది. బట్టతల, గుండ్రటి కళ్ళజోడు, పెద్దముక్కు, టూత్‌బ్రష్ కుచ్చులాంటి మీసం, గళ్ళకోటూ, పంచ, సాక్సులు లేని బూట్లు, నిశ్చేష్టుడైనట్టు ముఖకవళికలు ఉండే సాధారణమైన మనిషి. కామన్‌మేన్ నోరు తెరిచి ఎప్పుడూ మాట్లాడింది లేదు. ధరలు పెరిగినా, రాజకీయకుంభకోణం జరిగినా, కొత్తగా ప్రభుత్వవిధానాలు ఏమైనా ప్రకటించినా, ప్రజలు సివిక్‌సెన్స్ లేకుండా ప్రవర్తించినా.. ఆయా సంఘటనలలో ప్రత్యక్షసాక్షిగా ఉంటాడు. అర్ధశతాబ్ధం పైనుంచి `యూ సెడ్ ఇట్` పేరుమీద ఈ కార్టూన్ వస్తున్నా ఎప్పుడూ జనాలకి విసుగు పుట్టలేదు. పూనాలో, ముంబాయ్‌లో  కామన్ మేన్‌కి విగ్రహాలు కట్టారు. ఇది ఒక అరుదైన విషయం.

ఆర్.కే.లక్ష్మణ్ నిజజీవితంలో చాలా సీరియస్‌గా ఉంటాడట. ఆయనని నవ్వించడం చాలా కష్టం అని చెపుతుంటారు. కానీ చాలా సున్నితమైన స్వభావం ఉన్నవాడట. ఒకసారి ముంబాయ్ యూనివర్సిటీలో గౌరవడాక్టరేట్ ప్రధానం జరుగుతున్నప్పుడు, అప్పటి రాష్ట్రపతి అబ్ధుల్ కలాం గారు లక్ష్మణ్‌ని హృదయానికి హత్తుకొన్నారట. వెంటనే, లక్ష్మణ్ కళ్ళవెంట బొటబొటా నీళ్ళు కారాయి. `మీ కార్టూన్లతో మమ్మల్ని అందరినీ నవ్విస్తారు, మీరు కన్నీళ్ళు పెట్టుకొంటున్నారే,` అని కలాం చమత్కారమాడారట.

చిన్నప్పుడు పుస్తకాలమీద, చిత్తుకాగితాలమీద, గోడలమీద ఎక్కడపడితే అక్కడ బొమ్మలు వేసేవాడట. గది కిటికీలోనుంచి బయటకి చూస్తు, కనిపించే కాకులని గియ్యడం అలవాటయ్యింది. లక్ష్మణ్ కాకుల్ని చాలా అందంగా గీస్తాడు. ఒక ఇంటర్వ్యూలో లక్ష్మన్ భార్య కమల వాళ్ళదగ్గర ఒక మర్డర్ ఆఫ్ క్రోస్ వున్నాయని చెప్పారు. ఇంగ్లీష్‌లో కాకుల సమూహాన్ని తెలిపే కలెక్టివ్ నౌన్ ని మర్డర్ అంటారని అప్పుడే తెలిసింది.

ముంబాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో జేరడానికి లక్ష్మణ్ చిన్నప్పుడు ధరకాస్తు చేసుకొంటే, `నువ్వు పనికిరావు పో!` అన్నారట. ఏం చేస్తాడు? తనంతట తనే నేర్చుకొన్నాడు. అన్నగారు ఆర్.కే.నారాయణ్ గొప్ప కథా, నవలా రచయిత. లక్ష్మణ్‌కి 12సంవత్సరాలు ఉన్నప్పుడు హిందూ న్యూస్‌పేపర్లో నారాయణ్ రాసే కథలు అప్పుడప్పుడే అచ్చవుతూ ఉండేవి. వాటికి లక్ష్మణ్ బొమ్మలు గీస్తే ఒక్కోదానికి రెండురూపాయల ఎనిమిది అణాలు పారితోషికం ఇచ్చేవారట.

