Pages

Tuesday 1 September 2015

ధర్మం - అధర్మం

`ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి` అని భద్రాచల రామదాసు ఆర్తిగా అమ్మచేత సిఫారసు చేయిస్తే లక్ష్మణ సమేతుడై మారువేషంలో వచ్చి, నవాబుకి రామదాసు బాకీపడిన సొమ్ములు చెల్లించి, చక్కగా మాయమైపోయాడు శ్రీరామచంద్రుడు. ఎంత కరుణతో కష్టాలు తీర్చమని కోరుకొన్నా - అదృశ్యంగా ఉండి భక్తుని కోరికని తీర్చాడుకానీ, రామదాసుకి మాత్రం ఒక్కక్షణమైనా దర్శన భాగ్యం కలిగించినట్టు లేదు దేవదేవుడు! తాళ్ళపాక అన్నమాచార్యుడు వేలకొలదీ సంకీర్తనలతో వేంకటేశ్వరస్వామిని అర్చిస్తే, ఆయనకి ఎప్పుడో జీవితచరమాంకంలో దైవసాన్నిధ్యం లభించింది. ఇక, సంకీర్తనాచార్యుల కాలానికన్నా చాలా వెనక్కి - అంటే పురాణకాలానికి వెళితే విశ్వామిత్రుడో, మరో మహర్షో ఏళ్ళకొద్దీ తప్పస్సులు చేసి.. శివుడో, విష్ణుమూర్తో ఒక లిప్తకాలంపాటు ప్రత్యక్షమైతే - వరాలు పొంది, సంతృప్తి పడినట్టు గాధలు ఉన్నాయి. దీనినిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే - `కరుణతోటో, భక్తితోటో, ధృఢసంకల్పంతోటో దేవుడిని శాశ్వతంగా మనతోపాటూ ఉంచుకోలేము` అని. ఈ మార్గాలు అవలంభించిన భక్తులకి ఆయన అదృశ్యంగా ఉండి కరుణించడమో, కనిపించి వరాలివ్వడమో చేస్తాడు కానీ - అవతారం ఎత్తి వాళ్ళతోపాటూ జీవించడు. రాముడిగానో, కృష్ణుడిగానో దేవుడు మరో అవతారంలో భూమిమీదకి రావాలంటే సమిష్టిగా అందరూ అవలంభించవలసిన మార్గం ఒకటి ఉంది.... అదే, అధర్మం! 

మీరు సరిగ్గానే చదివారు. పైన చెప్పిన మార్గం `ధర్మం` కాదు. అధర్మమే! ఈ విశ్వంలో ఏ మార్గానికీ లేని శక్తి అధర్మమార్గానికి ఉంది. మనిషిని మనిషి మోసం చేస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, ప్రాణంతీస్తున్నప్పుడు; అక్రమసంబంధాలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, లంచాలు, కల్తీలు, అక్రమవ్యాపారాలు, ఉగ్రవాదం, దురలవాట్లు భరించలేనంత ఎక్కువగా పెరిగిపోయినప్పుడు - `ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!` అని ధర్మాన్ని పున:ప్రతిష్ట చెయ్యడానికి ఓ అవతారంగా దేవుడు పుడతాడట. కష్టాలు కలిగాయని ఏడిస్తే, భక్తితో చేతులు జోడించి మ్రొక్కితే ఉపేక్షించవచ్చునేమో కానీ, అధర్మంతో వికటాట్టహాసం చేస్తే చూస్తూ ఊరుకోలేడట దేవుడు. అందుకే అధర్మానికున్న శక్తి మరి దేనికీ లేదని చెప్పడం. ప్రస్తుతం  జనాలు శాశ్వత దైవదర్శనం కోసం బాగానే ప్రయత్నిస్తున్నట్టున్నారు కదూ? 