ఎక్కువకాలం ఒకే న్యూస్‌పేపర్లో పనిచెయ్యడం చాలా అరుదు. ఆవిషయం గురించి ద హిందూ పేపర్‌వాళ్ళు ఒక చక్కనిమాట అన్నారు. `Rasipuram Krishnaswamy Laxman has been synonymous with the Times of India ever since your grandfather was a child`  అని. 
*     *     *
ఇంతకీ ఆయన మళ్ళీ ఎందుకు వార్తల్లోకి వచ్చాడూ అంటే.. టైంస్ ఆఫ్ ఇండియా ప్రారంభించి నూటడెబ్బయ్ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా భారత తపాలా శాఖ ఒక కమెమొరేటివ్ స్టాంప్‌ని విడుదల చేసింది. అది ఆర్.కే.లక్ష్మణ్  గీసిన కామన్‌మేన్. 
 

© Dantuluri Kishore Varma

Thursday 14 November 2013

భయపడ్డారా!

`ఈ ఊరికి కొత్తగా వాచ్చాం. ఒక ఇల్లు కొనుక్కొని స్థిరపడదామని అనుకొంటున్నాం. మీ తాతగారి ఇల్లు మెయిన్‌రోడ్డుకి ఆనుకొని మూడవ వీధిలో ఉందట. ఎంతో చెపితే, మిగిలిన వ్యవహారాలు మాట్లాడుకొందాం,` అన్నాడు అతను మురళీమోహనరావుతో.

చాలాకాలంనుంచి ఖాళీగా ఉన్న ఆయింటిలోనుంచి ప్రతీరాత్రీ ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయని, మంచి మంచి వాసనలు కూడా వస్తాయని, ఎవరో మాట్లాడుకొంటున్నట్టు వినిపిస్తుంటుందనీ... ఇవేమీ చెప్పకుండా వచ్చినతనికి ఇల్లు అమ్మేశాడు.

చవకగా దొరికిన ఇంటిలోకి పెళ్ళాం పిల్లలతో దిగిపోయాడు ఇల్లు కొనుక్కొన్న దొరబాబు. మొదటి రాత్రినుంచీ చీకటిగదుల్లో లైట్ల కాంతి, వంటగదిలోనుంచి తియ్యని వాసనలు, గుసగుసలు.. వెన్నులోనుంచి వణుకు వచ్చేలా ఉంది. ఇల్లు ఖాళీ చేసి, లాడ్జీలో గది తీసుకొని పడుకొన్నారు. 
మోసంచేసి ఇల్లు అమ్మేశారని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. మురళీమోహనరావుని అడిగితే - `నేనేమన్నా అమ్ముతానన్నానా? మీరేకదా కోరి కోరి వచ్చి అడిగారు?` అని తప్పించుకొన్నాడు. విషయం తెలిసినవాళ్ళకీ, తెలియని వాళ్ళకీ చెపుతూనే ఉన్నాడు దొరబాబు. ఏమయినా ఫలితం ఉంటుందేమో అని ఒక వెర్రి ఆశ. 

శివాజీరావు చెవిలో పడింది విషయం. `పద వెళ్ళి చూద్దాం అన్నాడు`.

చీకటి పడుతుండగా వెళ్ళారు. మార్పేమీలేకుండా అలాగే ఉంది సందడి అంతా. ఎవరూ ఏమీ వండకుండానే నోరూరించే వాసనలు. `దెయ్యాలు పార్టీ చేసుకొంటున్నట్టున్నాయి. పద అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం,` అన్నాడు శివాజీరావు. దొరబాబుకి చాలా భయం వేస్తుంది. కానీ, విషయం ఏమిటో తెలియాలి కదా?

`ఏమైనా కబుర్లు చెప్పు అన్నాడు. కొత్తగా చూసిన సినిమాలో బ్రహ్మానందం గురించో, ఆలీ గురించో చెప్పు,` అన్నాడు శివాజీ రావు. మెల్లగా సంభాషణ జరుగుతుంది. ఇద్దరూ సినిమా జోకులు, మామూలు జోకులు, అవీ, ఇవీ అన్నీ చెప్పేసుకొంటున్నారు. నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. 

ఇళ్ళదగ్గర వాళ్ళ పెళ్ళాలకి భయం మొదలైంది. ఆరు గంటలకి వెళ్ళినవాళ్ళు ఎనిమిదయినా తిరిగిరాలేదు. జరగకూడనిది ఏమైనా జరగలేదుకదా అని. 

వాళ్ళనీ, వీళ్ళనీ బ్రతిమాలి పోగేశారు. అందరూ వెళ్ళి చూసేసరికి శివాజీరావూ, దొరబాబు కూర్చొని జోకులమీద జోకులు చెప్పేసుకొని, నవ్వేసుకొంటున్నారు. ముఖ్యంగా దొరబాబు జోకులు అదిరిపోయేలా ఉన్నాయి. వచ్చినవాళ్ళూకూడా నవ్వడం మొదలుపెట్టారు. 

`మీరు భలే చెప్తున్నారండీ కబుర్లు,` అన్నాడు, ఆడవాళ్ళకి తోడువచ్చినవాళ్ళలో ఒకడు. 

`నిజమే, దొరబాబుదగ్గర మంచి నవ్వించే కళ ఉంది. రేపుసాయంత్రం కూడా కొంచంసేపు కూర్చుందాం రండి,` అని ఆహ్వానించాడు శివాజీరావు. ఒక కాలక్షేపం మొదలైంది. ఆ మరునాడు వాళ్ళు వస్తూ కూడా మరికొంతమందిని వెంటబెట్టుకొని వచ్చారు. అలా, అలా రోజువారీ కాలక్షేప కేంద్రంగా మారిపోయింది దొరబాబు ఇల్లు. 

చిత్రం ఏమిటంటే అప్పటినుంచీ మళ్ళీ దెయ్యల హడావుడి ఏమీలేకుండా అయిపోయింది ఆ ఇంటిలో. `మనుషులు వచ్చేశారుకదా, మనమెందుకు ఇక్కడ  అనుకొన్నాయేమే!`

నోట్: ఈ కథలో లాజిక్ వెతక్కండి. ఉత్కంఠత కలిగించడానికి సరదాగా రాసింది.  హారిస్ టోబియస్ అనే ఆయన రాసిన హాంటెడ్ అనే కథ ఆధారం.
© Dantuluri Kishore Varma

Wednesday 13 November 2013

మనసున తొణికే మమకారాలు.. కనులను మెరిసే నయగారాలు..

సినిమాపాటల్లో కవిత్వమేమిటీ అని అడుగుతారు కొంతమంది. కానీ, ఈ పాటలో చూడండి, కవిత్వం ఎంత చక్కటి హొయలుపోతుందో. ప్రేమించిన పిల్లదానికి మనసులోమాట సూటిగా చెప్పలేక రకరకాల ప్రయత్నాలు చేస్తారు కొందరు అబ్బాయిలు. అలాంటి ప్రయత్నమే ఇది కూడా. అరమరికలు లేకుండా నోరుతెరచి మాట్లాడమంటున్నాడు. తను చెప్పవలసింది చెప్పకుండా ఇదిగో ఇలా-
మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుప రాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా
పలుకరాదటే చిలుకా పలుకరాదటే

అనికూడా కవిత్వం వొలకబోస్తాడు. ఇది సముద్రాల రాఘవాచారి రాసిన పాట.  ఘంటసాల సంగీతం, గానం. 1950లో విడుదలైన షావుకారు సినిమాలోది ఈ పాట. 

ఈ పాటలో నేను గమనించిన ఇంకొక విశేషమేమిటంటే ఎన్.టీ.ఆర్ ని పాట అంతా చాలా భాగం క్లోజప్‌లోనే చూపించినా ఒక్క క్షణం కూడా కెమేరావైపు చూడడు. హిందీ హీరో మనోజ్ కుమార్ కి అలాంటి అలవాటు ఉండేదని చెపుతారు. 