*     *     *

పోలీసులది ప్రజల్ని రక్షించవలసిన ధర్మం
ప్రభుత్వానిది జనరంజకంగా పరిపాలించవలసిన ధర్మం
మీడియాది వార్తలు అందించడంతో పాటూ, జరిగిన సంఘటనలను విశ్లేషించి ప్రజల అభిప్రాయాలకి దిశానిర్దేశం చెయ్యవలసిన ధర్మం 
తల్లితండ్రులదీ, ఉపాద్యాయులదీ పిల్లలకు మంచీ, చెడు మధ్య వ్యత్యాసాన్ని చెప్పి వాళ్ళని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిన ధర్మం.. 
వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్న ప్రజలది న్యాయబద్దంగా సంపాదించుకొని కుటుంబాలని పోషించుకోవలసిన ధర్మం..  

కానీ,  చాలామంది వాళ్ళ ధర్మాలని సక్రమంగా నెరవేరుస్తున్నట్టు లేదు. అసహాయులమీద అత్యాచారాలు చెయ్యడానికి వావీ, వరసా, వయసు, సాంఘిక హోదా.. ఏవీ అడ్డు కావడం లేదు.  స్కూలుకి వెళ్ళి చదువుకోవలసిన వయసులో ఉండే అమాయకమైన పిల్లలు నేరాలవైపు ఆకర్షించబడుతున్నారు. భారతంలో దృతరాష్ట్రుడిలాంటి తల్లితండ్రులకి పిల్లలు తప్పుడు మార్గంలో వెళుతున్నా, మంచివైపు అడుగులు వేయించగలిగినంత తీరుబడి లేదు.

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువ:
మామకా: పాణ్డవాశ్చైవా కిమకుర్వత సంజయ.

అని కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలవబోతుండగా అన్నీ చూసి చెప్పగల మీడియాలాంటి సంజయుడ్ని దృతరాష్ట్రుడు మావాళ్ళైన కౌరవులూ, పాండవులూ ఏమి చేస్తున్నారని అడుగుతాడు. దాయాదుల రాజ్యాన్ని అధర్మంగా తన కుమారులు స్వంతం చేసుకొన్నారనీ, అలా చేసుకొనే క్రమంలో ఎన్నో దుష్టకార్యాలు చేశారనీ దృతరాష్ట్రుడికి తెలుసు. అయినా అధర్మాన్ని ఖండించకుండా `నా వాళ్ళు` అనే పక్షపాతాన్ని చూపించాడు.   

సుమారు ఏడువందల శ్లోకాల్లో యుద్దం జరగడానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతని దృతరాష్ట్రుడికి చెప్పాడు సంజయుడు. చెప్పి, తన మాట ఒకటి కూడా చిట్టచివర కలిపాడు    

యత్ర యోగేశ్వర: కృష్ణో యత్ర పార్థో ధనుర్థర:
తత్ర శ్రీర్విజయో భూతిర్థృవా నీతిర్మతిర్మమ.    
   
యోగీశ్వరుడిలాంటి కృష్ణుడు, ధనుస్సును చేపట్టిన అర్జునుడూ ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయం, నీతీ ఉంటాయని దీని భావం.  

భగవ్బద్గీతలోని మొట్టమొదటి, చిట్టచివరి శ్లోకాలనుంచి సమాజం నేర్చుకోవలసినది ఎంతో ఉంది. విజయానికి, ఆనందానికి అక్రమమార్గాలు సరిఅయినవి కావనీ, పరాయి సొమ్ము ఆశించడం అధర్మమని, మంచీ చెడుల విచక్షణ, కర్తవ్యనిష్టా ఉండాలనీ పిల్లలకి చెప్పవలసిన బాధ్యత తల్లితండ్రులకీ, గురువులకీ ఉంది.  ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మీడియాకి ఉంది. ధర్మాన్ని ఆచరించవలసిన బాధ్యత మనందరికీ ఉంది.

       © Dantuluri Kishore Varma 

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!