పలుకరాదటే చిలుకా పలుకరాదటే
సముఖములో రాయబారమెందులకే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే

ఎరుగని వారమటే
మొగ మెరుగని వారమటే
పలికిన నేరమటే
పలుకాడగ నేరమటే
ఇరుగు పొరుగు వారలకే
అరమరికలు తగునటనే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే

మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుప రాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
© Dantuluri Kishore Varma

మలాలా

చాలా సార్లు అవకాశం కష్టం అనే ముసుగు ధరించి వస్తుందట. కష్టాలు, బాధలు, ఆటంకాలు రాకూడదని కోరుకొంటే వాటితో పాటు వచ్చే అవకాశాలు కూడా రావడం మానేస్తాయి. అలాగని మన జీవితాల్లోకి ఇబ్బందులు రావాలని కోరుకోమని కాదు. ఒకవేళ కష్టనష్టాలను భరించవలసి వచ్చినప్పుడు, వాటిని సహనంతో ఓర్చుకొంటే తరువాత అంతా మంచే జరుగుతుంది అనే ఆశావహదృక్పదం అలవరచుకోవాలని అలా చెపుతారు. 

పాకిస్తాన్‌లో తాలిబన్ ప్రభావిత ప్రాంతాల్లో మహిళలమీద చాలా ఆంక్షలు ఉంటాయి. వాళ్ళకి బడికి వెళ్ళి చదువుకొనే స్వాతంత్ర్యంకూడా ఉండదు. బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళే అమ్మాయిలు ఏవిధమైన వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారో ఒక అమ్మాయిచేతే బ్లాగ్ రాయిస్తే బాగుంటుందని బిబిసి వాళ్ళు భావించి మలాలా యూసఫ్‌జాయ్  అనే ఒక ఏడవతరగతి అమ్మాయిని ఎన్నుకొన్నారు. అదికూడా ఆమె తండ్రి స్కూళ్ళు నిర్వహిస్తున్న వ్యక్తికనుక సాధ్యమైంది. బడికివెళ్ళడమే జీవన్మరణ సమస్య అయినప్పుడు, తాలిబన్లకి వ్యతిరేకంగా రాయడమా?

స్కూల్‌బస్‌లో ఇంటికివెళుతుండగా, తాలిబన్లు బస్‌ని ఆపి, మలాలాని తలమీదకాల్చారు. అదృష్టవశాత్తూ ఆమె మరణించలేదు. ఈ సంఘటన జరిగి సుమారు ఒక సంవత్సరం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అరవైకోట్ల అమ్మాయిలు ఎదోఒకకారణంగా చదువుకి దూరంగా ఉంచబడుతున్నారు. వాళ్ళతరపున మాట్లాడగలిగిన ఒక ప్రతినిధిగా ఇప్పుడు మలాలా గుర్తించబడుతుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఐయాంమలాలా అనే పుస్తకం రాసింది. మలాలా ఫండ్‌ని నిర్వహిస్తుంది. 

నిన్న న్యూయార్క్‌లో గ్లామర్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అనే వార్షిక కార్యక్రమం ఒకటి జరిగినప్పుడు, ఎంతో మంది నటీమణులు, పాప్ సింగర్లు, యంగ్‌పొలిటీషియన్లు.. వాళ్ళందరితో పాటూ మలాలా కూడా హాజరయితే - జనాలనుంచి మలాలాకి మాత్రమే హృదయపూర్వకమైన, ఉత్సాహవంతమైన ప్రతిస్పందన వచ్చిందట. `వి లవ్ యూ, మలాలా` అని హర్షధ్వానాలు చేశారట.
సంవత్సరంక్రితం కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఒక ధైర్యంకల టీనేజర్, ఇప్పుడు ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ. మరచిపోకూడని విషయం ఏమిటంటే ఆమె ఈ స్థాయికి రావడానికి మొదటి అడుగు మరణం అంచు వరకూ ఆమెని తీసుకువెళ్ళిన కష్టం - తాలిబన్ల దుశ్చర్య.
 © Dantuluri Kishore Varma

Tuesday 12 November 2013

శ్రీ శంకరభగవత్పాదులు

ఆదిశంకరాచార్యులని సాక్షాత్తూ పరమశివుని అవతారంగా భావిస్తారు. క్రీస్తుశకం 788వ సంవత్సరంలో కేరళలో కలాడి అనే ఊరిలో నంబూద్రి బ్రాహ్మణుల ఇంటిలో ఆర్యాంభ, శివగురు అనే దంపతులకి  బిడ్డగా జన్మించాడు. పుట్టిన కొన్నిరోజులకే తండ్రి చనిపోవడంతో, ఈతనిని తల్లే పెంచుతుంది. ఉపనయనం అయినతరువాత బ్రహ్మచారిగా సనాతన ధర్మాన్ని అనుసరించి ఇంటింటికీ తిరిగి బిక్ష గ్రహించాలి. బాలుడిగా ఉన్న ఆదిశంకరాచార్య ఒక పేదమహిళ ఇంటి దగ్గర ఆగుతాడు. కానీ, పాపం ఇవ్వడానికి ఆమెకి ఇంటిలో ఏమీలేదు ఒక ఎండిపోయిన ఉసిరికాయ తప్ప. దానినే బిక్షగా ఇస్తుంది. అప్పుడు, ఆమె దయకి, కరుణకి ముచ్చటపడి కనకధారాస్తోత్రం చదివి లక్ష్మీదేవిని ప్రసన్నంచేసుకొని, ఆ పేదరాలికి సంపదని ఒనగుర్చమని కోరతాడు. లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షం ఆ యింటిలో కురిపిస్తుంది. ఆ కుర్రవాడియొక్క గొప్పతనం అది. ఆదిశంకరాచార్యులు అత్యంత తెలివితేటలు కలిగిన బాల మేధావి.  శంకరాచార్యుని విధ్వత్తు ఎంతగొప్పది అంటే, ఒకసారి తల్లి నదిదగ్గరనుంచి నీరు తీసుకొనివస్తూ అవస్థలు పడడం గమనించి, ఆనదినే ప్రవాహమార్గం కొంచెం మార్చుకొని తమ ఇంటిప్రక్కగా వెళ్ళవలసిందని అడుగుతాడు. అలాగే జరుగుతుంది!
At Kotipalli Temple
సన్యాసం స్వీకరించి గురువుకోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఎన్నో వేలకిలోమీటర్లు కాలినడకన తిరుగుతూ చివరికి నర్మదానది ఒడ్డున శ్రీ గోవింద భగవత్పాదుల వారిని చేరతాడు. గురువుకి సేవలు చేస్తూ అన్ని విద్యలూ నేర్చుకొంటాడు. తరువాత గురువుగారి ఆజ్ఞమేరకు వారణాసి వెళతాడు. అక్కడ ఎంతో మంది ఆదిశంకరాచార్యునికి శిష్యులుగా మారతారు. ఒకరోజు శిష్యులతో కలసి వెళూతున్నప్పుడు ఒక చంఢాలుడు ఎదురు వస్తాడు. శంకరాచార్యులు వాడిని ప్రక్కకి తొలగమని అడిగినప్పుడు, వాడు తొలగవలసినది ఈ శరీరమా, లేక ఆత్మా? అని ప్రశ్నిస్తాడు. ఆకాశం యొక్క ప్రతిబింబం గంగానదిలోనూ, కల్లుకుండలోనూ కనిపిస్తుంది. రెండింటిలోనూ కనిపించే ఆకాశం ఒకటేనా, లేక వేరు వేరా? అని అడుగుతాడు. ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని తెలియజేసిన చంఢాలునికి ఆదిశంకరాచార్యుడు ప్రణమిల్లుతాడు. అప్పుడు చంఢాలుని రూపంలో ఉన్న పరమశివుడు నిజరూపంలో ప్రత్యక్షమై వ్యాసుడు కూర్చిన బ్రహ్మసూత్రాలకి వాఖ్యానం రాయవలసినదిగా ఆదేశిస్తాడు.  పరమశివుడు ఆదేశాలను నిర్వర్తించడానికి బదరీకి వెళతాడు. ప్రస్థానత్రయం అని పిలువబడే బగవద్గీత, ఉపనిషత్తులు,బ్రహ్మసుత్రాలమీద భాష్యం రాస్తాడు. తిరిగి కాశికి వస్తాడు. అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు.

శంకరాచార్యులవారి ప్రియశిష్యుడు సనందనుడు. ప్రియశిష్యుడికి కావలసిన అన్ని అర్హతలూ అతనికి ఉన్నా, అందరికీ ఆతనిమీద అసూయగా ఉంటుంది. దానిని తొలగించడానికి ఒకరోజు ఆదిశంకరాచార్యుడు ఒక చిన్న తమాషా చేస్తాడు. నదికి ఇవతలి ఒడ్డున గురువు, అవతల ఒడ్డున శిష్యుడు ఉండగా తక్షణమే ఇటు రావలసిందని పిలుస్తాడు. వెంటనే సనందనుడు నదిలోని నీటిమీద పాదాన్ని వేసి అవతలి ఒడ్డుకు ప్రయాణం మొదలుపెడతాడు. పాదం నీటిలో మునగకుండా ఒక కలువపువ్వు పైకి లేస్తుంది. అడుగడుగుకీ ఒక్కో పువ్వుచొప్పున పువ్వులదారి ఏర్పడి ఆ పరమశిష్యుడికి నదిని దాటడానికి సహాయం చేస్తుంది.

ఆదిశంకరుడు బోధించిన మతం అద్వైతం. దేశం ఆ చివరినుంచి ఈ చివరివరకూ ప్రయాణంచేసి ఎందరో విద్వాంసులని తర్కంలో, మీమాసంలో ఓడించి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు మఠాలను స్థాపిస్తాడు. తూర్పున పూరీలో, పశ్చిమాన ద్వారకలో, ఉత్తరాన బద్రీనాథ్లో, ధక్షిణాన శృంగేరీలో. సనాతనధర్మాన్ని దేశంలో మూలమూలలా వ్యాపింపచేయడానికి, వేదవిజ్ఞానాన్ని ప్రజలకి అందించడానికి ఒక్కో వేదాన్ని ఒక్కో పీఠానికి అప్పగిస్తాడు. ఋగ్వేదాన్ని పూరీకి, యజుర్వేదాన్ని శృంగేరీకి, సామవేదాన్ని ద్వారకాకి, అదర్వణవేదాన్ని బదరీనాథ్‌కీ అప్పగిస్తాడు.

శివనందలహరి, సౌందర్యలహరి, విష్ణుశహస్రం లాంటి ఎన్నో స్త్రోత్రాలు రచించాడు. కైలాసగిరినుంచి పంచలింగాల్ని తీసుకొనివచ్చి అయిదుచోట్ల - కేదార్‌లో ముక్తిలింగాన్ని, నేపాల్ నీలకంటదేవాలయంలో పరలింగాన్ని, చిదంబరంలో మోక్షలింగాన్ని, శ్రంగేరీలో భోగలింగాన్ని, కంచిలో యోగలింగాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు.

ముప్పైరెండవఏట శివసాన్నిధ్యాన్ని చేరారు.

© Dantuluri Kishore Varma

Monday 11 November 2013

వెలిగించిన దీపంతో కళా, కాంతి, ఉత్సాహమూ వస్తాయి.

Photo Courtesy: Vazeer Ishaan
శివుడికి, విష్ణుమూర్తికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసం దీపాల వెలుగులతో నిండిపోతుంది.
అన్నవరం సత్యన్నారాయణస్వామి, అంతర్వేది లక్ష్మీ నరశింహస్వామి...
సామర్లకోటలో, ద్రాక్షారామంలో భీమేశ్వరుడు పండుగశోభతో కళకళలాడుతున్నారు
కోనేర్లు, కాలువలు, గోదావరిల్లో తేలియాడుతున్న వేలదీపాలు కాంతులీనుతున్నాయి
మాలధారణచేసే అయ్యప్ప భక్తులకీ ఇదే ఇష్టమైన సమయమేమో
మణికంఠుడి దేవాలయాలు `స్వామియే శరణం అయ్యప్పా!` అని మారుమ్రోగుతున్నాయి.
వారాంతాల్లో తోటలు, గరువులు,  బీచ్‌లూ వనభోజనాలతో అందగిస్తున్నాయి 
ఇళ్ళూ గుళ్ళూ వేలదీపాల వెలుగుల్లో తడిసి ముద్దవుతున్నాయి
పండుగ శోభ దీపకాంతిలా దశదిశలా వ్యాపించింది. 
The Hindu`s Photo
© Dantuluri Kishore Varma

Sunday 10 November 2013

కొమ్మకొమ్మకో సన్నాయి

ఆడియో కేసెట్లలో ఇష్టమైన పాటలన్నీ రికార్డ్ చేయించుకొని, మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని విన్నరోజులు గుర్తుకొస్తాయి ఈ పాట వింటుంటే. సాహిత్యాన్ని కబళించని శ్రావ్యమైన మామ కే.వీ.మహదేవన్ సంగీతం, దానికి ధీటురాగల వేటురి సుందరరామ్మూర్తి సాహిత్యం. (ఇక్కడొక చిన్న చమత్కారమైన విషయం చెప్పాలి. పాట అంతా రాసిన వేటూరి సుందరరామమూర్తిగారు రికార్డింగ్ సమయంలో తిరుపతి వెళ్ళడంతో ఒకటి రెండు లైన్లని కొంచం మార్పించి ఆచార్య ఆత్రేయగారితో రాయించారట. ఆయన రాసిన ముక్క ఇదే - కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు - వేటూరిగారు తిరిగి వచ్చిన తరువాత ఈ పాట పూరింపులో కొంత దోషం ఉందని తప్పుపట్టారట). ఈ రెండింటిలో ఏదిబంగారమో, ఏది దానికి అంటుకొన్న పరిమళమో చెప్పడం కష్టం. దాసరి నారాయణ రావు చిత్రీకరణ కూడా ఎంతో హుందాగా ఉంటుంది. హీరో, హీరోయిన్ల దృక్పదాల్లో ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది ఈ పాటలో. ఆమెది ప్రేమ, దానిద్వారా కోరుకొంటున్న పెళ్ళీ అనే బంధం. అతనిది బాధాకరమైన గతం, అనిశ్ఛితి కలిగిన భవిష్యత్తు.  అందుకే ఆమె పరుచుకున్న మమతలు చూడు అంటే, అతను ముసురుకున్న మబ్బులు చూడమంటాడు. సుశీల, బాలసుభ్రహ్మణ్యాల గళాల్లో మాధుర్యం బహుచక్కగా ఉంటుంది. ముఖ్యంగా `ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి` అనే పంక్తి దగ్గర చాలా బాగుంటుంది. ఆ ఒక్కలైను కోసమే ఆ పాటని ఎన్నో సార్లు వింటాను. యువచిత్రా బ్యానర్లో వచ్చిన అన్నిసినిమా పాటలూ, కే.వీ.మహదేవన్ సంగీతంలో మెలోడియస్‌గా ఉంటాయి. హ్యాపీ లిజనింగ్!

కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మకొమ్మకో సన్నాయీ...

కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటే వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు
వురకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి వుండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మకొమ్మకో సన్నాయి...

© Dantuluri Kishore Varma

Wednesday 6 November 2013

రావోయి చందమామ

విజయావారు 1955లో నిర్మించిన మిస్సమ్మ సినిమా పెద్దహిట్. పింగళి నాగేంద్రరావు రాసి, సాలూరి రాజేశ్వరరావు స్వరపరచిన పాటలు అన్నీ ఎంతో బాగుంటాయి. ముఖ్యంగా రావోయి చందమామ పాట అత్యద్భుతం. లీల, ఏ.ఎం.రాజా లలితలలితంగా పాడారు. 

పాటలో సినిమా కథ అంతా ఉంటుంది. ఎస్.వీ.రంగారావు ఒక జమిందారు. ఆయన నడుపుతున్న స్కూల్‌లో టీచర్లుగా పనిచెయ్యడానికి భార్యాభర్తలైన వాళ్ళు కావాలని ప్రకటన ఇస్తారు. రామారావు, సావిత్రిలకి ఉద్యోగం చాలా అవసరం. కానీ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. ఎలాగోలా తిప్పలు పడి ఉద్యోగంకోసం అలా నటిద్దామని ఆమెని ఒప్పిస్తాడు. ఆమె పక్కా క్రీష్టియన్, అతను హిందువయినా పరమత సహనం మెండుగానే ఉన్నవాడు. సర్దుకొనిపోయే వ్యవహారం. అబద్దంచెప్పి కొలువులో చేరారే కానీ రోజుకొక గొడవ. పరస్పరం పైకి వ్యక్తం చేసుకోలేని ప్రేమ ఉంటుంది. దానిని కోపంతో, అలకతో, ఆటపట్టించడంతో వ్యక్తంచేస్తుంటారు. 

ఇలాంటి అవ్యక్తప్రేమని ఎవరితో పంచుకొంటారు, చందమామతో తప్ప? 

రావోయి చందమామ మా వింత గాద వినుమా 
రావోయి చందమామ మా వింత గాద వినుమా 

సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌ 
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌ 
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే   

ఎస్.వీ.రంగారావు కూతురు జమున `బాలనురా మదనా` అని పాడితే సావిత్రి, రామారావుకి డైరెక్టుగా చెప్పలేక `మగవారికి దూరముగా మగువలెపుడు మెలగాలని తెలుసుకొనవె చెల్లీ,` అని పాట నేర్పిస్తుంది. అతను గడుసువాడు మాటకి మాట అప్పజెప్పకుండా ఊరుకొంటాడా? అందుకే తనవంతుగా ఇదిగో ఇలా నేర్పించాడు - `సాధింపులు, బెదరింపులు ముదితలకిక కూడవని, హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని తెలుసుకొనవె యువతీ`. ఇంకేముంది గొడవ మొదలు. అది అలా చిలికి చిలికి గాలివాన అయ్యింది. 

మనసులో ఉన్న ప్రేమ, తనవాడు పరాయివాడవుతాడేమో అనే ఆందోళన. మరొక సందర్భంలో జమునకు పాటనెర్పిస్తూ `బృందావనమది అందరిదీ` అని అతను పాడేసరికి అగ్నిపర్వతంలా బద్దలయ్యింది.  ఆవిషయాన్ని ఎత్తిచూపిస్తున్నాట్టు ఆమె అంటుంది..

ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌ 
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌ 
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా 

అతను: 

తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌ 
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌ 
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్‌ 

ఆమె:

నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో 
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో 
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా  

ప్రేమపాటల్లో ఇంత మంచి పాట మరొకటి లేదేమో అనిపిస్తుంది. చెట్ల చుట్టూ పరుగులు పెట్టి, స్టెప్పులు వెయ్యక పోయినా సావిత్రీ, రామారావుల ముఖాలలో పలికించిన భావాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మనల్ని కళ్ళు తిప్పుకోనివ్వవు. అందుకే ఇది ఆల్‌టైం ఫేవరెట్ సాంగ్. మీరేమంటారు? 


© Dantuluri Kishore Varma

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!